వేటూరి వారితో నా స్వానుభవం (మోహన్ మురళీధర్)

వేటూరి వారి రచనా పటిమ గురించి చెప్పబోవట్లేదు. ఆయనతో నా స్వానుభవాలను, ఆనందకర క్షణాలను పంచుకుంటాను.

వేటూరి వారు గుంటూరులో, కొల్లూరు జెడ్.పి హై స్కూలు లో చదివారని విన్నాను. మా నాన్నగారి కన్నా కొన్నేళ్ళు చిన్నవారుట. మా నాన్నగారు జెడ్.పి హై స్కూలు,  దొనెపూడి లో SSC పూర్తి చేసి, వెనువెంటనే కొల్లూరు స్కూలులో పనిలో జాయిన్ అయ్యారు. దొనెపూడి, కొల్లూరికి పక్కనే ఉంది. మా నాన్నగారు అక్కడ పని చేసేటప్పుడు, వేటూరివారు అక్కడ విద్యార్థి గా ఉండి ఉంటారు. నాకు సరిగా తెలీదు గానీ ఏదో బీరకాయ పీచు సంబంధం ఉండే ఉంటుంది.

వేటూరి లాంటి మహానుభావుడు “మీ తెలుగు చాలా బావుంది” అని పొగిడితే ఎలా అనిపిస్తుంది? గాల్లో తేలుతున్నట్టు అనిపించదూ! నాకు అలాగే అనిపించింది. 2007 చివరిలో వేటూరి గారితో జరిగిన ఒక ముచ్చట మీతో పంచుకుంటాను.

దానికి ముందు, వేటూరి కలం నుండి జాలువారిన ఈ ఆణిముత్యాన్ని చూడండి.

కుమార సంభవం లోని శ్లోకం:

వాగర్థా వివసంతృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే, పార్వతీ పరమేశ్వరౌ

వేటూరి విరుపు:

వందే పార్వతీప,  రమేశ్వరౌ

ఈ విరుపుకు జగమెరిగిన అర్ధం:

పార్వతీప = పార్వతి దేవి భర్త, శివుడు!

రమేశ్వరుడు = రమాదేవి (లక్ష్మి) భర్త, విష్ణుమూర్తి!

వేటూరి విరుపులో నేననుకున్న కొంటె అర్ధం:

వందే పార్వతీప, రమేశ్వరౌ = ఓ పార్వతి పై రమించువాడా, నీకు వందనం.

నేను మొట్టమొదట 2005 డిశంబరు 24 న, హైదరాబాదు ఎయిర్‌పోర్ట్ లో అనుకోకుండా వేటూరిగారిని కలిసాను. ఆయన అప్పుడు చెన్నై వెళుతున్నారు. నేను నా కుటుంబంతో విశాఖ వెళుతున్నాను. ఆయన అభిమానిగా నన్ను నేను పరిచయం చేసుకుని నా విజిటింగ్ కార్డ్ ఇచ్చాను. ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. నాకు గొప్ప ఆనందంగా అనిపించింది. కొద్ది సమయమైనా సరే చాలా సంతోషం గా అనిపించింది. నా బిజినెస్ కార్డ్ మీద ఆయన సంతకం(ఆటోగ్రాఫ్) తీసుకున్నాను. వారి ఫ్లైట్ టైము అయిపోతుండడంతో నాకు ఫోన్ నంబర్ ఇచ్చి “ఫోన్ చెయ్యండి, అప్పుడు సావకాశంగా మాట్లాడుకుందాం” అని చెప్పారు.

2007 వేసవిలో, నా “తెలుగువన్” రేడియో కార్యక్రమం కోసం ఆయన ఇంటర్వ్యూ తీసుకుందామని వెంటబడడం మొదలెట్టాను. ఆయన సాధారణంగా ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వరని విన్నాను. కానీ నాకు ఇంటర్వ్యూ ఇస్తానని ఆయన ఒప్పుకున్నాక గొప్ప సంబరపడిపోయాను. దాదాపు నాలుగు గంటలు ఏకబిగిన కూర్చుని ఆయనకోసం బోలెడు ప్రశ్నలు తయారుచేసుకున్నాను. కానీ ఆయన టైము ఇచ్చిన ప్రతీసారి ఏవో ఒక అవాంతరాలేర్పడి ఇంటర్వ్యూ రద్దయిపోయేది. రెండు నెలలు ప్రయత్నించిన మీదట, ఇంక లాభం లేదని వేటూరివారికి ఒక ఉత్తరం రాసి (ఇక్కడ నొక్కండి) అది అప్పటి మా రేడియో డైరెక్టరు గారి చేత ఇప్పించాను.

