కడసారిది వీడ్కోలు…. కన్నీటితో మా చేవ్రాలు….(ఓంప్రకాష్)

కడసారిది వీడ్కోలు…. కన్నీటితో మా చేవ్రాలు….

ఆశలు సమాధి చేస్తూ… బంధాలను బలిచేస్తూ..

ప్రాణాలే విడిచి సాగే పయనమిది….

వేటూరి…

ఈ మూడు అక్షరాలు తెలుగు సినిమా పాటను కనీసం రెండున్నర దశాబ్దాలపాటు శాసించాయంటే అతిశయోక్తిలేదు. ‘ఓ సీత కథ’ తో వెండితెరపై ప్రకాశించిన ఆ పేరు మరో కొన్నినెలలపాటు కనిపిస్తుంది. అయితే భవిష్యత్తులో భౌతికంగా తెర మీద ఆ పేరు కనిపించకపోవచ్చు! కాని కోట్లాది తెలుగు ప్రజల పెదవులపై ఆయన పాట నర్తిస్తూనే ఉంటుంది. ఆ పాటతో పాటే .. ఆ పాటల తోటమాలితో వారికున్న అక్షరానుబంధమూ అజరామరంగా నిలిచి ఉంటుంది!!

***

వేటూరి తుదిశ్వాస విడవటానికి రెండు వారాలముందు…

మే 5 న…

పింగళి నాగేంద్రరావు గురించి బైట్ కోసం మిత్రుడు ప్రదీప్, నేను ఆయన దగ్గరకు వెళ్ళాం. ‘మోక్ష’ సినిమా దర్శకుడితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు.

‘కొద్దిసేపు వెయిట్ చేస్తారా’ అని అడిగారు వేటూరి.

‘తప్పకుండా’ .. అంటూ ముందు గదిలో కూర్చున్నాం.

ఆయనకు లభించిన అవార్డుల్ని, అందుకున్న జ్ఞాపికల్ని, ఆయన రాసిన ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ పుస్తకాలను చూస్తూ గడిపేశాం.

అరగంట తరువాత ఆయన నుండి పిలుపు వచ్చింది.

లోపలికి అడుగుపెట్టగానే, ఎంతో ఆప్యాయంగా పలకరించారు.

సరదా సరదాగా మాట్లాడారు

పింగళితో తనకున్న అనుబంధాన్ని వివరించారు

మా పని పూర్తయినా వెంటనే ఆయన్ని వదిలి బయటకి రావాలనిపించలేదు. ఏదో తెలియని ఆత్మీయబంధం అలా కూర్చోపెట్టేసింది.

మాటల్లో ప్రదీప్… మావాడిదీ బందరే’ అన్నాడు.

అంతే ఆయన కళ్ళల్లో ఓ మెరుపు! బందరుతో తనకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. తెలుగు సినిమా రంగానికీ బందరు అందించిన అపురూప వ్యక్తుల గురించి తలుచుకున్నారు.

సరదా సరదాగా పింగళి గురించీ చెప్పుకొచ్చారు.

తనను చూడటానికి వచ్చే అభిమానులతో పింగళి వారు చాలా చమత్కారంగా సంభాషించేవారని చెబుతూ…

ఓసారి దూరప్రాంతం నుండి పింగళిని చూడటానికి అభిమానులు వచ్చారట. ఆయన్ని కలిసి, తమ ఆనందాన్ని వ్యక్తపరిచి, ‘ మీరు ఆ సినిమాలో అంత అద్భుతంగా రాశారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రాశారు’  అని అభినందనలతో ముంచెత్తారట. పింగళి గారు ‘ బెస్టు…బెస్టు’  అని సమాధానమిచ్చారట.

