చాన్నాళ్లుగా శారీరకంగా అలిసిపోయినా, అడపాదడపా ఒకటో, రెండో పాటల రూపంలో వినిపిస్తూ, లేని ఓపిక తెచ్చుకుని ఏదో కార్యక్రమంలో కనిపిస్తూ వచ్చిన సినీ గేయ శ్రీనాధుడు, పాటల కవిరాజు వేటూరి సుందరరామ మూర్తి తన 74వ ఏట, దాదాపు 36 ఏళ్ల సినీ గీతాసారాన్ని, అభిమానులకు తన తీపి గురుతుగా అంకితం చేసి, ‘సెలవంటూ లోకాన్ని వదిలిపోయారు’.
మనసు మాటకందనినాడు మధురమైన పాటవుతుంది..
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది..
ఈ రెండు లైన్లు వేటూరివే.. పాటకు ఇంతకన్నా అద్భుతమైన..అందమైన..నిర్వచనం మరెవరూ ఇంతకన్నా బాగా చెప్పలేరు. ఈ లెక్కన ఆ మహాకవి ఎన్ని మధురమైన బాధలు అనుభవించారో..వేలాది పాటలు రాయడానికి. ‘ఇది వేటూరి రాసిన పాట’, లేదా ‘ఈ పాట వేటూరే రాయగలడు’ అనిపించుకున్న సినీ అన్నమయ్య ఆయన. నిజమే..సినీ పరిశ్రమలో వాగ్గేయకారుడు అన్న బిరుదు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, నిస్సందేహంగా అది వేటూరికే ఇవ్వాల్సి వుంటుంది.
ఒకటా రెండా ఎన్ని పాటలనీ, ఒకటా, రెండా ఎన్ని ప్రయోగాలనీ, అసలు పదాలతో అంతలా ఆడుకోవడం ఎక్కడ నేర్చాడో కదా ఆయన. అది అనుభవసారమో, పఠనం ద్వారా వచ్చిన పండిత ప్రకర్షో, శ్రీనాధుడు, వాల్మీకి, త్యాగరాజు, అన్నమయ్య ఇలా..మహామహులనెందరి ప్రతిభాపాటవాలను అర్ధంచేసుకుని, జీర్ణించుకుని, వారందిరి ప్రతి రూపమై, ఈ కాలపు ప్రతినిధియై, రాసిన పాటలు ఎన్నని..ఎన్నదగినవి.
********************
మనిషి జీవితంపై ప్రాంతం, కుటుంబం, వ్యక్తుల ప్రభావం ఎంతో కొంతయినా వుండి తీరుతుంది. వేటూరి పుట్టింది, పెరిగిందీ కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లిలో. సంగీత సాహిత్యాలకు పేరుగాంచిన ఎందరో మహానుభావుల చిరునామా ఈ గ్రామం. త్యాగరాజస్వామి ప్రధాన శిష్యపరమాణువుఆకుమళ్ల వెంకటసుబ్బయ్య, ఆయన శిష్యుడు, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి, ఆ క్రమంలో అలా పారంపర్య శిష్యరికం పొందిన మంగళపల్లి బాలమురళీకృష్ణ..వీరందరూ ఈ గ్రామంతో స్వర సంబంధం కలిగివున్నవారే. అమరగాయకుడు ఘంటసాల కూడా ఈ గ్రామంలో స్వరసాధన చేసినవారే.
ఇక పెదకళ్లేపల్లి సాహితీ వైభవాన్ని తరచి చూస్తే సంగీత సాహిత్యాలకు నెలవైన వేటూరి పూర్వీకులే పెద్ద గురుతు. ఆపై బృందావనం గోపాలాచార్యులు, అద్దేపల్లి సోమనాధ శాస్ర్తీ (చర్లపల్లి ఆస్ధాన పండితులు), తర్కశాస్త్ర ప్రవీణ ముద్ధు భూషయ్యశాస్ర్తీ ఇంకా ఎందరో గుర్తుకొస్తారు. పెదకళ్లేపల్లిలో వేటూరివారి కుటుంబానిది విశిష్ట వైభోగం. సుందరరామమూర్తిది వారి తాతపేరే. వేటూరి సుందరశాస్ర్తీ. ఆయన బహుముఖ ప్రజాశాలి. వైద్యం, సాహిత్యం, జ్యోతిష్యం, శిల్పకలలో నిష్ణాతులు. ఆ కాలంలో ఆయన ఎన్నో అధ్భుత రచనలు సాగించారని చెప్పుకుంటారు. ఆయన సంతానం నలుగురు. వెంకటశివ శాస్ర్తీ, ప్రభాకరశాస్ర్తీ,చంద్రశేఖర శాస్ర్తీ, శివశంకర శాస్ర్తీ. వీరిలో ప్రభాకరశాస్ర్తీ సాహితీలోకానికి సుపరిచుతులే. మహాపండితుడాయెన. ఆయన రచనలు, సాగించిన పరిశోధనలు జగద్విదితం. ఆయన సోదరుడు చంద్రశేఖర శాస్ర్తీ వంశోద్ధారకుడే సుందరరామమూర్తి. చంద్రశేఖర శాస్ర్తీ, కమలాంబ దంపతులకు జనవరి 29 1936 పుట్టిన ఈ కవి సుందరుడికి ఓ సోదరుడు కూడా పేరు సదానందమూర్తి.
