వేటూరి గారు “మౌనమేలనోయి” పాటలో “నీలి నీలి ఊసులు” అని ప్రయోగించారు. ఈ “నీలి” పదాన్ని ఇతర పాటల్లో కూడా వాడారు. దీని అర్థమేమిటన్న చర్చ ఒక మా వేటూరి Whatsapp group లో జరిగింది. దానిని ఇక్కడ పొందుపరుస్తున్నాం. మొత్తంగా తేల్చినదేమిటంటే ఈ ప్రయోగాన్ని పలురకాలుగా అర్థం చేసుకోవచ్చని:
- శృంగార పరమైన ఊహలు
- ఉత్తుత్తి ఊసులు
- అస్పష్టమైన భావాలు
మౌనమేలనోయి పాటలో “నీలి నీలి ఊసులు” ప్రయోగాన్ని శృంగారపరంగానే అర్థం చేసుకోవాలి అని చాలా మంది అభిప్రాయపడ్దారు. ఈ విషయాన్నే కిరణ్ చక్రవర్తుల ఇలా చెప్పారు:
ఆ పాట సందర్భం చాలా ప్రత్యేకమైనది. స్నేహితుడికి పెళ్ళిపెద్దలై పెళ్ళి చేసిన నాయికా నాయకులు వాళ్ళని గదిలోకి పంపాక… అక్కడ ఉన్నది వయస్సులో పెద్దవాళ్ళయితే కాసింత borderline ముతక మాటలు అనేసి, పగలబడో ముసిముసిగానో నవ్వి తలుపులు వేసేస్తే అయిపోతుంది. వీళ్ళా పడుచు వయసులో ఉన్నవాళ్ళు. ఇద్దఱే మిగిలాక ఏదైనా మాట్లాడదామా అంటే చేయించిన పెళ్ళి జంట గుఱించి మాట్లాడాలి, ice breaker లాగా! కానీ, అవతలేమో వాళ్ళకి శోభనం. అందుకు అది “మఱపు రాని రేయి”, కానీ వీళ్ళ మధ్య “మౌనం”. ఇటువంటి సందర్భంలో వ్రాసిన “నీలి ఊసులు” అన్నది నా దృష్టిలో శోభనానికి సూచనయే! అస్పష్టమైన భావాలు అనుకోవచ్చు గాక, కానీ ఆ చరణమంతా ఒకింత స్పష్టంగానే శోభనం గుఱించే వ్రాసినట్టు ఉంటుంది.
నిజమే! ఈ పాటని శోభనం పాటగా సినిమా కథతో సంబంధం లేకుండా అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమా కథని కూడా ప్రస్తావిస్తూ ఇంకో layer of meaning ని కూడా వేటూరి తీసుకొచ్చారు. ఆయన ఇలా సినిమా కథని అంతర్లీనంగా ప్రస్తావిస్తూ సందర్భోచిత గీతాలు రాయడంలో సిద్ధహస్తులు!
శృంగార భావం అన్నది లేతగా ఉండొచ్చు, చిలిపిగా ఉండొచ్చు, నాటుగానూ ఘాటుగానూ ఇంకా పచ్చిగా కూడా ఉండొచ్చు. ఈ పాటలో mood ఏమిటన్న చర్చ ఒకటి వచ్చింది. “నీలి నీలి ఊసులు” అనగానే “నీలిచిత్రం” స్ఫురించొచ్చు కొంతమందికి. ఇలా అర్థం చేసుకోవడం సబబా కాదా అని ప్రశ్న. దీనికి చర్చలో తేలిన సమాధానం – “నీలిచిత్రం అనగానే జుగుప్స కలిగించే graphic imagery స్ఫురిస్తే కాదు, ఎందుకంటే ఇది సున్నిత శృంగారంతో నిండిన ఉదాత్తమైన సన్నివేశం కనుక. ఆదిత్య మారెళ్ళపూడి ఇలా అన్నారు:
ఇంత చక్కటి పాటని అలాంటి అర్థం వచ్చే ప్రయోగంతో చేజేతులారా ఎందుకు పాడుచేసుకుంటారో నాకు అంతుచిక్కలేదు. తెలిసో, తెలీకో మనం అలా ఊహించుకుంటే ఆయన స్థాయిని తగ్గించడమని, నైతికతను శంకించడమని అనిపించింది. “శంకరా నాదశరీరాపర ” లాంటి పాటలో బూతు వెతికితే ఎంత అసహ్యంగా ఉంటుందో, ఇలాంటి పాటలో కూడా వెతకడం అంతే అసహ్యంగా ఉంటుంది, ఎంత శృంగార గీతమైనప్పటికీ. అదే అర్థంతో కనుక వ్రాసుంటే పాలలో ఉప్పుగల్లు వేసినట్టవుతుంది. వేఱే సందర్భాల్లో అలాంటివేమైనా వ్రాసుండొచ్చేమో కానీ, ఇటువంటి పాటలో అయితే కచ్చితంగా వ్రాసుండరని నా నమ్మిక.
