బృందావనిలో చిన్నికృష్ణుడు-వేటూరి(శ్రీగార్గేయ)

పాటలు అందరూ రాయగలరు. కానీ మనసుని తాకే విధంగా కొందరే రాస్తారు. అందునా కృష్ణతత్వాన్ని రాయాలంటే వేటూరి కలానికి మించిన బలం ఏముంటుంది చెప్పండి. సరిగా ఇలాంటి పాటే… “కాంచన గంగ” సినిమాలోని బృందావని ఉంది పాట.

బృందావని ఉంది.. యమునా నది ఉంది
మధురాపురి ఉంది… కాళింది ఉంది…
లేని వాడొక్కడే శ్రీకృష్ణమూర్తి
కలిలోన శిలయైన కళ్యాణ మూర్తి…. ఏహే..హేహే…ఏహేహే… ఆహా..హాహా…ఆహాహా

పుట్టగానే పెరిగేటి మాయబంధనాలకన్నా…
పుడుతూనే తొలిగేటి చెరసాలలే మిన్న…
ఆ కిటుకు తెలిసేరా…
ఆ కిటుకు తెలిసేరా… శ్రీకృష్ణమూర్తి
చెరసాలలో పుట్టె చైతన్యమూర్తి.

వెంటపడి వేధించే వేలమంది స్త్రీలున్నా…
ఇంటనుండి పూజించే ఇంతి ఉంటె చాలన్నా…
ఆ కిటుకు తెలిసేరా…
ఆ కిటుకు తెలిసేరా… శ్రీకృష్ణమూర్తి
రాధ గుండె దోచినాడు వేదాంతమూర్తి.

ఈ పాటలో ప్రతి పదమూ ఓ అద్భుతమే. శ్రీకృష్ణుడి లీలామానుష తత్వాన్ని ఇంతకంటె గొప్ప పదాల్లో ఎవరు మాత్రం చెప్పగలరు. మహాభారతంలో గానీ, భాగవతంలో గానీ శ్రీకృష్ణుని గొప్పతనాన్ని తెలియజెప్పిన వాటిలో బృందావనం, యమునా నది, మధుర, కాళింది విశిష్టమైనవి. అవన్నీ ఇక్కడా ఉన్నాయి అన్నారు వేటూరి. ఇక్కడ లోలోపల కనిపించే భావమూ ఉంది. ఇవన్నీ కృష్ణుణ్ని గొప్పతనాన్ని తెలియజేసిన ప్రదేశాలు. అలాంటి అంశాలు మనిషిలోనూ ఉన్నాయి. మనిషి గొప్పవాడు కావాలంటే అవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ శ్రీకృష్ణమూర్తి కే తెలుస్తాయి. తెలియలేదంటే ఆ మహనీయుడు లేనట్టేగా. అదే చెబుతున్నారు వేటూరి. అన్నీ ఉన్నాయి కృష్ణుడొక్కడే లేడు. అందుకే మహాత్ముడు కాలేడు అని.ఇక్కడ ఇంకో పదాన్ని కూడా వాడారు. కలిలోన శిలయైన కళ్యాణమూర్తి అని. మహావిష్ణువు అంశల్లో పరిపూర్ణ వ్యక్తిత్వంగా భావించేది శ్రీకృష్ణావతారం. అందుకే వెంకటేశ్వరుణ్ణి పదకవితలతో అర్చించిన అన్నమయ్య సైతం… ఆ స్వామిని కృష్ణునిగా భావించిన సందర్భాలు అనేకం. అదే లాలిత్యం ఇక్కడా కనిపిస్తుంది. కలికాలంలో శిల రూపంలో మాత్రమే ఉన్నాడు ఆ నిత్యకళ్యాణ మూర్తి అని చెప్పారాయన.

నల్లనయ్య పుట్టుకే ఓ అద్భుతం. చెరసాలలో దేవకీ గర్భాన జన్మించాడాయన. వెంటనే వసుదేవుడు ఆయన్ను యశోద చెంతకు చేర్చాడు. భగవంతుడైతే చెరసాల జన్మమెందుకు… గోకులంలో పెరగడమెందుకు అని. ఇక్కడా మనిషి జీవితానికి సంబంధించిన ఓ గొప్ప విషయాన్ని చెప్పారు వేటూరి.

పుట్టగానే పెరిగేటి మాయబంధనాలకన్నా…
పుడుతూనే తొలిగేటి చెరసాలలే మిన్న…

ఈ చిన్ని పదాల్లోనే కొన్ని వేల ప్రశ్నల తాలూకు సమాధానాన్ని మన ముందుంచారు వేటూరి. మనిషి పుట్టగానే ఎన్నో బంధాల మధ్య మాయలో చిక్కుకుంటాడు. అదే సుఖమనుకుని అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ జగన్నాటక సూత్రధారి ఈ మాయలో ఎందుకు చిక్కుకుంటాడు చెప్పండి. అందుకే వేటూరి అంటారు… ఈ కిటుకు తెలిసే ఆయన చెరసాలలో పుట్టారని. చైతన్యమూర్తి అనే పదాన్ని వాడారు. నిజమే కృష్ణుడు చైతన్యానికి చిహ్నం. సకల చరాచర సృష్టిని చైతన్యం చేసే ఎన్నో అంశాలు ఆయనలో ఉన్నాయి. అన్నీ ఆయనే. అంతా ఆయనే. ఒక్క చిన్నపదం రాయడానికి ఎంతగానో ఆలోచించే వేటూరి… ఈ ఒక్కపదంలోనే ప్రశ్నను, సమాధానాన్ని చెప్పేశారు. స్వేచ్ఛను తొలగించేది చెరసాల. స్వేచ్ఛకు ప్రతిరూపం చైతన్యం. ఈ రెండింటికి మధ్య మంచి వంతెన వేశారు వేటూరి.