మరి కాస్త సమయం గడిచింది. ఇంకా వారి అభినందన పరంపర కొనసాగుతూనే ఉంది. పింగళి కాస్త మౌనం వహించారు.  ఆయన మౌనాన్ని అర్థం చేసుకున్న అభిమానులు ‘చాలా సమయం గడిచింది. మేం బయలు దేరతాం’ అని చెప్పారట. దాంతో పింగళిగారు ‘ఇది మరీ బెస్టు ‘ అని చెప్పారుట.

దాంతో వారు పింగళి గారి దగ్గర శలవు తీసుకుంటూ … ‘మరోసారి వచ్చి కలుస్తాం’ అని చెప్పారుట. వెంటనే పింగళిగారు ‘ఎందుకు వేస్టు’ అన్నారుట.

ఆ తర్వాత వేటూరి ‘అదేమిటి గురువుగారు! మిమ్మల్ని చూడ్డానికి అంతదూరం నుండి వచ్చినవారితో అలా అన్నారు?’ అని అంటే…

‘ఈ బక్కపలచ నల్లనివాడిని వారేం చూస్తారు! అయినా ఈ పొగడ్తలకు మనం దూరంగా ఉండాలి.  మన రచనల్ని వారు అభిమానిస్తే చాలు ‘ అని సమాధానం ఇచ్చారుట.

వేటూరిగారి పట్ల మాకున్న అభిమానాన్ని వ్యక్తం చేయకుండా ఆయన అలా అడ్డుకట్టవేశారు. కాసేపు ఆయనతో సరదాగా ముచ్చటించి ప్రదీప్,నేను బయటకి వచ్చాం.

***

మే 22 రాత్రి 9.30 నిమిషాలు.

ఆఫీసునుండి ఇంటికొచ్చాను. కొంచం నలతగా ఉంది. జలుబు చేసి జ్వరం వచ్చేలా ఉంది భోజనం చేసి టాబ్లెట్ వేసుకుని పడుకుందాం అనుకుంటూ ఉండగా సుబ్బారావు ఫోన్…

‘బ్యాడ్ న్యూస్, వేటూరిగారు చనిపోయారట, బాడీ కేర్‌లో ఉందట ‘

ఒక్క క్షణం ఏమి అర్థం కాలేదు. ఊహించని వార్త. ఇది పుకారైతే ఎంత బాగుండు… అనే ఆశ.

ఇంతలో వేణుగోపాల్ ఫోన్.. ‘నేవిన్నది నిజమేనా! వేటూరిగారు ఇక లేరట కదా ‘

‘దేవుడా జరగకూడనిదే జరిగింది ‘

వెంటనే కేర్‌కు బయలు దేరాను.

సినీ రంగ ప్రముఖులు… వందలాది అభిమానులు.. మీడియా పీపుల్‌తో కేర్ కిక్కిరిసి పోయింది. రాత్రి ఒంటిగంటకు వేటూరి భౌతిక కాయాన్ని హాస్పటల్ నుండ్ ఇంటికి తరలించారు.

****

మే 23 శ్రీనగర్ కాలనీ.

వేటూరి గారుండే అపార్ట్మెంట్.

తెలుగు సినిమా పాటకు కొత్త సొగసులు అద్దిన అపర బ్రహ్మ ప్రశాంత వదనంతో శాశ్వతంగా నిద్రపోతున్నారు.

మండుటెండను కూడా లెక్కచేయకుండా ఆయనకు చివరిసారి వీక్షిద్దామని జనం తండోపతండాలుగా వస్తున్నారు.

చూస్తుండగానే మధ్యాహ్నం రెండు గంటలైంది. అంతిమయాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. వేటూరి రాసిన వేలాది పాటలు వరుసగా మదిలో మెదులుతూ ఉన్నాయి. ఆయన పాటల్లో నాకు బాగా ఇష్టమైన పాట…

ఏ కులము నీదంటే – గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది

… … …

ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసవుతాది…

అన్ని వర్ణాలకూ ఒకటే ఇహము పరముంటాది…

… .. …

ఆదినుంచి ఆకాశం మూగది

అనాదిగా తల్లి ధరణి మూగది

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు

ఈ నడమంత్రపు మనుషులకే మాటలు

ఇన్ని మాటలు….

