జంధ్యాల గారి తరువాత చెప్పుకోవలసింది, రమేష్ నాయుడు గారు – వేటూరి గురించి. రమేష్ నాయుడు గారు, రచయితకు ఆనందం కలిగించే రెండు విషయాలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఒకటి, ఆ సన్నివేశం లో పాట అవసరమా , రెండోది, సరైన పదాలతో అందంగా అమరిన పాట. ఆయన పాట కే స్వరాలు కూర్చేవారు. స్వరానికి పాట ఆయన ఎప్పుడూ చేయలేదు అంటారు, బహుశా అతి తక్కువేమో.
రమేష్ నాయుడు గారు ఆ కాలంలోనే తను స్వరపరిచే సినిమాలలో కొన్ని అసాధారణ నియమాలు పాటించేవారు. రమేష్ నాయుడు గారు సంగీత దర్శకుడిగా ఒక పధ్ధతి ప్రకారం శిక్షణ తీసుకున్నవారు కూడా కాదు. తను సంగీత దర్శకుడిగా పనిచేసినంత కాలం కూడా, సినిమాలో ఒక సన్నివేశానికి పాట అవసరమా అని ప్రశ్నించి తను సమాధాన పడిన తరువాతే పాటను స్వరపరిచే వారు. ఈ నియమం (చాలామంది తెలివితక్కువ విధానం అనేవారు) వల్ల, ఆయన ఆ సమయం లో వ్యాపార దృక్పధం తో పాటలను విదేశీ విహార యాత్రలను ప్రోత్సహించే విధం గా తీసే సినిమాలకు దూరం కావలిసి వచ్చింది.ఆ సమయంలో తక్కువ ఆర్ధిక వనరులతో కొంతమంది నిర్మాతలు తీసే మంచి సినిమాలకు, సంగీతం తో ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఆయన పనిచేశారు. ఆయన చేసిన సినిమాలు, ‘తాత మనవడు, తూర్పు పడమర, మీనా, స్వప్న,కల్యాణి,ముద్ద మందారం, మేఘ సందేశం, ఆనంద భైరవి, స్వయం కృషి’, వీటన్నిటి మధ్య ఒక విలక్షణమైన సినిమా ‘హేమా హేమీలు’. ఇవి చూస్తే, ఆయన ఏ సినిమాలకు, వ్యాపారాత్మక సినిమాలకా లేక కళాత్మక మైన సినిమాలకా, పని చేయడానికి ఇష్టపడ్డారో మనకి అర్ధం అయి పోతుంది. ఇది అటు నిర్మాతలకు ఇటు అభిరుచి గల ప్రేక్షకులకు ( పాటలు అంటే వాద్యహోరు, హీరో హీరోయిన్ల విదేశీ నృత్యాలు మాత్రమే కాదు అనుకునే వారు) ఆమోద యోగ్యమయింది. సినిమాలను తన అభిరుచికి అనుగుణంగా ఎంచుకొని, సంగీత ప్రధానంగా శ్రావ్యమైన పాటలను అందించిన వారిలో ఈయన తో జత కట్టినవారు హిందీ సినిమా రంగంలో మదన మోహన్ ఒకరే అనుకోవచ్చు. ఇరువురు కూడా సినిమాలను ఎంచుకొని, తమ సహజ సంగీత సామర్ధ్యంతో అజరామరమైన సంగీతాన్ని అందించారు. అటువంటి సంగీత దర్శకుడికి పాటలు వ్రాయడం కన్నా ఉత్సాహం కలిగించే విషయం ఒక మంచి రచయితకు ఉండదు. స్వరానికి పాటను కాకుండా సంపూర్ణ స్వేచ్చతో పాటను వ్రాసే అరుదైన అవకాశాలలో వేటూరి కొన్ని ఆణిముత్యాలు అందించారు.
మధువనాంతముల మరు వసంతములు చిరు లతాంతములు వెదజల్లగా
దశ దిశాంతముల జత శకుంతములు గల మరందములు ఎద జల్లగా
గుములు గుములుగా ఎదల మెదులు తుమ్మెదలు రొదలు పలికించగా
తొడిమి తొడిమిలో తొలకిరింతలకు కడిమి పూలు వికసించగా
రాధవై వలపు గాధవై మరుని పాలి మర్యాదవై
కృష్ణ మురళివై ఆడ నెమలివై రాగ సరాళివై రా తరలి రా కదలి రా
బీరం మస్తాన్ రావు గారు నిర్మించిన ‘సువర్ణ సుందరి’ అనే, అంతగా వెలుగు లోకి రాలేకపోయిన సినిమాలోని ఈ పాట, ప్రసిద్ధ హిందీ చిత్ర నిర్మాత శాంతారాం సినిమా ‘నవరంగ్’ లోని ‘ఆదా హై చంద్రమా రాత్ ఆధీ’ అనే పాటను జ్ఞప్తికి తెస్తుంది. అంత మధురంగానూ ఉంది. వేటూరి గారి ఈ పాట వింటే పాటలో లయ, తాళం, ఛందము కూడా అందరికీ అర్ధం అవుతాయి. పాటలో పదాలే స్వరం కూరుస్తాయి. ఇటువంటి పాటల కోసమే రమేష్ నాయుడు గారు తపించేవారు. సాంప్రదాయకమైన సందర్భంలో నైనా, ఒక క్లబ్బు లో పాట సన్నివేశానికైనా, సందర్భోచితంగా, అందమైన పదాల అల్లిక తొ పాట వ్రాయడానికి రచయితను ప్రోత్సాహపరిచే వారు రమేష్ నాయుడు. నారాయణ రెడ్డి గారు ‘తాతా మనవడు’ సినిమాకు వ్రాసిన పాటను ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వేటూరి కొన్ని మరిచి పోదగ్గ సన్నివేశాలకు అరుదుగానైనా, పేలవమైన పాటలు వ్రాసారు. కానీ నాయుడు గారికి, అర్ధ నగ్నంగా స్త్రీలు నృత్యం చేసే సన్నివేశాలకు కూడా అర్ధవంతంగా మంచి పాటలే వ్రాసారు.
