అమరజీవి చిత్రం ..గుర్తుందా? ఆ చిత్రంలో..ఓ..వింత ప్రేమ కథ. ఆసాంతం అపార్ధాలతో..నడచి..ఆఖరికి ప్రేమించిన ప్రేయసి భర్తకి.. తన కళ్ళని దానం చేసి అమరజీవిగా నిలిచిన..ఓ..ప్రియుని కథ. చిత్రం కన్నా పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామీ “అనే పాట..నాకు బాగా నచ్చుతుంది. వేటూరి గారి .. సాహిత్యం ..చాలా ఇష్టంగా వింటాను.
ఈ పాట తరచూ కోరి మిగతా శ్రోతల వినబడని తిట్లు తింటూ ఉంటాను. ఎందుకంటే ఆరు నిమిషాల పైబడి ఉన్న పాటని ఆస్వాదించడం తెలియకుంటే..పరమ చిరాకు కల్గిస్తుంది. అర్ధమైన వారికి..ఒక రసస్వాదన.శ్రీవారికి ప్రేమలేఖ కన్నా ముందు వేటూరి గారి పద రచన .. ఓ..ప్రేమ లేఖ రూపంలో..ఈ పాట ముందు సాకీగా సాగుతుంది.
ఈ పాట ఒక వేదిక పై సాగుతూ..నాయికా నాయకుల ఊహా లోకంలో సాగుతున్నట్లు గుర్తు…ఉంది. ఒక వేళ ఏమైనా మార్పు ఉంటే.. తప్పని తప్పు సమాచారంకి..మన్నించ గలరు. . ఇక్కడ పాట నేపధ్యం కన్నా పాట సాహిత్యం,సంగీతం,భావం చెప్పదలచాను. ఈ పాట సాహిత్యం కూడా.. చాలా కష్టపడ్డా సేకరించలేక.. వింటూ..వ్రాసుకున్నాను. ఇది అంతా పాట పై మమకారమే! అదీ.. వేటూరి పాట పై..ప్రత్యెక మమకారం.
ఇక కథలో ..నాయకుడేమో.. విరాగి. ప్రేమ దోమ తెలియని సదాచార సన్యాసి. నాయిక ఏమో..అతని పై..ప్రేమ ని మక్కువగా పెంచుకుని.. సిగ్గు బిడియాలు విడిచి..అతనికి..తన ప్రేమని..మొహాన్ని,కోరికని..బాహాటంగా..తెలియ జేస్తుంది. అతనేమో..కాదు పొమ్మంటాడు.తగదు..తగదు పాపం అంటాడు.
కావ్య లక్షణంతో..నాయికా నాయకుల మద్య జరిగిన ప్రేమ,శృంగార & వైరాగ్య భాషణంబులని.. పాటలో..చెప్పడం తెలుగు చిత్రాలలో..కొత్త కాకపోయినా.. ఈ పాట ఆసాంతం ఓ..కావ్యం చూస్తున్న భావాన్ని కల్గిస్తుంది అనడంలో ..సందేహం లేదు…అనుకుంటాను.జంధ్యాల గారి దర్శకత్వంలో..ఈ చిత్రం రూపు దిద్దుకుంది. వేటూరి గారి కి..జంధ్యాల గారికి..ఆలోచనల సమతుల్యంలో..ఈ పాట..చూడ చక్కనిది.శ్రవణానంద కరమైనది కూడా.
పాట సాహిత్యం :
శ్రీ రంగనాధ చరణారవింద చారాణ చక్రవర్తి, పుంభావ భక్తి,
ముక్తికై మూడు పుండ్రాలు నుదుట దాల్చిన ముగ్ధ మోహన సుకుమార మూర్తీ
తొండరడిప్పొడి, నీ అడుగుదమ్ముల పడి ధన్య అయినది
దీన, దీన, దేవ దేవీ, నీ దాసాను దాసి
నీ పూజలకు పువ్వుగా,
జపములకు మాలగా,
పులకించి పూమాలగా
గళమునను, కరమునను, ఉరమునను
ఇహమునకు, పరమునకు నీదాననై!
ధన్యనై, జీవన వదాన్యనై తరియించుదాన
మన్నించవే మన్నించవే! అని
విన్నవించు నీ ప్రియ సేవిక, దేవ దేవి!
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి
ఆడ ఉసురు తగలనీకు స్వామీ!
ముసురుకున్న మమతలతో
కొసరిన అపరాధమేమి? స్వామీ స్వామీ!
