తెలుగుపాటను కొత్త పుంతలు తొక్కించిన కలం ఆయనది. తెలుగు మాటను మురిపించి, మైమరిపించిన పద ఝరి వేటూరి. ఆయన లేని లోటు తెలుగు మాటకు, పాటకు, భాషకే తీరనిది. ఆయన కలం బలం అంతటిది. ఆయన భావజాలం అంత గొప్పది. ఆ కలానికి అడ్డులేదు. భాషాపరమైన అవరోధాలూ లేవు. అందుకే ఎలదేటి పాటలా సాఫీగా మూడున్నర దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా సాగిందా సిరా. ఆయన పాటలో తత్వం పలుకుకుంది. అరమరికల్లేని ఆనందం పరవశిస్తుంది. శృంగారం పరవళ్లు తొక్కుతుంది. విరహమూ వీరంగం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వేటూరి కలం పడితే కలకలమే. భావ ప్రవాహమే. ఎలాంటి భావ లోతులకైనా ఆయన కలం వెళ్లగలుగుతుంది. ‘సిరిమల్లె పువ్వా’ అంటూ పలుకరించిన ఆ తెలుగుదనం ‘కోకిలమ్మ పెళ్లికీ కోనంతా పందిరీ’ అంటూ అడవికీ కోకిలమ్మకు మధ్య ఉన్న ప్రకృతి సంబంధిత అనుబంధాన్నీ హృద్యంగా ఆవిష్కరించింది. అదేపాటలో చిగురాకులనే తోరణాలుగా చేసి చిరుగాలుల్నే సన్నాయిగా మార్చిందా కలం. అందుకు భాషాపరమైన పట్టుమాత్రమే ఉంటే సరిపోదు. భావస్ఫోరక ప్రయోగమూ అవసరమే. అలాంటి ప్రయోగాలెన్నింటినో వేటూరి చేశారు. ‘వేట నాది వేటు నాది వేటాడే చోటునాది’ అంటూ భక్తకన్నప్ప చిత్రంలో ఆయన చేసిన పద శబ్ద ప్రయోగం మనస్సును పులకింపజేసేదే. సందర్భాన్ని బట్టి భావలహరిలో ఎంతలోతుకైనా వెళ్లగలిగే ‘పాట’వం వేటూరిది. అందుకే ఆయన తెలుగుదనానికే కాదు తెలుగు పాటకూ చిరునామా అయ్యారు.
తొలి పాట రాసిన ఓ సీత కథ నుంచి ఆయన ప్రతి పాటకూ తెలుగు ప్రేక్షకులు పట్టంగట్టారు. ఆయన విరుపులకు, విసుర్లకు ఉప్పొంగిపోయారు. పదాలను పరుగులు తీయించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న వేటూరి ఆ తరహాలో ఎన్నో వేల గీతాలను హృదయాలు పరుగులెత్తించేలా రాశారు. చిన్న మాటల్లో నిగూఢ అర్థాన్ని చెప్పగలిగిన ఆత్రేయ స్థాయిలో వేటూరి విరచిత గీతాలెన్నో ఉన్నాయి. ‘చిన్నమాట ఒక చిన్న మాట’ అంటూ ఆయన అలతి పదాలతో రాసిన పాట సైతం విశేష ప్రాచుర్యాన్ని చూరగొంది. వేటూరి అంత తేలిక పదాలతో అంత సునాయాసంగా, సునిశిత భావంతో పాటలు రాయగలిగారంటే దాని వెనుక తెలుగు భాషను ఔపోసన పట్టిన అనుభవం ఉంది. తెలుగు పదం ఎంతగొప్పదో అధ్యయనం చేసిన కృషి ఉంది. అన్నింటికీ మించి సమాజాన్ని లోతుగా చూసిన, మనస్తత్వాన్ని కోణాల్లోనూ స్పృశించిన అవగాహనా శక్తి ఉంది. అందుకే వేటూరి పాటలో సజీవత్వం కనిపిస్తుంది. ఆయన పాటలోని సందర్భోచితమైన భావ పరంపర పదపదంలోనూ ద్యోతకమవుతుంది. మూడున్నర దశాబ్దాల పాటు సాగిన వేటూరి గేయరచన ఎక్కని పుంతల్లేవు. ఆయన అందుకోని భావ శిఖరాల్లేవు. ఆయన కలం శృంగారాన్నీ పండించింది. వయ్యారాన్నీ ఒలకబోసింది. అద్వైతాన్ని ప్రబోధించింది. తెలుగుదనానికి నిండైన చిరునామా ఆయన పాట. మాటలకందని భావాలనెన్నింటినో తన పాటల్లో పరంపరగా పొదివారు. తెలుగుపదానికి ఎన్ని అర్థాలున్నాయో.. అన్నింటిలోనూ అందెవేసింది కలం ఆయనది.
తెలుగు పాటకు తొలి నాళ్లలో తాత్విక కోణాన్ని అందించిన ఘనత సముద్రాల వారిదైతే, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి సరళపదాలతో ఘనమైన అర్థాలనందించిన పాటవం వేటూరిది. దేనిపైనైనా పాట రాయగలిగే పదాల పందిరి ఆయన మనసు. దానికి సందర్భానుసారం స్పందించడం తెలుసు. ఆ స్పందనలో తెలుగు తీయదనాన్ని ఎలా అందించాలో తెలుసు. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ అంటూ భావలోతులకెళ్లిన ఆయన ‘వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికీ’ అంటూ ప్రేక్షకుల గుండెలను ఆర్ద్రతతో పిండేశారు వేటూరి. పదాలందరికీ తెలుస్తాయి. భావ గర్భితంగా, భావస్ఫోరకంగా వాటిని సందర్భాన్ని బట్టి అందించడంలోనే గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనం వేటూరి సొంతం. అందుకే వేటూరి పాట తెలుగుదనానికి ప్రతీక. తవ్వేకొద్దీ వేటూరి పాటలో కొత్త భావాలు పుట్టుకొస్తాయి. కొత్త అర్థాలు సాక్షాత్కరిస్తాయి. అందుకే ఆయనది తెలుగు పద ‘పాట’వం. తెలుగు పాటకు సాహితీ గౌరవాన్ని తెచ్చిన తేజం. తెలుగు మాటకూ ఉత్తేజం.
———————–
ఆంధ్రభూమి సౌజన్యంతో (అసలు వ్యాసం ఈ కింద లింక్ లో చూడవచ్చు)