జంధ్యాల స్మారక అవార్డ్ ను ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి గారికి “జనవరి 15 2007 ఆదివారం” నాడు అందజేసారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు జంధ్యాల గారి జ్ఞాపకార్థంగా సాహిత్యం, సాంస్కృతిక అంశాలలో నిపుణులకు అభిరుచి అనే సాంస్కృతిక సంస్థవారు ఈ అవార్డును బహూకరిస్తారు.
వేటూరివారు ఈ అవార్డుని అందుకుంటూ గద్గద స్వరంతో “చిరంజీవి జంధ్యాలకు నా ఆశీస్సులు” అన్నారు. తమ ఆప్తమితృని తలుచుకుని గొంతు పూడుకుపోయి, మాట రాక, కాసేపు మౌనం వహించారు. జంధ్యాల గారు బహుముఖప్రజ్ఞాశాలి అని కొనియాడారు.
“జంధ్యాల నా కన్నా 14 యేళ్ళు చిన్నవాడు. ఈరోజు ఆయన మన మధ్య లేరు అనే నిజాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను. అది ఎంత బాధాకరమైన విషయమంటే ఒకానొక సమయంలో నేను అచేతనుణ్ణైపోయాను. కానీ, ప్రజలు ఆయన పట్ల చూపించిన అమితమైన అభిమానాన్ని చూసాక నాకు జీవం వచ్చినట్టయింది. ఓ కొత్త ఆశ చిగురించింది. ఆయన స్ఫూర్తితో మున్ముందు మరెందరో జంధ్యాలలు అవతరిస్తారని ఆశిస్తున్నాను.” అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.
“విశ్వనాథ మరియు జంధ్యాల లాంటి వారి వల్ల విజయవాడ నగరం ధన్యత పొందింది. అటువంటివారి సాంగత్యం గురించి ఇక్కడి ప్రజలు ఎప్పుడూ గర్వపడుతుంటారు. జంధ్యాల గారితో స్నేహమే నాకు జీవితంలో లభించిన గొప్ప అవార్డ్. ఈ అవార్డు కూడా లభించడం చాలా సంతోషంగా ఉంది”. అని చెబుతూ జంధ్యాల స్మారక అవార్డ్ ను “జంధ్యాల అవార్డ్” గా మార్చాలి అని సూచించారు. ఎందుకంటే అభిమానుల మనసుల్లో ఆయన ఎప్పుడూ చిరంజీవే అని చెప్పారు.. సుత్తివేలు గారు, ఇంకా జంధ్యాలగారు ఆప్తులెందరో ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
ది హిందూ సౌజన్యంతో (ఈ కింద లింక్ లో అసలు వార్త చూడగలరు)
http://www.hindu.com/2007/01/15/stories/2007011516690300.htm
(తెలుగు అనువాదం…సౌమ్య ఆలమూరు)