నా తెలుగు సాహితీ ప్రయాణములో మైలు రాయి (ఇరువంటి మాధురీ దేవి)

వేటూరి గారి జయంతి సందర్భంగా ఇదివరకే ఒక వ్యాసం పంపించినా మనసు ఉండబట్టక ఈ వ్యాసాన్నీ రాసి, “ఇది వ్రాయక పోతే కృతఘ్నత అనిపించిందండీ!” అంటూ పంపిన మాధురీ దేవి గారి అభిమానానికి మా వందనాలు!  – వేటూరి.ఇన్ టీం

బడిలో ప్రతి సంవత్సరం ౙరిగే వేడుకలలో భాగంగా ఆ సంవత్సరం కూడా మా తరగతి విద్యార్థులందఱూ వేడుకలకు సాధన చేస్తున్నారు.

అక్కడ "టైటానిక్" పాట వినపడుతూండగా, తెలుగు మాధ్యమంలో ౘదువుతున్న మా స్నేహితులు నన్ను అటు పిలిచినప్పుడు ఈ పాట లోని సాహిత్యం నన్ను కట్టి పడేసింది.

పదానికి - పథం, దివ్య సభ, నవ్య లాస్యము, హరి నామము, అర ముద్దలూ - ఈ శబ్ద సౌందర్యం - నాడు పాఠశాల స్థాయి విద్యార్థిని గా ఉన్న నాకు భలే "ఆకర్షణ" గా అనిపించింది.

అంతే, ఇక వదలకుండా ఆ పాట వెంటే నా బాటా అని సాగాను. సినిమాల ముందు, వెనుఁక వరస క్రమం తెలియదు కానీ, ఇప్పటి లా సాంకేతికత, సాంఘిక మాధ్యమాల అందుబాటు ఊహ కూడా తెలియని రోౙుల్లో, "సరిగమ"లతో ఆ పయనం కొనసాగింది.

కానీ నన్నిటు నడిపించిన ఈ ఆణిముత్యం తో నా ఆనందం మఱింత హెచ్చింది కనుఁక, ఈ పాట గుఱించి ఆ మేరు శిఖరం జయంతి సందర్భంగా ప్రస్తావించాలనిపించి...

ఓం..ఓం
తెలుగు పదానికి జన్మదినం - అవుఁను, ఈ పాటతో తెలుగు భాషా పఠనం వైపు నాకూ తొలి అడుగే. (ప్రాగ్దిశ వేణియ మ్రోగే నాటికి చిన్న పిల్లనే, కనుఁక అప్పుడు ౘదవటం వఱకే. ఈ పాట తోటే శబ్ద సౌందర్యం, భావ తరంగం వంటివీ విశ్లేషణ చేయటము మొదలు పెట్టాను. ఈ వ్యత్యాసం నేను ఎదుగుతూ ఉండటం వలననే అయినా, నాకు పునాది అయిందని ఈ ఆరాధన).

ఇది జాన పదానికి జ్ఞానపథం - పద సౌందర్యం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణు పదం - వె, వి లకు యతి

అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము - అరి, హరి - ప్రాస‌యతి

బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్య సభలలో నవ్య లాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి - దివ్య, నవ్య, అన్ని లోకాలూ స్పృశింౘటాన్ని ఎంత బాగా చెప్పారు!

నీరద మండల నారద తుంబుర మహతీ గానవు మహిమలు తెలిసి
సితహిమ కందర యతిరాట్సభలో తపఃఫలమ్ముగ తళుకుమని - సిత, యతి
తల్లి తనముకై తల్లడిల్లు - తల్లి, తల్లడిల్లు
ఆ లక్క మాంబ గర్భాలయమ్ములో - లక్కమాంబ, ఆ'లయమ్ము'
ప్రవేశించె ఆనందకము నందనానంద కారకము - నంద, నంద, నంద!

అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగ పద్మాసనుడే ఉసురు పోయగ
విష్ణు తేజమై నాద బీజమై అంధ్ర సాహితీ అమర కోశమై - తేజమై, బీజమై - ఏమా శబ్ద సౌందర్యం!
అమర కోశమై - పాటూరి వారే మా పాటకులామృతామరకోశం

అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా - పా, పా, భా - యతులు
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా - హరి, అర
తెలుగు భారతికి వెలుగు హారతై - ఆహాహా! పాదం మొత్తం శోభామయమే
ఎదలయలో పద కవితలు కలయ - ఏమా లయ!

తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ


పాటంతా ఛందో భాషణమే, అయినా భావగర్భితమే.

తన గుఱించి ఇంత బాగా వ్రాసిన మన పెన్నిధి, పెన్ను నిధి గారిని ౘూసి ఇప్పుడు మురిసి పోతుంటారేమో, ఆ పద కవితా పితామహుడు అన్నమయ్య!

- ఇరువంటి మాధురీ దేవి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top