నిజం చెప్పాలంటే , అర్ధం చేసుకోవటం కొంచెం కష్టమైనా , అర్ధం పర్ధం లేని సందర్భాలలో వాణిజ్య విలువల కోసమే వ్రాసిన పాటలలో శ్రీ వేటూరి ప్రతిభ కనిపిస్తుంది. సందర్భం ఏదైనా, హాస్యం, వ్యంగ్యం, దురదృష్ట వశాత్తు పూర్తిగా చవకబారు సన్నివేశమైనా శ్రీ వేటూరి సందర్భాన్ని బేరీజు వేయకుండా తన మాటలతో సందర్భానికి ఉదాత్తత కల్పించడం లో కృతకృత్యులయ్యారు. డెబ్భై వ దశకం లో సినీమాలలో వ్యాపారదృక్పధం పెరుగుచున్న రోజులలో కూడా సంగీతం తన విలువలను, ఉన్నత స్థానాన్ని కాపాడుకోగలిగింది. ఈ నాడు గొప్పగా, కొండోకొచో సాంప్రదాయబద్ధమైన అని చెప్పుకోబడుతున్న పాటలు, ఆనాటి సాధారణ పాటల స్థాయి లోనే ఉన్నాయి. అడవి రాముడు సినిమాకి ఆయన వ్రాసిన మాటలు సాహిత్యాభిలాషుల దృష్టిని ఆకర్షించాయి . ఆ పాటలు వ్యాపార దృక్పధం తో వ్రాసినవైనా సాహిత్య విలువలను కూడా నిలబెట్టేయి. (సిరిసిరి మువ్వ కూడా అదే సంవత్సరం వచ్చింది.)
పూల గాలి తో రేగిన పుప్పొడి పారాణిగా
చిలక పాట నెమలి ఆట కలిసి మేజువాణి గా
అందమైన పెళ్ళికి అందరూ పేరంటాళ్ళే
అడవి లోని వాగులన్ని ఆనందపు కెరటాలై……..కోకిలమ్మ పెళ్లి కి…..
ఎంతో కొంత విలువలను పాటిస్తూ ప్రయోజనాత్మకం గా ఉండే సినిమాను అర్ధ రహితం గా, కళకు తిలోదికాలు ఇచ్చి పూర్తిగా సినిమాని వ్యాపారం గా మార్చడంలో సారధ్యం వహించిన వారిలో మొదట చెప్పుకోవలిసింది శ్రీ కె. రాఘవేంద్ర రావు పేరు.
కధా గమనానికి అడ్డు వస్తూ, సందర్భోచితం కూడా కాని ఒక పాటని ‘గుండమ్మ కధ’ సినిమాలో ఎందుకు పెట్టారని నిర్మాత శ్రీ చక్రపాణి ని అడిగితె “చూడ్డానికి” అని సమాధానం చెప్పారుట. శ్రీ రాఘవేంద్ర రావు సినిమాలు కూడా అదే సాధారణ సూత్రం పై ఆధార పడ్డవే. కంటికి ఇంపుగా విషయేంద్రియాలని ఉత్ప్రేరేపించే విధం గా తీసే సినిమాలో అప్పుడప్పుడు సాహిత్యం గుబాళిస్తే అది యాదృచ్చికం. సినిమాలని విజయవంతం చేయడానికి శ్రీ రాఘవేంద్ర రావు ఎన్నుకొని ప్రావీణ్యత సంపాదించిన మార్గము, అందాన్ని ఆరాధిస్తూ, ప్రస్థుతిస్తూ, ఉపయోగించుకుంటూ చేసిన సౌందర్యారాధన. అద్భుత సౌందర్యమైనా, సామాన్య మైన అందమైనా, అందానికి నీరాజనం పట్టడం లో కొత్త వరవడి ని సృష్టించి అనేకులకు మార్గదర్శి గా నిలిచారు. ఆయన నమ్మి నడిచిన ఈ మార్గం తెలుగు సినిమాకి దిశా నిర్దేశం చేయకపోయినా, ప్రస్థుత పరిస్థితులలో తెలుగు సినిమా ఈ మార్గం నించి బయటకు రావటానికి ప్రయత్నిస్తున్నా, శ్రీ రాఘవేంద్ర రావు తెలుగు సినిమా ముఖ చిత్రాన్ని మార్చి వేసాడనడం లో సందేహం లేదు. అతని తో కలసి నడచిన శ్రీ వేటూరి వ్యాపార విలువలు పాటిస్తూ పాటలు వ్రాయడం లో తనదైన శైలి ని వరవడిని సృష్టించుకున్నారు. వ్యాపార విలువలకు అనుగుణంగా సినిమా పాటలు వ్రాయడం లో శ్రీ వేటూరి కొండొకొచో సాధారణ స్థాయి లో వ్రాసినా, ఉన్నత సాహిత్య సృష్టి కూడా చేసారు. ఒకే సినిమాలో సందర్భాను సారంగా అతి మధురం గానూ, సాధారణం గానూ వ్రాయడం లో శ్రీ వేటూరి సిద్ధ హస్తులు. శ్రీ రాఘవేంద్ర రావు ఎంతగా సౌందర్యారాధన చేస్తారో అంతగానూ మంచి సాహిత్యాన్ని ఆస్వాదిస్తారు. ఇరువురి కలయిక కొన్ని మధురమైన పాటలు అందించింది.