నాస్తికులమని చెప్పుకునే వారు శ్రీకృష్ణుని లీలల్లో తప్పుగా చూపించే అంశమొక్కటే… ఆయనకు 16 వేల మంది భార్యలున్నారని. వారితో పాటు మరో ఎనిమిది మంది అసలు భార్యలు… ఇంకా రాథ. ఇంత మందితో రాసలీలలు జరిపిన వాడు భగవంతుడా అని. దానికీ ఈ పాటలో సమాధానం ఉంది.

వెంటపడి వేధించే వేలమంది స్త్రీలున్నా…
ఇంటనుండి పూజించే ఇంతి ఉంటె చాలన్నా…

వెంటపడి వేధించుకు తినే ఎంత మంది భార్యలున్నా… మనల్ని అర్థం చేసుకునే ఒక్క భార్యకు సాటిరారంటారు వేటూరి. అందుకే ఇంత మంది భార్యలున్నా శ్రీకృష్ణుడు రాథ గుండే దోచాడు, రాధామనోహరుడయ్యాడు అని చెప్పారాయన. ఇక్కడ కృష్ణుణ్ని వేదాంత మూర్తి అంటూ అభివర్ణించారు. నిజమే కామిగాక మోక్షగామి కాడు అంటారు. మరి ఇంత మంది భార్యలున్న కృష్ణుడే నిజమైన వేదాంతి. కాస్త మెట్టగా అనిపించినా ఇదే నిజం. లేదంటే భగవద్గీత చెప్పేవాడా. ఇంత మంది భార్యల వల్లే ఆయన పరిపూర్ణవ్యక్తిత్వంగా మారాడేమో అనిపిస్తుంది.

పతంజలి యోగసూత్రాలకు భాష్యం చెప్పేవారు ఎవరైనా మొదటి లైను గురించి చెప్పేటప్పుడు… మహనీయుల ప్రతి పదంలో వ్యర్థం అనేది ఉండదని చెబుతుంటారు. అలాగే వేటూరి పాటల్లోనూ వ్యర్థపదాలు కనిపించవు. ప్రతి పదం వెనుకా ఎంతో అంతరార్థం ఉంటుంది.

ఈ పాటలో ఇంకో విశేషమేమిటంటే… 1984లో ఈ పాట ఉత్తమ గీతరచయితగా వేటూరికి నంది అవార్డు సంపాదించిపెట్టింది. ఇక సినిమా విషయానికొస్తే…. యుద్ధనపూడి సులోచనారాణి నవల ఆధారంగా… ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు కాంచనగంగ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది.
దర్శకత్వం వి. మధుసూదనరావు
తారాగణం చంద్రమోహన్, శరత్ బాబు, సరిత,
సంగీతం చక్రవర్తి
సినిమాటోగ్రఫి ఎస్. గోపాలరెడ్డి
ఈ “బృందావని ఉంది” పాటను పాడింది ఎస్పీబాలు కాగా, నటించింది శరత్ బాబు.

ఈ పాట వినండి

You May Also Like

One thought on “బృందావనిలో చిన్నికృష్ణుడు-వేటూరి(శ్రీగార్గేయ)

  1. పుట్టగానే పెరిగేటి మాయబంధనాలకన్నా…
    పుడుతూనే తొలిగేటి చెరసాలలే మిన్న…

    ఈ చిన్ని పదాల్లోనే కొన్ని వేల ప్రశ్నల తాలూకు సమాధానాన్ని మన ముందుంచారు వేటూరి. మనిషి పుట్టగానే ఎన్నో బంధాల మధ్య మాయలో చిక్కుకుంటాడు. అదే సుఖమనుకుని అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ జగన్నాటక సూత్రధారి ఈ మాయలో ఎందుకు చిక్కుకుంటాడు చెప్పండి. అందుకే వేటూరి అంటారు… ఈ కిటుకు తెలిసే ఆయన చెరసాలలో పుట్టారని. చైతన్యమూర్తి అనే పదాన్ని వాడారు. నిజమే కృష్ణుడు చైతన్యానికి చిహ్నం. సకల చరాచర సృష్టిని చైతన్యం చేసే ఎన్నో అంశాలు ఆయనలో ఉన్నాయి. అన్నీ ఆయనే. అంతా ఆయనే. ఒక్క చిన్నపదం రాయడానికి ఎంతగానో ఆలోచించే వేటూరి… ఈ ఒక్కపదంలోనే ప్రశ్నను, సమాధానాన్ని చెప్పేశారు. స్వేచ్ఛను తొలగించేది చెరసాల. స్వేచ్ఛకు ప్రతిరూపం చైతన్యం. ఈ రెండింటికి మధ్య మంచి వంతెన వేశారు వేటూరి.

    పతంజలి యోగసూత్రాలకు భాష్యం చెప్పేవారు ఎవరైనా మొదటి లైను గురించి చెప్పేటప్పుడు… మహనీయుల ప్రతి పదంలో వ్యర్థం అనేది ఉండదని చెబుతుంటారు. అలాగే వేటూరి పాటల్లోనూ వ్యర్థపదాలు కనిపించవు. ప్రతి పదం వెనుకా ఎంతో అంతరార్థం ఉంటుంది.

    అద్భుతంగా రాసారు కిరణ్ గారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.