సుందరరామమూర్తికి బాల్యంలోనే మంచి సాహితీపునాది పడింది. తండ్రికి అనూచానంగా వచ్చిన సాహితీ పిపాస కారణంగా సంస్కృత, ఆంధ్ర, తమిళ కావ్యకన్నియలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రభంధాలు, పురాణాలు, సుభాషితాలు, ఉపనిషత్తులు..ఇలా ఒకటేమిటి..అన్నింటా అభ్యాసం..అన్నిటా ప్రవేశం..అన్నీ ఔపాసన. ప్రాధమిక విద్య విజయవాడలో, ప్రాధమికోన్నతం జగ్గయ్యపేటలో, ఆఖరికి తెనాలిలో స్కూలు ఫైనల్. మద్రాసులో ఇంటర్, బెజవాడలో డిగ్రీ. చదువేదైనా..ఎక్కడైనా తండ్రి పోసిన ఉగ్గుపాలు మాత్రం సాహిత్యాన్ని రంగరించే. మరో పక్క తల్లి అందించిన సంగీతామృతాలు. నిజానికి సుందరరామమూర్తి చాలా అదృష్టవంతుడు. తండ్రి సాహితీపిపాసి అయితే. తల్లి సంగీతాభిరుచికి చిరునామా. అలా ఆ ఇద్దరూ సంగీత సాహిత్యాలను అందించి పెంచారా చిన్ని వేటూరిని బహు సుందరంగా.
అప్పట్లో కాస్తో కూస్తో సాహితీ వ్యవసాయం నేర్చిన వారందరికీ పత్రిక రంగం పెద్ద ఆకర్షణగా వుండేది. అలాగే వేటూరి కూడా ఆంధ్రప్రభలో నార్లవారి దగ్గర అప్రెంటీస్‌గా, ఆపై సబ్‌ఎడిటర్‌గా, రిపోర్టర్‌గా పనిచేసారు. అప్పట్లో ప్రధాని నెహ్రూ శ్రీశైలం వచ్చినపుడు ఆయనను ఇంటర్వ్యూ చేసారు. ఆపై 1959లో ఆంధ్రప్రత్రికలో చేరారు. 1964లో అసెంబ్లీ రిపోర్టరుగా వున్నారు. 1966లో ఆంధ్ర జనతలో సబ్ ఎడిటర్‌గా చేరి, 1967లో ఎడిటరయ్యారు. ఇదీ సంక్షిప్తంగా వేటూరి సినీ పూర్వాశ్రమ ప్రస్ధానం.
చదువుకునే రోజుల నుంచి ఉద్యోగధర్మంగానూ, భావోద్వేగజనితంగానూ ఆయన అనేక రచనలు చేసారు. వాటిలో కథలు, కవితలు, నాటికలు, రూపకాలు ఎన్నో రకాలున్నాయి.అన్నింటికీ మించి ఆంధ్రపత్రికలో అనురాధ డైరీ అంటూ మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో దాదాపు 10వారాల పాటు సాగించిన ఫీచర్ బాగా పేరుతెచ్చిపెట్టింది. కానీ కృష్ణాజిల్లా శ్రీకాకుళం ప్రాంతంలో వున్న దేవదాసీ వ్యవస్థ తీరుతెన్నుల నేపథ్యంలో రచించిన “సిరికాకొలను చిన్నది” రేడియోసంగీత నాటకం ఆయనను సినిమాలవైపు మళ్లించింది. రేడియోలో అది ప్రసారమై, ప్రాచుర్యం పొందిన మీదట, ఆనోటా..ఈనోటా దాని గురించి విన్న అప్పటి ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు దాని ఆధారంగా సినిమా చేస్తే ఎలా వుంటుందోనని ఆలోచనలో పడ్డారు. అందుకోసం మాట్లాడడానికి వేటూరి మద్రాసు పిలిపించారు. అప్పటికే వేటూరికి జర్నలిస్టుగా, సినీ సమీక్షలు రాయడం అలవాటు..పైగా అప్పటి సినీ సంగీత, సాహితీ ప్రముఖులు మల్లాది, పింగళి తదితరులతో పరిచయాలు వున్నాయి. ఇవన్నీ తెలుసుకున్న ఎన్టీఆర్ ప్రోత్సహించి, పాటలు రాయమంటే, పెండ్లి పిలుపు, దీక్ష సినిమాల కోసం పాటలు రాసారు. కానీ అవి వెలుగు చూడలేదు.
