వేణువై వచ్చాను(5వ భాగం) వేటూరి-చక్రవర్తి

తిరోగమనానికి  నాంది……

ఆమని చీరలు చుట్టుకుని కౌగిలి ఇల్లుగ కట్టుకుని

శారద రాత్రుల జాబిలి మల్లెలు పగలే సిగలో పెట్టుకుని

చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోక చిలుకల్లాగ

ఉయ్యాలూగే  వయ్యారంలో సయ్యాటాడే శృంగారంలో……ఏ వసంతమిది  ఎవరి సొంతమిది…..

 

వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం

మల్లెలు మంటలు రేగిన గ్రీష్మం నా సొంతం

పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ ఆనందం

ఆ వెన్నెలతో చితి రగిలించిన కన్నులు నా సంగీతం…….ఎవరికి తెలుసు చితికిన మనసు……

 

ఇటువంటి భావ పూర్ణమైన, అర్ధవంతమైన , శ్రావ్యమైన పాటలు చేసిన చక్రవర్తి పేరు,  తరువాతి కాలంలో కట్టిన బాణీలలో  పునరుక్తికి, నకలుకి,  పతనమైన సామర్ధ్యానికి మారుపేరు గా చెప్పుకోవాల్సి వచ్చిందంటే నమ్మటం కష్టం కానీ నిజం.  వేటూరి, చక్రవర్తి లకు  ఎనభైలలో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి.  అందువల్ల వారు సాధారణ ధోరణి లోనే పనిచేయ వలిసి వచ్చింది.  ఈ సమయం లో  వారిలోని సృజనాత్మకత కొంచెం మరుగున పడి  ఉండవచ్చు. కానీ సమయం సందర్భం కలసి వచ్చినప్పుడు వారు ఆణి ముత్యాలు  సృష్టించారు.

 

తెలుసా నీకు తెలుసా

ప్రేమంటే ఒక మనిషి నివసించే భువనమని

ఒకే మురళి పలికే గోకులమని

ఒకే కెరట ముప్పొంగే యమున యని

 

పంట చేలో పాల కంకి నవ్వింది

పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది

పూత రెల్లు చేలు దాటే వెన్నెల్లా

లేత పచ్చ కోనసీమ ఎండల్లా

 

యం. యస్. సుబ్బులక్ష్మి-  సుప్రభాతం, ఘంటసాల – భగవద్గీత, లాగా సినిమా పాటలకి సంబంధించి  సంగీతం- చక్రవర్తి , సాహిత్యం – వేటూరి అనే  పదబంధం ఒక తరం శ్రోతల కి వాడుకలోకి వచ్చేసింది. వ్యాపార విలువలు సినిమాలలో ఉచ్చస్థితి కి చేరుకునే రోజులలో ఏడాదికి వంద సినిమాల కి పైగానే విడుదల అయ్యేవి. వేటూరి – చక్రవర్తి ల జంట చాలా సినిమాలకి కలసి పనిచేశారు (వేటూరి ఇంకా ఎక్కువ సినిమాలకి పనిచేశారు). మంది పెరిగిన కొద్దీ మజ్జిగ పలచన ఔతుంది అన్న లోకోక్తి ప్రకారం,  చేసే సినిమాల  సంఖ్య పెరిగిన కొద్దీ చక్రవర్తి అన్ని పాటలకి తగు న్యాయం చేయలేకపోయారు.  ఒకే రీతిని సాగే వాద్య ప్రధానమైన చక్రవర్తి బాణీలు బహుళ ప్రజాదరణ పొందటానికి ముఖ్య కారణం, జనాలని ఉర్రూత లూగించి నాట్యం చేసేటట్టు చేసే జానపద పోకడలు గల సంగీతం.  చక్రవర్తి ఎంత వేగంగా బాణీలు కడితే అంతే  వేగం గా వేటూరి ఆకర్షణీయమైన పల్లవిలతో పాటలు వ్రాసేవారు. వీరిరువురి కలయిక సినిమా సంగీతం లో జెట్ కాలాన్ని స్ఫురింపచేసింది. ఇటువంటి సంగీతం అప్పటికప్పుడు ఆహ్లాదం కలిగించినా  వెంటనే మరిచి పోతాం. చాలా పాటలలో  గుర్తుపెట్టుకోవడానికి ఏమి ఉండక పోయినా,    కొన్ని అద్భుతమైన సాహిత్యము , సంగీతం కల  పాటలు మరువలేనివి కూడా వచ్చాయి వీరి సంయోగంలో .

