ఆమె తన బెంగని సంపెంగపూలలో దాచుకుందట
ఆమె నోము సన్నజాజి పూలతో నోచిందంట.
రాసుకుంటూ పోవాలిగాని ఇలాంటి ఎక్స్‌ప్రెషన్లు కోకొల్లలు.
నీవు వారణ నేను అసి
వలసి వచ్చిన ప్రేయసి
అనురాగం మన మతము, ఇది అసిధారావ్రతము, స్వర్గాదపీ గరీయసి, ప్రేమే కదా వారణాసి.. ఇలాంటి పాటలు ఎన్నెన్నని.
ఆయన కాయిన్ చేసిన పదాలెన్నని.
కీర్తిశేషులు వేటూరి సుందర్రామ్మూర్తి గారు ‘శంకరాభరణం’ అప్పట్నుంచి తెలుసు నాకు. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న టైంలో వారి ఆరోగ్యం బాగోలేక విజయా హాస్పిటల్‌లో చేరినప్పుడు ‘దొరకునా ఇటువంటి సేవ ‘ పాట వారు డిక్టేట్ చేస్తే నేను రాశాను. ఐతే, రష్ చూశాక చరణాలు మార్చారు.
నేను డైరెక్టరయ్యాక నా మోదటి సినిమా ‘మంచుపల్లకి’ లో ‘మేఘమా దేహమా’ అన్న పాట కూడా వారు చెప్పుకుంటూ పోతే నేను రాశాను.
లుకేమియా జబ్బుతో తొందర్లో పోబోయే అమ్మాయి మనసులోంచి వ్యక్తం చేసిన పాటది. ఒక చరణంలో ‘వేకువ ఝామున వెన్నెల మరకలుగా ‘ అన్నారు.
ఆ తర్వాత ఎందరో ఆ ఎక్స్‌ప్రెషన్ని మెచ్చుకున్నప్పుడు ఆయనకి చెబితే, చంటి కుర్రోడి కంటే దారుణంగా సంబరపడిపోయేవారు.
నాతో చాలా సరదాగా మాటాడ్తా, ‘చూడవయ్యా! ఆ త్రాష్టుడు పాట సిట్యుయేషనేంటయ్యా అంటే ఏవుంది గురుగారు! హీరో హీరోయిన్లు లవ్ చేసుకుంటారు కట్ చేస్తే ఊటీలో పాట అంటాడేంటి? అంటే ఊటీ గాలి పోగేసి ఆ లవ్ సాంగ్ రాయాలా? ఏం చేస్తాం అలాగే రాద్దాం‘ అనేవారు. అంటూనే చాలా పాటలు రాస్తూ మిత్రులన్నట్టు సినిమా పాటకి కావ్యగౌరవాన్ని తెచ్చెళ్ళిపోయారు.
వరుసగా సితార, అన్వేషణ, అన్ని సినిమాలకి పాటల రచయిత ఆయనే. ‘ప్రేమించు పెళ్ళాడు ‘ సినిమా పాటలన్ని విజయ గార్డెన్స్ మామిడి చెట్లకింద కూర్చుని ఆయన చెప్పుకుంటూ పోతుంటే గబగబా నేను రాసినవి. గొప్ప క్వాలీటీతో ఆయనంత ఫాస్ట్‌గా పాట చెప్పే రచయితని నేనింతవరకూ చూడలేదు.
పాట రాయడానికి హోటల్‌లో రూములు తీస్తారు ప్రొడ్యూసర్లు అవసరమంటావా? సిట్యుయేషన్ బావుంటే ఎక్కడైతే ఏంటీ రాదా పాటా అనేవారు.
తర్వాత నా సినిమాలకి గాకుండా వేరే వాళ్ళ కోసం చెన్నై తాజ్ కోరమాండల్ హోటల్లో నిర్మాతలు తీసినప్పుడు నేనెళ్ళిన సందర్భాలున్నాయి. ఓసారి ఒక డీజీపీగార్ని పరిచయం చేసి ‘అన్వేషణ ‘ లో పాటను వారికినిపించారు కూడా.
పాట రాసే ముందు సినిమా టైటిల్ ఆయనకి చెప్తే దాన్ని కూడా పాటలో ఇరికించడం ఆయనకో సరదా. అంతేగాకుండా ఆయనకి సంగీతం కూడా తెలుసేమో, ట్యూన్ని సొంతం చేసుకుని అద్భుతమైన పదాలు అందులో ఇమిడ్చేవారు. ఇళయరాజాగారు ఎంతటి కాంప్లికేటేడ్ ట్యూన్ ఇచ్చినా చాలెంజ్‌గా తీసుకుని, ఆయన పాటలు రాసిన సందర్భాలెన్నో! ఉదాహరణకి గురువుగారు కళాప్రపూర్ణ బాపు తీసిన ‘మంత్రిగారి వియ్యంకుడు ‘ సినిమాలో ‘ఛి పోపో పోపో కొబ్బరి చిప్పా ‘ అన్న పాట.
