అసలీ వేటూరి అనేవాడు ఉన్నాడే… మేనకకి మేల్ వెర్షన్ అనుకుంటా… అట్రాక్షన్లో కాదు డిస్ట్రాక్షన్లో.😂
అందరూ నిద్రపోయాక అర్థరాత్రి ఏకాంతం దొరికిందని మనం ఎక్కడో బాల్కనీలో కూర్చొని ఏదో సీరియస్గా తపస్సు చేసుకునే రేంజ్ లో విప్లవాత్మక కథ కోసం స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటాము. ఇంతలో చల్లగా ఎక్కడనుండో
"హిమమే కురిసే వెన్నెలమ్మ వాకిట
సుమమే విరిసే చందమామ కౌగిట"
అని వినిపిస్తుంది.. వెంటనే అప్రయత్నంగా
"ఇది ఏడడుగులా… వలపూ మడుగులా కన్నె ఈడు ఉలుకులు కంటి పాప కబురులు ఎంతెoతో తెలిసినా… మౌనమేలనోయి"
అని పాడుకోకుండా ఉండగలమా?
ఇక అక్కడ నుండి మొదలు….
“కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి” అని పాడేస్తుంది నోరు… ఆ పాట అవగానే ఈ పాట వినడం బాల్యం నుండి ఉన్న అలవాటు… ఆ అలవాటు వెనుక ఒక కథ కూడా ఉందిట . ముందుగా సాగరసంగమంలో వేదం అణువణువున నాదం పాట చివర కిన్నెరసాని వచ్చిందమ్మ పాట (పల్లవి) కలిపే రికార్డ్ చేశారుట, కానీ k.విశ్వనాథ్ గారు తన పేరు వచ్చిందని ఆ పాట వద్దనుకున్నారుట…అయినా కొన్ని క్యాసెట్ లలో ఆ పాట కింద ఈ పల్లవి కలిపే వచ్చేసింది మార్కెట్ లోకి. అందులో ఒక క్యాసెట్ మాకు దొరికింది. తరువాత ఆ పాటను పారేసుకోవడం ఇష్టం లేక సితారకు పల్లవిగా ఇచ్చారు వేటూరి గారు అని ఒక కథ. 🤷♀️
ఏది ఏమైనా… రాస్తున్న విప్లవాత్మక సాహిత్యపు స్క్రిప్ట్ మీదుగా దృష్టి అలవోకగా వేటూరి గారి వెన్నెల పాటల మీదకి మళ్ళిపోతుంది.
‘ఇంకా ఏమేమి వెన్నెల పాటలు రాసాడు మన గురు’ అని మస్తిష్కoలో గూగుల్ సెర్చ్ ఇంజన్ దానంతట అదే ఓపెన్ అయిపోతుంది.
“వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం“
“వెన్నెలైనా చీకటైనా”
“పండగంటి ఎన్నెలoతా సేందరయ్య
దండగయ్యిపోయింది సెందరయ్య”
“నవమి నాటి వెన్నెల నీవు దశమి నాటి జాబిలి నేను”
“వెన్నెల్లో ఈ నీలాకాశం”
దగ్గరనుండి మొదలయి
“వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా?” అంటుంది మనసు. ఇంకేముంది అరగంటకు పైగా ఇంత వెన్నెలను గ్రోలాక ఈ తరహా వేటూరి పాటలు మరిన్ని కావాలంటుంది మనసు.
“వెండి చందమామలు
వేయి తీపి రాత్రులు
ఎండ పూల జల్లులు ఎవరికోసమో
ఒకరికోసమొకరున్న
జంటకోసమూ” అంటూ శ్రుతి కలుపుతుంది వెన్నెల.
“నా తోడువై నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై” అంటూ మరో పాట గుర్తుకొస్తుంది.
“ఏ జన్మ బంధమో ఈ రాగ బంధము
ఏడేడు జన్మలా అనురాగబంధము” అని కెరటంలా మరో గీతం తడిపి పోతుంది.
ఈ వేటూరి అనే సముద్రoలో ఎగసిపడే ఎన్ని కెరటాలనని ఈ చిన్ని దోసిళ్లతో పట్టుకోను? రేయంతా ఎన్నెన్నో తీపి పాటల కెరటాలలోనే మనసు తడిసిపోయింది. ఒకోసారి తపోభంగం జరగడం కూడా లోకకళ్యాణo కోసమో మనను మరో లోకానికి తీసుకుపోవటం కోసమో జరుగుతుందనుకుంటా. నాటి మేనక వల్ల శకుంతలోపాఖ్యానం లోకానికి తెలిస్తే నేటి మేనకకి ‘మేలు’ వెర్షన్, వేటూరి గారు కానరాకుండా చేసిన తపోభంగం వల్ల ఈ వెన్నెల గీతోపాఖ్యానం మరోసారి వెలుగులోకి వచ్చింది. 🤷♀️
మరక మంచిదే అన్నట్టుగానే తపోభంగం కూడా మంచిదే.😀