వేణువై వచ్చాను – వేటూరి (ఆఖరి భాగం)

ఒక దర్శకుడు ఒక గొప్ప కళాఖండం తోనూ, ఒక సంగీత దర్శకుడు ఒక గొప్ప బాణీ తోనూ తమ వృత్తికి ముగింపు పలక గలరేమో కానీ, మిగతా కళాకారుల వలే,   ఒక గొప్ప పాటల రచయిత ఒక మంచి పాట తో తన రచనా వ్యాసంగాన్ని బహుశా ఆపలేడేమో.  పాటల రచయితలు కాలానుగుణంగా, మారుతున్న అభిరుచులు, పరిస్థితులు, సన్నివేశాలు కు తగ్గట్టుగా తమ రచనలు సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పాత కాలం నుంచి ఇప్పటి దాకా సినిమాలో పాటలు పెట్టడానికి గల కారణాలు ఒకటే. భావావేశాలు ప్రకటించే, పలికించే  తీరుతెన్నులు మారుతూ వస్తున్నాయి. ఒకే సన్నివేశానికి, సందర్భానికి   కాలానుగుణంగా మారుతున్న అభిరుచులను, భాషనూ కూడా ప్రతిబింబించేటట్టు  తమ రచనలను మార్చుకోవడములో రచయిత ప్రతిభ కనపడుతుంది. వేటూరి సినిమా గమనం దీనికి మంచి తార్కాణం.  ఒక పాట కట్టడం లో (శిల్పం అనవచ్చునేమో) పాటను మలచిన విధానం, రచయిత ఉహ, భావ ప్రకటన, భాష, సన్నివేశానికి తగ్గట్టుగా ఔచిత్యం పాటించడం ముఖ్యం. ఇవి రచయిత శైలి మీద కూడా ఆధారపడి ఉంటాయి. భాష మీద సాధికారత, భాషా ప్రయోగం మీద ఆధారపడ్డ ఈ శైలి కూడా  మారుతున్న అభిరుచులకు అనుగుణంగానే ఉంటుంది.  ఉదాహరణకి,  భగ్నప్రేమికుడి ఉద్వేగాన్ని తెలియ చేయడానికి,  “ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా” అంటూ ఒకప్పుడు తన పాండిత్యానికి మెరుగు పెట్టిన కవి   “రెండక్షరాల ప్రేమ రెండు క్షణాల ప్రేమ” అని అన్నారు. భాషా ప్రకటనలో ఔన్నత్యం తగ్గినా ప్రేమికుడి బాధ, నిరాశ తెలియచేసే  భావం  రెండిటిలోనూ వినిపిస్తుంది. ప్రేక్షకులు కూడా ఆ నాటి ఉదాత్త భావ ప్రకటన ను ఎంత ఆదరించారో సాధారణ భావ ప్రకటనను అంతే ఆదరించారు.   అటువంటి భావాలని ఈ నాడు, నేటి వేగవంతమైన జీవన  క్రమానికి  అన్వయం చేసి “అందంగా లేనా, అసలేం బాలేనా, నీ ఈడు జోడు కానా” అని వ్రాస్తున్నారు. మారుతున్న తరాల తీరు తెన్నులను ప్రతిఫలించేటట్టు శ్రేష్టమైన పాటలు వ్రాయడం లో భాష ముఖ్యమా భావం ముఖ్యమా అన్నది రచయితలకు కత్తి మీద సాము లాంటిదే.

 

ఒక్క మాటలో చెప్పాలంటే, రచయితగా విజయం సాధించాలంటే కాలానుగుణంగా భాషలోనూ, భావ ప్రకటనలోనూ మార్పులు చేసుకోవాలి. ముప్ఫై ఏళ్ల తన సినీ గమనం లో కాలానుసారం గా కవిత్వం వ్రాసిన వేటూరి అందరి కన్నా మిన్న. రచనా వ్యాసంగంలో ఉచ్చస్థితికి చేరిన, ప్రజాదరణ  పొందిన  ఏ రచయిత అయినా చాలా రచనలు బహుశా వేలల్లో పాటలు వ్రాసి ఉంటారు. కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక్క ‘శంకరాభరణానికి’  వ్రాస్తే ఒక ఏభై ‘ఘరానా దొంగ. ఘరానా అల్లుడు, ఘరానా మొగుడు, ఘరానా బుల్లోడు, ఘరానా గంగులు’ లాంటి వాటికి కూడా వ్రాయాల్సివస్తుంది. ఇక్కడే రచయిత తన ప్రతిభను చూపించాలి. సాహిత్య సృష్టి చేసే అవకాశం లేకపోయినా, పస లేని సన్నివేశాలకి కూడా ఏదో ఒక విలువ తెచ్చే విధంగా పాట వ్రాయ గలగాలి. పాటతో సన్నివేశానికి బలం చేకూర్చాలి. ఇటువంటి సందర్భాలలో వేటూరి కృతకృత్యులయ్యారనే చెప్పాలి. ‘ముఠామేస్త్రి, ధర్మక్షేత్రం’ లలో పాటలే ఉదాహరణ.

