వేణువై వచ్చాను(4 వ భాగం) వేటూరి-రాజన్,నాగేంద్ర

ఏ రచయిత కయినా,  ఏదైనా వరం ఇవ్వడమంటే, గొప్ప బహుమతి ఇవ్వడమంటే అది అతని రచనా వ్యాసంగంలో అతని సృజనకు  పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే. రచయిత భావాల్లో, ఉహల్లో కలగచేసుకోకుండా, అడ్డంకులు, అవాంతరాలు సృష్టించకుండా అతనిని  కవిలాగే ఉండనివ్వడం.  సినిమా పరిభాషలో చెప్పాలంటే అసంబద్ధమైన,  కవిత్వానికి ఆస్కారమే లేని  సందర్భాలలో , నిర్జీవమైన సన్నివేశాలలో పాట సంఖ్యలను పెంచే ఉద్దేశ్యం తో మాత్రమే, పాటలు  వ్రాయమనడం.  గొప్ప రచయిత సందర్భమేదైనా,  ఎప్పుడూ మంచి మంచి పదాలే వాడుతారు  అనే దురూహ  ఉంటుంది  సాధారణ పాఠకులకి.  కానీ కొన్ని సందర్భాలలో గొప్ప రచయిత కూడా,   తన మార్గం లో పరచిన ముళ్లని (కవిత్వం, హాస్యం, సరసత మొదలైనవాటి మీద ఆంక్షలు, అవరోధాలు) తప్పించుకొని రచన చేసే ప్రయత్నం లో మంచి రచయితగానే  మిగిలిపోతాడు. ఒక అభిరుచి కల్గిన నిర్మాత రచయితకు పూర్తి స్వేచ్చ నిస్తే, కళాదృష్టి కల దర్శకుడు కవిత్వానికి ఆస్కారముండే  సన్నివేశం సృష్టించ గలిగితే, సంగీత దర్శకుడు  కట్టిన బాణీ లోని స్వరాలు పదాల అందాలని ఇనుమడింప చేయగలిగితే, చిరస్మరణీయమైన పాట సృజించ బడుతుంది. 

 

హిమములై రాలి సుమములై పూసి

ఋతువులై నవ్వి మధువులై పొంగు

నీ ప్రేమా నా ప్రేమా

శిశిరమైనా శిధిలమైనా

విడిచి పోబోకుమా విరహమై పోకుమా…..చినుకులా రాలి……

 

డెబ్భై దశకం చివరలో అనేక కుటుంబ పరమైన సినిమాలు తీసిన చిన్న నిర్మాతలు  పెద్ద సంగీత దర్శకులని భరించే ఆర్ధిక స్తోమత కలిగి ఉండేవారు కాదు. అదృష్టవశాత్తు ఆ సమయం లో ఇద్దరు సోదరులు,  శ్రీ రాజన్ – నాగేంద్ర  కన్నడ చిత్ర సీమ నుంచి వచ్చారు.  వీరు అప్పటికే కన్నడ సినిమాలలో మంచి పేరు గడించారు. వారు తెలుగు సినిమాలకు స్వర పరచిన బాణీలు అప్పటికే కన్నడ సినిమాలలో ఉపయోగించినవే అయినా వాటిలోని మాధుర్యం, వాద్య సమ్మేళనం శ్రావ్యం గా,  ఇంపుగా ఉండేవి. ఈ బాణీ లకి  శ్రీ వేటూరి వ్రాసిన పాటలు కొత్త అందాలని తెచ్చిపెట్టాయి. సాధారణం గా చిన్న సినిమాలలో కూడా పాటలు వుండే సన్నివేశాలు, హీరో కేంద్రి కృతమైన పెద్ద సినిమాలలో లాగానే ఉంటాయి. కానీ ఇక్కడ రచయితకు స్వేచ్చ ఎక్కువుగా ఉంటుంది. హీరో ను పాటలో ఉన్నతం గా చూపించాల్సిన అవసరం ఉండదు. ముఖస్థుతి , అతిశయోక్తులు ఉపయోగించ నఖ్ఖరలేదు.  రచయిత తన మేధస్సు ను ఉపయోగించి తన భావాలను కవితాత్మకంగా పలికించ వచ్చు.  ఇటువంటి సందర్భాలలో శ్రీ వేటూరి,  శ్రీ దేవులపల్లి తో సరి తూగుతారు.

 

తొలకరి కోరికలే తొందర చేసినవే

ఈ విరి శయ్యకే  ఆవిరి తీరగా

సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే

ఏ తెర చాటునో ఆ చెర వీడగా

అందిన పొందులోనే అందలేని విందులీయవే……మల్లెలు పూసే…….

 

ఎదలో అందం ఎదుట ఎదుటే నిలిచిన వనిత

నీ రాకతో నా తోటలో వెలిసే వన దేవత

కదిలే అందం కవిత అది కౌగిలికొచ్చే యువత

నా పాటలో నీ పల్లవే నవతా నవ్య మమతా……………..వీణ వేణువయిన…….

