ఇది వేటూరి సుందరరామ మూర్తి గారికి జరిగిన ఒక సన్మానంలో సుప్రసిద్ధ కవి, నటులు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణిగారు సమర్పించిన సన్మాన పత్రం… అంటే సరస్వతి దేవి చెబితే ఆయన రాసారట…. వేటూరి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇలా వారికి సంబంధించిన స్మృతులను తలచుకోనడానికి ఇది సరైన సమయమని ఇక్కడ ఈ సన్మాన పత్రాన్ని యధాతధంగా మీకు అందిస్తున్నాం. ఆసాంతం చదివి ఆస్వాదించండి..
ఒరేయ్ రాముడూ!….
సుందర్రాముడూ.!!
అలా ఉలిక్కిపడతావేంట్రా!!
నేను నిన్ను ఒరేయ్ అని కాకుండా ఏమండీ అని పిలిస్తే ఆయుక్షీణం నాన్నా!
నేనురా.. శారద నీరదేందు ఘనసారని…
మరాళ మల్లికాహరని… తుషారఫేన రజతాచలకాశ
ఫణీశకుందమందారని… సిత తామర సామర వాసినీ
శుభకారని… చతుర్ముఖుని రాణిని… వాణిని.. నే సరస్వతిని…!
నువ్వుకడుపులో పడాగానే మా అన్నయ్య నన్నయ పుట్టింటికి తీసికెళ్ళాడు.
అక్కడ వ్యాసులు తాతయ్య పరగడుపునే భారతం చదివేవాడు. వాల్మీకి తాతయ్య రాత్రిళ్ళు రామాయణం వినిపించేవాడు.. ఒకటి తేనెవాక, మరొకటి వెన్నెలరేక.. పంచవాయిద్యాలు .. షడ్రుచులు.. సప్తవర్ణాలు .. అష్ట భోగాలతో… నవరసాలతోటే నవమాసాలు నిండాయి.
సరిగ్గా మీ పెద్దన్నయ్య కాళిదాసు ‘ కుమార సంభవం’ పూర్తి చేసాడు.. నువ్వు పుట్టావు. మరో అన్న.. భవభూతి శివుడికి అభిషేకం చేసి విభూతి తీసుకొచ్చి నీ నుదిటిన బెట్టి చిటికెడు నోట్లో కూడా వేసాడు. మీ మేనత్త మొల్ల చల్ల చిలికి నీ చేతిలో వెన్న పూస పెట్టేది. మీ చిన్నన్న పోతన్న మందార మకరందాన్ని నీ నాలిక్కి రాసేవాడు. నువ్వు నడకంతా శ్రీనాధుడి దగ్గర నేర్చుకున్నావు. అంచేతే నీ పాదాల్నిండా అల్లరి. .
యవ్వనం వచ్చింది.. పువ్వులకోసం దేవుళ్ళాడ్డాం మొదలైంది. దేవులపల్లితో నేస్తం కట్టావు. శ్రీ శ్రీ ని ఆవహించుకొని కలాన్ని కత్తిలా సానబట్టావు. గురజాడ నించి ముత్యాల స్వరాలు.. చిలకమర్తి నుంచి కంఠాభరణం సొంతం చేసుకున్నావు. అలాగే విశ్వనాధ నుంచి మిరియాలు, పానుగంటి నుంచి శొంఠీ వంట బట్టించుకున్నావు.
శ్రీ వేటూరి ప్రభాకర్ విష్ణువూ
శ్రీ దైతా గోపాలేశ్వరుడూ..
శ్రీ మల్లాది రామకృష్ణ బ్రహ్మ
ఈ సాహితీ త్రిమూర్తుల వద్ద శుశ్రూషా
ఆ తర్వాత నార్లవారి నేతృత్వంలో ఆంధ్రప్రభలు వెలిగించటం, శివలెంక శంభుప్రసాదం, తిరుమల రామచంద్రుల వారి తీర్థం పుచ్చుకొని బాపు, రమణలతో స్నేహ బంధం పీటముడి పడింది.
