“తెలుగుపదానికి జన్మదినం ఇది జానపదానికి జానపదం“
అన్న కమ్మటిమాట అన్నమయ్యకే కాదు వ్రాసిన ఆ కలానికి కూడా స్వగతమవుతుంది. ఎందుకంటే ఆయనే తెలుగు భారతికి వెలుగు హారతి, ఆయనే ఆంధ్రసాహితీ అమరకోశం. ఆధునిక ఆంధ్రజాతికి సాహితీ అమృతాన్ని పంచేందుకు కేవలం మోహినీరూపం సరిపోదని విశ్వరూపం ధరించిన అనంతవిశ్వకవి వేటూరి. తెలుగు సినిమా సాహిత్యానికి చివరి వెలుగు వేటూరి. తెలుగుపాటల తోటలో కొమ్మ కొమ్మకో సన్నాయిని పూయించిన తోటమాలి వేటూరి. పాటంటే పదాలతో ఆటని, భావలతో వేటని చాటిన ఆటగాడు, వేటగాడు వేటూరి. మన నిత్య జీవితంలో మంచిపాటలు వినాలనే సంకల్పంతో విన్న పాటలైనా, అసంకల్పంగా గాలిలో తేలుతూ వచ్చి చెవులను తాకే పాటలైనా అత్యధికం ఆయన కలం కురిపించిన అమృతధారలే. నిరంతరం వేంటాడే ఆ సాహితిమూర్తిని స్మరించుకోని క్షణమేది?
“అనగల రాగమై
తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి
మరులే కురిపించి”
వేటూరి పాటల్లో ఒక మాయ ఉంది. ప్రపంచంలో మాయనంతా చేదించే ఉపదేశమూ ఉంది. మొదటిసారి విన్నప్పుడు శబ్ధసౌందర్యంతో చెవులను తాకి కేవలం పదాల అల్లిక అనే భ్రమని కలిగిస్తుంది. మరలా వింటే మనసుని తాకి మన మనస్సు నింపుకోలేనంత భావన్ని కుమ్మరిస్తుంది. పామరులనోట అత్యంత క్లిష్టసమాసాలతో కూడిన పాటలను పాడించిన శబ్ధలాలిత్యం ఆయన సొంతం. పండితులే భేషనే భావాలను జానపదాల్లో చెప్పేయటం ఆయన కలానికి మరో వైపు.
“ఆబాలగోపాల మా బాలగోపాలుని, అచ్చెరువున.. అచ్చెరువున”
“మేలుకుంటేపాట ఏలుకుంటేపాట“
“ఆ సుప్రభాతాలు ఆ భక్తిగీతాలు పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు“
తెలుగుభాషలోని మాధుర్యాన్ని రుచి చూపించే ఈ పదాల అల్లిక వేటూరి తనది అని సగర్వంగా చెప్పుకునే సిగ్నేచర్.
ఇలాంటి గమ్మత్తు పదవిన్యాసాలు ఆయన పాటల్లో చరణానికో మారైనా పలకరించి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
“అన్నులమిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలిసిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే”
“పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్లోన సంపెంగ”
“కలికి చిలకలకొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనక మాలక్ష్మి”
చెవులకింపైన లలితమైన పదాలతో అలరించిన తెలుగుపాటకు చిరునామ వేటూరే. తెలుగు నుడికారాన్నే కాదు, తెలుగు లోగిళ్ళలో సంప్రదాయాన్ని, సందడిని పాటల్లో నింపి భవిష్యత్తరాల కోసం ఒక పెద్ద నిధిని దాచిన రచయిత వేటూరి.
“మాగాయే మహా పచ్చడి పెరుగేస్తే మహత్తరి,
అది వేస్తే అడ్డ విస్తరి, మానిన్యాం మహా సుందరి”
అని పాటల్లో అల్లరి చెయ్యగలడు.
“మసకపడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు”
అని సున్నితంగా వాతలు పెట్టానూ గలడు. వేటూరి పాటలో చెప్పలేని, చెప్పని భావమే లేదు. ఇది శిలాక్షరాలుగా చెక్కించాల్సిన మాట.