… … …

ఇలా ఆయన గీతాలాపనలో నేను, ఐ న్యూస్ ఫణి మునిగి తేలుతుంటే …

ఓ వ్యక్తి మా దగ్గరకు వచ్చాడు.

‘అంతా అయిపోయింది సార్… గురువుగారిని ఇక తీసుకెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చినా హరిబాబు బాగున్నావా? అని అప్యాయంగా పలకరించేవారు. ఆయన చనిపోయారనే వార్త టీవీలో చూసి బందరు నుండి హడావుడిగా బైలు దేరి వచ్చాను. చివరిచూపు దక్కింది ‘ అన్నాడు.

మాటల్లో వేటూరితో  తనకున్న అనుబంధాన్ని వివరించాడు. వేటూరికి తనని పరిచయం చేసిన గుమ్మడి కూడా కొద్ది నెలల క్రితమే తనువు చాలించిన విషయం తలుచుకుని బాధపడ్డాడు.

చివరగా మా దగ్గర శెలవు తీసుకుంటూ ‘మీరేమీ అనుకోనటే ఓ 30 రూపాయలుంటే ఇస్తారా? వూరు వెళ్ళాలి. వేటూరి గారు చనిపోయారని తెలియగానే జేబులో వందరూపాయలుంటే బయలుదేరి వచ్చేశాను. ఇక్కడ ఓ ఫ్రెండ్‌నడిగి తిరుగు ఛార్జీలు తీసుకుందామనుకున్నా , కానీ అతను ‘సెల్ ఎత్తడం లేదు’ అన్నాడు మొహమాటంగా.

పర్సులో చూశాను. చిల్లర లేదు. వందరూపాయల నోట్లు ఉన్నాయి. ఓ వందనోటు తీసి అతనికిచ్చాను.

‘ముప్పై చాలు ‘ అన్నాడు

‘భోజనం చేసి.. ఊరెళ్ళండి ‘ అన్నాను

నా ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ నుండి నిష్క్రమించాడు.

ఒక్క నిమిషం ‘అపాత్రాదానం చేయలేదు కదా ‘ అన్న సంశయం కలిగింది.

ఒకసారి తలతిప్పి చూశాను దూరంగ వేటూరి గారి పార్థీవ దేహాన్ని అలంకరించిన వాహనంలో ఎక్కిస్తున్నారు. ఆయన్ని చివరిసారి చూడాలని సుదూరం నుండి వచ్చిన వ్యక్తికి ఓ పూట భోజనం పెట్టే అవకాశం కలగడం అడృష్టమే కదా అనిపించింది. మనసు తేలిక పడింది.

కరములు మోడ్చి.. కవిబ్రహ్మ వేటూరిగారికి అంతిమ నివాళి అర్పించాను.

గుఱ్ఱం జాషువ గీతం మదిలో మెదిలింది…

‘రాజు మరణించే నొక తార రాలిపోయె

సుకవి మరణించే నొక తార గగనమెక్కె

రాజు జీవించె రాతి విగ్రహమౌలందు

సుకవి జీవించె ప్రజల నాల్కుల యందు ‘

 

తెలుగు ప్రజ ఉన్నంతకాలం వేటూరికి మరణం లేదు.

—————————————

 

ఓంప్రకాష్ గారికి కృతజ్ఞతలతో…వేటూరి.ఇన్

You May Also Like

One thought on “కడసారిది వీడ్కోలు…. కన్నీటితో మా చేవ్రాలు….(ఓంప్రకాష్)

  1. antha bagundi kani.. meeru attach chesina photo naku badhanu kaligistondi .. daya chesi marchandi….

    veturi garini ila chudadam kastanga vundi.. pls..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.