 

సరుకు ఏమో యమా చీపు

తలకు ఏమో యమా టాపు

పలుకు ఏమో పిడి బాకు

మనసేమో నవటాకు

 

కొరమీను కోమలం

సొరచేప శోభనం

దొరసాని బురద కొయ్య

 

సినిమా వ్యాపారం కోసమే కల్పించే సన్నివేశాలలో పాటలు ఇలాగే ఉంటాయి. ఇలాంటి పాటలు ఎందుకు ఉండాలి అంటే హీరో గారికి కనీసం ఆరు పాటలు ఉండాలి కాబట్టి.  సమయం, సందర్భం లేని  సన్నివేశాలకి, సంఖ్య కోసమే పాటలు వ్రాయాల్సి వచ్చినప్పుడు రచయితకు సాహిత్యం  కానీ  రసపోషణ  కానీ అక్కరకు రావు. అల్ప విషయాలకు అనుసంధానించి వ్రాసిన పాటతో సన్నివేశానికి ఉదాత్తత కల్పించే ప్రయత్నం  చేసారు వేటూరి. ఈ సందర్భంలో నవటాకు (కృష్ణా , గుంటూరు జిల్లాలలో ఎక్కువుగా ఉపయోగించే,  ద్రవాలను కొలిచే పరికరం, శేరు లో ఎనిమిదవ వంతు), రక రకాల చేపల పేర్లు పాటకు ఎంతో కొంత అలంకారం తెచ్చిపెట్టేయి. ఇటువంటి సందర్భాలలో పాటలు వ్రాయడం లో వేటూరి తన,  భౌగోళిక, చారిత్రిక, కళా, సంగీత,   ఆకార, ఆచార వ్యహహార సంబంధిత విషయ పరిజ్ఞానాన్ని, ఎక్కువగా ఉపయోగించారు.  సాధారణ సన్నివేశాలకి ఇతరుల వలే మూస పధ్ధతి లో కాక, మనకి తెలియని విషయాలలో ఆసక్తిని కలిగించే విధంగా వ్రాసారు. రసహీనమైన సందర్భాలకు  కూడా తన పాటతో ఎంతో కొంత జీవం పోసారు వేటూరి. ఎటువంటి సన్నివేశమైనా తన పాటతో మెప్పించగల వేటూరి  తన 36 ఏళ్ల సుదీర్ఘ సినీ జీవితం లో అందరి మన్నలను పొందుతూ నెగ్గుకు రాగలిగారు.

 

సినీ చరిత్రలో వేటూరి శకం ముగిసింది. వేటూరి  ఉత్థానము సినిమా చరిత్రలో డెబ్బై లలో ఒక ఆసక్తికరమైన సంధికాలం లో జరిగింది.  వేటూరి సినిమా ప్రవేశం కన్నా ముందునుంచి,  సినిమాలలో వ్యాపారాత్మక ధోరణి  ఉన్నా ఆయన రాక తరువాత ఎక్కువ అయింది. ఇక్కడ ఒక ప్రశ్నకి జవాబు వెతకాలి. మారుతున్న సినిమా కి అనుగుణంగా వేటూరి తనను మలచుకున్నారా?  లేక ‘కాదేది కవితకనర్హం’ అన్న పధ్ధతి లో వేటూరి,   సంబంధమే లేని సందర్భాలకు కూడా తన ప్రతిభా పాటవంతో పాటలు వ్రాయగలగడం వల్ల సినిమా పాటలలో  సాహిత్యపు గుబాళింపు తగ్గిపోయిందా? పాట పరంగా సాహిత్యం ఎంత బాగుంది అన్నది శ్రోతల అభిరుచి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సాహిత్యపరంగా అందంగా ఉన్న పాటలు ప్రజాదరణ పొందలేక పోవచ్చు.  తరచి చూస్తే వ్యాపార ధోరణిలో వ్రాసిన  పాటలలో కూడా అంతో ఇంతో విలువలు కనిపించవచ్చు.

 

నీ కచటపనల్లో కరుగుతున్నదీ  సొగసు, నీ గజడదబ దబల కధలు ఏమిటో తెలుసు,

అబ్బా దాని చూపు అది ఇచ్చాపురం పోపు, అబ్బా దాని వీపు అది బొబ్బర్లంక స్లోపు,

ఆకు పూజ నీకు నోము సోకు పూజ నాకు నోము, జంట కింక గంట కొట్టరా,

 

(హనుమ భక్తిని భామ రక్తితో కలపి పాట వ్రాయడం చమత్కారానికి అవసరమేమో.)

