దోసిట్లో క్షీరాబ్ధి (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)

(వేటూరి గారి విలక్షతనీ, తన పాటల ద్వారా ఆయన సాధించిన ఘనతనీ తనదైన శైలిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వివరించిన వ్యాసమిది. తర్వాత కాలంలో ఆయన హాసం పత్రికకు రాసిన “వెండితెరని నల్లబల్లగా మార్చి తిరిగి తెలుగు ఓనమాలు దిద్దించిన వేటూరి” వ్యాసంలో దాదాపుగా ఇవే అంశాలు మళ్ళీ ప్రస్తావించారు. ఆ వ్యాసాన్ని గతంలో వేటూరి.ఇన్ లో ప్రచురించాం. ఇప్పుడు ఈ వ్యాసాన్నీ ప్రచురిస్తున్నాం. ఈ రెండు వ్యాసాలనీ  ఒకదాని తరువాత ఒకటి చదవడం ఓ చక్కని అనుభూతిని మిగులుస్తుంది! 

సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలో పొందుపరచబడిన ఈ వ్యాసాన్ని అడిగిన వెంటనే ప్రచురించడానికి అనుమతినిచ్చిన సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ముఖ్యంగా సిరివెన్నెల వారి సోదరులు శ్రీ శ్రీరామశాస్త్రి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు!)

చలనచిత్ర ‘సాహిత్య చరిత్ర’లో శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారి కథనం సాగరమథనం.

సాహిత్యం అని నొక్కి చెప్పడానికి కారణం ఉంది. ‘నాటకాంతం హి సాహిత్యం’, ‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్న నిర్వచనాన్ని గుర్తుచేసుకుంటే, సారస్వత శిఖరమనదగిన ‘నాటకా’నికి పర్యాయపదమే సినిమా అని ప్రతిపాదించడం వక్రభాష్యం అవదు. కాకపోతే, ఆ గౌరవాన్ని దక్కించుకున్నదా నేటి ‘చలనచిత్రం’ అన్నది వేరే ప్రశ్న.

‘చలనచిత్ర సాహిత్యం’ అనడంలో వేరే ఉద్దేశ్యం కూడా ఉంది. కథ, కథనం, నాటకీయత ఇత్యాది అంశాలను కాస్త పక్కనుంచి, ‘గీతరచన’ మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తే…

ఈ రంగంలో ‘గీత’ రచన చేసే కవిని ‘కవి’గా పరిగణించక ‘సినీ కవి’గా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్న ప్రశ్నని పరిశీలించవలసి వస్తుంది. ఈ ‘సినీ’ అన్న విశేషణం కవికి అలంకారం కాదనీ, ఒకరకమైన ‘చిన్నచూపు’ని సూచించేదనీ మరచిపోకూడదు. ఈ ‘సినీ’లో ఉన్న సినికల్ సింబాలిజంని ఇంత విస్తారంగా ప్రస్తావించడంలోనే శ్రీ వేటూరి గారి విశిష్టతని విశదీకరించడానికి బీజావాపం జరుగుతుంది.

కవి తన మనోధర్మానికి అనుకూలంగా తన ‘భావ పల్లకి’ని శ్రుతి చేసుకుని, తనదైన స్వర ప్రస్తారం సాగిస్తాడు.

కాని, సినిమాకి పాటరాసే కవి ఇంకెవరి కథకో, ఆ ఇంకెవరి కథో కన్న పాత్రకో తన కవన కళని అరువిస్తాడు. అది అరువవుతుందో, రసామృతాన్ని వర్షించే మేఘాల మెరుపవుతుందో ఆ సంగతుల మీద కవికి కర్తృత్వం తక్కువ. సాధారణంగా ‘చిత్రగీతం’ శ్రావ్య ధ్వనినే తప్ప కావ్య ధ్వని చెయ్యదు పాత్రౌచిత్యానికి భంగం గనుక.

