వేటూరి సుందరరామమూర్తి ….తెలుగుపాట ఇంటి పేరు!
తన పాటల్లో, ఇష్టమైన పాట గురించి చెప్పమంటే ఆయన చెప్పారిలా. (ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని కలిసిన ‘ఈనాడు ఆదివారం’ తో చెప్పిన మాటలివి. ఆ మహారచయితకు నివాళులు అర్పిస్తూ …)
స్త్రీ శక్తిస్వరూపిణి. కరుణిస్తే అమ్మ. కన్నెర్రజేస్తే అమ్మవారు. మహాభారతంలో ద్రౌపదిని చూడండి. సభాపర్వంలో అవమానం పాలవుతుంది. ఎదురుగా భర్తలు ఉంటారు. ఎవరూ స్పందించకపోయినా ఆమె ప్రతిఘటించదు. దీనంగా కృష్ణుడ్ని ప్రార్ధిస్తుంది. అప్పటి ద్రౌపది వేరు. విరాటపర్వంలో ద్రౌపది వేరు. కీచకుడు వెంటపడుతుంటాడు. అక్కడామె ఒంటరి. ‘అబలనని అనుకుంటున్నావేమో. దగ్గరికొస్తే నాశనమైపోతావ్ జాగ్రత్త’ అని విరుచుకుపడుతుంది. అదీ స్త్రీ శక్తి అంటే! సమయమొస్తే ప్రాణాలకు తెగిస్తుంది ఆడది. సభ్యత మరిచిన విద్యార్ధులపై క్లాసురూంలో తిరగబడుతుంది విజయశాంతి! ఇది ప్రతిఘటన చిత్రంలో ఓ సందర్భం. దానికి రాసిందే ‘ఈ దుర్యోధన దుశ్శాసన’ … అంటూ సాగిన గీతం.
దమ్మున్న కధ
ఓ సామాజిక ప్రయోజనంతో రూపొందిన చిత్రం ‘ప్రతిఘటన’. ఇందులో కధానాయిక విజయశాంతి కాలేజీ లెక్చరర్. ఆమె భర్త చంద్రమోహన్. కళ్ళెదుటే భార్యను రౌడీలు అవమానిస్తుంటే ఏమీ చేయలేని పిరికివాడు. తరువాత కధానాయిక యుక్తితో ప్రతినాయకుణ్ణి అంతమొందిస్తుంది. ఇదీ కధ. ఈ సినిమాలో విజయశాంతికీ, చంద్రమోహన్ కీ ఓ డ్యూయెట్ ఉంది. మరోటి ఉంటే బాగుణ్ణు అన్నది దర్శకుడు టి. కృష్ణ అభిప్రాయం. అయితే, దాన్ని కధలో ఎక్కడ చొప్పించాలా అని ఆలోచిస్తున్నారు. డ్యూయెట్ కి బదులు క్లాసురూం సన్నివేశానికి పాట పెట్టుకోవచ్చు కదా అని నేనన్నాను. ఆ సన్నివేశం ఏంటంటే … క్లాసురూంలో బ్లాక్ బోర్డుపై స్త్ర్హీ బొమ్మల్ని నగ్నంగా చిత్రిస్తారు కొందరు విద్యార్ధులు. అపుడే క్లాసులో అడుగుపెట్టిన విజయశాంతి ఆ బొమ్మలు చూసి రగిలిపోతుంది. స్త్ర్హీ ఔన్నత్యాన్ని విద్యార్ధులకు వివరిస్తూ వాళ్ళు చేసిన తప్పును తెలియచేస్తూ సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వొచ్చు. భారీ డైలాగులు చెప్పొచ్చు. దానికి బదులు ఓ పాట ఉంటే బాగుంటుందన్నది నా ఆలోచన. ‘సరే మీరన్నట్టే పాట రాయండి’ అన్నారు దర్శకుడు మొదట అయిష్టంగానే.
‘యత్ర నార్యస్తు పూజ్యన్తే
రమన్తే తత్ర దేవతాః
యత్రైతాస్తు న పూజ్యన్తే
సర్వాస్తత్రా ఫలాఃక్రియాః ‘
స్త్రీని గౌరవించే చోట తలపెట్టిన కార్యాలన్నీ సఫలమౌతాయి. ఆడదాన్ని అవమానించే చోట కార్యాలన్నీ విఫలమౌతాయి. అదీ సమాజంలో స్త్రీకి ఉండాల్సిన స్థానం. కానీ, ఇప్పుడేమౌతోంది? ఎంతోమంది కీచకులు మన కళ్ళముందే ఉన్నారు. ఇలాంటి కీచకుల అకృత్యాలకి దర్పణమే ‘ప్రతిఘటన’లో ఆ సన్నివేశం. ఈ సందర్భంలో పాట అనగానే మహాభారతం స్ఫురించింది. విరాటపర్వంలోని ద్రౌపది గుర్తొచ్చింది. కీచకుడుపై ఆమె విరుచుకుపడ్డ విధానం మనసులో మెదిలింది. అదే స్ఫూర్తితో పాట రాయడం మొదలుపెట్టాను…. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’ అంటూ. జూబ్లీహిల్ల్స్ (హైదరాబాద్) లోని ఉషాకిరణ్ గెస్ట్ హౌస్ బాల్కనీలో ఉద్వేగంతో రాసాను.