అస్పష్టతని ఇష్టపడే వేటూరి గారి రచనా శైలిలో ఉండే ఒక చిక్కు ఇది. ఎవరికి తోచిన అర్థాలు వారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శృంగారపరమైన పాటల్లో ఈ సమస్య మరీ ఎక్కువ.
నీలి ఊసులని అస్పష్టమైన భావాలుగా కూడా తీసుకోవచ్చు అని కాలనాథభట్ల ఫణీంద్ర అభిప్రాయపడ్డారు.
నీలి ఊసులు అంటే “నల్లని ఆలోచనలు”. శృంగార పరమైన తలపులు అనుకోవచ్చు. అస్పష్టమైన భావాలూ కావొచ్చు. సినిమా సందర్భం అదే. ప్రేమ, ఆకర్షణా, అభిమానం అన్నీ ఉన్నా వాటిని కలిపి ఏ రూపంలో నిలుపుకోవాలో, ఏ పేరు పెట్టాలో, ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధత.
చివరిగా చర్చలో సురేశ్ కొలిచాల గారు పాల్గొంటూ “ఉత్తుత్తి ఊసులు” అన్న అర్థాన్నీ సూచించి, కొన్ని ఇతర ప్రయోగాలని ప్రస్తావించారు:
నీలి వార్త అంటే అబద్ధపు వార్త, . నీలాపనిందలు ( నీల + అపనింద) అంటే ఏమాత్రం సత్యం లేని నిందలు. నీలి ఏడుపు అంటే ఉత్తుత్తి ఏడుపు. నీలిఊసులు అన్నది ఉత్తుత్తి ఊసులు, కల్లబొల్లి కబుర్లు, nonsensical blabber అన్న అర్థంలో ప్రయోగించవచ్చు. అయితే శృంగారపరంగా nonsensical romantic blabber, sweet-nothings అన్న అర్థం కూడా పొసగుతుంది.
వేటూరి పాటల్లో కొన్ని నీలి ప్రయోగాలు:
- కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం (రాక్షసుడు)
- దేవతలా నిను చూస్తున్నా …
నీ వెన్నెల నీడలైన నా ఊహలు
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు
(ఇక్కడ కల్లబొల్లి ఊసులు అన్న అర్థమే పొసగుతుంది) - మూగె నా గుండెలో నీలిమంట (బొంబాయి సినిమాలో పాట)
- వాలు కనుల వలుపు గనుల నీలి మెరుపులు (ఇంద్రధనుస్సు చీర కట్టి… చంద్రవదన చేరవస్తే) – ఇక్కడ కళ్ళ నీలిమ గురించే!
ఇక నీల/లినయనాలు, నీలి ముంగురులు, నీలాకాశం, నీలాంబరం మొదలైనవన్నీ సూటిగా బ్లాక్, బ్లూ రంగులను ప్రస్తావిస్తూ రాసిన మాటలే కాబట్టి వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు.
Sir WhatsApp గ్రూప్ అంటే చదివి నేను వెదికాను, నాకు దొరకలేదు, అంటే పర్సనల్ గా మీరు క్రియేట్ చేసుకున్న గ్రూపా,… నన్ను కూడా add చేయండి, అలాగే ఒక రిక్వెస్ట్ వేటూరి గారి రచనలన్నీ ఒక app రూపం లో గాని website లో గాని పెట్టగలరు… నా నెంబర్ 9000323207