ఈ నిజాన్ని ఆధారంగా చేసుకుంటే, సినీ కవులుగా లబ్దప్రతిష్ఠులయిన ఎందరో మహానుభావులు శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీ సముద్రాల సీనియర్, జూనియర్, శ్రీ పింగళి, డా॥సినారె, శ్రీ దాశరథి, శ్రీ శ్రీశ్రీ, శ్రీ ఆరుద్ర, శ్రీ ఆత్రేయ, శ్రీ వేటూరి – ఇత్యాదులు అందరూ (కొందరి పేర్లను స్మరించకపోతే అది నా ‘మతిమరుపు’ గా భావించి మన్నించ ప్రార్ధన) తమ సాహితీ కేదారాల్లో రెండు పంటలు కోసినవారనే వైనం స్ఫుటంగా తెలుస్తుంది.

‘తెర’ చాటున వారు సాగించిన ‘కృషి’ నాటకాలు, నవలలు, ఖండ కావ్యాలు, పద్యాలు, ప్రబంధాలు, కవితలు ఇలా అనేక రూపాల రుచుల సాహితీ సస్యాన్ని అందించి, వారికి కావ్య ప్రపంచంలో ఆమోదముద్రనీ, గణనీయమైన గౌరవాన్ని సంపాదించి పెట్టింది. ఆ కావ్య ప్రపంచం వారి ‘తెర’ మీది దాళవా కృషిని తక్కువగా చూడకపోయినా ‘పట్టమహిషి’గా మాత్రం మన్నించలేదు.

‘మహాప్రస్థానం’, ‘కృష్ణపక్షం’, ‘తెలంగాణ’, ‘త్వమేవాహం’, ‘విశ్వంభర’ వగైరా వగైరా రచనలతో గుర్తించబడిన వారి వారి సాహితీమూర్తులకు వారి వారి ‘చిత్ర గీత’ నీడగానే నడిచింది.

అంటే, ఈ ప్రతిభామూర్తులెవ్వరూ సినిమాల్లో తమతమ ప్రజ్ఞాపాటవాల్ని పరిపూర్ణంగా ప్రదర్శించలేదు అని చెప్పడం లేదు. కాని, సినిమా పాటకి కావ్య గౌరవ స్థాయి కల్పించే అవకాశం వారికి ప్రతి పాట బాటలోనూ ఎదురవలేదు. ఎదురవకపోవడం సహజమే అని నా భావం.

సినిమా పాట సినీ సంగీతాన్ని ఆలంబన చేసుకుని మనగలుగుతుంది. సినిమాలో ‘పాట’ ఒక చిన్న భాగం. దానికి ‘తియ్యగా వినిపించడం’ అన్నది ప్రప్రథమమైన నియమం. సినీ సంగీత దర్శకుల వేలు విడిచి, తమ ‘పదాల’ మీద స్వతంత్రంగా, సగర్వంగా తలెత్తుకు నిలిచే పాటలు చాలా కొద్ది.

ఇది శ్రీ వేటూరివారు రాకముందు తెలుగు సినిమా పాటల పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో అంటే సం॥ 1940 నుంచి 1970 వరకు ఉత్తరాదిన హిందీ పాటల్లో చాలా భాగం పాటలు గొప్ప కవితలుగా మనగలగడం మనం మరచిపోరాని అంశం. మరి తెలుగుపాట తన ‘మరుగుజ్జు’ ‘తన్నానాన్న’ స్వరాల సోపానాల మీద నిలబడడం విస్తృత పరిచిందని, పాట విడిచి సాము చేసే పదాలు ఒట్టి మాటల పోగుగానే ‘కనబడిందనీ’, ఆ మాటలు తొడుగుకున్న సరిగమల సిరిమువ్వల వల్ల చెవులకి విందుగా వినబడిందనీ తెలుస్తుంది.

మరోసారి వినమ్రంగా విన్నవిస్తున్నాను. పూర్వపు పాటల్లో ఎన్నో గొప్ప lyrics ఉన్నాయని, ఆ ‘ఎన్నో’ అన్నమాట, మొత్తం పాటలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ‘కొన్ని’ అయిపోతాయని చెప్పే నా ప్రయత్నంలో, ఒకనాటి తెలుగు పాట నడచిన కచ్చారోడ్ ని చూపడానికే గానీ, ఆ పాటలని నడిపించిన వారి విద్వత్తుని కాదని మనసారా వినమ్రంగా విన్నవిస్తున్నాను.

