నేనెరిగిన వేటూరి (గొల్లపూడి మారుతీరావు)

1988 లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం సి.నారాయణరెడ్డిగారికిచ్చారు. ఆ నాటి సభలో నేను ప్రధాన వక్తని. ఎందరో పముఖులు హాజరయిన సభ. మిత్రులు సినారె గురించి మాట్లాడుతూ ఒక పాట రచనని సమగ్రంగా విశ్లేషించాను. ఆ పాట: “చేరేదెటకో తెలిసి, చేరువకాలేమని తెలిసి, చెరిసగమౌతున్నామెందుకో తెలిసి, తెలిసి” ‘ప్రేమబంధం’ పతాక సన్నివేశంలో ఆఖరి పాట. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. కూర్చున్నాను. నా పక్కన ఎస్.పి.బాలసుబ్రమణ్యం. ఆయన పక్కన సినారె. నాకో చిన్న కాగితాన్నందించారు బాలూ. అది సినారె రాసింది. ‘ ఆ పాటని నేను రాయలేదు!’ అని. తర్వాత విందులో మాట్లాడుతూ సినారె అన్నారు “నేను అన్ని పాటలు రాశాను అదొక్కటే గుర్తొచ్చిందేమిటయ్యా నీకు?” అని. నాలిక కొరుక్కున్నాను.ఇంతకీ ఆ పాట ఎవరు రాశారు? – వేటూరి.

మరో పదహారు సంవత్సరాల తర్వాత విశాఖలో కొప్పరపు కవుల కళాపీఠం వేటూరి దంపతులను సత్కరించింది. మళ్ళీ నేను ప్రధాన వక్తని. మాట్లాడుతూ పదహారు సంవత్సరాల కిందట వేసిన కప్పదాటుని గుర్తుచేసి – ఈసారి సాధికారికంగా ఆ పాట గురించి మాట్లాడాను. హీరో మీద హత్యా నేరం పడింది. జైలుకి వెళుతున్నాడు. ఎలాగ? ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని. అక్కడ కథ ముగుస్తుంది. ఇది ‘ఉత్సవం’ జరుపుకునే సందర్భం కాదు. ఆనందంగా పాటపాడుకునే విషయమూ కాదు.కాని గుండె గొంతులో కదలగా, విధికి తలవొంచి ‘రే పుని మాత్రమే అలంకరించుకోగలిగిన గంభీరమైన స్థితి ఇది. కాగా, ఇది సినిమా ముగింపు. అప్పుడేం చెయ్యాలి? ఒక్కటే మార్గం. వేటూరిని శరణుజొచ్చాలి. ఆ పాటకి పల్లవి ఇది. ఈ ఆలోచనలోనూ, మాటల్లోనూ విశ్వనాధకి వాటా ఉంది. ఈ సన్నివేశానికీ, పాటకీ గుండె ధైర్యం కావాలి. ఆ గుండెల సమూహంలో నాదీ ఉంది.

 

వేటూరి తన కుటుంబ వారసత్వమయిన సాహితీ సంప్రదాయాన్నీ, విద్వత్తునీ మూటగట్టుకుని, పెండ్యాల అద్భుతంగా సంగీత దర్శకత్వం వహించి, విజయవాడ ఆకాశవాణిలో ప్రసారితమైన అంతే అద్భుతమైన సంగీత రూపకం రికార్డింగుని పట్టుకుని అలనాడు మద్రాసులో రైలు దిగాడు. నాకు ఇంటికి తెచ్చి వినిపించాడు. ఆయన్ని విశ్వనాధ్ గారిని కలవమని ప్రోత్సహించి పంపింది నేను. ఆయనిపుడు లేడు కనుక – ఇలాంటి ఘనతల్ని నెత్తిన వేసుకుంటే చెల్లిపోయే అవకాశం ఉంది – కాదని చెప్పేవారు కాని, ఖండించేవారు కాని ఎవరూ లేరు కనుక. కానీ నా షష్టి పూర్తి సంచికకి ఆయన రాసిన వ్యాసంలో మొదటి పేరాని మాత్రం వ్రాస్తాను:

“ఆదిశంకరులను ఒకసారి పద్మపాదుడు అడిగాడట ‘కో గురుః ? ‘ అని. ‘అధిగత తత్వః’అని ఆ జగద్గురువు సమాధానం చెప్పాడట. గొల్లపూడివారు నాకు ఆ విధంగా గురువు. ఇక మిత్ర శబ్దం సూర్యుడికి చెందుతుంది. జగఛ్ఛక్షువు అయినవాడు లోకానికే కన్ను – నా చూపును పెడదారి పట్టకుండా కాపాడిన మిత్రుడూ ఆయనే.”

