అవును. వేటూరి మరణించలేదు.
అసలెలా మరణిస్తారు?
వెన్నెల అందానికి, గోదావరి ప్రవాహానికి, తియ్యటి పాటకి, కమ్మని సంగీతానికి, అద్భుత సాహిత్యానికి… వీటికి కూడా మరణం ఉంటుందా?
అలా ఉంటే ఇంక అజరామరం అనే మాటకి అర్ధం ఏముంది? అజరామరమనేది అసలేముంటుంది?
జనంలో, జన గళంలో, జన హృదయంలో మమేకమైన కళాకారుడికి ఎప్పుడూ మరణం లేదు.
ఘంటసాల, పింగళి, ఎన్టీ రామారావు, సావిత్రి… వీళ్ళందరూ మరణించారంటే మీరొప్పుకుంటారా?
నేనైతే ‘చస్తే’ ఒప్పుకోను. నా దృష్టిలో వీళ్ళందరూ ఎప్పటికీ చిరంజీవులే..
అలాగే “మా” వేటూరి చనిపోయారంటే కూడా నేనొప్పుకోను.
పండితులు పాడుకునే ‘ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణము’ లోను, పామరులు పాడుకునే ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ లోను, కుర్రకారు ఇంకో పాతికేళ్ళు పాడుకునేంత నిత్యనూతనమైన ‘అబ్బ నీ తియ్యని దెబ్బ’ లోను, మేధావులు ప్రశంసించే ‘వేణువై వచ్చాను భువనానికి’ లోను, వేదాంతులు అబ్బురపడే ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ లోను … ఇంకా ఇలాంటి వందలాది* పాటల్లోనూ వేటూరి ఎప్పటికి మనల్ని సజీవంగా పలకరిస్తూనే ఉంటారు.
(*అవును, వేటూరి రాసిన పాటల్లో కేవలం ‘గొప్ప పాటల జాబితా’ వరకు మాత్రమే తీసినా నిస్సందేహంగా కొన్ని వందలు ఉంటాయి)
తెలుగు సినిమా పాట రూపు రేఖల్నే సమూలంగా మార్చి ఒక నవశకానికి కారకుడైన వేటూరి శైలి ప్రభావం ఎంత అంటే ఆయన రాసినట్లుగా రాయాలని అనుకరిస్తున్న రచయితలు ఇప్పుడు అనేకులున్నారు. ఏ పాట విన్నా ఇది వేటూరి రాసారా అనిపించేలా ఉంటుంది. కాని వెంటనే కనుక్కోగలం అది ఒక అనుకరణ ప్రయత్నం అని. ఎంత ఔపోసన పట్టినా ఆ తెలుగు సినీ శ్రీనాధుడి స్థాయిలో నూరో వంతుకు అందుకోవటం కూడా ఇంకొకరికి అసాధ్యం.
ఆయన్ను చూసి, ఆయన మాటలు విని, ఆయన పాటలను అనుభవించి పరవశించటం అనేది మనకు దొరికిన ఒక మహద్భాగ్యం. అవును, మన రేపటి తరంలోని మనవళ్ళకు, మనవరాళ్ళకు మనం గర్వంగా చెప్పుకుంటాం.. “అవును. మేము వేటూరికి వీరాభిమానులం. అంతకు మించి సమకాలికులం” అని.
ఒక అభిమాని…రఫీ
ఏమండీ రఫీ గారు,
గోదావరి ప్రవాహానికి అనడం కన్నా కృష్ణా ప్రవాహానికి అని మార్చి వేటూరి వారి కి నివాళి ఇవ్వాలండోయ్!
చీర్స్
జిలేబి.
తెలుగు సినీ సాహితీ సంద్రంలో వేటూరి కృష్ణా సాగర కెరటం. ఆ కృష్ణమ్మ పరవళ్ళు.. వారి కలంలో కదను త్రొక్కాయి. కవికి మరణమా!? జనం నాల్కలపై కవి జీవిస్తాడని.. మరొక కవి అన్నారు కదా! .
అవునండీ వనజ గారూ జాషువా అన్నారు ఇలా.
“రాజు మరణించె నొక తార నేల రాలిపోయె,
సుకవి మరణించె నొక ఒక తార గగనమెక్కె,
రాజు జీవించె రాతి విగ్రహములందు,
సుకవి జీవించె ప్రజల నాల్కుల యందు.”