వేటూరి పాట అంటే నాకెంత ఇష్టమో ప్రత్యేకించి నేను మాటల్లో చెప్పను, బహుశా చెప్పలేను. ఆయన పాట పాడందే నాకు రోజు గడవదు. కుర్రదనంతో “జగడజగడజగడానందం” అన్నా, వెర్రితనంతో “అ అంటే అమలాపురం” అన్నా, ప్రేమభావంలో “ప్రియా! ప్రియతమా రాగాలు” అన్నా, విరహవేదనతో “చిన్న తప్పు అని చిత్తగించమని” అన్నా, ఆరాధనాభావంతో “నవరససుమమాలికా” అన్నా, చిలిపిదనంతో “ఉత్పలమాలలకూపిరి పోసిన వేళ” అన్నా, భక్తిభావంతో “శంకరా! నాదశరీరాపరా!” అన్నా, వైరాగ్యంతో “నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన” అన్నా, దుఃఖంతో “కన్నీటికి కలువలు పూచేనా?”, అన్నా – వేటూరి పాట నాకు చివరిదాకా తోడుండే నేస్తం. వేటూరి పాటతో నేను సావాసం చేస్తున్నట్టనిపిస్తుంది నాకు. ఆ పాట భుజం మీద చెయ్యేసి తిరుగుతున్నట్టు, ఆ పాటతో వేళాకోళమాడినట్టు, ఆ పాటతో కలిసి ఆడుకుంటున్నట్టు, ఆ పాటతో పాటే అలిసిపోయినట్టూ అనిపిస్తుంది. అలాటి వేటూరి పాట మూగబోయింది అంటే, అది జీర్ణించుకోవడానికి నాకు చాలా కాలం పడుతుంది. ఇంకోసారి ఆ వృద్ధకలం “అందంగా లేనా? అసలేం బాలేనా?” అని అడుగుతుందేమో, “అబ్బే, నీకేమి? మహారాణిలా ఉన్నావు.”, అని చెప్దామని అనిపిస్తుంది.
మన తెలుగుచలనచిత్రరంగంలో ఎందరో మహానుభావులున్నారు. వారి మధ్య వేటూరికి ఒక ప్రత్యేకస్థానం ఉంది. మహాభారతంలో భీష్ముడు మూడు తరాల పాటు అందరికీ తన విద్వత్తుని, ఙానాన్ని అందిస్తూ వచ్చాడు. చివరికి, “తాతా, నిన్నెలాగ చంపాలో చెప్పవా?”, అని అర్జునుడు అడిగితే “ఇలాగ చెయ్యాలిరా మనవడా!” అని చెప్పాడు. అలాగే వేటూరి కూడా తనకు సమకాలీకులైన అనేకచలచిత్రకవులకు దగ్గరుండి యుద్ధమర్మాలను బోధించారు. కొంతమంది అర్జునులైతే, కొంతమంది దుర్యోధనులైనారు; కొంతమంది ధర్మరాజులైతే, కొంతమంది విదురులైనారు. కానీ, ఎవ్వరూ భీష్ముడు కాలేకపోయారు. అధర్మం అన్నం పెట్టింది అని దానికి ఆసరాగా ఉండిపోయినంత మాత్రాన, భీష్ముడి గొప్పదనం తగ్గిపోతుందా? తన పాట విని ఎదిగినవాళ్ళే ఆయనకు అంపశయ్య వేసి పరుండబెట్టినా ఆయన ఠీవి తగ్గుతుందా? చివరికి అంతటి ధర్మరాజవిదురాదులే ఆయన పాదాలకు మ్రొక్కి, “మాకు మీరు ధర్మాన్ని మప్పండి” అని అడుగకతప్పుతుందా? ఈ రోజు, ఎంతటి చలనచిత్రకవి అయినా ఒకప్పుడు వేటూరి పట్టిన ఉగ్గుపాలను త్రాగినవాడేననడంలో అతిశయోక్తి లేదేమో? భీష్ముడిలాగే, వేటూరి మరణం తరుముతుంటే పారిపోకుండా, “కాలుతున్న కట్టేరా, చచ్చేనాడు నీ చెలి”, అని ప్రేమగీతాన్ని ఆలాపించగలిగినవాడు.