హరికథతో అసలు కథ మొదలయింది. కళాతపస్వి విశ్వనాధ్ ‘ఓ సీత కథ’ రాస్తున్న రోజులవి. చిత్రంలో భాగంగా ఒక సన్నివేశంలో కీచకవథ ఘట్టం హరికథ కావాల్సి వచ్చింది. అప్పటికే వేటూరి గురించి కర్ణాకర్ణిగా విన్న విశ్వనాధ్ ఆయనకు కబురుచేసి, సన్నివేశం వివరించారు. అంతే..్భరతనారీ చరితము..మథురసుధా భరితము..అంటూ రచన పెల్లుబుకింది.
అసలు కథ అది వచ్చిన రెండేళ్లకు ప్రారంభమైంది. ఆ ఊపులో ఎదురులేని మనిషికి ఒకటి రెండు పాటలు రాసినా, ఆ తరువాతి సంవత్సరం అటు కళాతపస్వి చిత్రాలను, ఇటు తెలుగు గేయాల చరిత్రను మలుపు తిప్పిన సిరిసిరిమువ్వ సినిమా మొదలైంది. సంగీత సాహిత్యాలనే ఆలంబన చేసుకుని, నటీనటలకు పెద్ధ ప్రాధాన్యం లేకుండా వచ్చిన సినిమా అది. దానికి వేటూరిది సింగిల్ కార్డు.
ఆణిముత్యాలు దొర్లాయి. స్వరబ్రహ్మ మహదేవన్ సంగీత సారధ్యంలో వేటూరి పాటల రథం పరుగు ప్రారంభమైంది.
అందులో పాటలు ఒకటనేమిటి? అన్నీ వేటూరి ప్రతిభాపాటవాలను ఒక్కసారిగా సినీ లోకానికి చాటి చెప్పినవే.
ఊరేగినా వాడే..ఊరేలినావాడే..ఊరూ పేరున్నవాడు..ఉన్నవాడూ వాడే..
వేటూరికి పదాలతో ఆడుకోవడం సరదా అనడానికి ఆరంభంలోనే రాసిన ఈపాటే ఉదాహరణ.
అదే విధంగా..అదే సినిమాలో..
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ..అందరికీ అందనిదీ పూచిన కొమ్మ..
ఎలాంటి పదప్రయోగం. కొమ్మ అంటే అమ్మాయి..పూచినకొమ్మ..ఎత్తుగా వుండి అందలేదనడం..ఈ అమ్మాయి అందరికీ అందేది కాదనడం..
ఎదకన్నాలోతుగా గుడి వుంది తెలుసుకో..గుడిలోని దేవతని గుండెలోదాచుకో..
ఎంత లలితమైన పదాలు..లాలిత్యమైన భావనలు.
సదా భగవంతుడిని కొలిచే భక్తుడే ఆగ్రహిస్తే..ఏమంటాడు..
‘రాతిబొమ్మకు రవ్వలు పొదిగి రామహరే..శ్రీరామహరే..అని పట్టిన హారతి చూస్తూ, ఏమీ పట్టనట్లు కూర్చుంటే చాలదు..రా..దిగిరా..దివినుంచి భువికి దిగిరా..’
అని ఆజ్ఞాపిస్తాడు.
అలా ‘ఎదలోని లయలా, ఎలదేటి రొదలా, కదిలేటి నదిలా, కలల వరదలా..లలితలలిత పద కవితలుగా…’పాటల ప్రస్థానం ముందుకు ఉరికింది.