నింగిలాగా నేలకు వంగి నీరులాగా మబ్బుల దాగి
మెరుపిస్తే ఉరుమై వస్తా జరిగిస్తే పిడుగై పోతా
వరదొస్తే వంతెన వేస్తా సరదాగా సంకెల వేస్తా
ఏ ఊరు ఏ వాడా అందగాడా
మా ఊరు వచ్చావు సందె కాడా
భావార్ధాలతో కూడిన రచన నాయుడు గారి సంగీతంలో ఒక పార్సము. ఇంకో వైపు, వాద్యసంగీతం తక్కువుగా శ్రావ్యంగా మధురంగా స్వరకల్పన చేయడం ఆయన ప్రావీణ్యత. ఆయన కట్టిన బాణీలు నిశ్శబ్ద నేపధ్యంలో రెండు శ్రావ్యమైన స్వరాలు మధురమైన సంగీతం ఆలాపిస్తున్నట్టు ఉంటుంది. ఆ కాలంలోవాద్య సంగీతాన్ని పాటలోని పదాల అమరికకు శ్రావ్యత చేకూర్చేటట్టు గా వాడేవారు, ఎంతమేరకు అవసరమో అంత మాత్రమే. ఈ నాడు వాద్య సంగీత హోరులో ఖాళీలను పూరించటానికి మాత్రమే పదాలను ఉపయోగిస్తున్నారు. మొదటి పద్ధతిలో నాలుగు కాలాలు నిలిచే బాణీలు వచ్చాయి, రెండో మార్గంలో మంచి పాటలు వెతుక్కోవటం అంటే మెరుపును సీసాలో పట్టే ప్రయత్నమే. అందమైన పదాలతో కూడిన పాటలను కలకాలం నిలిచేటట్టు స్వరకల్పన చేయడం నాయుడు గారి ప్రత్యేకత.
నవమి నాటి వెన్నెల నీవు దశమి నాటి జాబిలి నేను
కలుసుకున్న ప్రతి రేయీ కార్తీక పున్నమి రేయి
ఏరు పక్క మా ఊరమ్మా ఊరు పక్క మాగాణమ్మా
ఏరు కాళింది ఊరు వ్రేపల్లె వెన్న దాచకే కన్నె గోపెమ్మా
మెరుపులా మెరిసావు వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలోగా నిన్నలో నిలిచావు నిన్నలో నిలిచావు
ఈ పాట హిందీ సినిమా ‘లవ్ స్టోరి’ లోని ‘యాద్ ఆరహా హై తేరీ యాద్ ఆరహా హై’ పాటకు అందమైన మార్పులు చేసినట్టు అనిపిస్తుంది.
అనేక అందమైన బాణిలలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి నాయుడు గారు జంధ్యాల గారికి చేసిన ‘ఆనంద భైరవి’, దాసరి గారికి చేసిన ‘మేఘ సందేశం’ సినిమాల సంగీతం. వీటి కోసం వేటూరి చే వ్రాయించిన అందమైన పాటలు. సాంప్రదాయ శాస్త్రీయ సంగీత పద్ధతుల్లోనూ, సంప్రదాయ సంగీతం మేళవించి సాగే పద్ధతిలోనూ ఉండే సన్నివేశాలకు వేటూరి సాంప్రదాయ సాహిత్యం లోనూ నేటి భావ కవిత్వ తీరులోనూ వ్రాసిన పాటలు ఆయన ప్రతిభకు గీటురాళ్ళు .
శరీర పంజర స్వర ప్రపంచక మధుర గాన శుక వీణ గా
పాడనా వాణి కల్యాణి గా స్వర రాణి పాదాల పారాణి గా
వానుకారు కోయిలనై తెల్లవారి వెన్నలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి ప్రేమ సందేశం ఈ మేఘ సందేశం
పిలచిన మురళికి వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రాగం అది ఆనంద భైరవి రాగం
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి
ఎదలో ప్రేమ పరాగం మది ఆనంద భైరవి రాగం
శయ్యలలో కొత్త వయ్యార మొలికే శరదృతు కావేరిలా తీగసాగి
జలద నినాదాల పలుకు మృదంగాల వాశుక జలగీతిలో తేలియాడి
చలి ఋతువే సరిగమలౌ నాద సుధా మధువాణికి చైత్రము కుసుమాంజలి
సాధారణంగా ఉత్తమ అభిరుచి కలిగి, విజయవంతంగా సాగుతున్న పాటల రచయిత, సంగీత దర్శకుల జంట లను నిర్మాతలు, చిత్ర దర్శకులు, ప్రేక్షకులు కూడా ఆనందంతో ఆహ్వానిస్తారు. ఈ జంటల్లో చాలా అరుదుగా, రచయితకు సాహిత్యపరంగా ఉత్తమ సృష్టి చేసే అవకాశం తద్వారా అందరికన్నా ఎక్కువగా సంతృప్తి కలుగుతుంది. రచయితను బతిమాలి, ఉత్సాహపరిచి, ప్రోత్సహించి పాటలను వ్రాయిస్తే అవి అందరికీ వీనుల విందు చేస్తాయి. ఈ విషయంలో వేటూరి, ఆయనతో పాటు దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు రమేష్ నాయుడు కి ఋణపడ్డారు.
———————————————————–
కంచిభొట్ల శ్రీనివాస్ గారు వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం.
కంచిభొట్ల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్