ట్యూన్ చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నోటికొచ్చిన పదాలేవో పాడుతూ ట్యూన్ చేస్తే, వాటిని కలుపుకుంటూ గొప్ప పాట రాస్తారు. ఉదాహరణకు ‘ప్రేమించు పెళ్ళాడు ‘ సినిమాలో ఇళయరాజా ట్యూన్ ‘గోపెమ్మ రాధమ్మ రేపేక్కడ ‘ అని రెండుసార్లు పాడితే ‘గోపెమ్మ చేతిలో గోరుముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద ‘ అని అల్లారు.
ఆయనది గొప్ప మనసు., చాలామంది కొత్తవాళ్ళని గొప్పవాళ్ళకి పరిచయం చేసేవారు. మిత్రులు కీరవాణిని ఇళయరాజాకి పరిచయం చేసిందీయనే. ఇలా ఎంతమందినో.. ఇంకెంతమందినో.
ఇక అసలు విషయానికొస్తే, ఆయన్లో ఉన్న గొప్ప సినిమా కవిని ప్రేమించి ప్రాణమిచ్చిన మనిషి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగారు. నేను వేటూరి గురించి బాగా తెల్సుకుంది బాలూగారి దగ్గరే. అసలు నాకు వేటూరి మీద భక్తి భావాలు పెరిగింది బాలూగారి వల్లే .
నాకు వేటూరి పాటలు రాసిన చివరి సినిమా ‘అనుమానాస్పదం ‘ సరిగ్గా అదే టైంలో ఒకప్పుడు పసలపూడి మనిషి ఇప్పుడు అమలాపురం వాసి అయిన డాక్టర్ పైడిపాల దగ్గరికి తవేరా వేసుకెళ్ళిన వేటూరి, తన ఆత్మకథ రాయమని అడిగి కొంత చిన్న మొత్తం పారితోషికం ఇవ్వడం జరిగింది.
ఎందుకోగాని పైడిపాల గారు ఆ వేటూరి ఆత్మకథ రాయడం జరగలేదు.
ఇప్పుడు నాకనిపిస్తుంది, ఆయన బతికుండగా అదే పూర్తయి పుస్తకమైతే ఎంత బావుండేదని ఇప్పుడనిపిస్తుంది. ఊపిరి పీలిస్తే జననం, ఊపిరి వదిలితే మరణం, మధ్యలోనే మరణమంటామయ్యా అనెళ్ళిపోయిన ఆయన పుస్తకం ఇప్పటికైనా పూర్తయితే పైనున్న ఆయన ఆత్మ శాంతిస్తుంది. కాంతిస్తుందీ అని.
ఒక చిన్నవాడిగా గురువుగారు వేటూరి సుందర్రామ్మూర్తిగారికి నివాళులర్పిస్తూ మరి నమస్కారం.
పప్పు శ్రీనివాస్ గారు ఈ వెబ్ సై టు మొదలుపెట్టిన దగ్గర్నుంచీ అనుకుంటూ(రాయాలని)బద్దకిస్తూ వచ్చిన కొన్నిటిలో ఒకటి ఇప్పుడు వంశీ ని చదివాక చెప్పకతప్పటం లేదు.ఊరూ పేరూ వివరాలివ్వను గానీ,వేటూరి సజీవులుగా ఉన్నప్పుడు ఒక సాహిత్య ఔత్శాహికుడొక పుస్తకం రాసి (వేటూరి జీవితం,పాటలు వగైరా ప్రక్రియలు) ఆయనకు చూపించటం,ఆ సారికి వేతూరి (ఎంచేతో)నిర్మొహమాటం గానే అయినా ఆయన తరహాలో కాస్త సున్నితంగానే ప్రచురించే యోచన ఉంటే మానికొమ్మంటం,అది జరిగిన కొన్నాళ్ళకే ఆయన మనల్ని వీడిపోవటం జరిగాయి.అయితే ఈ లోపు అంటే ఆయన పెద్ద కర్మ జరిగేలోపే మన సాహిత్య ఔత్శాహికుడు వాయు,మనో,కాంతివేగాల కన్నా వేగంగా వేటూరి వద్దన్న పుస్తకాన్నే ముద్రించటం,మార్కెట్లోకి విడుదల చెయ్యటం జరిగిపోయాయి.అయితే కొందరన్నారు ఇలాంటి పుస్తకం ఆయన(వేటూరి)మీద రాకుంటేనే బావుండేది అని.నిజమే కొన్ని పుస్తకాలు కొందరి మీద కొందరు రాయకపోతేనే మంచిది.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
chaala chakkani article. thanx for sharing..
ఊపిరి పీలిస్తే జనం, plz edit this
మార్చానండీ రాజ్