****************
శోభన్‌బాబుతో బాబు సినిమా తీసి, ఎన్టీఆర్‌తో తొలిసారిగా సినిమా ప్రారంభించాడు రాఘవేంద్రరావు. సత్యచిత్ర బ్యానర్. వారికి మహదేవన్ పెర్మనెంట్ సంగీత దర్శకుడు. దాంతో రాఘవేంద్రరావు ఆయననే వుంచాడు. పాటలు రాయించాలి. మహదేవన్ అప్పటికే వేటూరి సాహితీ రుచిని చవిచూసినవాడు. ఎన్టీఆర్‌కు ముందే పరిచయం. అందరికీ అంగీకారం కుదిరింది..వేటూరి కలం కదిలింది. అసలే మహదేవన్..వేటూరి మాటల్లో చెప్పాలంటే..‘తెలుగు సినీ సీమలో ట్యూన్ ఇచ్చి పాట రాయించడం అంటే ఇష్టపడని ఏకైక సంగీత బ్రహ్మ’..ఆపై సినీ సంగీతంపై అభిరుచి వున్న రాఘవేంద్రరావు.
ఈ సినిమాతో వేటూరిలోని చిలిపితనం వెల్లువెత్తింది.
‘పారేసూకోవాలనే ఆరేసుకున్నావు’ అనడం.. ఆపాటకు జనం నీరాజనాలు పట్టడం అలా అలా జరిగిపోయింది.
ఆ సినిమాలో గిరిజనులకు జాతీయగీతం అనదగ్గదిగా రాసిన పాటలో వేటూరి చాకచక్యం అంతా తొంగి చూస్తుంది.
‘కృషివుంటే మనుషులు ఋషులవుతారని’ చెప్పడడే కాదు..చేతల్లో చూపించగలిగాడు.
‘ఆ శోకంలో ఒక శ్లోకం పలికె..చీకటి ఎదలో దీపం వెలిగె’ అంటూ వాల్మీకి గురించి ఒక్క వాక్యంలో చెప్పేసాడు. ‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా సందడి..చిగురాకుల తోరణాలు..చిరుగాలీ సన్నాయి’ అంటూ ఇందులో రాసిన గీతంలో వేటూరి భావుకత అంతా కనిపిస్తుంది
******************
అడవిరాముడు చిత్రంతో వేటూరి తెలుగుసినీ రంగానికి వరంలా మారిపోయారు. అటు మాస్ పాటలు, ఇటు క్లాస్ పాటలు రాయగలిగినా, ముందుగా ఆయనను మాస్ పాటల కోసమే ఎక్కువగా ఉపయోగించుకున్నారు. అడవి రాముడు తరువాత కేవలం మూడేళ్లలో ఆయన 120 చిత్రాలకు పాటలు రాసారంటే, ఆ సినిమా ఇచ్చిన ఊపు ఎలాంటిదో అర్ధమవుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ యమగోల, వేటగాడు చిత్రాల కోసం ఆయన రాసిన మాస్ మసాలా పాటలు యువతరాన్ని ఊపేసాయి. ‘ఆకుచాటు పిందె తడిసె, కోకమాటు పిల్లతడిసె’ అన్నది నాటికీ ఏనాటికీ తీసిపోని హిట్.
సిరిసిరిమువ్వ తరువాత మళ్లీ వేటూరిలోని సాహితీదాహాన్ని తీర్చిన చిత్రం విశ్వనాధ్ ‘శంకరాభరణం’. ఆ చిత్రానికి అందరూ ఈశ్వరులే..ఈయనొక్కడే రాముడు అన్నది రచయిత ఎవీయల్ చమత్కారం. దర్శకుడు విశ్వనాధ్, కెమేరామెన్ బాలు మహేంద్ర, సంగీత దర్శకుడు మహదేవన్..అందుకని ఆ చమత్కారం.
‘పరవశాన శిరసూగంగా..ఇలకుజారెనా శివగంగ’ అనడం వేటూరి మార్కు. ‘ఉచ్ఛ్వాస నిశ్వ్ఛాసములే వాయులీనాలు..స్పందించు నవనాడులే వీణానాదాలు’ అంటూ శరీరమే సంగీతనిలయంగా చేసి రాయడం ఆయన ఊహాశక్తికి నిదర్శనం.
