వేణువై వచ్చాను(7వ భాగం) వేటూరి-జంధ్యాల

 

బహుశా గతంలో సినీ రంగం లో  ఎప్పుడూ లేని విధంగా ,  పండిత పామరులను అలరింప చేసే విధంగా, గ్రాంధిక భాష లోనూ వ్యావహారిక భాషలోనూ పట్టు గలిగిన వేటూరి, జంధ్యాల లు  సినీ జీవితం లో సమకాలీను లవడం  తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం. వారివురు తెలుగు వారి అభిరుచులను గ్రహించి  వ్యాపార అవసరాలకు అనుగుణంగా పని చేసిన తీరు అపూర్వం. వారు ‘సిరి సిరి మువ్వ’ లతో ఆడుకున్నారు, ‘శంకరాభరణం’ కు అలంకారాలు చేసారు, ‘అడవి రాముడు’ లో వేడుకలు చేసుకున్నారు, ‘సప్తపది’ కి అడుగులో అడుగు వేసారు, ‘వేటగాడు’ తో వినోదం పంచారు. ఇంకా చాలా సినిమాలకు కలిసి పనిచేశారు. జంధ్యాల దర్శకుడిగా మారిన తరువాత వేటూరికి, వ్యాపార దృక్పధం లో కాక కొత్త కోణం లో తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలిపించారు. స్వతహాగా జంధ్యాల మంచి అభిరుచి కలిగిన రచయిత అవడం వల్ల వేటూరి కి కొన్ని మంచి సన్నివేశాలకి పాటలు వ్రాసే అవకాశం కలిగింది. వేటూరి ప్రేమను, అందాన్ని సుకుమారం గా వర్ణిస్తూ పాటలు వ్రాసి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

ఆవిరి చిగురో అది ఊపిరి కబురో

స్వాతి వాన లేత ఎండలో

జాలి గుండె పూల దండలో

అలివేణి ఆణిముత్యమా  నా పరువాల ప్రాణ ముత్యమా

 

యవ్వనం లో అడుగు పెడుతున్న జంట తొలి  ప్రేమలోని అమాయకత్వాన్ని ‘ఆవిరి చిగురు’, ‘ఊపిరి కబురు’, ‘లేత ఎండలో స్వాతివాన’, అంటూ ఎంతో  సున్నితం గా పలికించారు  వేటూరి.  ‘అలివేణి ఆణి ముత్యమా’ అంటూ  వారి ప్రేమలోని నాజుకైన అన్యోన్యతను స్పృశిస్తూ కూడా ‘మనసా త్రుళ్ళి పడకే అతిగా ఆశ పడకే’ అంటూ ఆ అన్యోన్యతకున్న హద్దుల గురించి కూడా అంతే సున్నితంగా హెచ్చెరిక చేసారు.

 

ఏ నోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలము

ఏ దేవుడిస్తాడు నీకని అరుదైన వరము

మనసా వినవే ఆ అందగాడు

తనుగా జతగా మన కందిరాడు

కలల పాలే కన్నె మనసా

 

ఈ పాటలో దేవులపల్లి వారి లాలిత్యము, ఆత్రేయ గారి సునిశితం కనిపిస్తాయి.  ‘శ్రీ వారికి ప్రేమ లేఖ’ తరువాత, హాస్యం, సంగీతం,  సాహిత్యం అంత అందంగా మిళితమైన సినిమా మరొకటి రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో. సందర్భాను సారం గా ఉన్నా సరే, ప్రతీ పాట కూడా కధతో కానీ సన్నివేశం తో కానీ సంబంధం లేకుండా కూడా  తమ సాహిత్య సౌందర్యం తో నిలబడ గలవు.  ‘తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు’, ‘లిపి లేని కంటి బాస’,  అన్నిటి కన్నా మెచ్చ దగిన ‘సరిగమపదని స్వరధార, రసరాగ యాత్రకు ధృవ తార’ అంటూ  పాటలు వ్రాసారు వేటూరి.

 

జంధ్యాల గారికి వ్రాసేటప్పుడు కూడా వేటూరి లో ద్వైదీభావం కనిపిస్తుంది. ఉన్నత ప్రమాణాలు కల పాటలు తో పాటు ప్రమాణాలు లేని పాటలు కూడా వ్రాసారు,  బహుశా జంధ్యాల వారి అభిరుచుల కనుగుణంగా అందమైన సన్నివేశాలకి, హాస్య సన్నివేశాలకి వ్రాయడం వల్ల అయుండవచ్చు.

చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువు లూదే

మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూచే

ఏడేడు రంగుల దీపం ఆ నింగిలో హరి చాపం

అరుణాల రుధిరం తోనే ఋణమైనది ప్రియ బంధం

………..

ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ

పడమటి సంధ్యారాగాలేవో పారాణి  పూచేనులే

 

అంటూ  భారతీయ ఆధ్యాత్మిక ఆత్మస్వరూపత్వం నకు విదేశీ సగోత్రతకు వారధి గా పాట వ్రాసిన కలం తోనే,

 

ఇన్నాళ్ళు ఇల్లైనా  తల్లైనా ఆఫీసు

ఇకనుండి ఇల్లాలే ఇస్తుంది ఆ  ఫీసు    II పెళ్ళాడు పెళ్ళాడు ఆనంద రాయాII

 

అంటూ వ్రాసారు. అంతే కాదు అందమైన భావాలు తో హాస్యం  కలగలిపినవి కూడా,

 

ఆకాశ వీణ ల్లో నేను అనురాగమే పాడుకుంటా

గోంగూర పచ్చట్లో నేను ఉల్లిపాయే నంజుకుంటా

నీరుల్లిపాయే నంజుకుంటా

మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా

వదిలేస్తే వంకాయ వండించుకుంటా……

వంకాయ వంటి కూరయూ పంకజముఖి

సీత వంటి భార్యామణి యును అన్నారు కదండీ

అందుకే అలా పాడానన్నమాట      IIకొబ్బరి నీళ్ళ జలకాలాడిII

 

ఈ పాటలో వేటూరి నిరాడంబరత కనిపిస్తుంది. జంధ్యాల వారి హాస్య సినిమాలలో కొన్ని విపరీతమైన ప్రకృతి, ధోరణి కలిగిన పాత్రలు ఉంటాయి. కొన్ని సన్నివేశాలు కూడా విపరీతం గానూ అప్పుడప్పుడు అతిగా అనిపించే సందర్భాలలోనూ, ఉదాహరణకి   ‘సీతారామ సంగ్రామం’ (మాయ లేడి సందర్భంలో సీతారాముల వాదులాట)  ఆకట్టుకునే స్వరానికి వ్రాసిన,

 

సీత:       లేడీ లేడీ లేడీ లేడీ

గోల్డెన్ లేడీని తేరా గోల్డెన్ చాన్స్ ఇది పోరా

ఖాతాలు బంగాళా ఖాతాలు గా మార

దారుణ ఋణ బాధ తక్షణమే తీర

రామ:     సారీ సారీ సారీ సారీ

అది గోల్డెన్ లేడీ కాదే గోల్మాల్ కేడి పోవే

ఆ లేడీ బంగారమే  కాకి బంగారము

ఈ ఋణ బాధ చాలక రణబాధ  ఏలకో

రామ:     నోరు ముయ్యవే   పూబోడి

సీత:       నువ్వుండగా నేనా బోడి

గడియారపు లోలకం ఈ వైపు నుంచి ఆ వైపుకి ఊగి నట్టుగా, అంత తేలికగా  తుంటరి పాటల నుంచి సాహిత్యం గుబాళించే గంభీరమైన పాటలు వ్రాస్తారు వేటూరి వారు.  అతని అత్యున్నత గీతాలలో ఒకటి  ‘చైత్రము కుసుమాంజలి’ ఆనందభైరవి సినిమాకి వ్రాసినది.  ప్రేక్షకుడు ఆశ్చర్య పోతాడు అది ఇదీ ఒకరే వ్రాసారా అని.

————————————————

కంచిభొట్ల శ్రీనివాస్ గారు వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం.

కంచిభొట్ల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్

 

You May Also Like

One thought on “వేణువై వచ్చాను(7వ భాగం) వేటూరి-జంధ్యాల

  1. ilanti vallu mana telugu cinema rangam lo undatam nijanga mana adhrushtam valla duradrushtam…ila endukannanate….vallani tagina vidhanga manam gouravinchukoleka poyam ani na uddesam…tappaithe kshaminchandi!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.