 

వేటూరి లాంటి పదశిల్పి మరొకరు లేరు అని చాలామంది  అంటారు.  ఆశువుగా, సందర్భోచితంగా, వేగంగా పాటలు వ్రాయడంలో వేటూరి కి సాటి మరొకరు లేరంటారు. వేటూరి పాట పరిధి అంటే సందర్భం,సన్నివేశం, భాష లకు అతీతంగా కూడా ఆలోచించేవారు. విదేశీ భాష, లోకోక్తులు, భోజనరుచులు, విహార స్థలాలు, ఇత్యాదులు ఏమైనా సరే సమయోచితంగా ఉపయోగించడంలో వేటూరి సిద్ధహస్తులు  (‘సెంబవాంగు రంభతోటి  సాగుతున్న హేలలో; హే చికిటా కమోస్తాస్, జంటకడితే జమాస్తాస్;  లాంటివి). ఆయన వ్రాసిన పాటలలో, భాష, భావం, సాహిత్యం లతో పాటు కూర్చిన ఆసక్తికరమైన విషయాలన్నీ క్రోడీకరిస్తే బహుశా అది ఒక సర్వసంగ్రహ నిఘంటువు అవుతుందనడంలో సందేహం లేదు.  రచయితలు, విమర్శకులు, తత్వవేత్తలు, భాషా కోవిదులు, రసజ్ఞులు, తమ తమ రంగంలో నిష్ణాతులు అనేకులు ఉండవచ్చు. వీటన్నిటిలో ప్రావీణ్యంతో పాటు, మిగతా అనేక రంగాలలో విషయ పరిజ్ఞానం గలవారు వేటూరి. ఇంత శేముషి సంపన్నుడు తెలుగు సినిమా చరిత్రలో ఒక్కడే. ఆయన అభిప్రాయాలు కానీ, మాటలు కానీ, వ్రాసిన పదాలు కానీ ఎవరూ తప్పుగా అర్ధం చేసుకోలేదు.  ఆయనతో కలసి తిరిగిన వారు, పని చేసినవారు కూడా ఆయన మాట మన్నించారు. ఆయన సినిమాలలో పనిచేసినంత కాలం ఆయన ప్రాముఖ్యత తగ్గలేదు. ఆయన సినీ రంగంలోకి ఎలా వచ్చారో అలాగే ఎంతో గౌరవంతో తల ఎత్తుకుని నిష్క్రమించారు. జూలియస్ సీజర్ కి ఉద్దేశించిన  ఒక లాటిన్ లోకోక్తి, ‘అతను వచ్చాడు, చూసాడు, జయించాడు’ వేటూరి కి కూడా సరిగ్గా సరిపోతుంది.

 

రచనలని జీవనోపాధిగా చేసుకున్న రచయితలలో వేటూరి అగ్రగణ్యుడు అని చెప్పవచ్చు. అలాంటి వారు న భూతో న భవిష్యతి. ఒక కవి తన రచనలతోనూ. ఒక తత్వవేత్త తన ఆలోచనలతోనూ, ఒక కళాకారుడు తన కళతోనూ కలకాలం జీవించి ఉంటారు.  అనేక కళల సమగ్ర స్వరూపమైన వేటూరి తెలుగు భాషలో కలకాలం జీవించి ఉంటారు. వేటూరి ప్రతిభను ముఖ్యంగా పదప్రయోగం లోని కౌశల్యాన్ని తరతరాల ప్రజలు భాష జీవించి ఉన్నంతకాలం  గుర్తు  పెట్టు కుంటారు. తెలుగు సాహిత్యం లో అనేక మంది మహా కవులు తమదైన ముద్ర వేసారు, తిక్కన్న గారి ఛందం, శ్రీనాధుడి సీసం, పోతన్న పద్యం , కృష్ణశాస్త్రి భావం, శ్రీ శ్రీ వచనం లాగ.  తెలుగు సినిమా పాటలు వ్రాయడం లో ఏ రచయిత కైనా తనదైన పంధా అలవర్చుకోవడం కష్టమైన విషయం ఎందుకంటే ఒకే రకమైన సందర్భాలకి, సన్నివేశాలకి అనేక మార్లు మళ్ళి మళ్ళి  వ్రాయాల్సి రావడం వల్ల.  విప్లవ భావం పలికించడానికి శ్రీ శ్రీ, సున్నితంగా హృదయానికి తగిలేటట్టు వ్రాయడానికి ఆత్రేయ, కృష్ణ శాస్త్రి , ప్రాసలతో చమత్కారాలు చేయడానికి ఆరుద్ర, పరిసరాలని పరిశోధించి తత్వ బోధ చేయడానికి సిరివెన్నెల, చూపిన మార్గం లో ఏ సాధారణ కవి యైనా అప్పుడప్పుడు, వారిలా అద్భుతంగా వ్రాయవచ్చు. కానీ,  సంపూర్ణ విషయ పరిజ్ఞానం తో, పాత కొత్త లను మేళవించి, పూర్వాపరాలను అనుసంధానించి,  మారుతున్న తరాల అంతరంగాలు అభిరుచుల కనుగుణంగా, తనదైన శైలి లో జన సామాన్యానికి సులువుగా ఉండే సరళమైన భాషలో సినిమా పాటలు  వ్రాయగలవారు వేటూరి తప్ప మరొక్కరు లేరు.  వ్రాయలేరు అని సవాల్ చేసి చెప్పవచ్చు. అంతదాకా వేటూరి కలకాలం జీవించే ఉంటారు. ఇది ఆకాంక్ష కాదు సత్యం.

                                     

                                            సమాప్తం 

************************************************************************

కంచిభొట్ల శ్రీనివాస్ గారు వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం.

కంచిభొట్ల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్

 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.