‘హృదయస్పందనే’ చిరస్థాయిగా నిలుస్తుంది (వేటూరి)

మూడు దశాబ్దాలుగా తెలుగు పాటకు కర్త, కర్మ, క్రియగా మారిన వేటూరి సుందరరామ్మూర్తిని ఒక్కమాటలో ‘తెలుగుపాటల పూదోట’ అనవచ్చు ఆయన తెలుగు నుడికారానికి గుడి కట్టారు.  జర్నలిస్టుగా తన వృత్తి ప్రారంభించి మాంత్రికుడిగా తెలుగు పాటను హైజాక్ చేశారు.  మారుతున్న కాలానికి తగినట్లు తన పాళీని, బాణీని మార్చి కొత్త తరంతోను పోటీ పడుతూ వాడిలోనూ, వేడిలోనూ, వేగంలోనూ తనకి తానే సాటి అనిపించుకున్నారు. వేటూరితో ముఖాముఖి…..

ప్ర: మీ బాల్యం, చదువు సంధ్యలు…

స: కృష్ణా జిల్లా దివి సీమలో ఉన్న కదళీపురం అనే గ్రామంలో 1936లో పుట్టాను. దాన్ని ప్రస్తుతం పెదకళ్ళేపల్లి అంటున్నారు. ఆంధ్ర సంగీత సాహిత్య ప్రపంచానికి ఒక మణిదీపం వంటివారు త్యాగరాజస్వామి. ఆయన ప్రధమ శిష్యుడు ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య మా గ్రామ నివాసి. నా బాల్యం విజయవాడలో గడచింది.  బీసెంట్ రోడ్డులో ఉన్న చిన్న స్కూల్లో కొన్నేళ్ళు చదువుకున్నాను. తర్వాత జగ్గయ్యపేటలో చదువుకున్నాను. కాలేజీ చదువు మద్రాసులో జరిగింది.

 

ప్ర: మీ ఉద్యోగ జీవితం

స:  1956లో నేను బి ఎ పాసై నిరుద్యోగిగా ఉన్న రోజుల్లో నన్ను పిలిపించి ‘రేపటి నుంచి ఉద్యోగంలో చేరండని చెప్పిన ప్రాతఃస్మరణీయులు నార్ల వెంకటేశ్వరరావు. జర్నలిస్టుగా పనికొస్తానని ఆయనకు ఎలా అనిపించిందో నాకు తెలియదు.  వారు నాకు తెలుగు వర్ణ క్రమాన్ని, జీవనానికి సంబంధించి భాషాప్రయోగాలను దగ్గరుండి నేర్పారు. తరువాత విక్లీ జర్నలిజంలోకి వెళ్ళాను. దాని తర్వాత అసెంబ్లీ కరస్పాండెంట్‌గా హైదరాబాదులో ఉన్నాను. మొత్తం పద్దెనిమిదేళ్ళు నాకు ఎంతో తృప్తినిచ్చిన జీవితం అది. రచయితగా అదే నాకు పునాది వేసింది.

 

ప్ర: సినిమాల్లోకి ఎలా వచ్చారు?

స: నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు ఓసారి ఎన్.టి.రామారావును ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ‘బ్రదర్…మీరు సినిమా రంగంలోకి రావచ్చు కదా’ అన్నారు.  ‘నేనెందుకు పనికొస్తానండీ’ అన్నాను.  ‘కాదు మీ దగ్గర ఆ ధోరణి చూస్తున్నాను మాకు అవసరమయ్యేటట్టున్నారు’ అన్నారు. ‘మీకవసరం అయినప్పుడు వస్తానులెండి’ అన్నాను. ఏదో కారణంగా ఆంధ్రపత్రికలో పని చేయలేక రిజైన్ చేశాను.  ఆయన నన్ను పిలిపించారు ‘మీరిక్కడే ఉండండి ప్రస్తుతం పని లేదని వెళిపోవద్దు ‘ఉ హావ్ టు స్విం ఎగినెస్ట్ ది స్ట్రీం’ అన్నారు. ఎవరైన ‘పాట’ ఇస్తారేమోనని చూస్తూ కూర్చోవటం నచ్చక తిరిగి హైదరాబాద్ వచ్చి ఆంధ్రప్రభలో జర్నలిస్టుగా చేరాను.

