2010 మే 22 న రాత్రి ఎనిమిది గంటల సమయంలో తెలుగు సినీ గీతాల ఆచంద్రతారార్క కీర్తి, శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి వాగ్దేవి పంపిన అంబారీ మీద, ద్వివిజ కవివరుల గుండెలు దిగ్గురనగా అరిగినాడు అమరపురికి. ఆయనలేని లోటు తెలుగు సినీ గీత సాహిత్యానికి ఎవరూ పూడ్చలేనిది. ఆయన కలం సినీ సాహిత్యంలో సవ్యసాచిలా కదం తొక్కింది. తెలుగువన్ డాట్ కాం ఆయన ఆత్మశాంతిని కోరుతూ, చంద్రునికో నూలుపోగులా సమర్పిస్తున్న చిన్న వ్యాసం. ఆయన గురించిన వివరాలలోకి వెళితే ….
కృష్ణాజిల్లా, పెదకళ్ళేపల్లి గ్రామంలో ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో 1936 జనవరి 29 వ తేదీన జన్మించిన వేటూరి సుందరరామ మూర్తి తెలుగు సినీ పాటలతో తెలుగు సినీ సాహిత్యంలో, తోటమాలిగా అందమైన, అద్భుతమైన పాటల సేద్యం చేస్తాడని ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వద్ద సాహిత్య శిష్యరికం చేసిన వేటూరికి కవితా ప్రక్రియలో అసాధ్యమనేదే లేదు. ముందు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలలో విలేఖరిగా పనిచేసిన వేటూరికి కళాతపస్వి, డాక్టర్ కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ”ఓ సీత కథ” చిత్రం ద్వారా సినీ గేయ రచయితగా సినీ పరిశ్రమకు పరిచయం అయినా, విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ యన్.టి.రామారావు ప్రోత్సాహంతో సినీ సాహిత్య వినీలాకాశంలో వేటూరి తిరుగులేని రచయితగా అవతరించారు. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ”సీతాకోక చిలుక” చిత్రంలో ”మిన్నటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా” పాటలో ”నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” అనే పదం విన్న వారికి వేటూరి కవితా ప్రతిభ తేలిగ్గానే అర్ధమవుతుంది.
ఇక ప్రాస విషయానికొస్తే ‘సాగర సంగమం” చిత్రంలో ”తకిట తథిమి తకిట తథిమి తందాన” పాటలో ”నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన – తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా, తెలిసీ తెలియని ఆశల వయసీ వరుసా” అన్నా, ”అన్నమయ్య మాట – అచ్చతేనే తెలుగు పాట” అనే పదాలువిన్నా ”శంకరాభరణం” చిత్రంలోని ”శంకరా నాద శరీరా పరా – వేదవిహారా హరా జీవేశ్వారా” పాటలో ”మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలూ.. ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలూ” వంటి పదాలు విన్నాఆయనకి తెలుగు భాష మీద ఉన్న అధికారం మనకు తెలుస్తుంది. అంతే కాదు అసలు శంకరాభరణం చిత్రంలో వేటూరి వ్రాసిన ప్రతిపాటా అజరామరం అని చెప్పాలి. మణిరత్నం దర్శకత్వంలో, నాగార్జున హీరోగా నటించిన ”గీతాంజలి’ ‘చిత్రంలో ”ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈవేళ – రాలేటి పూలా రాగాలతో – పూసేటి పూలా గంధాలతో” వంటి అద్భుతమైన పదప్రయోగాలు ఒక్క వేటూరి కలానికే సొంతమంటే అతిశయోక్తి కాదేమో. ”వేటగాడు ” చిత్రంలో ”పుట్టింటోళ్ళు తరిమేశారు – కట్టుకున్నోడు వదిలేశాడు” వంటి పాటకీ, ”శంకరాభరణం” చిత్రంలో ”ఓంకార నాదాను సంధానమౌ గానమే.. శంకరాభరణమే” వంటి పాటకీ ఏమన్నా సంబంధం ఉందా? ఈ రెండు పాటల భావాల్లో, భాషలో, సాహిత్యంలో ఎంత తేడా ఉందీ. ఈ రెండు పాటలు వ్రాసింది ఒక కవేనంటే ఎవరైనా నమ్మగలరా…? అదే వేటూరి కవితావైచిత్రి.