సరిగ్గా ఆ సమయంలో శ్రీ వేటూరి సుందరరామమూర్తిగారు 1975 లో ‘ఓ సీత కథ’ చిత్రం ద్వారా శ్రీ కె. విశ్వనాథ్ గారి పుణ్యమా అని, ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అని, నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజ స్వాములవారిని స్మరిస్తూ, ‘మధుర కథాభరితమైన భారత నారీచరిత్ర’ను హరికథగా పలుకుతూ తెచ్చిన తేనెవాక ముందుతరాల ‘సినీ’ కవుల పాలిటి భవ్య భవితవ్యానికి నారుపోసిన ఏరువాక.

‘సిరికాకొలను చిన్నది’ లాంటి ‘ఆకాశవాణి’తో గాలి పాలకడలే తప్ప, ముచ్చటైన ముఖచిత్రాలు, ముఖ్యమైన ఆముఖాలు, పీఠికాధివాహరణలలో అచ్చుపడిన ‘అక్షరాయక్షణాలు’, సుదూరకాలపు సులోచనా వీక్షణకు నిలువగలిగే గ్రంథస్థ లక్షణాలూ గలిగిన పత్రక్షేత్రాల్లో వేళ్ళూనుకొని వేటూరివారి బీజాక్షరాలు చిత్రగతిలో నర్తించడం ప్రారంభమయింది.

అగ్ని కార్యానికి అర్ధాంగి, స్పర్శా దాహానికి వేరొక సారంగి కలిగిన ‘సిరిగలవాడు’ కాని వేటూరి కవి, పేదవాడికి పెళ్ళాఁవే ప్రియురాలు’ అన్న తెలుగు కైతలా, పంచె ఎగ్గట్టి పంకంలోనే పద కమలాలు పండించే తలమునకల పనిలో పడ్డాడు.

తను రాక మునుపే చిత్రసీమలోకి అనేక చైత్రాలు వచ్చి వెళ్ళాయి. తనకన్నా ముందే అనేక గండు కోయిలలు పరిపరి విధాల తమ రాతలతో ఇక పలకడానికేముంది, బొంగురుపోయిన గొంతుల వగరు దీర తప్ప అనేంత సుదీర్ఘ కచ్చేరి కానిచ్చాయి. పాటని చూసే ప్రేక్షకులు మూడాటలతో వెళ్ళిపోతే, తమ పాటవాన్ని గౌరవించే పాఠకుల ముందు మూడు కాలాలూ విద్యా ప్రదర్శనకు ‘తెర’పడని వేదికలను కూడా ఏర్పాటు చేసుకున్న మునుపటి వారితో మాట కలిపి అవుననిపించుకోవలసిన అవసరంతో ఒక ఎడారి కోయిల, తెల్లారని రేయి లాంటి ఈ కవీ – సినీ కవి విభేదాల వివాదాల కడలి కల్లోలంలో తన కలస్వనాల్ని వినిపించేందుకు చేసిన విన్యాసమే శ్రీ వేటూరి సుందరరామమూర్తిగారి చలనచిత్ర గీత కథనం – సాగర మథనం.

భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ, పంతులమ్మ, సప్తపది, అడవిరాముడు, మయూరి, సితార, సీతాకోకచిలుక, ఆనందభైరవి, సాగర సంగమం, శ్రీవారికి ప్రేమలేఖ, ప్రతిఘటన, సీతారామయ్యగారి మనవరాలు, మేఘ సందేశం, రాజేశ్వరి కల్యాణం, శంకరాభరణం… ఇలా ఎన్నెన్ని చిత్రాల్లోని ఎన్నెన్నో సంగతులతో వినిపించిన ఆయన గీతాల్లోని ‘ఒడుపున్న పిలుపు – ఒదిగున్న పులుపు’ తనే రాగమో తేల్చుకుంటూ తెలుగువారి పెరట్లో శాశ్వతంగా మకాం పెట్టింది.