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ
స్వామి ఉసురు తగలనీకు దేవీ
మరులుకొన్న హరిని వీడి
మరలిన నరజన్మమేమి దేవి దేవీ! (అసుర)
హరిహర సుర జేష్టాదులు,
కౌశిక శుక వ్యాసాదులు
నిజ తత్వములను దెలిసి,
నియమ నిష్టలకి అలసి
పూనిన శృంగార యోగమిది కాదని నను కాదని
జడధారీ ! ఆ ఆ ఆ ఆ పడకు పెడ దారి
నశ్వరమది నాటక మిది
నాలుగు ఘడియల వెలుగిది
కడలిని కలిసేవరకే
కావేరికి రూపు ఉన్నదీ
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ
రంగని భక్తుల ముంగిట రంగ వల్లికని కానీ
దేవి దేవీ దేవ దేవీ!(అసుర)
అలిగే నిట శ్రీ రంగము, తొలగే నట వైకుంఠము
యాతన కేలా దేహము, ఈ దేహము సందేహము
ఈ క్షణమే సమ్మోహము, వీక్షణమే మరు దాహము
రంగా! రంగ రంగ శ్రీ రంగ!
ఎటు ఓపను ఎటులాపాను?
ఒకసారి … అనుభవించు ఒడి చేరి (అసుర)
ఈ పాటలో..జయ ప్రద యెంత బాగా రొమాంటిక్ భావాలు ఒలికించిందో.! అలాగే పాటలో.. సుశీల గారి..స్వరం ఎంత బాగా భావాలని అందించిందో.!! వినడమే తప్ప సంగీత జ్ఞానం లేని దాన్ని..వర్ణించలేను.
ఈ చిత్రం లో..మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి,(జయప్రద)ఓదార్పు కన్న చల్లనిది.. (సుమలత) పాటలు..
చాలా బాగుంటాయి.ఇక ఏ.యెన్ .ఆర్ గారి నటనా చాతుర్యం ని.. చెప్పడానికి మాటలే చాలవు.
ఇక పాట వినేయండీ!! అసుర సంధ్య వేళ
ఈ పాటలో నాకు ఇష్టమైన అంశాలు.. జయ ప్రద గారి నటన, వేటూరి గారి సాహిత్యం .సుశీల గారి గళం .. అంతా మధురం.
————————————————–
వనజ వనమాలి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్
వనజ వనమాలి గారు వ్రాసిన అసలు వ్యాసం కింద లింక్ లో చూడవచ్చు.
http://www.vanajavanamali.blogspot.in/2011/07/blog-post_23.html
వేటూరి పాట సాహిత్యాన్ని ఇక్కడ పరిచయం చేసినందుకు వనజ వనమాలిగారికి ధన్యవాదాలు. అయితే ఈ పాట ఓ కావ్యంలా ఉందని అన్నారు కానీ ఆ కథ చరిత్రను చెప్పలేదు వనజ గారు. అది విప్రనారాయణుడు అనే శ్రీరంగనాథుడి భక్తుడి కథ. అతను మహాభక్తుడై తన అందాన్ని ఆరాధించలేదని పట్టుబట్టిన దేవదేవి అనే వేశ్య అతన్ని తన అందచందాలతో లోబరుచుకుంటుంది. శ్రీ రంగనాధుడి భక్తుడు రక్తిమార్గానికి మళ్ళి ఆమెకు బానిసౌతాడు. చివర ఇద్దరూ ముక్తిపథం చేరడం జరుగుతుందనుకోండి. ఆ విప్రనారాయణుడి కథ సినిమాగా వచ్చింది. ఈ అమరజీవి సినిమాలో అంతర్నాటకంగా ఆ కథనే మళ్ళీ చూపడం జరిగింది. దేవదేవిగా జయప్రద, విప్రనారాయణుడిగా ఏఎన్నార్ అభినయించారు.
ఈ విప్రనారాయణుడే రంగనాధునిచేత తొండరడిప్పొడి ఆళ్వార్ అని పేరు పెట్టించుకుని పది పాశురాలు రాసి ఆయనలో ఐక్యమయ్యాడు. పాటలో మనకి ఈ పదం కనిపిస్తుంది చూడండి.
జడధారీ (జడలు ధరించి యోగిగా ఉన్నవాడు)పడకు పెడదారీ(తనని నిర్లక్ష్యం చేసి భౌతిక సుఖాలు వదులుకోకు అనే భావంతో) అన్న వాక్యాలు కవి చమత్కారం.
కథ కావేరీ నది ఒడ్డున జరుగుతుంది.కనుక కడలిని కలిసే వరకే కావేరికి రూపు ఉన్నదీ అనడం లో వారిద్దరూ ఏకమయ్యేవరకే వేరు వేరు రూపాలుగా ఉంటారనీ కలయికతో ఐక్యం పొందుతారనే భావం, ఆమె స్త్రీకనుక తనను కావేరీ నదితోను, అతడు పురుషుడు కనుక సముద్రంతోను పోల్చి ఆయనలో ఐక్యతని కోరడం ఎంతో గొప్ప ఊహ.
రహస్యం సినిమాలో గిరిజా కల్యాణం అంత కాకపోయినా ఆ స్థాయికి చేరే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. వనజవనమాలిగారు చెప్పినట్టు పాట నిడివి ఆరునిముషాలు అయినా రసహృదయంతో వినేవారికి ఆరుసెకెండ్లకన్నా తక్కువగా గడిచిపోయే వేటూరివారి అమృతగుళికల్లో ఒకటి ఈ పాట.