తార తారకీ నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకీ నడుమ ఆవేశం ఎందుకో
మనిషి మనిషి కీ మధ్య మనసనేది ఎందుకో
మనసే గుడిగా మమతే ముడిగా మమత ఎందుకో…….ఒక ఉదయం లో నా హృదయం లో……
నీ తొలిచూపులోనే
ప్రేమకు పెళ్లి వంతెన వేసిన
శుభలేఖనే చూసుకోనా
వాకిట పండిన వలపు కుంకుమ
తిలకాలుగా దిద్దుకోనా
భావ కవితల బరువులో
ఆ కృష్ణ శాస్త్రి లా కవి నైతే
హాయి రెమ్మల కోకిలమ్మకు
విరుల ఋతువు వికసించదా…..అందమా నీ పేరేమిటి అందమా….
ఇద్దరి మనసుల ఇంధనం
ఎంత కూరినా కాదనం
ఏమి తడిసినా వద్దనం ఈ దినం……………..వానా వానా వందనం….
ఇలాంటివే అందమైనవి చాలా ఉన్నాయి. కానీ, ఆ దరిని అర్ధం పర్ధం లేని, ప్రజాదరణ పొందిన గీతాలున్నాయి.
అబ్బబ్బబ్బా అందం దెబ్బా ఓ యబ్బా
తబ్బిబ్బయ్యి ఇబ్బందబ్బా చూడబ్బా
పడుచు యవ్వనం పగటి శోభనం
అడుగుతున్నాం ఆగనన్నది
బంతి లాంటి బత్తాయి వారేవా
బన్నులాంటి అమ్మాయి వారేవా
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దులిమ్మంది వారేవా
ఇప్పటికిప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుడు బుగ్గల్లో
హత్తుకునే మత్తులో మెత్తని వత్తిడిలో
ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో
తాకిడికో దూకుడికో తక్కిన చెక్కిలికో
అగ్గిపుల్ల భగ్గుమంటది
ఆడపిల్ల సిగ్గులంటది
అగ్గిపుల్ల చీకటింటికి
ఆడపిల్ల కౌగిలింతకి
చీకటింట్లో కౌగిలింతలో
నా చెంతనే ఉంది పో
ఇలాంటి వే ఇంకా చాలా చాలా ఉన్నాయి.
పూర్తిగా వ్యాపారానికే ఉద్దేశించిన పాటలకి గిరాకీ పెరుగుతున్న రోజులలో శ్రీ వేటూరి ఇటువంటి పాటలు వ్రాయడానికి ఒక కొత్త విధానం అవలంబించారు. ఇది సైకో అనాలిసిస్ లో ఉపయోగించే Free association పద్దతి తో పోల్చవచ్చు నేమో. ఈ పద్దతిలో రోగి తన మెదడులో వచ్చిన ఆలోచనలన్నీ బయటకు చెబుతాడు. (A psychoanalytic technique in which a patient’s articulation of free associations is encouraged in order to reveal unconscious thoughts and emotions, such as traumatic experiences that have been repressed.) ఒక దాని తరువాత ఒకటి వచ్చే ఆలోచనలలో పొంతన ఉండవచ్చు ఉండక పోవవచ్చు. దీన్ని మార్పు చేసి ‘Free association verse’ (అని బహుశా పిలవ వచ్చునేమో,) విధానం శ్రీ వేటూరి అవలంబించారేమో ననిపిస్తుంది. ఈ పాటలలో ఉపయోగించే పదాలు ముందు పదాన్ని వెనుక పదానికి కలపడానికే ఉపయోగ పడుతాయి కానీ అర్ధం , విలువలు పాట కి కల్పించలేవు. బహుశా ఇది పేదవాడి ‘దత్తపది’ ( అవధానాలలో ఒక ప్రక్రియ) అని అనవచ్చేమో. శ్రీ వేటూరి ఒక స్థాయి కి దిగి ఇటువంటివి వ్రాయడంలో మరే సబబైన కారణం కనిపించదు.
ధినక్కుట కసక్కురో
ఝనక్కుట చమక్కురో
తళుక్కు తారా
మినుక్కు స్టారా
కధక్కు ఆటా పాటా చూస్తారో …
అని వ్రాసిన కలం తోనే
తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞాన పధం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణు పదం
అని మహోన్నతం గా వ్రాసారు అదే దర్శకుడికి. ఏం చెప్పగలం. పూర్ణమి చంద్రుడు చవితి చంద్రుడు కూడా ఒకే చంద్రుడి రూపాలు అని సంతృప్తి పడడం తప్ప.
——————————————–
కంచిభొట్ల శ్రీనివాస్ గారు వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం.
కంచిభొట్ల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్
వ్యాసం బాగుంది. ముఖ్యం గా రాఘవేంద్ర రావు గారి తెలుగు సినిమా ముఖచిత్రం గురించి , వారితో పాటు వేటురి వారి ప్రయాణం, వారు రాసిన కొన్ని ఆణిముత్యాలు గురించి రాయటం బాగుంది.బలుసు గారికి ధన్యవాదాలు.