ప్రతి ఒక్క పాటలోను తన ప్రాణస్పందనను పొందుపరిచి “తలపైని గంగమ్మ తలపులోనికి పారె” అంటూ కిరాతార్జునీయ శ్రీనాథుడికి కొత్త ‘సిరిమువ్వ’ కానుకిచ్చి, తూరుపుతల్లికి పడమర తండ్రికి ‘సాగర సంగమ కళ్యాణం’ జరిపించి ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ తో జతపరచి, ‘ఉయ్యాలలూగే ఈ జగమంతా ఊహలకందని వింత! ఈ లాహిరిలో నీవెంత!’ అనే నిగమార్థసార మంత్రోచ్చారణతో పౌరోహిత్యం నిర్వహించి, నవరసాలతో నిత్యనూతన వియద్గంగావతరణంగా సాధించిన కృషి, శేముషి, సినీ కవులకీ కొత్త యునికిని, గొప్పతనాన్ని కట్టబెట్టిన ‘మా’ పెద్దాయన వేటూరిగారు.

‘ఉదయరాగ మంజరికీ సుప్రభాత సుందరికీ’ మధ్య ఉన్న చిన్న అంతరాన్ని దర్శించిన ఆయన విశ్వాంతరాళాలను స్పర్శించి ‘రుద్రవీణ నిర్నిద్ర గానమిది అవధరించరా! విని తరించరా’ అని, ‘ఎరుకల సామి’గా చేరిన ‘ఎరుకగల సామిని’ రచియించ గలిగారు.

‘ముద్దు ముద్దుకు ఎడమెంత? ఉరుముకి మెరుపుకి ఉన్నంత!’ అని ‘అలలా ఎన్నెల గువ్వ ఎగిరిపడుతున్నంత’ తెలుగందంతో తేలిగ్గా చెప్పేసినట్టనిపించే ఆయన పదం కదంతొక్కుతూ, ఆ “పదం ఇలలో నాట్య వేదం” అంటుంటే, ‘వ్రేపల్లియ ఎదఝల్లున పొంగిన మురళి’ నూదిన మువ్వగోపాలుడి మోవి వెనుక గీతాచార్యుడి గుండె లయ గుప్పిట ఉంచితే గోరంత, విప్పి చెప్పితే ‘కొండంత’ అంటుంది. ‘ఏ గగనమో కురుల జారి నీలిమై పోయె, ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమగా నిలిచి’న ఆంధ్రభారతి ‘మానస వీణా మధుగీతం’లో ‘నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా’ అంటున్న వేటూరివారి కమ్మని ‘ఝుమ్మన్న నాదం’ ‘వేణువై వచ్చాను భువనానికి’ అని స్వర పరిచయం అందిస్తూ స్వాగతిస్తోంది. ‘పట్టుపురుగు ధన్యమే కట్టబడితే’, ‘రవివర్మకే అందని” అందాన్ని హృదయాలకు నయనాలను ఏర్పరుచుకుని చూసుకుంటుంది.

‘తొలిరాతిరి మీరడిగిన ప్రశ్నకి, తొమ్మిది నెలలు ఆగాలి, నేను కమ్మని జవాబు చెప్పాలి’ అని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుతో మేలమాడుతూ మురిసిపోయిన సింగారాల చిన్నది – ఏఁవన్నది ఏ కల కన్నది ఆ పుట్టిన బిడ్డను చూస్తూ ఏ కళనున్నది అని వర్తమానం తెలుసుకోవాలి’ – భవిష్యత్తుకి తెలియజెప్పాలి.

వేటూరిగారి పాటల ప్రయాణం తెలుగు పలుకుబడికి సంబంధించిన వైనం! ఆయనను ప్రశంసించినా, విమర్శించినా, విస్మరించినా ఆయనకి ఒరిగేదీ లేదు, కరిగేదీ లేదు. కాకుంటే, ఈ వ్యాసాన్ని చదివే వాళ్ళు అప్పుడే అంగన్యాస కరన్యాసాలతో మహాసంకల్పం ప్రారంభించి ఉంటారు – నా మీద దాడికి.

వేటూరివారి పాటల పూతోటలోని రాళ్ళు-రప్పలు-ముళ్ళు, “రాలిపోయిన రాగాలు”, కందిరీగల చిందులాటలు, తెనాలి రామకృష్ణుడి వికట విన్యాసాలు, నీకు కనబడవా? వినబడవా? అని నన్ను దండించడానికి వేటూరివారి ప్రతిభా వ్యుత్పత్తుల్ని, వారి పాండితీ ప్రాభవాన్ని, వారి పదాల లాస్యాల ఆర్భటీ తాండవాల నిశాల ఉచితానుచితాల పరిశీలనకి పూనుకోలేదు నేను. వారిని విమర్శించే పార్థులకి గాండీవ శరవర్షానికి, భీష్మ కవచానికీ నడుమ శిఖండినీ కాను.

