ఆ పుస్తకం తెరవగానే ‘వేటూరి సుందర రామమూర్తి’ అనే సంతకం కనిపించింది.
ఆరు సంవత్సరాల వెనక్కి వెళ్ళాను. అక్కడితో అది ఆగలేదు. పేజీల్లోకి , అక్షరాల్లోకి దృష్టి సారిస్తే ఆ జ్ఞాపకాల ప్రయాణం ఇంకా వెనక్కి… దశాబ్దాల వెనక్కి సాగిపోయింది.
వేటూరి పాటల సంగతులు ముందుకు సాగి, రాద్దామనుకున్న టపా సంగతి వెనకబడిపోయింది! 🙂
సినీ కవిగా అందరికీ తెలిసిన వేటూరి వచనంలోనూ చక్కని ప్రతిభ ప్రదర్శించారు. జర్నలిజంలో పదిహేనేళ్ళపాటు కొనసాగటం వల్లనా? సహజమైన ప్రతిభా వ్యుత్పత్తుల వల్లనా? ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మాటల్లో చెప్పాలంటే… ‘ఉపనిషత్తుల నుంచి ఉలిపిరి కాయితం వరకూ , దేన్ని గురించైనా అపారమైన పరిజ్ఞానం’ వేటూరిది .
శ్రీశ్రీ మరణించినపుడు 1983లో జూన్ 17న ‘ఈనాడు’ లో వచ్చిన ప్రసిద్ధ సంపాదకీయం రాసింది వేటూరే. ‘శ్రీశ్రీ మొదలంటా మానవుడు- చివరంటా మహర్షి- మధ్యలో మాత్రమే కవి- ఎప్పటికీ ప్రవక్త’ అని ఎంతో క్లుప్తంగా , అనల్పార్థం స్ఫురించేలా శ్రీశ్రీని అక్షరాలతో sum up చేశారాయన.
‘కవిగా అతను తన జీవిత కాలంలోనే ‘లెజెండ్’ అయినాడు’ అని శ్రీశ్రీని ఉద్దేశించి వేటూరి రాసిన వ్యాఖ్య ఆయనకూ వర్తిస్తుంది.
వేటూరి గారు రాసిన ‘ఆర్ద్ర స్మృతుల అక్షరాకృతుల’ వ్యాసాలు ఆరేళ్ళ క్రితం ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పుస్తకంగా విడుదలయ్యాయి. వేటూరి చక్కని కథా రచయిత కూడానట. ‘కవితా పరమైన శైలిలో మల్లాది రామకృష్ణశాస్త్రి గార్ని తలపించే తీపి తీపి తెలుగులో అలనాడే అద్భుతమైన కథలు రాశారని కొందరికే తెలుసు’ అని ఈ పుస్తకం ముందు మాటలో పైడిపాల అంటారు. ఆ కథలు ఎక్కడున్నాయో… ఇప్పుడైనా అవి వెలుగులోకి వస్తాయా?
ఎదుటివారి ప్రతిభను మనస్ఫూర్తిగా ప్రశంసించే సంస్కారం వేటూరిది.
బాలూను – ‘బాల రసాల సాల అభినవ ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం ఒక పుంస్కోకిల’ అని అభివర్ణించారు. ‘నైమిశారణ్యాలలో, గంధ మాదన పర్వతాలలో, చిరపుంజి చినుకులలో, సుందర వన సాగర తీరాలలో , మలయానిలాలలో వీచే పవన పరిమళాలు రాజన్ నాగేంద్రల సుస్వరాలు’ అంటారు.
శబ్ద చిత్రాలూ, ప్రాస క్రీడలతో తన వచనాన్ని ఆకర్షణీయంగా మలుస్తారు వేటూరి. ‘స్వరమేశ్వరుడు’, ‘పాటలీ కుసుమాలు’, ‘రాగతాళీయం’, ‘స్వరాయురస్తు’ అనే పద ప్రయోగాలే కాదు- ‘ఆదినారాయణరావుకు అంజలి’, ‘జంధ్యావందనం’ లాంటి అర్థవంతమైన శీర్షికల్లో ఆయన మార్కు మెరుపులు తళుక్కుమంటాయి!
వేటూరి వి ప్రైవేటు క్యాసెట్లు ‘గీతాంజలి’ పేరుతో వచ్చాయి. ఇవన్నీ భక్తి గీతాలే. సినీ ప్రముఖులే స్వరకల్పన చేశారు.
* శ్రీ వేంకటేశ్వర పదములు – కె.వి. మహదేవన్.
* భద్రాచల శ్రీరామ పట్టాభిషేకం – చక్రవర్తి
* కబీర్ వాణి – చక్రవర్తి
* క్రీస్తు గానసుధ – బాలు.
* స్వామియే శరణం అయ్యప్ప – రాజ్ కోటి.
తెలుగు సినిమా పాటకు పర్యాయపదంగా మారిపోయిన వేటూరి అంటే … నాకైతే ‘శంకరాభరణం’పాటలే చప్పున గుర్తొస్తాయి.