ఇది నూటికి నూరుపాళ్ళూ నా గొప్పతనం కంటే ఆయన సంస్కారాన్ని సూచిస్తుంది.

అమెరికాలో మొదటిసారి కాలుపెట్టినప్పుడు ఆస్కార్ వైల్డ్ ని ఇమ్మిగ్రేషన్ అధికారి అడిగాడట – ‘నీతో ఏమైనా తీసుకొచ్చావా? డిక్లేర్ చెయ్యీ – అని. అప్పుడు ఆస్కార్ వైల్డ్ సమాధానం ఒక చరిత్ర ‘ఐ హావ్ నథింగ్ టు డిక్లేర్ ఎక్సెప్ట్ మై జీనియస్!” అన్నాడట. అలాంటి సరంజామాని పట్టుకునే వేటూరి సెంట్రల్లో రైలు దిగాడు. ఆ పెట్టుబడికి సరితూగే ‘బడిలోకి రావడం రావడం వచ్చి పడ్డాడు. విశ్వనాధ్ అప్పుడు ‘సిరి సిరిమువ్వ’ వండుతున్నారు. మరో పక్క ‘ఓ సీత కథ‘ రూపు దిద్దుకుంటోంది. రోజూ విశ్వనాధ్ ఇంటి బయటి ఆవరణలో మా చర్చలు. వేటూరి వచ్చి కూర్చునేవారు – పాటల కవిలికట్టలతో. న్యాయంగా ‘సిరి సిరిమువ్వ’ తో ఆయన రంగప్రవేశం చెయ్యాలి. ముందొచ్చిన ‘ఓ సీత కథ’లో పాట తొలిపాట అయింది.

కొత్త నుడికారం, కొత్త పలుకుబడి, కొత్త ఆలోచనా ధోరణి, వైవిధ్యం వేటూరి సొత్తు. పసితనంలో పసివాడి చిందులు అతని నూరేళ్ళ జీవితానికి అద్దం పడతాయి. ‘సిరిసిరిమువ్వ’లో పాటలు చిక్కటి మీగడ తెట్టుకటిన పాలకుండ. ఎంత గ్ప్ప రచన అది! ప్రతీ రోజూ ‘ఆహా!’ అనిపించేవారు. ఈయన తెలుగు సినీరంగంలో రాణిస్తాడని విశ్వనాధ్ గారిని గోకడం గుర్తుంది.That proved to be the biggest understatement in my career!

నేను మద్రాసు రేడియోలో పనిచేసే రోజులో నా చిరకాల కోరికల్ని తీర్చుకునే వకాశం కలిగింది. వాటిలో కొన్ని – ఎన్.టి.రామారావుగారిచేత ప్రోగ్రాం చేయించాను. అట్లూరి పుండరీకాక్షయ్య, దేవిక, అల్లు, ఛాయాదేవి, సావిత్రి వంటి వార్లని రేడియోనాటికలలో నటింపజేశాను. సరే. శ్రీ శ్రీ చేత రచనలు చేయించడం. నరసరాజు, ఆత్రేయ చేత రచనలు చేయించడం. వచన కవితా నాటకాన్ని చేయాలన్న కోరికని ఇద్దరు తీర్చారు.1. అనిశెట్టి సుబ్బారావు (జీవితోత్సవం), 2. వేటూరి (సాగుతున్న యాత్ర). నా మనస్సుకి చాలా ఇష్టమయిన కార్యక్రమాలు ఈ రెండూ.

ఆయన చేత పాటలు రాయించడం కష్టం అన్నది ఆ రోజుల్లో తరచు వినిపించేమాట. ఆయన వెయ్యి సినిమాల పూజారి. మా వాసూ మాత్రం తను చేసిన ఆ కాస్తపాటి చిత్రాలకు ఆయనతో కూర్చుని ఫాటలు రాయించాడు. తను చేసిన ఒకే ఒక చిత్రానికి పాటని రాయించుకున్నాడు. వేటూరి మానసికంగా పసివాడు. అవసరాలు ఆయన తలవొంచుతాయి. కాని ఆలోచనలు ఆయన సాహితీ మూర్తిని ఠీవిగా, చేవతో నిలుపుతాయి.