“అష్టాయ ఫట్ ఫట్ ఫట్”
“మసజస తతగ శార్ధూల””
“పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది”
కాదేది పాటకనర్హం అని చాటిన గేయరచయిత వేటూరి. సంధులు, సమాసాలు, యతులు, గణాలు, చంధస్సు, సామెతలు, సంధ్యావందనాలు, కీర్తనలు, కవితలు, ప్రభందాలు, కావ్యాలు ఆయన పాటల్లో పాదాలుగా ఒదిగిపోతాయి.
“ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి”
“పుట్టింటోళ్ళు తరిమేసారు కట్టుకున్నోడు వదిలేసాడు”
వంటి వేటూరి మార్కు పాటలు పెదాలపై పలికితే చాలు పండు ముదుసలికైనా పాదాలు కదలటం మొదలుపెడతాయి. సినిమాకి, సందర్భానికి ఏ స్థాయి సాహిత్యం కావలో ఆ స్థాయి పాటలే ఇచ్చాడు. ఆయన వద్దకి వెళ్ళి దర్శక, నిర్మాతలు ఏ రసాన్ని పండించమంటే ఆ రసాన్ని, ఎంత పాళ్ళలో రంగరించమంటే అంతేపాళ్ళు కొలిచి మరీ రంగరించి బేషనిపించుకున్నాడు. ఆయన తూకం ఎప్పుడూ తప్పలేదు.
“కాదిలి వేణుగానం కానడ పలికే”
“ఇందువదన కుందరదన
మందగమన మధురవచన
గగనజఘన సొగసులలనవే”
“ఒంపు సొంపుల యంగోత్రి
కాలు జారకే ఖంగోత్రి
అబిబ్బి అబిబ్బి అబిబ్బి అబిబ్బి”
తెలుగుభాషకు వేటూరి చేసిన సాహిత్య సేవ ప్రపంచం గుర్తించకపోయినా ఆయన అభిమానుల మనస్సులో మాత్రం నిలిచి ఉంటుంది. వేటూరి పదాలు అవసరమైనప్పుడు ప్రాచీన కవుల నుండి తవ్వితీసారు, భాష సరిపోనప్పుడు కొత్త పదాలను సృజించారు. తెలుగుభాషకు ప్రాచీనహోదా ఇవ్వనందుకు జాతీయ అవార్డుని తిరస్కరించిన భాషాభిమాని వేటూరి. అందుకే ఆయనకు ఇన్ని వేల వీరతాళ్ళు.
“ఏ పాట నే పాడను
బ్రతుకే పాటైన పసివాడను”
మానవజీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భానికి, అంశానికి, భావానికి సరిపోయే ఎన్నో వేల పాటలు వేటూరి మనకి వదిలివెళ్ళిన సంపద. తెలుగువాడెవడైనా తన బాధనయినా, ఆనందాన్నైనా, సుఖమైనా, దుఃఖమైనా ప్రకటించుకోవటానికి మాటలు వెతుకాల్సిన అవసరం లేదు. ఆయన వదిలి వెళ్ళిన పాటలు మనకు తోడుగా ఉన్నాయి.
“రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే!”
“ఆకాశాన సూర్యుడుండడు సందెవేళలో!”
“వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి”
“గతించిపోవు గాథ నేననీ!”
పుట్టినరోజులని, పెళ్ళిల్లని, పండగలని, సందళ్ళని తనపాటల్లో ఎంత ఉత్సాహంగా చెప్పారో చావుని అంతే తాత్వికంగా చెప్పారు వేటూరి. వేటూరి ప్రతి తెలుగువాని నట్టింటికి పాటగా వచ్చారు పాటగా మిగిలిపోయారు. ఆయన శరీరమే గగనానికి వెళ్ళింది ఆత్మ మన లోగిళ్ళలో ఉంది, ఉంటుంది.
“చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు”
మన మనసుల్లో ఒక ఆలాపనగా ఎప్పటికీ నిలిచి ఉండే ఆ మహానుభావునికి శ్రద్దాంజలి ఘటిస్తూ….
నామాల మురళీధర్
తెలవారితే నీకు తేనె నీరెండ భావం ఏమిటి