‘నీపద రాజీవముల చేరు..నిర్వాణ సోపాన మధిరోహణము చేరు త్రోవ..దొరకునా..అటువంటి సేవ’ అంటూ రాయడం అనితరసాధ్యం. 1980 నుంచి 90 వరకు ఆ దశాబ్ధం అంతా వేటూరి కలానికి విశ్రాంతి లేదు. పైగా తెలుగునాట సినీ సంగీతానికి అది స్వర్ణదశాబ్ధంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సంగీత దిగ్ధర్శకులు మహదేవన్, ఇళయరాజా, రమేష్‌నాయుడు, విశ్వనాధన్, రాజన్‌నాగేంద్రలు బాణీలు కట్టిన రోజులు అవి. అది వేటూరి అదృష్టం కావచ్చు, తెలుగు సినీ సంగీత ప్రియులు పెట్టిపుట్టిన కాలం కావచ్చు, మొత్తం మీద..అద్భుతమైన పాటలు పుట్టుకొచ్చాయి. ఒకటా రెండా ఆ పదేళ్లలో ఆయన రాసిన పాటలు రెండు వేలకు పైగానే. అంటే 3650 రోజుల్లో రెండు వేల పాటలు. అందునా ఇళయరాజా విభిన్న శైలీ విన్యాసంతో చేసిన స్వరకల్పనకు ధీటుగా, వేటూరి పదాలు కదనుతొక్కాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు, వాటిల్లో సంగీత సాహిత్య ప్రయోగాలు ఒక పరిశోధనకు కావాల్సినంత సరుకుతో కూడుకున్నవి. అలాగే రాజన్‌నాగేంద్రతో కలిసి వేటూరి అందించిన గీతాలకు పాత అన్నది లేదు.
‘వీణ వేణువైన సరిగమవిన్నావా..తీగ రాగమైన మధురిమ కన్నావా’ అని తన భావాలను వింతగా చెప్పుకున్నాడు.
‘ఎడారిలో కోయిలా..తెల్లారనీ రేయిలా..పూదారులన్నీ, గోదారికాగా పాడింది కన్నీటి పాట..
ఎదవీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నాదేవత..
కల అయితే శిల అయితే మిగిలింది ఈ గుండె కోత’,
పాటంత..ఆవేదన..పాటంతా ని‘వేదన’..
‘మానసవీణా మధుగీతం..మనసంసారం సంగీతం..’
‘జాబిలీకన్నా నాచెలీ మిన్న..పులకింతలకే పూచిన పొన్న
కానుకలేమి నేనివ్వగలను..కన్నుల కాటుక నేనవ్వగలను’
ఎంత భావుకత్వం నిండిదీ పాటలో..పులకింతలకు పొన్నచెట్టుపూయడం..ప్రేయసి కన్నులకు కాటుకవ్వడం..ఎంత సున్నితమైన భావాలు.
‘దొరలనీకు కనుల నీరు దొరలదీ లోకం..మగదొరలదీ లోకం..కనులలోనె దాచుకోవె కడలిలా శోకం..’ అని నిజం పాటలా చెప్పినా..’
‘కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్ధురలేచే..ఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అందియమోగే’ అని చాటిచెప్పినా ఆయనకే చెల్లింది.
వేటూరి ఓసారి అన్నారిలా..‘నేను స్ధిరంగానే వుంటాను..నా పాటలు మాత్రం పరుగెడతాయి..పరుగెత్తిస్తాయి..’ అని. అంతే కాదు ఆయన పాటలు..ఆలోచింపచేస్తాయి..గుండెలు పట్టి ఆపుతాయి..కళ్లను తడిచేస్తాయి..మాటల్ని ఆపి మౌనం మిగులుస్తాయి.
జంధ్యాల ముద్దమందారం కోసం ఆయన రాసిన పాటల్లో ఎంత ఆర్ధ్రత తొంగి చూస్తుందనీ..
‘సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారులే..పూరిగుడిసెల్లో పేదమనసుల్లో వెలిగేటి దీపాలులే..’ అంటే ఎంత సామ్యవాదం గుర్తుకు వస్తుందో..
‘ఆ తారలే చేరి మిలమిల మెరిసే వేళలో..ఒడిలో నువ్వుంటే, ఒదిగిపోతుంటే కడతేరిపోవాలిలే’ అంటే..నిజంగా గుండె పట్టినట్లుంటుంది.
సీతాకోకచిలుక చిత్రం కోసం ఇళయరాజాతో కలిసి అందించిన ఆయనపాటలు సినీ రంగంలో అలా నిలిచిపోయాయి.
‘మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా..పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మా’
‘మాటే మంత్రమూ మనసే బంధమూ’
ఇలా చెప్పుకుంటే ఆ సినిమాలో ప్రతిపాటా..అందులో ప్రతిమాటా గుర్తుతెచ్చుకోవాల్సిందే.
మురారి జేగంటలు చిత్రం కోసం రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే.
‘వందనాలు..వందనాలు వలపుల హరిచందనాలు..
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామి వందనాలు..’
వెన్నెల్లో వేచి వుంటే వెచ్చబడడం ఏమిటి? చల్లదనం కోసం వలపుల హరిచందనాలు పూయడమేమటి? ఏ తీరాలు దాటి సాగిందీ భావుకత.