వాసూ పోయినప్పుడు మా ఇంటికి వచ్చి లాన్ లో కూర్చుని గంట సేపు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడట. నేను లేను.మా ఆవిడ చెప్పింది. వాసూ గురించి పాట రాశాడు:

భ్రమలో పుటి శ్రమలో పెరిగి

‘మమా అనుకుంటూ మట్టిలో కలిసే

చర్వణ చర్విత చరిత్రలోపల

నీకన్న ముందు పుట్టాను నేను

నాకన్నా ముందు వెళ్ళిపోయావు నువ్వు..

… … …

నువ్వు – అంతులేని చలనచిత్రానివి

అనంతమైన సత్యానివి

ఇప్పుడు వేటూరి వెళ్ళిపోయాడు. ఆఖరి రెండు వాక్యాలూ – ఇప్పుడు ఆయనకీ వర్తిస్తాయి. ఆ వాక్యాలు మా వాసూ పరంగా ఏనాడో ఆయనరాసుకున్న ‘ఆత్మచిత్రం ‘.

మన తెలుగు దేశం దరిద్రం ఒకటుంది. మన గొప్పతనాన్ని చూసి మనకి గర్వపడడం తెలీదు. పొరుగు దేశంలో వైరముత్తు అనే సినీకవి ఉన్నాడు. మంచి కవి. కాని సాహితీ మేధస్సులో, కవితా వైశిషిష్ట్యంలో,రచనా సాంద్రతలో వేటూరికి నాలుగు మెట్లు కిందన నిలుపుతాను ఆయనని. అయినా వారి సామ్యం ప్రసక్తి కాదిక్కడ. ఆయనకి 57. వేటూరికి 75. ఆయనకి ఏనాడో ‘పద్మశ్రీ’నిచ్చారు. తెలుగు సినీపాటకి సారస్వత స్థాయిని కల్పించి – ప్రతీ తెలుగువాడి నోటా మూడున్నర శతాబ్దాలు నిలిచిన వేటూరిని ‘పద్మశ్రీ’ని చేసుకోలేని కళంకం ఈ వ్యవస్థది. అభిరుచి దారిద్ర్యం ఈ ప్రభుత్వాలది. ఈ విషయంలో మనవాళ్ళు పొరుగు తమిళనాడు, కేరళ, బెంగాలుని చూసి ఎంతయినా నేర్చుకోవలసి ఉంది. వేటూరి పుట్టిన పాతికేళ్ళ తర్వాత పుట్టిన ఎంతో మంది కళాకారులు తమిళనాడులో ఏనాడో పద్మశ్రీలయారు. గుమ్మడి, పద్మనాభం, వేటూరి వంటి వారు పోయాక మన సంస్కార లోపాన్ని చాటుకుంటున్నాం.

వేటూరి కవితా వైభవాన్ని గురించి చాలామంది చాలా రాశారు. రాస్తారు. చివరగా ఒక్కటే అంటాను.

మాటలకి వయ్యారాన్ని మప్పుతారు కృష్ణ శాస్త్రి. మాటలని మంటలను చేస్తారు శ్రీ శ్రీ. మాటలకి ప్రౌఢత్వాన్ని రంగరిస్తారు మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఈ మూడు గుణాల్నీ తగు మోతాదుల్లో కలిపి పామర జనానికి ఆస్వాదయోగ్యమయిన రసాయనాన్ని ఒక వ్యసనంలాగ జీవితాంతం పంచిన కవి వేటూరి.
ఈ వ్యాసాన్ని ప్రచురించుకునేందుకు అనుమతించిన కౌముది పత్రిక వారికీ, గొల్లపూడి గారికీ కృతజ్ఞతలతో “వేటూరి.ఇన్” సభ్యులు

గొల్లపూడి గారు వ్రాసిన ఈ వ్యాసాన్ని ఈ కింద లింక్ లో చూడవచ్చు

http://www.koumudi.net/gollapudi/053110_veturi.html

 

2 thoughts on “నేనెరిగిన వేటూరి (గొల్లపూడి మారుతీరావు)”

  1. చాలా కాలం తర్వాత మళ్ళీ చదివాను ఈ వ్యాసం.
    వేటూరి.ఇన్” సభ్యులకి ధన్యవాదాలు

  2. Pingback: “బాలోచ్చిష్టం” (విశాలి పేరి) – Veturi

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top