వేటూరి సుందరరామ్మూర్తి. ( జననం : జనవరి 29, 1936 – మరణం : మే 22, 2010)
జనవరి 29. “తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపథం..” అంటూ తెలుగు పదకవితా పితామహుడైన అన్నమయ్యను కీర్తించిన వేటూరి సుందరరామ్మూర్తి జన్మదినం ఈనాడు. నాకు తెలిసి సినిమా పాటల్లో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, శ్లేషాలంకారాలు, ప్రాసలు వేటూరి వాడినంతగా మరే ఇతర సినీకవి వాడి ఉండడు. వృత్తి రీత్యా ఎన్నో రకాల పాటలు రాసినప్పటికీ, సందర్భానుసారంగా అవసరమైనప్పుడు తెలుగు సినీ సాహిత్యానికి కావ్యస్థాయి రంగులు అద్ది, హంగులు దిద్ది నన్నయ్య మొదలుకుని వెయ్యేళ్ళకు పైగా విలసిల్లుతున్న తెలుగు సాహిత్య చరిత్రలో యే మహాకవికి తీసిపోకుండా అభినవ శ్రీనాథుడుగా తనకంటూ కూడా కచ్చితంగా ఒక పేజీ సృష్టించుకున్న తెలుగు సినీ పద కవితా మహామహుడు వేటూరి అనడం అతిశయోక్తి కానే కాదు.
సాహితీకుటుంబం లో పుట్టిన వాడు కాబట్టి, స్వతహాగా చిన్నప్పటి నుంచే సంప్రదాయ సాహిత్యంలోనూ, సంస్కృతాంధ్ర సాహిత్యాల్లోనూ పాండిత్యం పొందడమే కాక, తెలుగు భారత, భాగవత , రామాయణాలు, శ్రీనాథ కావ్యాలు, రాయల యుగపు ప్రబంధాల మొదలుకుని విశ్వనాథ కల్పవృక్షం వరకూ వ్రాయబడిన కావ్యాల మీద మంచి పట్టు ఉండడం, భావ కవిత్వం, అభ్యుదయ కవితా తత్వం, త్యాగరాజు, అన్నమయ్యల గీతాల మీద గొప్ప అవగాహన సాధించి సినిమాలకు రాక పూర్వమే కవిగా కొన్ని రచనలు, తెలుగు పాత్రికేయునిగా మరెన్నో వ్యాసాలు రాసి తనకంటూ ఒక పేరు సంపాదించిన సంగతి లోక విదితమే.
ఆయన ప్రతిభ, విద్వత్తు సినిమా పాటల ద్వారా అసలు కొలవనే లేము. ‘నువ్వు పట్టుచీర కడితేనే పుత్తడిబొమ్మ, ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ లాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే సింప్లీ మైండ్ బ్లోయింగ్. అలాంటి ఊహలు అసలు ఏ ప్రాచీన కావ్యాల్లోనూ కనబడనే కనబడవు. అర్జున్ సినిమా లో మధుర మధురతర మీనాక్షి పాట పల్లవిలో “వరములు చిలక.. స్వరములు చిలక.. కరమున చిలక కలదానా.. హిమగిరి చిలక.. శివగిరి చిలక.. మమతలు చిలక.. దిగిరావా” అంటూ చిలక అనే పదాన్ని ఎన్ని అర్థాల్లో వాడారో చూస్తే మతిపోతుందంతే .
అదే పాట చరణంలో విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర నవల కథాంశాన్ని కూడా తీసుకొచ్చి మరొక అందమైన అలంకారం, ప్రాసతో పాటు “శృంగారం వాగైనది ఆ వాగే వైగైనది” అని చొప్పించడం ఆయనకు మాత్రమే సాధ్యమనిపిస్తుంది.
సాగరసంగమం సినిమాలో తకిట తథిమి తకిట తథిమి తందానా పాటలో అన్నమయ్య కీర్తనలోని. “అలరులు కురియగ నాడినదే… అలకల కులుకుల అలమేల్మంగ” అన్న వాక్యాలు యథాతథంగా ఇళయరాజా స్వరానికి రాయడం వేటూరికి సహజ సిద్ధమైన అపార సంగీత జ్ఞానమే కారణం అనిపిస్తుంది నాకు.
ఇంక భక్తకన్నప్ప సినిమా కోసం ఆయన రాసిన కిరాతార్జునీయం పాట అవుతే ఒక చిన్న పాటి ఖండ కావ్యం అనుకోవాలి. నాకయితే శ్రీనాథ కవి సార్వభౌముడు హర విలాసంలో రచించిన కిరాతార్జునీయం పద్యాలకి పోటీ పడుతూ వేటూరి గారు ఆ పాట రచించారేమో అనిపిస్తుంది. అంత ప్రౌఢత్వం ఒట్టి పడుతుంది ప్రతీ వాక్యంలో. నిజానికి నా మటుకు నాకు శివపార్వతులు కిరాతకుడు, ఎరుకలసాని గా మారే ఘట్టాన్ని శ్రీనాథుడు రాసిన దానికంటే ఒక మెట్టు పైనే వేటూరి వర్ణించారిమోననిపిస్తుంది. శ్రీనాథుడు వ్రాసిన సీస పద్యం, వేటూరి వర్ణన చూడండి మీకే అర్థమవుతుంది..