ఒక్క విషయాన్ని గమనించవలసినదిగా వర్తమానానికి విజ్ఞప్తి చేస్తున్నాను. లిరిక్ కి సాంగ్ కి ఉన్న తేడా గుర్తించిన వారెవ్వరు? సరిగమలని అలంకరించుకున్న కవితా కాంతకి మాటల మారువేషం వేసుకున్న స్వర సంచాలనానికీ – ఏది గొప్ప, ఏది చిన్న అన్న వ్యత్యాసాన్ని పోల్చుకున్నవారు “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః’ అన్న శ్లోకంలోని ప్రథమ పాదం దగ్గర అగిపోయి ‘కో వేత్తి కవితా తత్త్వం శివో జానాతి వా నవా!” అన్న ద్వితీయ పాదం వెయ్యకపోతే సారస్వతామృతా పాన యోగ్యతను కోల్పోదా అని, అది నన్నయాదులందించిన పారంపర్యాన్ని పాడుబెట్టుకోవడం అవుతుందనీ, అది పాటా, పద్యమా, సినిమా పాటా, మరోటా అన్న మాటలాయనని కావ్య జ్యోత్స్నలో విహరించమని వేడుకుంటున్నాను.

సం|| 1975 నుంచి 1985 వరకు దాదాపు పదేళ్ళపాటు సాగిన వేటూరిగారి తపస్సు ఆ తర్వాత బీటలు వేస్తోందనేది చారిత్రక వాస్తవం అయితే, ఆ వాస్తవాన్ని అవక్షేపించిన రసాయన చర్య ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరిగిందో విశ్లేషించే బాధ్యతని, భారాన్ని ఈ చిన్న వ్యాసం మొయ్యలేదు ఇప్పుడు.

ఆయన గీతామృతసాధన వేదిక పాటల పాలకడలి. బాధ్యత – మందరగిరి. చిలికేందుకు అల్లెతాడు అల్లిబిల్లిగా అల్లుకున్న విష వలయాల వాసుకి. ఈ లోపల హాలాహలం పుట్టలేదా అంటే పుట్టింది. ఆ హాలాహలం ఆయన కలంలో అడుగుపెట్టదట!

చెత్తనే నెత్తికెత్తుకునే వాళ్ళు, అత్తరును చూసి చీదరించుకునేవారు, ముత్యాల మాలలకన్నా గవ్వల గలగలలే కోరుకునే పిల్లకాయలు, అచ్చరలలో కనబడితే అచ్చెరువున చూసే మూఢమతులు, ఈ తారకలతో ‘ప్రతిఘటన’లో ఉన్న ఈ స్థితిగతులన్నీ విశదీకరించ వీలవ్వని ఈ చిన్ని ప్రయత్నం – అమృత మథన వేళ ఎగసిబడుతున్న క్షీరాబ్ధిని దోసిట్లో తీసుకుని చూపించడం వంటిది.

నీడల క్రీడలని వెక్కిరించేముందు, ఆ నీడల్ని కలిగించే దీపాన్ని చూడమని, చేతనైతే చిన్న చమురు బొట్టులాగ సదనసదనమందించి చిటికెన వేలి గోరుపాటి ప్రోత్సాహంతో ఒత్తి నెగదోసి, ‘వేణువై వచ్చాను భువనానికి’ అన్న తెలుగు పాట ‘గాలినై పోతాను గగనానికి’ అని మాలోకి ముడుచుకుపోకుండా చూడమని, చదువుతున్న వాళ్ళందర్నీ, రసజ్ఞుల్ని, విమర్శకుల్నీ, పండితుల్నీ, ‘వ్యాస పీఠాధిపతుల్ని’ వేడుకుంటూ, వచనంగా ప్రవచిస్తున్న తెలుగు కవితని పద్యంగా కూడా పలకనివ్వమని, పాటగా కూడా పరుగెత్తనివ్వమని ప్రార్థిస్తూ…

ఈ ప్రస్తావనకి నాంది పలికిన వేటూరి సుందర రామమూర్తి గారికి నా వందనాలు సమర్పిస్తున్నాను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top