సినీ రంగంలో అడుగిడిన తొలి సంవత్సరాల్లో ‘ఝుమ్మంది నాదం’, ‘శివశివ శంకర భక్త వశంకర’ అంటూ తాపీగా, సాఫీగా సాగిన ఆయన కలం క్రమంగా విశృంఖలమైంది. కమర్షియల్ అడవి బాటలో చెలరేగి ‘చిలకకొట్టుడు’తో యమగోల గోలగా ‘తిక్కరేగి’న వేటూరి పాళీకి ఉన్న పదునునూ, ఘనతనూ తెలిసేలా చేసి… కవిగా వేటూరిని కూడా రక్షించిన సినిమా ‘శంకరాభరణం’. ఈ అజరామర చిత్రం విజయ సిద్ధికి ‘గానమె సోపానం’గా అమర్చిపెట్టిన మహదేవన్, పుహళేంది కనుమరుగైపోగా.. ఇప్పుడు ఇలా… వేటూరి!
ఎప్పుడో స్కూల్ రోజుల్లో ‘ఝుమ్మంది నాదం’ సిరిసిరి మువ్వ సవ్వడిగా చెవులకింపుగా రేడియో తరంగాల్లో తేలివచ్చినపుడు ఆ పాట రాసిందెవరో పట్టించుకోలేదు. తర్వాతి కాలంలో తెలుగు సినీ పాటలకోటను త్రివిక్రముడిలా ఆక్రమిస్తూ వచ్చిన వేటూరిని పట్టించుకోకుండా ఉండటం ఎలా సాధ్యం? ఆ పాటల మధురిమను ఆహ్లాదిస్తూ, ఆస్వాదిస్తూ, ఆ అక్షరజాలాన్నీ, చిలిపిదనాల ప్రయోగశీలతనూ గమనించటం అప్రయత్నంగానే అలవాటయింది.
‘పంతులమ్మ’ సినిమాలో రాజన్ నాగేంద్ర స్వరపరిచిన ‘మానసవీణా మధు గీతం’ పాట అలాంటిదే! ఎమ్వీఎల్ లాంటివారు ఈ పాటను ఆరాధిస్తూ దాని గురించి పత్రికల్లో కూడా రాశారట. ‘కురేసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ, తడిసేదాకా అనుకోలేదు తీరని దాహమనీ..’ అనే చరణ భాగం ఎంత బావుంటుందో! తర్వాత ‘కలిసేదాకా అనుకోలేదు తీయనీ స్నేహమనీ..’- ఇది వినగానే అద్భుత భావన మనసును ఆవరించేస్తుంది!
నాలుగు స్తంభాలాట లో ప్రేమ భావనను వేటూరి హృద్యమైన గీతంగా ఎలా మలిచారో కదా! ‘హిమములా రాలి, సుమములై పూసి రుతువులై నవ్వి మధువులా పొంగు నీ ప్రేమ నా ప్రేమ’. అంతేనా? ‘మౌనమై మెరిసి, గానమై పిలిచి, కలలతో అలిసి, గగనమై ఎగసె’ అంటారు. తెలుగునాటి అందాలనీ, రుచులనీ, రాగాలనీ, పెదవి విరుపులనీ అందించే తెలుగు కవుల సంప్రదాయం, సరసం సినిమా పాటలోకి తేవాలనేది వేటూరి తాపత్రయం. అది జంధ్యాల సినిమాల ద్వారా కొంత తీరిందనుకోండీ.
‘రెండు జెళ్ళ సీత’ పాట గుర్తొచ్చిందా? ‘కొబ్బరి నీళ్ళా జలకాలాడ’ పాటలో వచ్చే ఊరగాయ స్తోత్రం చూడండి. ‘మాగాయే మహా పచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డ విస్తరి, మానిన్యాం మహా సుందరి’.
ఇక ‘ప్రేమించు పెళ్లాడు’లో ‘గోపెమ్మ చేతిలో గోరుముద్ద’ ఎంత రుచిగా ఉంటుందీ! ముద్దుముద్దుగా తెలుగు అక్షరమాలలోని అలూ, అరూ, ఇణీ వరసగా చెంగుమని పాటలోకి గెంతుకుంటూ వచ్చేయవూ! వేటూరి మాటల్లో చెప్పాలంటే- ‘అదొక సరసం, అదో చిలిపితనపు మోజువీడు చిన్న రసం’.
వేటూరి సినీ గీతాల సుందరోద్యాన వనంలోకి పూర్తిగా అడుగుపెడితే ఆ సుమ సుగంధాల నుంచి బయటపడటమూ, బయటికి రావటమూ చాలా కష్టం. ‘ఇలరాలిన పువ్వులు వెదజల్లిన తావుల’ తిరుగుతూ ఉండాల్సిందే. అందుకనే ‘ఈ పూలలో అందమై, ఈ గాలిలో గంధమై’న వేటూరి ప్రతిభను సంస్మరిస్తూ ఇలా అర్థోక్తి లో ఆపెయ్యటం అర్థవంతమే అనుకుంటాను!
———————————-
వేణువు బ్లాగర్ వేణు గారి స్మృతుల్లో వేటూరి
http://venuvu.blogspot.in/2010/05/blog-post_24.html
(వేణు గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ సభ్యులు)
వేటూరి లేని లోటు అంత ఇంత కాదు తెలుగు సిని పాపట మూగపోయింది.నాదాన్ని జుమ్మని పించి పద్దన్న్ని సై అనిపించిన గనత ఆయనదే . అయన కలం లో పదాలు మధుర రసాలై పాతాళ రూపంలో పుజలందుకున్నై