(మా వేటూరి Whatsapp గ్రూపులో ఈ మధ్య వేటూరి గారి జయంతికి “మన కవులలో జఘనమండలాధీశులు” అంటూ కొంపెల్ల వెంకట్రావు గారు సరదాగా వేటూరి గారు నడుముపై రాసిన వేటూరి వాక్యాలను పంచుకున్నారు! అందరి ఆనందం కోసం అది ఇక్కడ పొందుపరుస్తున్నాం. )
అస్తి నాస్తి విచికిత్స హేతు శాతోదరి అన్నాడు శ్రీనాధుడు…కలదో లేదో అన్న సందేహం కలిగించే సన్నని నడుము కలదానా…అని అర్ధం.
ఉద్ధతుల నడుమ పేదకుండ తరమే ? అని ప్రశ్నించాడు మరో కవి. ఐతే అదే subject గా మన వేటూరి గారు ఏమన్నారో చూద్దాం:
*నడుమా, కన్నెలేడి నడుమా
సన్నజాజి తొడిమా
ఉందోలేదో ఉయ్యాలరో
ఊగుతుంటే జాజిపూల జంపాలరో
(పులిబిడ్డ)
*లేమి అన్నది లేదు నడుముకే గాని
కాలుపెడితే కలిమి కనకమాలక్ష్మి
(భార్యామణి)
*పైనున్న పరువాల భారాలు సోకి
వెనకున్న విరివాలు జడదెబ్బ తాకి
ఆపైన రంభోర్వశీ నటన కలిసి
పాదాలపై కదిలి, తాళాలకే అదిరి
వన్నెలారు వంకరలు చూడ
నా ఒడలు తిరిగి కొంకరలు పోవ
శంకరాభరణ రాగరంజని గానమంజరి
మంజుభార్గవీ…. నడుమెక్కడే…
నడుమెక్కడే నీకు నవలామణి
నడుమును మరిచేవు, నడకలు మార్చేవు
నడకలు నేర్పిన నన్నే ఎమార్చేవు
(కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త)
ఏ జన్మలో మల్లెపూపూజ చేసానో కుందరదననైనాను
ఏనాటి కార్తీక దీపాల వెలుగో ఇందువదననైనాను
ఏ నాల్గు వేదాల పాఠాలు విన్నానో హంస గమననైనాను
ఏ నాస్తికత్వాల భావాలు విన్నానో గగన జఘననైనాను
(అమెరికా అల్లుడు)
*తూనీగ నడుమేమొ తూగుటుయ్యాల
రాయంచ నడకేమొ రాగమియ్యాల
(పండంటిజీవితం)
*ఇందువదన కుందరదన
మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
(ఛాలెంజ్)
*గగన వీణ సరిగమలు పాడగా
నీ జఘనసీమ స్వరజతులనాడగా
తళత్తళలతో తరుణకిరణ సంచలిత లలిత
శృంగార తటిల్లత కదలగా కనులే చెదరగా
(మల్లెపూవు)
నడకా, హంసధ్వని రాగమా ? అది నడుమా, గగనంలో కుసుమమా ?
మణిపురిలో వయారమా ?
పురివిప్పిన మయూరమా ?
(బంగారు కానుక)
*నడుమా కిన్నెరసాని నడకేమొ గోదారి
(గోల్కొండ అబ్బులు)
*తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు
నిన్నే చేరే నిన్న లేని నడకివ్వు
(అనుబంధం)
*He: నీకు తక్కువేమున్నది
బక్కనడుము ఒక్కటి మినహా
She: ఆ నడుము మీద నడకలు చూస్తే పిల్లవాడి గుండె తహతహ
He: నీ వొయ్యారం దిద్దుకుంది శృంగారపు ఓనమః
She: గుట్టురట్టు చెయ్యబోకు గురూ నీకు నమోనమః
(రంగూన్ రౌడి)
*చిలకలంటుకోని చిలిపి పెదవులున్నవి
నడకమీద తునకలైన నడుములున్నవి
నడుమ నడుమ ఊరుదాటు ఊసులున్నవి
ఊపు మీద ఉయ్యాలలూగుతున్నవి
(నిప్పులాంటి నిజం)
*నీ పెదవి ఊపిరికిలా మంచు తడి అంటిస్తా
కానడల పోకడలతో నడుముకొక ఊపిస్తా
(Gang Master)
ఈ విధంగా రస పిపాసువుల దాహముపశమింపజేయు భావ పుష్టి, నవ్యతలతో పాటు గాన గర్భిత లలిత పద విన్యాసం కూడా వేటూరి వారి సాహిత్యంలో గోచరిస్తుంది.
వెంకట్రావుగారి పోస్టుకి స్పందనగా గ్రూపులో సభ్యులు గుర్తుచేసిన మరికొన్ని పాటలు:
కన్నె నడుమా కల్పనా కవులు పాడే కావ్యమా (ఛాలెంజ్… ఓం శాంతి)
కడవకైనా లేదు తొడిమంత ఎడము.. ఎడమెట్టాగుంటాది పిడికెడే నడుము (మయూరి,.. ఎన్నెల్లో ముత్యమా)
సిటికంత లేత నడుము ఊగిపోతుంటే, సిరిమువ్వలు ఘల్లుమంటూ రేగిపోతుంటే (బందిపోటు విప్లవ సింహం)
ప్రియతమ లలనా
గోరింటాకు పొద్దుల్లోనా… తాంబూలాలా ముద్దిస్తావా
కొసరీ… కొసరీ..
సన్నాయంటీ నడుమే ఇచ్చి సందేళలో
(శ్రావణ సంధ్య )
నగుమోము నగ్మా
నగిషీల మహిమా
నడుమేది చెపుమా
జాజితొడిమా,అందమా
(గ్యాంగ్ మాష్టర్)
తీగ లాగా ఊగే నడుము ఉండి లేనిది….
(అమావాస్య చంద్రుడు…. కళ కే కళ ఈ అందము)