(వేటూరి గారి జయంతికి చిరు సమర్పణగా వారి అభిమాని దుర్గా మాధవి గారు Facebook లో ప్రచురించిన వ్యాసం వారి అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాం)
గోదావరి ఉప్పొంగినా, ఆ గోదావరి రాముని పాదాలు తాకినా, వేకువ వేళన అరుణ వర్ణమందినా, ఓ అతివ అందానికి నిర్వచనముగా నిలచినా అది గోదారి ఘనత మాత్రమే కాదండోయి,
మనకి తెలిపిన వేటూరి గారిదీన్నూ. అసలిక్కడ గోదావరీ పడతీ ఆ వర్ణన తమ కోసం అంటే తమ కోసం అంటూ పోటీ పడాలేమో…
భద్దర గిరి… అంటూ గోదారి పై పాట మొదలెట్టీ, ప్రతి పాదాంతం లోనూ ‘గంగా’ స్మరణమూ మనతో చేయించేశారు. పదాలపై ఎంత పట్టు ఉంటే సాధ్యమో కదా ఈ విన్యాసం! ఇక్కడే ఇంకో చమత్కారం, పాపీ కొండల కున్నా పాపాలూ కడ’గంగా’ అంటూ మొదలెట్టి, అల పాపికొండల నలుపు కడగలేక అని తేల్చేశారు, మనల్ని, భావ, పద సంద్రంలో.
ఈ సారూప్యత భలేగా చెప్తారు! నేడే రా నీకు నేస్తమూ రేపే లేదూ… నిన్నంటే నిండు సున్న రా… రానే రాదూ… ఒక్క మాటలో చెప్పారా… మరో చోట… ఉన్న దొక్క ఛాన్సూ సుఖించమంది సైన్సూ అంటూ ఆ చిత్రానికి అనుగుణంగా భాష మార్చినా సుళువుగా చెప్పేశారు. ఏమి ప్రజ్ఞ అనేంత దానను కాదు నేను.
ఆ సంద్రం లోనే, చిరు చేపల కను పాపలకిది నా మనవీ అంటూ సఖియ కోసము వ్రాశారా! మళ్ళీ కను చేపలకూ నిదురంటూ రారాదనీ అంటూ సహోదరి కోసం వ్రాశారు. భావ సారూప్యమూ, పద సారూప్యమూ ఇంత గొప్పగా ఎలా సాధ్యమో కదా! అసలైనా మీనాక్షి అంటూ వర్ణన ముందర చెప్పటం అలవాటైన మన పద సంప్రదాయంలో, కనులను మొదట చెప్పే పాండిత్యం ఈ సుందర మూర్తికే చెల్లింది.
ఈ సారూప్యత ఒక్క చోట ఆగిందా…
వాయులీన హాయిగాన రాగ మాలలు ఒక చోట అల్లుకుంటే, ఆ వాయులీనం వలపన్న గానానిదే కదా! అదే దుఃఖమైతే ఆ వాయులీనం వాంఛలది…
చీరలో చందమామ గురించి పలికి మనందరి చేతా సీతమ్మను పలికించిన పదాంబుధి సోముడు.
స్వరరాగ గంగా ప్రవాహమే… గోదావరీ పై ఎదా… ఈ పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఆ గంగ కారుణ్య రసం అందుకుంటే మన కన్నీరౌతుంది. రాలి పోయే పువ్వా పాట విని ఈ మాటను కాదనగలమా?
దర్శకుని భావం లోకి ఒదిగి పోయి వేణువై వచ్చాను ఆనిపించారంటే వారు కేవలం సాహితీ రంగ నిష్ణాతులు అని ఆపేయగలమా?
ఆ వేణువు వీణ నుంచీ వచ్చినదంటూ మమత కవిత అని చెప్పటం వారికి నల్లేరు మీద నడకే.
కానీ ఆ నడకే గాంభీర్యం సంతరించుకుని, స్త్రీల రక్షణ పై వ్రాయాలంటే…ఇంకెవరూ అందుకోలేరేమో అనే రీతిలో వ్రాశారు…
ఈ దుర్యోధన… పాట… ఆ భావ సాంద్రతకు జోహార్లు సరి పోతాయా…
ఇక ఈ పాట అంటూ వచ్చాక మరేమీ చెప్పలేను…
మనిషికి పుట్టినప్పుడు అది జన్మదినం, మిగిలినవన్నీ వార్షికోత్సవాలూ అంటారు యండమూరి గారు.
ఆ గణన ప్రకారం తెనుగు పదానికి అన్నమయ్య జననం జన్మదినం అయితే, ఈ వే[పా]టూరి గారి జన్మదినం వార్షికోత్సవమేగా!