పుంభావ సరస్వతికి సరిజోతలు! (రచన: కొంపెల్ల వెంకట్రావు)

(వేటూరి వారి జయంతి సందర్భంగా వారిని నిరంతరం స్మరిస్తూ, వారి పాటలు విని తరిస్తూ ఉన్న వారి అభిమాని శ్రీ కొంపెల్ల వెంకట్రావు గారు వారికి నమస్కరిస్తూ, వారి సాహిత్యాన్ని ఉద్దేశించి ఒక చిన్న సమర్పణ చేశారు)

వేటూరి వారి సాహిత్యము
అది ఒక పీయూష ప్రవాహము
అమర సాహితీ సుమసౌరభ సన్నిభము
అమల కవిత్వతత్త్వ తాత్పర్యము
విమల నాదోంకార సమానీతము

అరుదైన ఆ శైలి హిమశైల శిఖరాల
సురదీర్ఘికా కమ్ర జలదూర్మికా కేళి

ఆ కవన మాలికలు నాక వన వాటికలు
ఆ మధుర భావాలు ఆర్ద్రతల జీవాలు
ఆ భావ గమనాలు ఆద్యంత మధురాలు
రంభోర్వశీ నాట్య గ్రంధాల గంధాలు

శ్రీ పార్వతీ దేవి లాస్యాల పలికేటి
మంజీర నాదాల మృదుమధుర వేదాలు

నీలాల గగనాల వెలిగేటి నెలరేని
తుహిన కర నికరాల తోగి వికసించేటి
కలువ గమి గమకాలు
ఉదయించు రవికిరణ రాగాలతో విచ్చి
బిట్టలరి మురిసేటి తామరస పుష్పాల
తారాడు తమకాలు

శ్రావణమ్మై వరలు గగన వీధులలోన
జీమూత సంఘాత సారాలు సరసాలు

భక్తి భావ ప్రణవ ప్రౌఢిమల చాటేటి
నవ్యమౌ నమకాలు
అనురాగ యోగాల వివరాల ప్రవచించు
రసరమ్య చమకాలు

ఆద్యంతరహితుడౌ నెలతాల్పునిద్రలో
కలయైన గిరిపుత్రి తలపైన గంగోత్రి
కలిసి పులకల పేర్మి చాటి చెప్పిన కూర్మి
కొంగు బంగారాలు

విష్ణుపాదము కొలిచి వివిధ లీలల తరచి
మదిని ప్రేమను పరచి కూచి వలపుల రమకు
ఊసులాడగ తోచి విభుని చెవిలో పలుకు
చిలిపి సింగారాలు

సృష్టి జరిపే బ్రహ్మ రాతలో రహస్యం
చేతలో సమస్తం తెలిసి సంతోషాలు
విరిసి తా గీర్వాణి విమల వీణా తంత్రి
మీటే విలాసాలు

తే. నన్నపార్యుని కవనాల నయము కలిగి
నన్నెచోడుని కావ్యాల వన్నె కలిగి
తిక్కనామాత్యు పద్యాల తీరు తెలిసి
నాటి నాచన సోమన నీటు నెగడి

మహిత పోతనామాత్యుని మహిమ మలగి
త్యాగరాజ కృతుల భక్తి యోగమమరి
సరస మెరిగిన శ్రీనాధు వరస తెలిసి
అష్ట దిగ్గజాల కృతి విశిష్ట గతుల

ఆ. వెలుగు తోడ మలయు వేవేల వేటూరి
పాటలన్న మాట వాస్తవమ్ము
జీవనదుల వంటి భావ బంధములను
చాటి చెప్పు కవిదె పాటవమ్ము

శ్రీ వేటూరి వేంకట సుందరరామ శర్మ గారు
మీకివే మా వందనాలు
మము వీడని వసి వాడని
జ్ఞాపకాల హరిచందనాలు

కొంపెల్ల వెంకట్రావు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top