 

వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో  చూసాను

శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నీలో మెచ్చానే

అందాలో జన్మ గంధాలో రాగ బంధాలో

శాకుంతమై వసంత గీతమాలపించగా

 

శ్రీ లక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం

మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం

చిగురులేసే సిగ్గు చీనాంబరాలు

తడిసే కురిసే నీ కళ్ళు తలంబ్రాలు

 

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇద్దరు కళాకారులు ఉచ్ఛస్థితి లో సాధన చేస్తున్నప్పుడు సినిమా అవసరాల కోసం తమ స్థాయి దిగజార్చుకొని పని చేయవలసి రావడం. సినిమాలలో విలువలు పతనమవడానికి ముఖ్య కారణం గా చెప్పుకోదగినది, సినిమాలలో పాటలకు   నాయికా నాయకులు నాట్యం   చేయడం (గంతులు వేయడం అనడం సబబేమో). ఎందుకంటే ఆ సమయంలో నాయికా నాయకులు పాటలకి కసరత్తు చేసినట్టు నృత్యం చేయడం మొదలయినప్పుడు చాలా మందికి నాట్యం తెలియదు. ఒకరితో ఒకరు పోటిపడి నృత్య స్థాయిని తగ్గించారు. అందువల్లనే,  బహుశా చక్రవర్తి లాంటి కళాకారుడు సినిమాలలో హీరో, హిరోయిన్ల కసరత్తు కార్యక్రమానికి అనుగుణంగా ఐదారు డప్పు పాటలకి బాణీలు కట్ట వలసి వచ్చింది. ఈ సందర్భం గానే,  బహుశా వేటూరి కూడా ఈ తమాషా లో పాలు పంచుకోవాల్సి వచ్చింది. దేవులపల్లి తో పోల్చదగ్గ వేటూరి పండిత కవి స్థాయి నుండి వికటకవి స్థాయికి దిగాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కూడా సాహిత్యానికి, తమాషా కి సమ న్యాయం చేకూర్చడానికి వేటూరి ప్రయత్నం చేసారేమో.

కూడబలుక్కుని కన్నారేమో మీ యమ్మ మా యమ్మ

నా అమ్మనీ  అత్తో నా అమ్మ నీ  అత్త

 

బంగారు బాతు గుడ్డు

బందరు తొక్కుడు లడ్డు

చక్కెర చిలకా కిక్కురు మనక

వద్దకు వస్తే తీరుస్తా నీ మోజు  – గాడిద గుడ్డు

 

అత్త మడుగు వాగులోన అత్త కూతురో

నీ అందమంత తడిసి అత్తకూతురో

అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో

 

ఇటువంటి నిరర్ధకమైన పాటలు వ్రాయడానికి వేటూరి ఇంకా ఎక్కువగా శ్రమించ వలసి వచ్చిందేమో. సాహిత్యానికి, ఉదాత్తమైన భావాలకి ఆస్కారం లేని చోట, గాలి కసరత్తులకు   (ఏరోబిక్స్)   పాటలు వ్రాయడానికి  వేటూరి, వ్యాకరణం, ఛందస్సు, శబ్దార్ధాలు, పద విన్యాసాలు లాంటి భాషా రీతులను ఆశ్రయించవలసి వచ్చింది. సూక్ష్మంగా చూస్తే వేటూరి గీతాలలోని చమత్కార పద విన్యాసాలు ఎనభై లలోని సినిమాలలో సంగీత సాహిత్య పతనావస్థ కి అద్దం పట్టలేవు. ‘దొంగ’ సినిమాలో ఈ పాటలు ఏమైనా సూచిస్తాయోమో.