మరోదశ
రాముడు సీత కోసమే కదా ఆ విల్లెత్తింది. నువ్వూ ఓ సీత కోసం పెన్నెత్తావు. అక్కడ విశ్వామిత్రుడు దారి చూపిస్తే ఇక్కడ విశ్వనాధుడు సినీదారి పట్టించాడు. ఆ తర్వాత నువ్వు ఆడింది ఆట.. పాడింది పాట.. కిరాతార్జునీయతో రసిక జనారణ్యంలో వేటగాడివైన నువ్వు మాతృదేవోభవతో జాతీయస్థాయిలో అందుకున్నావు బంగారు పువ్వు.. నీ పాటలు వింటుంటే నాకే ముచ్చటేసింది.. కొన్ని పాటలు జోల.. మరికొన్నేమో ఈల!
నాకు మీ పెద్దమ్మ లక్ష్మికీ పడదంటారేంట్రా?!..
చిత్రసీమంతా నీకు కనకాభిషేకం చేసింది కదూ?…
కాకపోతే అభిషేకం ధార కనుక జారిపోయింది…
అష్టావధానాలు చేసావు.. అష్టకష్టాలు పడ్డావు…
ఏం తిన్నావో… ఏం తాగావో…
ఏం తిన్నావో ఎవడూ పట్టించుకోకపోయినా.. ఏం తాగావో
అందరూ పట్టించుకున్నారు నాయనా..
నీ హృదయం ఒక మధు కలశం రా.. అందుకే కదా పాటలంత అమృత తుల్యంగా వచ్చాయి…
సరే గతం గతః
ఏం పోయినా ఏమున్నా అపార పద సంపద వుంది.
కోట్లాది అభిమానులున్నారు.. చలన చిత్ర గీత సంగీత చరిత్ర
పుటల్లో నువ్వో సువర్ణాధ్యాయానివి.. ఇంకా నీకు బోల్డు కనకాభిషేకాలు జరగాలి..
నా కడుపు నిండాలి.. తెలుగు సినిమా పాట ఉన్నంత కాలం వేటూరి ఉండాలి.
ఆయుష్మాన్ భవ!
నీ తల్లి
సరస్వతి….
————————-
శ్రీ తనికెళ్ళ భరణి గారికి గ్రేటరాంధ్ర.కాం వారికీ కృతజ్ఞతలు.
అద్భుతం గా ఉంది.
అద్భుతం ! ఈ టపా తో చదువరులను ధన్యులను చేసినందుకు ధన్యవాదములు
super..
చాల చాల బాగున్నది.
చాల బాగుంది
Yemicchi ee kavi sundaruNNi sthuthichaali.. Ammavaare ee jeeva kavi gurinchi alaa palikithe.. manam bangaaru poolatho poojinchinaa saripodemo.
Wow…great chala baga rasaru Bharani garu…oka giant ki inkoka giant thodu…
వేటూరి గారి సాహిత్యమే ఒక అద్బుతం , దానికి సరస్వతి పుత్రుని లాంటి భరణి గారి ప్రశంస పత్రం మరొక అద్బుతం.
భరణి గారు రాసిన ఎన్నో ప్రశంస పాత్రలలో ఇదంటే నాకు చాలా ఇష్టం . site లో పెట్టినందుకు thanks,
ఒక అవ్యక్తానందం –
ఒక మధురానుభూతి –
ఒక గొప్ప అనుభవం..!!
‘వేటూరి – భరణి ‘
ఎందరో మహునభావులు అందరికీ శిరసాభి వందనములు…
ఇలా సాహితీ కారులందరి లో ఉన్న మంచి లక్షణాలను ఆభరణాలుగా చేసి వేటూరి గారికి వేయగలిగే వారు ఒకే ఒక్కరు. మన భరణి గారు.
Adbhuthaha…