మా తెలుగువన్ రిప్రజెంటేటివ్, సాగరసంగమం సినిమాలో శ్లోకానికి (వాగర్థా వివసంతృప్తౌ) నేనిచ్చిన వివరణ సరి అయినదా కాదా అని నా తరపున శ్రీ వేటూరిగారిని అడిగారు. అప్పటికి వేటూరిగారు నా ఉత్తరం చదివి ఉన్నారు. అయినప్పటికీ ఈ ప్రశ్న అడిగాక ఆయనకి నా గురించి కుతూహలం పెరిగినదిట. నా వివరణ సరి అయినదే అని అంగీకరించి, అటు పిమ్మట నా ఉత్తరాన్ని మరికొన్ని సార్లు చదివారుట.

ఆ ఉత్తరం చదివిన తరువాత “విక్రమార్కుడు, బాగుంది! బాగా వ్రాశారు!!” అని మళ్ళీ మళ్ళీ చెప్పారుట. నేను ఆ ఉత్తరం రాసిన విధానం చూసి ఆయన చాలా మెచ్చుకున్నారట. అయితే, మా రిప్రజెంటేటివ్, నా దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేయడానికి ఈ కథనంతా అల్లి ఉండవచ్చు. కానీ  ఇది విన్నాక నేను గాల్లో తేలకుండా ఉండలేకపోయాను.

తరువాత కూడా ఆయన ఇంటర్వ్యూ కోసం చాలాసార్లు ప్రయత్నించాను. కానీ నాకు ఆయన టైము ఇవ్వలేకపోవడమో లేదా టైము ఇచ్చినా అవాంతరాలు వచ్చి అది కుదరకపోవడమో జరిగింది. చివరిసారిగా నేను ఆయనతో మాట్లాడినది మార్చి 2008 లో. ఆరోజు ఆయన చాలా మర్యాదగా “మురళీ గారు, ఇవాళ అనుకోకుండా రెహ్మాన్ పాట రికార్డింగ్ పెట్టుకున్నాము. మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేను. సారీ అండి” అని చెప్పారు. నేను పట్టువిడవకుండా చాలాసార్లు ఆయన ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించాను. తుదకు వదిలేసాను. సాధారణంగా అలా వదిలేయను. నాకు నేనే విక్రమార్కుడిని. పట్టిన పట్టు అంత తేలికగా వదలను. కానీ ఈ విషయంలో నేను ఓడిపోయాను.

ఈరోజు వేటూరివారు నా ఆలోచనలనిండా ఉన్నారు. ఎంతోమంది తెలుగువారిలాగానే నేనూ కూడా వేటూరివారి రచనలనుండీ స్వాంతన మరియు ఉపశమనము పొందాను. ఉత్తేజము, స్ఫూర్తి పొందాను. గొప్ప ఉల్లాసాన్ని పొందాను. ఈవేళ నేను చేయగలిగినది ఇలా ఆయన్ను తలుచుకుని ఘన నివాళులు అర్పించడమే.

ఎంత ప్రయత్నించినా ఆయనతో ఒక్కసారైనా సుదీర్ఘమైన సంభాషణ కొనసాగించలేకపోయాననే విచారం నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

 

మోహన్ మురళీధర్ గారి ఆంగ్ల వ్యాసం ఈ కింద లింక్ లో చూడవచ్చు.

http://www.teluglobe.com/inthenews/telugu-nadu/veturi-in-my-thoughts

(తెలుగు అనువాదం – ఆలమూరు సౌమ్య)

మోహన్ మురళీధర్ గారికి కృతజ్ఞతలతో….

You May Also Like

3 thoughts on “వేటూరి వారితో నా స్వానుభవం (మోహన్ మురళీధర్)

  1. వాగర్థా వివసంతృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే/జగతః పితరౌ వందే, పార్వతీ పరమేశ్వరౌ
    కొన్నేళ్ళ క్రితం ‘పత్రిక’ అనే మాసపత్రికలో ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో వేటూరి సుదీర్ఘంగా వివరించారు.నా దగ్గర ఆ సంచిక ఉండాలి.దొరికితే పప్పు వారికి పంపగలను.

  2. పప్పు శ్రీనివాసరావు గారికీ, ఆలమూరు సౌమ్యకీ అభినందనలు.

    రఫీ గారూ, లింక్ పంచుకున్నందుకు ధన్యవాదాలు. రాజేంద్రప్రసాద్ గారూ, ఎదురుచూస్తూంటాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.