వేటూరి గారి జయంతి సందర్భంగా ఆయనపై అభిమానాన్ని అందమైన అక్షరాలుగా కురిపించిన మాధురీ దేవి గారికి మా కృతజ్ఞతలు – వేటూరి.ఇన్ టీం
కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే.
అక్షరాలు అర్థ శతం, భావాలు బహుళం.
ఇలాగని చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొక్కటే అనుకుంటే, వేటూరి గారి పాటల పల్లవులు ఒక్కే చరణానికి ఎన్నో ఉండగలవు.
"ఆకాశాన సూర్యుడుండడూ సంధ్య వేళకే" అనే పాటనే తీసుకుంటే, సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఉండే తెనుఁగు భాష ఉన్నంత కాలం వేటూరి గారి పాట కచ్చితంగా ఉంటుంది కదా! ఒక పూట లోనే రాలే పూవు కాదు కదా! అక్షర సుమగంధం!
అటువంటి వేటూరి గారి పాట గుఱించి ఎవఱైనా చెప్పగలగటం సాహసం కాదు కానీ, "పునరుక్తి" అయిపోతుంది, ఎందుకంటే, అందఱూ చెప్పేది "ఆ ప్రశంసయే" కాబట్టీ, వారు తెనుఁగు పాటల "పెన్నిధి (పెన్నునిధి) అని!
"అచ్చెరువున, అచ్చెరువున; ఆ రాధ ఆరాధనా గీతి; ఇందువదన కుందరదన; పేగుముడీ, ప్రేమగుడీ", ఈ పద సంపద, ప్రయోగమూ సరే!
"నీ కాపురం శ్రీ గోపురం తాకాలి నీలాకాశం" - ఈ భావ సంపద ఎంత గాంభీర్యం! ఆ ఇల్లాలికి ఎంత ౘక్కటి దీవెన! ప్రతి ఇల్లాలూ మురుసుకోదూ, ఈ పాదం గైకొని!
ప్రతి భారత నారినీ "చంద్రమతి" అన్నారు!
ఆమె పుట్టిల్లు "చిరునవ్వే"నంటారు.
ఈ భావ సౌందర్యానికి ఏమని పట్టం కట్టాలి!
"భావ దారిద్ర్యము" అంటూ తరౘూ ఎందుకు వినపడుతుందో నాకు అర్థం కాదు, ఇక్కడ ఇంత పొందికగా వివరించే నిధులు మనకుండగా! సదా అండగా.
రాగాల గోదారి... గోదారికి రాగాన్ని ఆపాదించేశారు, ఆ పాదంలో.
ౘుక్కానవ్వవే, వేగు ౘుక్కా నవ్వవే అనీ ౘూశాము, అంత కంటే ముందే, మిన్నేటి సూరీడు అంటే, మిన్నును "ఏరంటూ", ఆ "ఏటి" సూరీడన్నారు. ఏమా ప్రజ్ఞ!
కనుచేపలకూ, చేపకళ్ళ సోయగాలు, చిరు చేపల కనుపాపలూ అనే అందం సరే, ఈ అలంకారాలూ, విశేషణాలూ భాషా సౌందర్యం.
"కన్నీటికి కలువలు పూచేనా", "నీ కంటిలో నలకలో వెలుగును నేనూ, ఆ కంటికి రెప్పనై ఉన్నానూ" అనే కరుణా రసభావ నిలయునకు కరములు జోడించి కైమోడ్పులియటం తప్పితే కలము కదిపి కవనమునల్లే శక్తి నాకు కరువని తెలియచేస్తూ...
- ఇరువంటి మాధురీ దేవి