వేణువై వచ్చాను(6వ భాగం) వేటూరి-బాపు-రమణ

 

పోతన గారు శ్రీమహాభాగవతం లో శ్రీకృష్ణుని రాసక్రీడ వర్ణిస్తూ, గోపికల మధ్య తనొకడైనా తలకొకడై నారీ నారీ నడుమ మురారీ, హరికి హరికి నడుమ వయారి అనే బ్రాంతి కలిగించి, తను వారి కొక్కరికే స్వంతం అనే అభిప్రాయం కలిగిస్తూ నాట్యం చేసాడు అందరితో నని వ్రాసారు.  శ్రీ వేటూరి అనేక  సందర్భాలకి కి వ్రాసిన పాటలు అదే బ్రాంతి కలిగిస్తాయి.  సినిమా రంగంలో ఒక విశిష్టమైన జంట శ్రీ బాపు – రమణ ల కోసం శ్రీ వేటూరి తన రచనలకు కొత్త రుచులు అమర్చాడు. రమణ అన్న పేరు వింటే తెలుగువారికి చిరునవ్వు పెదవుల మీద ఉదయిస్తుంది. గిలిగింత నడకల హొయలు లాంటి అనుభూతి కలిగిస్తూ వారికే స్వంతమైన పద్ధతిలో హస్యపూరిత సన్నివేశాలు సృష్టించడం లో వారు ప్రసిద్ధులు. మాటలతో ఆడుకోగలిగే అసామాన్య ప్రతిభ, శ్రీ వేటూరి తను పత్రికా రంగంలో పనిచేసే కాలం లో శ్రీ రమణ గారి శిష్యరికం లో అలవర్చుకున్నారు. శ్రీ రమణ గారు పదాలను కొద్దిగా మార్చి అపూర్వమైన హాస్యాన్ని సృష్టించారు. ఆయన వరవడి లోనే శ్రీ వేటూరి గురువు గారిని సన్మానించు కున్నారు. శ్రీ రమణ గారి ‘అపార్ధ శారదమ్మ’ కి దీటుగా ‘అవకతవకుడు’ , ‘ముదురు బెండడు’ లాంటివి కల్పించారు. ‘డబ్బు చేసి పోయాడు’ అని శ్రీ రమణ అంటే ‘నీలాంటి ధనికుడు వేల వేల మని …. శ్రీ రాగమున కీర్తనలు మానరా’ అని శ్రీ వేటూరి అన్నారు. ‘నేనూ.. అడ్డ గాడిదలకు .. ఆ మాట మీరే అన్నారు… ఉద్యోగాలు ఇవ్వను, అంటూ శ్రీ రమణ  గిలిగింతలు పెడితే,  శ్రీవేటూరి సరిజోడుగా ‘బారులో దేశి విదేశీ మద్యాలు సీసపద్యాలు పాడేను మేలుకో’ అని పాడారు. శ్రీ వేటూరి శ్రీ రమణ లు పదానికి పదం తోనూ, భావానికి భావంతోనూ, హాస్యానికి హాస్యంతోనూ పోటీ పడ్డారు. ఇది నిజంగా తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం.

 

ఏ మంచి రచయితయినా, ముఖ్యం గా హాస్యసన్నివేశాలకి వ్రాసేటప్పుడు తనలోని సృజనకు మెరుగులు దిద్ది అందంగా  వ్రాయడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సమయాలలో ఇవి ఒక మూస పద్ధతి లో ఇతరులు నడిచిన బాటలోనే ఉండవచ్చు. కానీ దర్శక నిర్మాతలు మూస పద్ధతిలో వాడుకగా వ్రాసే పదాలు  కాక, వైవిధ్యం గా వ్రాయడానికి ప్రోత్సహిస్తే, ‘సిగలో అరటి పువ్వు’, ‘కోనసీమ లో కొంగు జార్చిన ఆకుపచ్చ చందమామ’, ‘కొబ్బరి లంకలో గొప్పగా కొలువైన లంకేశ్వరుడి ఘోర గాధలు’, లాంటి  హాస్య, వ్యంగ్య, కొండొకచో చురుకుగా తగిలే పదప్రయోగాలు వేటూరి గారి కలం లో   ప్రాణం పోసుకున్నాయి. బాపు – రమణ గార్లతో శ్రీ వేటూరి కి అంతా సరదాగానే సాగిపోలేదు. ముఖ్యంగా భక్త కన్నప్ప లాంటి సినిమాలలో  ‘కిరాతార్జునీయం’ పాట కి   తన పాండిత్యానికి, సందర్భానుసారం గా వ్రాసే నేర్పు లకు సాన బట్టాల్సివచ్చింది. కవి సార్వభౌముడు శ్రీనాధుడు వ్రాసిన ‘హరవిలాసం’  లోని ఒక గాధనూ  సినిమా పాటగా మలచడం లో అనన్యసామాన్య ప్రతిభ కనపర్చారు శ్రీ వేటూరి. మూలం లోని  కధ కి దీటుగా, భావార్ధాలు ప్రతిబింబిస్తూ , తెలుగు జాతీయత , నుడికారం లకు అనుగుణంగా నృత్య రూపకం గా అద్భుతంగా వ్రాసారు. ఈ పాటలో శ్రీ వేటూరికి భాష మీద  ఉన్న సాధికారతను గమనించవచ్చు,

 

ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా ..

నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే ..

సవ్యసాచి కుడిఎడమై సంధించుట మరిచిపోయే..

శర పరంపర కురిపే హరుడు అయినా నరుని కంట మనోహరుడు ..

 

అదే శృతి లో  పదాలను విరిచి, కలిపి వివిదార్ధాలను కలిపిస్తూ వ్రాసిన ‘శివశివ శంకర భక్త వశంకర’ అనే  గీతం లో,

 

మా రేడు నీవని మారేడు దళములు …

గంగమ్మ మెచ్చిన జంగమయ్య ..

 

బహుశా శ్రీ ముళ్ళపూడి వారు తన శిష్యుడిని చూసి గర్వం గా ఆనందించి ఉంటారు.

 

బాపు – రమణ గార్లు తీసిన సినిమాలలో ఒకవైపు భక్తి పరమైన సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, త్యాగయ్య లాంటి సినిమాలు, మరోవైపు సమాజంలో చెడుదారిని నడిచే దుర్మార్గుల కధలు, మంత్రి గారి వియ్యంకుడు, మన వూరి పాండవులు లాంటి సినిమాలు , పూర్తిగా వ్యంగ్యం, హాస్యం కలబోసిన సినిమాలు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం లాంటివి ఉన్నాయి. అల్లాగే, అవి అన్ని మేళవించిన సినిమాలు, అందాల రాముడు, బుద్ధిమంతుడు, భక్త కన్నప్ప లాంటివి కూడా ఉన్నాయి. వారి సినిమాలకి ఎక్కువుగా శ్రీ ఆరుద్ర, శ్రీ వేటూరి గార్లతోనే పాటలు వ్రాయించుకున్నారు. ముఖ్యంగా, పదాలు తమ పరిధిని దాటి భావప్రకటన చేయాల్సిన కొన్ని సందర్భాలలో శ్రీ వేటూరి చేత వ్రాయించుకున్నారు. వేటూరి వారి చేత పాటలు వ్రాయించుకున్నా రన్నది సరికాదేమో. పదాలు విరిచి,సాగదీసి కొత్త అర్ధాలు కలిపించే శ్రీ రమణ గారి పందాలోనే, వేటూరి వారు,  తమ  ఉహా శక్తి కి పదును పెట్టి పదాలకి వినూత్నమైన భావాలు పలికించారు. బాపు – రమణ గార్ల సవాళ్ళ కు  స్పందించిన శ్రీ వేటూరి, కిరాతార్జునీయం పాటకి సాటిగా, దీటుగా, అందాని కంటే అందంగా నిర్వచనం చెప్పిన పాట ‘సొగసు చూడ తరమా’ వ్రాసారు. ఈ పాటలో వేటూరి వారు ఆడతనం అందాన్ని వివిధ దశల్లో, కన్య అమాయకత్వం, కొత్తగా పెళ్ళైన స్త్రీ చిలిపితనం, సంపూర్ణత సంతరించుకున్న మాతృత్వం లను వర్ణించారు. బాపు రమణ గార్ల  ప్రోత్సాహంలో వారి సినిమాలకి  శ్రీ వేటూరి ఈ దశలలో ప్రయాణించారేమో.

 

సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి

క్షణమే యుగమై వేచి వేచి

చలి పొంగులు తెలి  కోకపు ముడిలో అదిమి

అలసి సొలసి కన్నులు వాచి

నిట్టూరుపుల నిశి రాత్రిలో నిదురోవు అందాలలో 

త్యాగరాయ కృతిలో సీతాకృతి గల ఇటువంటి

సొగసు చూడ  తరమా నీ సొగసు చూడ తరమా

 

వెంటనే జవాబు ఇవ్వాలనిపిస్తుంది కాదు కాదు కాదు అని. ఈ పాట వేటూరి వారి ప్రజ్ఞా పాటవాలకి ఒక  నిదర్శనం.

———————————————————————-

కంచిభొట్ల శ్రీనివాస్ గారు వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం.

కంచిభొట్ల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్

 

2 thoughts on “వేణువై వచ్చాను(6వ భాగం) వేటూరి-బాపు-రమణ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top