ఎడిట్ చేయమన్నా
పాట అందరికీ నచ్చేసింది. ఆ సీన్లో డైలాగులు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డ కృష్ణ కూడా పాటే పెడదాం అన్నారు. కాకపోతే కొన్ని లైన్లు అందులో ఎక్కువయ్యాయి. పక్కనే చిత్రనిర్మాత రామోజీరావుగారు ఉన్నారు. ఆయనకి పాట చూపించి ‘మీరు ఎడిటర్ కదా, పాటలో కొన్నిలైన్లు ఎడిట్ చేసి పెడతారా’ అన్నాను సరదాగా! ఆయన పాట అంతా చదివి ‘చూశారా… నా శరీరం ఎలా రోమాంచితం అవుతోందో’ అన్నారు. ఒక్క అక్షరం కూడా తీయడానికి ఆయనకి మనసొప్పలేదు. తప్పక చివరికి ఓ నాలుగులైన్లు తీసెయ్యాల్సి వచ్చింది. ఈపాటను చక్రవర్తి స్వరపరిస్తే ఎస్. జానకి పాడారు. దీన్ని తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారు కృష్ణ. నేను రాసిన పాటల్లో అత్యంత ప్రయోజనకరమైన గీతం ఏదంటే ఇదే అంటాను.
పాట కచేరి
సంగీతం: చక్రవర్తి. గానం: ఎస్. జానకి
పల్లవి:
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం
చరణం 1:
పుడుతూనే పాలకేడ్చి పుట్టీ జంపాలకేడ్చి
పెరిగి పెద్దకాగానే ముద్దూమురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిలకామ మేచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం
మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం
చరణం 2 :
కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి
మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా
ఎర్రని తనరక్తాన్నే తెల్లని నెత్తురుచేసి
పెంచుకున్న తల్లీ ఒక ఆడదనీ మరిచారా
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేత పెదవిముద్ర
ప్రతి భారతి సతిమానం చంద్రమతీ మాంగల్యం
మర్మస్థానం కాదది మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే
మానవరూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే
కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే
ఏమైపోతుందీ సభ్యసమాజం
ఏమైపోతుందీ మానవధర్మం
ఏమైపోతుందీ ఈ భారతదేశం
మన భారతదేశం మన భారతదేశం
(ఈనాడు వారి సౌజన్యంతో)
యూనికోడీకరించినది:ఉండవల్లి పద్మ
పప్పు శ్రీనివాసరావు గారికి,
పద్మ ఉండవల్లి గారికి అభినందనలు.
తిరుమల కొండకో , శబరిమల గుడికో వెళ్ళే భక్తులు ఒక్కో మెట్టు దగ్గరా ఆగి దణ్ణం పెట్టుకుని పూజచేసి ముందుకు వెళ్లినట్టు ఈ పాటలోని ప్రతి ఒక్క అక్షరానికీ మనం నమస్కరించుతూ ముందుకు వెళ్ళినా ఈ పాటకు మనం ఇచ్చిన గౌరవం అప్పటికీ ఇంకా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా పాటకి కావ్యగౌరవం కల్పించిన మహాకవిగా, సినీ శ్రీనాధుడుగా వేటూరిని పిలవటం పట్ల ఎవరికైనా అభ్యంతరాలుంటే వాళ్లకి ఈ ఒక్క పాట వినిపించండి చాలు
కన్న మహా పాపానికి ఆడది తల్లిగా మారి —- ఇంత గొప్ప వాక్యం ఎవరు రాయగలరు వేటూరి గారు తప్ప ..?
ఈ పాట మొదటి సారి విన్నప్పుడు తెలియకుండా కాళ్ళ నుండి నీళ్ళు కారాయి .మహానుభావుడు !
క్షమించండి .కాళ్ళ నుండి అని వచ్చింది పైన రాసిన కామెంట్ లో – కళ్ళలో నీళ్ళు తిరిగాయి అని నా ఉదేశ్యం
తెలుగు సినీ చరిత్రలోనే ఈ పాట చాలా విలక్షణము , స్పూర్తిదాయకంగానూ ఉంది. సాధారణంగా ఒకపాట ఏదైనా హిట్టయితే , అదే తరహా పాటలు మళ్ళి మళ్ళీ రావడం కద్దు.
కానీ ఇంత గొప్పగా రాసి , చిత్రీకరించబడిన ఈ పాటని ఎవరూ ఇంతవరకూ అనుకరించక పోవడము ( చివరికి వేటూరిగారైనా సరే ) ఒకవిధంగా ఆశ్చర్యమే అయినా , తరచి చూస్తే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు , దానిక్కారణము , మరలా అంత గొప్పగా రక్తి కట్టించడము ఎవరి వల్లా కాదు. కొన్ని పాటలు , సినిమాలు , సన్నివేశాలు ‘ న భూతో న భవిష్యతి ‘ అన్న మాటకి నిర్వచనంగా ఉంటాయి. అందులో ఇదొకటి.
నేను ఈ పాట ముందు గా వినలేదు ..సినిమా చూసినపుడు వెంట్రుకలు నిక్క బోడుచుకున్నాయి
Vetoori gariki saati ragala kavi telugu jathiki ika dorakaru.Mahanubhavudu mana vetoori.