 

గోలి మార్ కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో

నేపాలీ మంత్రమేస్తే  ఏమవుతావో

 

దొంగ దొంగ ముద్దుల దొంగ

దోచాడే బుగ్గ  కోసాడే మొగ్గ

వత్తిళ్ళన్ని దోపిళ్ళాయే  ఈ ఉర్రూతలో యే సయ్యాటలో

 

తప్పనక ఒప్పనక  తాకాలని ఉంది బుగ్గ  తాకాలని ఉంది

పగలనక  రేయనక పెట్టాలని ఉంది ముద్దు పెట్టాలని ఉంది.

 

సమయం సందర్భం లేకుండా,  కారణం లేకుండా కల్పించిన సన్నివేశానికి పాటలు వ్రాయడం రచయితకు కష్టమైన ఇష్టం లేని పని. ఆసక్తి,  అభిరుచి కలిగించ లేని సన్నివేశాలకి రచయిత తన మేధ ఉపయోగించ లేడు. పాట తరువాత పాట, సినిమా తరువాత ఇంకో సినిమా, ఏడాది తరువాత ఇంకో ఏడాది మూస పద్ధతిలో స్ఫూర్తి కలిగించలేని సందర్భాలకి వేటూరి పాటలు వ్రాయాల్సి వచ్చింది.  మహా కవి కాళిదాసు గురించి ఒక కధ ప్రాచుర్యం లో ఉంది. కాళికా దేవి వరాలిచ్చి సాటిలేని మహాకవివి అవుతావు అని ఆశీర్వదించినప్పుడు,  స్వర జ్ఞానం లేని, సాహిత్యాన్ని ఆస్వాదించలేని శ్రోతలముందు కవితా గానం చేసే దురదృష్టాన్ని కలిగించవద్దు అని కోరుకున్నాడుట కాళిదాసు. దురదృష్ట వశాత్తు వేటూరి కి ఆ అదృష్టం కలుగ లేదు. వేగంగా ఆలోచించి వ్రాయడం వేటూరి బలం. దురదృష్ట వశాత్తు అదే అతని స్థాయి దిగజారడానికి కారణం కూడా అయింది. ఆ నాటి సినిమా  సంగీత సాహిత్య శిధిలాల మధ్య ఓడి, అలసి సొలసి, విసిగి పోయిన యోధుడిలా వేటూరి నిలబడ్డారు. అది తెలుగు సినీ ప్రేక్షకుల దురదృష్టం.  ఆ ఇద్దరు మహా కళాకారులు, వేటూరి – చక్రవర్తి  కూడా ఆ నాటి విలువల పతనానికి కారణమయ్యారు అని అనుకునే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ నాటి పరిస్థితుల ప్రాబల్యం వలన, వ్యాపారం కోసం పడగొట్ట బడ్డ విలువల వలన వారి కీర్తి మసక బారిందేమో కానీ వారి సృజనాత్మకత ప్రకాశిస్తూనే ఉంది. బహుశా ధనార్జన కోసం వారు చేసిన తప్పు, ఈ పతనాన్ని అడ్డుకోక పోవడం.

——————————————

కంచిభొట్ల శ్రీనివాస్ గారు వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం.

కంచిభొట్ల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్

 

You May Also Like

One thought on “వేణువై వచ్చాను(5వ భాగం) వేటూరి-చక్రవర్తి

  1. kalam ki natyam nerpina kavitha nidhi
    kokila ki ragam nerpina padham nidhi
    manasuki maranam laedhani telipaina mata nidhi
    ni divenalu epudu makundalani ni patala lahirilo oka chinna pata nenaina chalu maha kavi veturi
    iam jithender lyric writter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.