శ్రీనాథుని హరవిలాసం, సప్తమాశ్వాసం, 41వ పద్యం :
సీ.
వికటపాటల జటామకుటికా భారంబు
కఱకైన జుంజుఱు నెఱులు గాగ
జారు సుధాధామశకలావతంసంబు
పెడకొప్పుపైనుండు పీకెగాగ
ఘనలలాటంబున గనుపట్టు కనువిచ్చు
గైరికద్రవ తిలకంబు గాగ
భుజమధ్యమున గ్రాలు భుజగహారంబులు
గురిజపూసల గుబ్బసరులు గాగ
తే.గీ
శంకరుండు కిరాతవేషంబు దాల్చి
యగజ చెంచెతయై తోడ నరుగుదేర
బాణి నోంకార దివ్యచాపము ధరించి
వచ్చె వివ్వచు వరతపోవనము కడకు
భక్తకన్నప్ప పాటలో వేటూరి ఆ పద్యానికి చేసిన అనుసృజన :
నెలవంక తలపాగ నెమలి యీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి బారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా
తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు
శ్రీనాథుడు తన పద్యంలో శివుడి తల మీద గంగ ఏమైందో మార్చిపోయారని కాబోలు మన అభినవ శ్రీనాథుడు వేటూరి ఆమెను తలపులోనికి జార్చేశాడు.
అలా వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య మహా సముద్రాన్ని అపర అగస్త్య మహామునిలా అవపోసన పట్టేసి తెలుగు వారి అదృష్టం కొద్దీ గత అర్థశతాబ్దంగా మనం క్షీర సాగరమధనం చెయ్యకుండానే అమృత ఝరులను, అప్సరసాలను, పారిజాత సుమాలను, చందమామ చలువలును, కామధేనువు క్షీరాలను, లక్ష్మీ కటాక్షాలను, నిధి నిక్షేపాలను, ( అప్పుడప్పుడు కొన్ని గరళ ధారలను కూడా ) తెలుగు సినిమా పాటలు గా మార్చేసి మన ధారాదత్తం చేసిన ఘనత వేటూరిది.
ఇలా చెప్పుకుంటూ పోతే వేటూరి పాటల్లో ఉన్న శ్లేష, అర్థ, శబ్దాలంకారాలు, ఇతర చమక్కులు, జిమ్మిక్కులు పేర్కొనడానికి పుస్తకాలకి పుస్తకాలు రాయాల్సి వుంటుంది. అయితే వీటన్నిటితో పాటు వేటూరి సినీ సాహిత్యంలో నాకు నచ్చే మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే చాలా పాటల్లో మన ప్రాచీన కావ్యాల్ని, కవుల్నీ, ఆధునిక రచయితలు,పుస్తకాల పేర్లు అవకాశం దొరికినప్పుడల్లా సూచనప్రాయంగా తీసుకొచ్చేసి తన పాటల్లో అలవోకగా ఇమిడ్చేస్తారు. అవి మహా మాస్ పాటలయినా, మెలోడియస్ క్లాస్ పాటలయినా, ఐటెం సాంగ్స్ అయినా, ఏమైనా కానివ్వండి ప్రాచీన కావ్యాల పేర్లు, కవుల పేర్లు, పద్యాల పాదాలు, తన ముందుతరం భావకవుల పేర్లు మనకు స్ఫురణకు వచ్చేటప్పటికి నాకు భలే ఆనందం వేస్తుంది.
నిజానికి ఆ భగవంతుడు అనుగ్రహించి, సరస్వతీ లోకంలో ఉన్న పుంభావ సరస్వతి ‘ వేటూరి’ కరుణించి ఆశీర్వదిస్తే వేటూరి సినీ గీతాల్లో ప్రాచీన కావ్యాలు, కవుల ప్రస్తావన అనే అంశంతో ఎప్పటికైనా ఒక పుస్తకం రాయాలని చిన్న కోరిక ఉంది. వందకి పైగా పాటలే పరిశోధించి పక్కన పెట్టుకున్నాను. చూద్దాం నా కలం కాదు… కాలమే నిర్ణయించాలి.
PS: రెండేళ్ల క్రితం ప్రతి ఆరునెల్లకొకసారి జరుపుకునే టెక్సాస్ సాహితీ సదస్సు ఏభయ్యవ సభ టెంపుల్ నగరం లో జరిగినప్పుడు నేను వేటూరి సినీ గీతాల్లో ప్రాచీన కావ్యాల ప్రస్తావన అనే అంశం మీద చిన్న ప్రసంగం చెయ్యడం జరిగింది. ఆ వీడియో ఈ పోస్టుకు జత చేస్తున్నాను. వీలుంటే ఓ పదిహేను నిమిషాలు నాకోసం వెచ్చించి చూడండి. తెలుగు సాహిత్యం మాత్రమే కాదు, సినిమా పాటలు ఇష్టమైన వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుందని హామీ ఇస్తున్నాను.
( తన ఫేస్బుక్ పోస్టును ప్రచురించడానికి అనుమతినిచ్చిన విజయసారథి గారికి మా కృతజ్ఞతలు)