 

ప్ర: ఆ తర్వాతేం జరిగింది?

స: లాల్ బహదూర్ శాస్త్రికి దేశ రక్షణ నిధి సమర్పించడానికి ఎన్.టి.రామారావు దేశాటనం చేశారు ఆ నిధిని తీసుకుని ఆయన ఫతేమైదాన్‌లో వారికి సమర్పించడానికి వచ్చారు. అది కవర్ చేయడానికి నేను వెళ్ళాను. రామారావుగారు నన్ను చూసి పిలిచి ఎందుకు మద్రాసు వదిలి వెళ్ళావయ్యా అని మందలించారు. తర్వాత నేను రాసిన రేడియో నాటకం ‘సిరికాకుళం చిన్నది’ విని నన్ను రమ్మని కబురంపించారు. ఆయనే నన్ను కె. విశ్వనాధ్ గారికి పరిచయం చేశారు.

 

ప్ర: మీ సినీ జీవితానికి అంకురార్పణ

స: దర్శకులు కె. విశ్వనాధ్ ‘ఓ సీత కథ’ లో మొదటి పాట రాయించారు. నా సినీ జీవితానికి అంకురార్పణ చేసిన చిరస్మరణీయులు ఎన్.టి.రామారావు. సినీ రంగంలో చేరిన తర్వాత వ్యక్తిగత ప్రవర్తన దగ్గర నుంచి ప్రతి క్షణం ఎలా ఉంటున్నాను, ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో చెప్తూ నన్ను తన తమ్ముడిగా చూసుకొని నాకొక గైడ్‌గా ఉన్నవారు కె. విశ్వనాధ్.  ‘భారత నారి చరితం మధుర కథా భరితం, పావన గుణ విస్పురితము’- ఇటువంటి పాటలు రాస్తున్న సమయంలో నన్ను కమర్షియల్ చేసి, ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను, కోకెత్తుకెళ్ళింది కొండగాలి’ వరకు రప్పించి నన్ను మాస్ రైటర్ని చేసిన వారు కె. రాఘవేంద్రరావు.  నార్ల వెంకటేశ్వరరావు, ఎన్.టి.రామారావు, కె. విశ్వనాధ్, కె రాఘవేంద్రరావు వారందరు చూపిన అవ్యాజమైన అనురాగం కంటే నా జీవితంలో చెప్పుకోదగిన సంఘటన, మరచిపోలేని సంఘటన ఇంకోటి లేదు.

 

ప్ర: సినిమా పాటలు ఎలా ఉండాలని మీరు వ్యక్తిగతంగా భావిస్తారు?

స: దీనిలో వ్యక్తిగత భావాలకు చోటు లేదు. కధా నాయకుల చుట్టూ పరిభ్రమిస్తోన్న పరిశ్రమలో పాట ఎలా ఉండాలో నిర్దేశించేందుకు ఎవరన్నా ఉంటే వారు ముందు శిక్షార్హులవుతారు. అటువంటి అభిప్రాయాలన్నా కూడా బయటకు చెప్పకుండా ఉంటే బాధలు తగ్గుతాయి. పాట ఎలా ఉండాలి అనేది మన పెద్దవాళ్ళు అంటే ఇది వరకు రాసినవాళ్ళు నా గత జీవితంలో నేను రాసినవాటికన్నా పాఠాలు లేవు.

 

ప్ర: భాషతో పని లేదని అనేవాళ్ళూ తయారయ్యారు కదా…?