 

చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు

మెరుపంత నవ్వునా చినుకైన రాలునా

జడివాన దరఖాస్తు లేకుంటే సెలయేరు

వరదల్లె పొంగునా కడలింట చేరునా……………..కాస్తందుకో దరఖాస్తందుకో………..

 

జంటనే ఎడబాసిన ఒంటరి నా బ్రతుకున

మల్లెల సిరివెన్నెల మంటలే రేపగా

వయసుల నులివెచ్చని వలపుల మనసిచ్చిన

నా చెలి చలి వేణువయి వేదన లూదగా………..రాగం తీసే కోయిలా…………

 

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే  చాలా మట్టుకు ఈ పాటలన్నీ కట్టిన బాణీలకే వ్రాసినవి. వీటిలో వేటికీ కూడా శ్రీ వేటూరి వ్యాపార ధోరణిలో పదాలను తిప్పి, వంకర,సంకర చేసి వ్రాయాల్సిన అవసరం కలుగలేదు. ఈ పాటలన్నీ కూడా స్వచ్చమైన . శుద్ధమైన , పరిపూర్ణ మైన ఉహలకి తన కల్పనా శక్తి జోడించి  వ్రాసినవే.

 

దశ దిశాంతాల శత వసంతాల

సుమ సుగంధాల భ్రమర నాదాల

కుసుమించు నీ అందమే

విరిసింది అరవిందమై

కురిసింది మకరందమై……………….మానస వీణా మధు గీతం……..

 

విరహ వీణా నిదుర రాక వేగే వేళలో

శృతిని మించి రాగమేదొ పలికే వేళలో

(ఎంత అద్భుతమైన భావన – విరహం పలికే వీణ మ్రోగే రాగం శృతి హెచ్చు )

 

అనుభవం ఉన్నగొప్ప  రచయితలు పరిస్థితుల కనుగుణంగా మార్పు చేసు కుంటారు. రచనలు మొదలు పెట్టిన కొత్తలో ఉత్సాహంగా పట్టుదలతో మంచి కవిత్వం వ్రాద్దామనే కోర్కె  ప్రబలంగా ఉంటుంది. కాలం గడిచిన కొద్దీ, నేర్చుకున్న పాఠాల అనుభవంతో, ఒక పరిధిలో సందర్భానుసారంగా వ్రాయడం అలవరుచు కుంటారు.  నిర్దోషమైన పరిస్థితులు  అనుకూలించి నప్పుడు ఉత్కృష్టమైన కవిత్వం వ్రాస్తారు. ఒక గొప్ప పాట,  కవి యొక్క సామర్ధ్యాన్నేకాదు నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుల అభిరుచి కి కూడా దర్పణం పట్టుతుంది. కవితో పాటు ఈ మువ్వురి సహకారము పాటను ఉత్తమంగా తీర్చి దిద్దుతుంది. ఈ పరిస్థితులు తలకిందులయితే పాటకూడా అంతే.  ఏభై ల, అరవై దశకాలలో తెలుగు సినిమా లలో సాహిత్యం బంగారు బాటలో పయనించింది. మళ్ళీ   డెబ్భై దశకం చివరిలోను,  ఎనభై మొదట్లోను సుమారు 6-7  సంవత్సరాలు కొన్ని సినిమాలు సాహిత్యానికి నీరాజనం పట్టాయి. చాలా లలిత గీతాలు ప్రజాదరణ పొందాయి. ఆ కాలాన్ని లలిత గీతాలకు స్వర్ణ యుగం అనవచ్చు.  కొద్దిమంది సమకాలినులతో పాటు  ఆ కాలం లో శ్రీ వేటూరి –  శ్రీ రాజన్ – నాగేంద్ర ల కలయిక సినిమా గీతాలను ఉన్నత స్థాయికి చేర్చాయి.

 

గతించిన కాలం ప్రసిద్ధి చెందినదే (మిధ్య యినా) ఎందుకంటే

“మేఘమా దేహమా  మెరవకే ఈ క్షణం

మెరిసినా కురిసినా కరుగునే జీవితం”  లాంటి పాటలు మళ్ళీ  రావడం కష్టం.

 

సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో పాటని చూడండి. గీతాంజలి సినిమాలో  ‘ఓ పాపా లాలి’  ముఖ్యంగా

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకీ

గాలిలో తేలిపో వెళ్ళిపో

 

ఒక చనిపోతున్న పాత్ర కోసం వ్రాసినది. పై సందర్భం లో లాంటిదానికోసమే. శ్రీ వేటూరి వ్రాసినదే. మొదటి దానిలో శ్రీ వేటూరి కవిత్వం ఎల్లలు దాటి పైకెగసింది. రెండవదాంట్లో తన పరిధిలోనే ఉన్నతం గా నిలిచింది. బహుశా ఈ చిన్న వైవిధ్యం మారుతున్న కాలానికి సంకేతం.

———————————

కంచిభొట్ల శ్రీనివాస్ గారు వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం.

కంచిభొట్ల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్

You May Also Like

3 thoughts on “వేణువై వచ్చాను(4 వ భాగం) వేటూరి-రాజన్,నాగేంద్ర

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.