వృద్ధాప్యం ఆయన బాణాల్లో పదును తగ్గించవచ్చు, దృష్టిమాంద్యం గురిని తప్పుగా చూపించవచ్చు, కానీ, ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని ఆయన ధనుష్టంకారాన్ని వినిపిస్తే దిక్కులు దద్దరిల్లి, “విధి లేదు, ఇది లేదు, ప్రతిరోజూ నీదే లేరా”, అని అనక తప్పదు. ఆయనతోటలో పూయని పూలు లేవు, ఆయన పండించని పండు లేదు, ఆయన నడయాడని చోటు లేదు! పింగళి, సముద్రాల, ఆత్రేయ, ఆరుద్ర నుండి సిరివెన్నెల వరకు అందరినీ ఆయన కవిత్వంలో చూపగలరు. అయినా పాటలో ఏక్కడో ఒక చోట, “ఇది నేను వ్రాసిన పాట సుమీ” అనేలాగా ఆయన సంతకం దాచివుంచి సంధిస్తాడు. రథసారథి ఎవరైనా, యుద్ధరంగమేదైనా, యుద్ధనీతి యేదైనా ఆయన బాణాల్లో దూకుడు తగ్గదు. విశ్వనాథ్ తో శంకరాభరణం, బాపుతో రాంబంటు, జంధ్యాలతో ఆనందభైరవి, వంశీతో సితార, సింగీతంతో అమావాస్య చంద్రుడు, రాఘవేంద్రరావుతో వేటగాడు, భారతీరాజతో సీతాకోకచిలుక, మణిరత్నంతో గీతాంజలి, శేఖర్ కమ్ములతో గోదావరి, గుణశేఖర్తో మనోహరం – ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చును. మహదేవన్, రమేశ్ నాయుడు, చక్రవర్తి, రాజన్-నాగేంద్ర, ఇళయరాజ, రెహ్మాన్, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, రమణగోగుల, రాధాకృష్ణన్ – ఎవ్వరితోనైనా ఆయన వ్రాసిన గొప్పపాటలు ఉన్నాయి!
బాపు-రమణలు చమత్కారంగా చెప్పినా వేటూరికి అవి తగని ఉపమానాలేమీ కావు అని నా నమ్మకం. “రాంబంటు” చిత్రంలో కోట శ్రీనివాసరావు తన గురించి చెప్పుకుంటూ కృష్ణపరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన వాక్యాలను అనుసరిస్తూ, “నేను హీరోల్లో చిరంజీవిని, హీరోయిన్లలో శ్రీదేవిని, పాటల్లో వేటూరిని”, అని చెప్తాడు. నిజంగా వేటూరి పాటల్లో అంత వైశాల్యం ఉంది. అలాంటి కవి మళ్ళీ తెలుగునాడుకు దొరకడేమో! ముళ్ళపూడివారు వేటూరిని వర్ణిస్తూ చెప్పిన కందపద్యం కూడా అదే పునరుద్ఘాటిస్తుంది:
వేటూరి వారిపాటకి
సాటేదని సరస్వతిని చేరి కోర, నా
పాటేశ్వరుడికి వుజ్జీ
వేటూరేనంది నవ్వి వెంకటరమణా!
వేటూరి పాటకు ఎల్లలు లేవు. అటు ఆట-వెలదులు పాడుకునే పాటైనా, ఇటు శీలవతులు పాడుకునే పాటైనా, అటు నాస్తికులు పాడుకునే పాటైనా, ఇటు ఆస్తికులు పాడుకునే పాటైనా, అటు కుర్రకారు పాడుకునే సరదా పాటైనా, ఇటు వృద్ధులు పాడాల్సిన వైరాగ్యగీతమైనా – ఏదైనా వేటూరికి అసాధ్యం కాదు, లేదు.
డభ్భై వర్షాలు దాటినప్పటికీ ఆయన, తలదువ్వి, బొట్టుపెట్టి, జేబులో కలం పెట్టి, తల్లి పంపిస్తే పాఠశాలకు వెళ్తున్న కుర్రాడిలాగే కనబడ్డారు. అదీ, ఆయన మనసుకున్న వయసు! రామారావుకి “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అని సీసపద్యాన్ని పాటగా వ్రాసి, బాలకృష్ణకి “ఎన్నోరాత్రులొస్తాయి కానీ రాదే వెన్నెలమ్మ” అనే సరసగీతాన్ని అందించి, నేడు జూనియర్ ఎన్.టీ.ఆర్ కి “వయస్సునామి తాకెనమ్మి” అని వ్రాసినా ఆయన కలానికి యవ్వనం పోలేదు, ఆయన పాటకి వయసు కాలేదు. కలానికి కాలం లెక్కలేకపోయినా, తనువుకు దశాబ్దాలు లెక్కేగా! భీష్ముడి ధనువు వేగంతో పోటీ పడలేని ఆయన రథంలాగా, వేటూరి మనసు వేగంతో పోటీ పడలేక ఆయన శరీరం కూలిపోయింది. కానీ, కాలం ఆయన మనస్సుని “నవమి నాటి వెన్నెల నీవు, దశమినాటి జాబిలి నేను” అంటూ పిలిచింది. యవ్వనం తగ్గని మనసు ఆ కాలాన్ని కౌగిలించుకోవడానికి, కలాన్ని వదిలేసి వెళ్ళిపోయింది.
ఆయన ఎన్నో రాగాలను వినిపించి, చివరికి “వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి” అని సెలవు తీసుకున్నాడు. తెలుగుచలనచిత్రగీతమనే ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే అనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ తెలుగుచలనచిత్రగగనంలో ఆయన ఒక ధ్రువతారగా, ఎప్పటికీ యువతారగా ఉండిపోతారనే ఊహ నన్ను నిలబెడుతోంది.
ఉత్తరాయణంలో దశమి పూటా దేహాన్ని విడిచిన ఆయనకు, చివర్రోజుల్లో ఆయన తపన పడినట్లు మరిన్ని భక్తిగీతాలు వ్రాసుకునే ఉత్తమమైన జన్మ ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
“నవతరంగం” వారికి కృతజ్ఞతలతో