‘ఈ చుక్కరాకతో నవరాత్రి నవ్వనీ..ఆ ఒక్కరాతిరే తొలిరాతిరవ్వనీ’
‘ఇది ఆమని సాగే చైత్రరథం..ఇది కృష్ణుడు ఎక్కిన పూలరథం’
ఎలాంటి పాటలివి. తెలుగుతెర ఎంత పుణ్యం చేసుకుంటే పుట్టిన గీతాలివి.
కేవలం భావుకతే కాదు..ఆవేశం కూడా వేటూరి గీతాల్లో అద్భుతంగా పలికింది.
ప్రతిఘటన చిత్రం కోసం ఆయన రాసిన ‘ఈ ధుర్యోధన, దుశ్శాసన, దుర్నినీత లోకంలో,రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో..’ అంటూ రాసిన పాట ఓ అద్భుతం. ఈ పాటను స్పష్టంగా విని, జీర్ణించుకున్న మగవాడెవ్వరూ, మరికెప్పుడు ఓ స్త్రీని అవమానించడు..అగౌరవపర్చడు. అంత ప్రేరణ వుంటుందీ గీతంలో..‘మర్మస్థానం కాదిది..మీ జన్మస్థానం’ అనడం ఇక ఎవ్వరూ ఎక్కలేని ఎత్తుకు పాటను చేర్చడమే.
వేటూరి రాసిన పాటలన్నీ ఒక ఎత్తయితే, బాపు-సత్యం-ఆదినారాయణరావ్‌ల కాంబినేషన్‌లో భక్త కన్నప్ప చిత్రం కోసం రాసిన కిరాతార్జునీయం ఒక ఎత్తు.
ఒక పాటలో ఎన్ని పదాల విరుపులో, ప్రయోగాలో..అవన్నీ అందులో చూడొచ్చు. వేటూరి విద్వత్తుకు నిదర్శనంగా నిలిచిపోతుంది ఆపాట.
‘ఎరుక కలిగిన శివుడు..ఎరుకగా మారగా..’
‘సవ్వసాచి కుడిఎడమై సంధించుట మరిచిపోయె..’
‘..కాని నరుడికాతడు మనోహరుడు..’
‘అర్జునుడు..అపుడతడు వేయి చేతుల కార్తవీర్యార్జనుడు’
ఇలా ఆ పాటంతా పదాలతో ఆటలే. ఇది పరమశివుడు భక్తుడైన అర్జునుడితో ఆడుకున్న ఆట కాదు..వేటూరి పదాలతో ఆడిన సయ్యాట.
********************
దర్శకులు..సంగీత దర్శకులు..అందరూ వేటూరి పాటనే కోరుకున్నారు. ఎందుకంటే ట్యూన్ ఎలాంటిదైన అందుకు అనుగుణమైన పదాలు వేయగల సత్తా ఆయనకు వుండేది.
జెమిని చిత్రంలో టైటిల్ సాంగ్ తమిళనాట పెద్ద హిట్. అందుకు తగ్గ పదాలు ఎలా కుదురుతాయి తెలుగులో అనుకున్నారు అంతా..ఆఖరికి వేటూరి కలం చేసుకోవాల్సి వచ్చింది..ఆ పాటలో ఓ సందర్భంలో‘వెయ్ పోటు’అని సరైన పదం జోడించి పాట పరువు నిలిపారు.
అలాగే బొంబాయి చిత్రం కోసం ‘అది అరబిక్ కడలందం..’ అన్న కాయినింగ్ ఆయనకే సాధ్యం.
గీతాంజలి చిత్రంతో మణిరత్నం పరిచయమయ్యారు. అలా అనే కన్నా మణిరత్నానికి వేటూరి పరిచయమయ్యారు అనడం సబబు. ఇలా అనడానికి కారణం వుంది. సాధారణంగా తమిళ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయినపుడు సినిమా కొనుక్కున్న వారు దాని మంచి చెడ్డల సంగతి చూసుకుంటారు. కానీ మణిరత్నం సినిమాలకు అలా కాదు..పాటలన్నీ వేటూరే రాయాలి. అది నిబంధనలాంటిది. చిత్రంగా మణిరత్నం విలన్ సినిమానే వేటూరి ఆఖరి సినిమా అయింది. ఆ సినిమాలో అన్ని పాటలూ వేటూరే రాసారు. వార్ధక్యం వయసుకే కానీ, అనారోగ్యం మనిషికే కానీ, మనసు ఏ మాత్రం మారలేదని ఇందులో పాటలు చాటిచెబుతాయి. విలన్ పాటల్లోనూ వీలయినంత వరకు తనమార్కు వుండేలా చూసారు.