స: నిజమే ఇవాళ భాషతో పని లేదు. భాషా సౌకుమార్యంతో పని లేదు. తెలుగుదనంతో పనిలేదు. ఇదివరకు వీణపాటలుండేవి. కూర్చొని పాడటం పోయింది. నిల్చొని పాడటం అనేది పోయింది. ఇప్పుడు ఒకటే పరుగులు… ఏ మొహమేదో తెలియదు. మా మాటేదో అంతకన్నా తెలియదు. వాయిద్యాల రొద, పాడేవాళ్ళు  మన తెలుగువాళ్ళు కాదు. ఒక చిన్న సంఘటన చెబుతాను. ఆ మధ్య ఒక పాట రాశాను. మణిశర్మ డైరెక్టరు ఆ పాట పాడటానికి బాంబే నుంచి ఉదిత్ నారాయాణ్ అనే గాయకుడు వచ్చారు. అందులో ‘జాబిల్లి’ అనే మాట వస్తుంది ఆయనకు పెద్ద సందేహం వచ్చింది. ఆయన్ని అనాల్సిన పనిలేదు ఆయన్ని మనం తీసుకొచ్చి పాడించుకుటున్నాం. ఆయన తప్పేమి లేదు. ఆయన నా దగ్గరికొచ్చి ‘సార్ బిల్లీ బిల్లీ అని రాశారు. బిల్లీ అంటే పిల్లి కదా, శృంగార గీతంలో పిల్లి సంగతేమిటి? నాకు అర్థం కావడం లేదు అన్నారు. ఇది ఎవర్నో విమర్శించడానికి నేను చెప్పడం లేదు. ఉన్న పరిస్థితి వివరించడానికి చెప్పాను. ఇవ్వాళ మనం మన కవుల్ని మర్చిపోయాం. తెలుగు సంస్కృతికి ఎంతో సేవ చేసిన తర్వాత సినిమా రంగానికి వచ్చిన కవులున్నారు. దేవులపల్లి, మల్లాది, కొసరాజు…. వీరందరూ తెలుగు సినిమా పాటలెలా ఉండాలో మాకన్నా ముందే చెప్పారు. నిన్న మొన్నటివరకు వచ్చిన  నా సినిమా పాటలే పాటలెలా ఉండాలో చెబుతాయి. నా పాటలే చెప్పాలి నేను కాదు.

 

ప్ర: పాట కథను అనుసరించి సాగాలంటారా? లేక కథకి సంబంధం లేకుండా కూడా ఉండచ్చంటారా? ఒక గేయ రచయితగా మేరేమంటారు?

స: ఉషాకిరణ్ మూవీస్ వారి ‘ప్రతిఘటన’ సినిమా అందరూ చూశారు. ఆ సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శక నిర్మాతలకు అందులో పాటకు చోటెక్కడా కనిపించలేదు. బలవంతంగా ఎక్కడో ఓ చోట ఇరికించాల్సి వస్తుందేమో అనుకున్నారు. కాలేజి సన్నివేశంలో విజయశాంతి పాత్రను హీనాతిహీనంగా అవమానపరిచి గేలి చేస్తున్న సందర్బంలో పాట పెడితే బావుంటుందన్నాను. పాట వచ్చేటట్లయితే రాయమని రామోజీరావు అన్నారు. వెంటనే రాసేశాను ఇప్పటికి ఆ పాటని ఎంతో మంది కోట్ చేస్తుంటారు. ‘ ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’.. అనే పాట ‘రక్తాశ్రువులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం’ అలా సాగుతుంది. అది కమర్షియల్గా ఎంత హిట్టయిందో చెప్పలేను. ప్రేక్షకుల హృదయాల మీద చెరగని ముద్ర వేసింది. ఆ సినిమా ఏ స్థాయికి తీసుకెళ్ళీందో అందరికి తెలుసు. అక్కడ మాటలతో చెబితే పేలవమయ్యేది. రసపోషణకు అక్కడ పాటే అవసరమైంది. పిక్చర్ని నిలబెట్టే ఆయుధం పాట. కథకు అనుగుణంగా పాట ఉండాలి. అలా ఉంటేనే పాటలు జ్ఞాపకం ఉంటాయి. ‘శంకరాభరణం పాటలను రిక్షావాళ్ళు, చదువుకోనివాళ్ళు, పామరులు కూడా పాడుకొని ఆనందించారని మనం వింటుంటాం. అలాగే పూర్వపు దేవదాసులో మల్లాది వారు రాసిన ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ హృదయ స్పందన కలిగించే సాహిత్యం ఏదైనా ‘ల్యాండ్ మార్క్’ లాగా నిలిచిపోతుంది. ఇవ్వాళ అటువంటి సన్నివేశాలు రావడం లేదు. ఆది కొంచం విచారకరం.