అంతెందుకు ఓకే చిత్రంలో అంటే ”అడవిరాముడు” చిత్రంలో ఆయన వ్రాసిన రెండు వైరుధ్య భరితమైన పాటలను మీరిప్పుడు గమనించండి. ”మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ – పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ” అనే పాట ఎంత స్ఫూర్తిదాయకంగా ఉత్తేజకరంగా, ఉద్భోధపూరితంగా ఉంటుంది. అదే చిత్రంలో ”ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరీ హరీ – కోకెత్తుకెళ్ళింది కొండగాలీ, నాకు ఉడుకెత్తిపోతోంది హరీ హరీ” అనే పాటలో ఎంత కొంటెతనంతో నిండి ఉంటుందో మనందరికీ తెలిసిందే. అదీ ఆయన కలానికున్న బలం. వేటూరి కాలానికి ఆధునిక యువతకు ఏం కావాలో బాగా తెలుసు… అందుకే ‘జగదేకవీరుడు – అతిలోక సుందరి’ చిత్రంలో ”అబ్బనీ తీయనీ దెబ్బ’ వంటి అనేక పాటలు ఆయన కలం నుండి అలవోకగా జాలువారాయి. అలాగే సమయం వచ్చినప్పుడు తనలోని సత్సాహిత్య కవితా దాహార్తిని ఏ విధంగా తీర్చుకోవాలో అదీ ఆయనకు తెలుసు. ఉదాహరణకు ‘ప్రతిఘటన’ చిత్రంలో వేటూరి వ్రాసిన ”ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో” అనే పాటలో ”మర్మ స్థానం కాదది నీ జన్మస్థానం … మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం” నిజానికి ఈ పాటలోని ఈ ఒక్క పదానికే జాతీయ అవార్దునివ్వాలి. స్త్రీ ఔన్నత్యం గురించి ఇంతకంటే గొప్పగా ఎవరు వ్రాస్తారండీ…? ఒక్క వేటూరి తప్ప. దౌర్భాగ్యమేమిటంటే ఇలాంటి అద్భుతమైన సాహిత్యమున్న పాటకు జాతీయ అవార్డు రాకపోవటం. ఈ విషయం గురించి కె.విశ్వనాథ్ వంటి పెద్దలనేకమంది కూడా బాధపడ్డారు.
”పంతులమ్మ’ చిత్రంలోని ”మానసవీణ మధు గీతం – మన సంసారం, సంగీతం సాగరమధనం – అమృతమధురం సంగమ సరిగమ స్వర పారిజాతం” పాటలో సంసారం గురించి ఇంతందంగా చెప్పటం ఒక్క వేటూరికే సాధ్యం. ఈ పాటలోనే ”శతవసంతాల దశాదిశాంతాల సుమసుగంధాల భ్రమరనాదాల కుసుమించు నీ అందమే, విరిసింది అరవిందమై కురిసిందిమకరందమై” అనే పదాల్లో, ఒక భర్తకి తన భార్య అందం ఇంతందంగా ఈ పదాలలోనే కనిపిస్తుందంటే అది వేటూరి భావుకత కాక ఇంకేంటి. ఆయన పాటలో అన్ని అలంకారాలు తమని తాము విధ విధాలుగా అలంకరించుకున్నాయి. యతి ప్రాసలు సాహిత్య యతు లై శోభిల్లాయి. ఆయన కాలంలో సాహిత్య సరస్వతి శతధా, సహస్రధా ఆనంద తాండవం చేసిందని చెప్పాలి…
ఇక వేటూరి తెలుగు భాషాభిమానం అంతులేనిది. తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వని కారణంగా, నాజర్, మాధవి జంటగా నటించగా, అజయ్ కుమార్ దర్శకత్వంలో, కె.యస్. రామారావు నిర్మించిన ”మాతృదేవోభవ” చిత్రంలోని ”రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే” అనే పాటకు, తనకు వచ్చిన జాతీయస్థాయి అవార్డుని కూడా వేటూరి సునిశితంగా, సున్నితంగా తిరస్కరించారు.
వేటూరికి అవార్డులు వచ్చాయనేకంటే, వేటూరి వారినే అవార్డులు వరించి గుర్తింపబడ్డాయంటే సమంజసంగా ఉంటుంది. ఎనిమిది నంది అవార్డులు, నాగార్జున విశ్వవిద్యాలయం వారిచే గౌరవ ”డాక్టరేట్”, మనస్విని అవార్డు వంటి అనేకమైన అవార్డులు ఆయన్ని వరించి తరించాయి. అటువంటి అద్భుత రచయితా, సాహితీ స్రష్ట వేటూరి మన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం.
వర్ధమాన సినీగేయ రచయితలకు చక్కని రాదారి, తేనేలొలుకు తేటతెనుగుకు పవిత్ర గోదారి …. అకటా తరలిపోయారు కదా వేటూరి …
———————-
తెలుగు వన్.కాం వారి సౌజన్యంతో
Paata ku Pranam pallavi kadhu…..Veturi