‘తుమ్మెదలంటని కన్నెమోము కన్న వనం ధన్యం..’
‘ఇది పెట్టిన ఎర్రని బొట్టిది’..
‘విల్లులా వంగినవాళ్ల..బాణమల్లే దూసుకుపోతాం’ ఇవన్నీ ఆయన ఆఖరి పాటల్లోని పదాలే.
మణిరత్నం అన్ని సినిమాల్లో అనేక ప్రయోగాలు చేసారు.
అలాగే వంశీ-ఇళయరాజా కాంబినేషన్‌లో, శేఖర్‌కమ్ములతో ‘ఆనంద్’..‘గోదావరి’..‘లీడర్’ల్లో ఆయన మంచి పాటలు అందించారు. ‘గోదావరి’లో..
‘ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ..నది ఊరేగింపులో..’
అని చమత్కరిస్తారు.
వంశీ కోసం ప్రేమించు పెళ్లాడు చిత్రం కోసం రాసిన ఓ డ్యూయట్‌లో ఋతువులను పేర్కొంటూ ఆయన చేసిన ప్రయోగాలు మరెవరివల్లా కాదు.
‘అగ్నిపత్రాలు రాల్చి గీష్మమే మారిపోయె..
మాఘదాహాలు..మంచుధాన్యాలు..ఇలా ఎన్ని పదప్రయోగాలో..
**********************
నిజానికి వేటూరి పాటలను చాలా విభాగాలుగా విభజించి పరిశీలించాలి. కోకమీద పాటలు..
నీ కళ్లు పడి అయ్యింది తెల్లకోక గళ్లకోక..తెల్లచీరకుతకథిమి..కుర్రకళ్లు చీరగళ్లలో దారేలేక తిరుగతున్నవి..
ఇలా దాదాపు పాతిక పైనే కోకపాటలు రాసారాయన..
ఇక పదప్రయోగాలన్నీ ఓ తరహా..సాహిత్యం నిండినవి మరోతరహా..
‘నరుడి బతుకు నటన..ఈశ్వరుడి తలపు ఘటన..ఈ నట్టనడుమ నీకెందుకింత తపన’
‘ఏకులము నీదంటే..గోకులము నవ్విందీ..’
‘రాయితేనేమిరా దేముడూ..హాయిగా వుంటాడు జీవుడూ..’
‘నిన్నటి దాకా శిలనైనా..నీ పదం సోకి నే గౌతమినైనా’
‘ఈపాదం ఇలలోన నాట్యవేదం..’
ఇలా ఎన్ని పాటలో..తేనెల ఊటలో..మల్లెల పూదోటలో..శ్రోతల కోసం..
******************
కాలం మారింది..కొత్త కొత్త రచయితలు వచ్చారు..వస్తున్నారు..కానీ ఈ పాట రాయాలంటే..వేటూరిని కలవాలి అన్న ముద్రమాత్రం పోలేదు..ఇది ఆయన మాత్రమే రాయగలడు..రాయాలి.. అన్న అభిప్రాయం మారలేదు.
అన్నమయ్య చిత్రంలో ఏ పాట ఎవరు రాసినా, మరో కిరాతార్జునీయంలా..
‘తెలుగపదానికిది జన్మదినం’ అంటూ అన్నమయ్య జన్మగాధను వివరించడానికి వేటూరే చేయిచేసుకోవాల్సి వచ్చింది.
అలాగే శ్రీరామదాసులో..
కలకత్తాపై ‘యమాహానగరి కలకత్తాపురి’ అనీ..
కాశీపై..‘శివగంగ విలాసంగా మారి’..
మధుర మీనాక్షిపై..‘మధుర మధురతర మీనాక్షి’..లాంటి పాటలు రాయాలంటే వేటూరే కలం విదిలించాల్సి వచ్చింది.
‘హిమగిరి చిలుక..సొగసులు చిలక..కరముల చిలక..వరములు చిలక’ ఇలా ఇంకెవరు రాయగలరు?
**************
అవార్డులు..రివార్డులు వేటూరి చిరునామా వెదుక్కుని మరీ వచ్చాయి. నంది అవార్డులు..ఇతర అవార్డులకు లెక్కే లేదు..నిన్న మొన్నటి గోదావరి చిత్రం వరకు. ఇక శ్రీశ్రీ తరువాత తెలుగు పాటకు జాతీయఅవార్డు ఆయనే తెచ్చారు. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..’ ‘వేణువై వచ్చాను భువనానికి..గాలినైపోయాను గగనానికి’..ఇలాంటి పాటలకు అవార్డు రాకుండా వుంటాయా..