 

ప్ర: ‘సాగరసంగమం’ చిత్రంలో ఓ పాటలో ‘పార్వతీ పరమేశ్వరౌ’ అనే పదబంధంలో ‘పార్వతిప… రమేశ్వరౌ’ అని విడదీశారు దీనికి కారణం ఏదైనా ఉందా?

స: మహాకవి కాళిదాసు రాసిన శ్లోకం అది. కాళిదాసు శైవమతస్తుడు. ఈ శ్లోకాన్ని ఆయన రఘువంశంలో రాశాడు. రఘువంశం అంటే విష్ణువు చరితం. ఆ విష్ణువు పేరు కూడా స్మరించకూడని శైవమతంలో పుట్టి జ్ఞానియై, మహాకవియై, విష్ణు చరిత్ర రాశాడు. మొదటి శ్లోకంగా ఈ శ్లోకం రాశాడు. ‘వాక్కు అర్థం వలే కలిసి ఉండేవారు ఏకమై పోయుండేవారు అర్థం లేని వాక్కు లేదు వాగ్రూపంలో రాని అర్థం లేదు. ఏక రూపంలో ఉండేవి అలా వాక్కు అర్థం వలే కలిసి ఉండేవారు వాకార్థ ప్రతిపత్తయే. కొన్ని సందర్భాల్లో వాక్కు వాక్కుగా, అర్థం అర్థంగా విడివిడిగా ఉండే వారు జగతః పితరొ వందే.. ఇక్కడ లిటరల్‌గా చూడాలి. జగతః అంటే జగత్తుకి, పితరొ అంటే కొంచం వివరంగా చూద్దాం. సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం- మూడు వచనాలున్నాయి. ఒకరు అనడానికి ఏకవచనం, ఇద్దరు అనడానికి ద్వివచనం, అనేకమంది అనడానికి బహువచనం ఉపయోగిస్తారు. పితరః అంటే ఒక తండ్రి, పితరౌ అంటే ఇద్దరు తండ్రులు పితరా అంటే  అనేక తండ్రులు అని అర్థం కాళిదాసు ఏమంటున్నాడంటే – జగతః  పితరౌ అంటున్నారు, అంటే జగతుకి ఇద్దరు తండ్రులైన వారికి నమస్కారం ఆ ఇద్దరు ఎవరు? పార్వతీ పరమేశ్వరులు వారు ఇద్దరు తండ్రులెలా అవుతారు. కాలేరు కదా? ఆయన భావం ఏమై ఉంటుంది అంటే ‘పార్వతీచ’ పార్వతిని పాలించినవాడు ఎవరు? ఈశ్వరుడు. రమకు ఈశ్వరుడు ఎవరు? రమ అంటే లక్ష్మీదేవి ఆమెకు ఈశ్వరుడు మహావిష్ణువు జగత్తుకి తండ్రులైనటువంటి శివుడు విష్ణువులకు భేదం లేదని  చెప్పడం కోసం, ఆ మహా సందేశం ఇవ్వడానికి ఆయన అలా రాశాడు. బహుజన హితాయ, బహుజన సుఖాయ, విశ్వశ్రేయః కావ్యం అన్నవి ప్రతిపాదించిన మహాకవి కాళిదాసు శైవమని, వైష్ణవమనీ ప్రజలు కొట్టుకు చస్తున్న రోజుల్లో తానే శైవుడై విష్ణు చరిత్ర రాస్తూ మొదటి శ్లోకం నిష్ప్రయోజనంగా రాస్తాడా ఆ మహాకవి? రాయడు కదా? ‘వాగర్ధములవలె కలిసి ఉండేవారు, విడివిడిగా ఉండే శివవిష్ణువులు ఇద్దరికి నమస్కరిస్తున్నాను’ అని మా పెదతండ్రి వేటూరి ప్రభాకరశాస్త్రి మా చిన్న తనంలో చెప్పినదాన్ని అవకాశం వచ్చినచోట నలుగురికి తెలియజెప్పడం కోసం ఆ విధంగా రాశాను.

-చీకోలు సుందరయ్య

 

“ఈనాడు” సౌజన్యంతో

విషయసేకరణకు సహకరించిన రఫీ గారికి ధన్యవాదాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.