అక్షరం ఆయన లక్షణం (మ్యూజికాలజిస్ట్ రాజా మాటల్లో)

 

అవును… అక్షరం ఆయన లక్షణం. సరస్వతీ కటాక్షం పొందిన అక్షర బ్రహ్మ ఆయన. శ్రీ కళలు నింపుకున్న శ్రీనాథుడాయన. విశాలాక్షిలా విశ్వాన్ని వీక్షించినా కవితా విస్ఫులింగాలను విరజిమ్మగల విరూపాక్షుడాయన. అందుకే అక్షరం ఆయన లక్షణం.

‘జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగేతల’ అంటూ విన్యాసాలు చేసినా..

‘అచ్చెరువున అచ్చెఱువున’ అంటూ ముక్కున వేలేయించినా..

‘నడుం మీద జడకుప్పెల టెన్నీసు, గుచ్చుతోంది ప్రేమ పిన్నీసు ఓ సీతా నా కవితా నేనేలే నీ మాతకు జామాతా’ అంటూ చమత్కరించినా..

‘నిన్నటి రైకల మబ్బుల్లో చిక్కిన చంద్రుళ్ళు’ అంటూ శృంగారం రంగరించినా..

‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అంటూ నవ్యంగా వర్ణించినా..

‘పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లనమ్రోవికి తాకితే గేయాలు’ అంటూ గుండెను జలదరింపచేసినా..

‘మా జనని ప్రేమధమని’ అంటూ కళ్లను చెపరింపచేసినా..

‘ప్రతి భారత సతి మానం చంద్రమతీ మాంగల్యం’ అంటూ మనసు పునాదుల్ని కుదిపేసినా..

‘గుజ్జు రూపమున కుమిలిన కుబ్జను బుజ్జగించి లాలించి సొగసిడి, మజ్జగాలకు ముద్దబంతిలా’ అంటూ జకార ప్రాసలతో పరవశింపచేసినా..

‘హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు’ అంటూ స్పందింపచేసినా..

‘యునైటెడ్ స్వీట్స్ ఆఫ్ హార్ట్స్ వుయ్ హావ్ లైక్ ఇండియన్ నమస్తే’ అంటూ ఎల్లలకు వెల్లవేసి ఎల్లరికీ వెల్లడించినా..

‘త్యాగరాజకృతిలో సీతాకృతి దాల్చిన నీ సొగసు చూడతరమా’ అంటూ దివ్యంగా వర్ణించినా..

‘గోపాలా మసజసతతగా శార్దూలా ‘ అంటూ నవ్యాతినవ్యంగా ఛాందసించినా ఆ కలానికే చెల్లింది.

అందుకే అంతకుముందు పాటరాసే పద్ధతులెన్నిటికో కాలం చెల్లింది. ఆయన మాటే పాటై, జనం నోట పరిపాటై చెల్లింది. జీవం ఆయువుపట్టు తెలుసుకున్నవాడు ధన్వంతరి అయితే, శబ్దం వాయువు పట్టు తెలిసిన ధ్వని అంతర్వేది ఈయన. ఆరోహణలే తప్ప అవరోహణలు లేని వైకుంఠపాళి – ఆయన పాళి.

‘పాట’లీపుత్ర రాజ్యాన్ని తన ప్రతిభా’పాట’వాలతో ‘పాళిం’చగలుగుతున్నారు.

‘మాగాయే మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అదివేస్తే అడ్డవిస్తరి, మానిన్యాం మహాసుందరి’ లాంటి, ‘మధ్యే మధ్యే మద్యపానీయం సమర్పయామి’ లాంటి తమాషా ప్రయోగాలు అలవోకగా చేసినా అలరించాయి అందర్నీ.

వాగ్దేవి ఆయన మదిలో వసిస్తోంది. ఆయన అంగుళీయార్చనతో పరవశిస్తోంది. వేవేల భావాలకు సుందరమూర్తిని కల్పించిన నిర్విరాముడాయన.

రాతిని నాతిగా చేసింది ఆనాటి రాముడు. రీతిని గీతిగా చేసింది ఈనాటి రాముడు.

అది పాదం

ఇది నాదం

ఆనాటి అందాలరామునికి ఒకే మాట ఒకే బాణం

ఈనాటి సుందరరామునికి ఎన్నో పాటలు ఎన్నో బాణీలు

మన వేటూరి సుందరరామ్మూర్తిగారు ఋషికన్నా గొప్ప కవి. ప్రణవ స్వరూపాన్ని ఆవహింప చేసుకుంటాడు ఋషి. ఆకళింపు చేసుకుంటాడు కవి.

ఋషి పొందేది సిద్ధి.

కవి పొందేది ప్రసిద్ధి.

ఋషి ధన్యజీవి.

కవి చిరంజీవి.

అక్షరం లక్షణంగా బాషించి, భాసించిన వేటూరి ఋషికన్నా గొప్పకవి.

 

జయంతితే సుకృతినో

రస సిద్ధా కవీశ్వరాః

నాస్తితేషాం యశః కాయే

జరా మరణజం భయం

నాస్తి జరామరణజం భయం

నాస్తి జరామరణజం భయం  

——————————

మ్యూజికాలజిస్ట్ రాజా గారికి కృతజ్ఞతలతో…వేటూరి.ఇన్

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top