***************
గోదావరి..సీతారాములు..కినె్నరసాని..ఎంకి..కోక..ఇవన్నీ వేటూరికి ఇష్టమైన పదాల్లా కనిపిస్తాయి. అందుకే ఆయనపాటల్లో తరచు వినిపిస్తాయి. రాముడిపై ఆయనకు ఎంత ప్రేమో..ఆయన పాటల్లో తెలుస్తుంది. శివుని విల్లును ఎక్కు పెట్టిన రాముడు..తాళికట్టే వేళ సీతజడను ఎత్తగలడా అని చమత్కరిస్తాడు..ఓ పాటలో. నిజమే కదా ఎంతటి వీరుడైన రాముడైనా..రెండు చేతులా తాళిబొట్టుపట్టుకుని, సీత జడ ఎలా ఎత్తగలడు. అలాగే అదే పాటలో‘నల్లపూసైనాడు దేముడు..నల్లని రఘురాముడు’ అంటాడు. ‘ముద్దులగుడి రామయ్యకు మా జానకి జోల’అని రాస్తారు మరో పాటలో..ఇలా రాముడిపై ఆయన చేసిన వెన్ని ప్రయోగాలో. ఇక ఒకటి రెండు తెలుగుపదాలు కలపడం..కొత్త కొత్త తెలుగుపదాలు సృష్టించడం అంటే ఆయనకు చాలా ఇష్టం. అలాంటి పదాలు కొన్ని వందలు వున్నాయి..నిన్నటి విలన్‌లో..అగ్గిపండు అనే పదం వరకు. కొన్నిసార్లు కర్త,కర్మ,క్రియ ఒకే పదం వాడి..వేర్వేరు అర్ధాలు తెచ్చిన సందర్భాలున్నాయి. ఇలా ఎన్ని ముత్యాలని ఏరుకోవడం.
****************************
వేటూరిది మంచి హృదయం..కొత్తగా ఎవరు రాస్తున్నా ప్రోత్సహించడం ఆయన నైజం. ఎలా రాసినా బాగుంది అనడం ఆయన సంస్కారం. ఆయనకు బాగా పేరు వస్తున్న రోజుల్లో యమగోల చిత్రంలో ‘ఆడవె అందాల సురభామిని’ పాట పెద్ద హిట్ అయింది. నిజానికి ఆ పాట రాసింది వీటూరి. ఆయన వేటూరికి ముందే సినిమాల్లో మాటలు పాటలు రాసేవారు. కానీ జనం ఆ పాటా వేటూరే రాసారనుకునేవారు. అవకాశం వచ్చినపుడల్లా..వేటూరి ఆ పాట రాసింది నేను కాదు..వీటూరి అని పెద్దాయిన..అని చెప్పేవారు. అదీ ఆయన సంస్కారం. జయదేవుడి అష్టపదులు వగైరా మంచి పాటలను మహదేవన్ లేదా పుహళేంది చేత ట్యూన్ చేయించి క్యాసెట్లు చేయించారు. కానీ ఆ అభిరుచి ఆయనకు చేదు అనుభవాల్నే మిగిల్చింది.
**************************
అయిపోయింది..తెలుగుసినీపాటగత్తెకు సాహిత్యపుటంచు..సొగసు అద్దకం నిండిన పదాడంబరం చుట్టిన గీతాకార్మికుడు తనువు చాలించాడు.
‘అలలు కదిలినా పాటే..
ఆకు మెదిలినా పాటే..
కలలు చెదిరినా పాటే..
కలత చెందినా పాటే..
ఇదీ వేటూరి జీవితం. వేలాది పాటలు తన వారసత్వ సంపదగా తెలుగుసినీ గీతాభిమానులకు పంచి ఇచ్చి..వెళ్లిపోయాడాయన.
ఆయన లేడు కానీ..ఆయన పాటలు వున్నాయి..అవి అలా ప్రతిధ్వనిస్తూనే వుంటాయి..నిండా కన్నాలే నిండినా..మధురగానం వినిపించే మురళిలా..కళ్ల ముందు ఆయన లేకున్నా..
********************************
వి.ఎస్.ఎన్.మూర్తి గారికి కృతజ్ఞతలో వేటూరి.ఇన్
chaala baagundandi………………veturi gaarini kalavaalani naa pedda korika okappudu teerakundaane mahatmudu vellipoyaaru………..