ఒకసారి
శ్రీ వేటూరి !
AVM స్టూడియో, మద్రాసు.

నేను సంభాషణలు వ్రాసిన సినిమా షూటింగ్ జరుగుతోంది. సిగరెట్ కాల్చుకోవడం కోసం ఫ్లోర్ లో నుండి బైటకి వచ్చాను. ఆ పనిలో వుండగా శ్రీ వేటూరి గారు గబగబా నడుచుకుంటూ వచ్చారు. నేను సిగరెట్ పారేసి నమస్కరించాను. ప్రతి నమస్కారం చేసి బావున్నారా అని అడిగారు. అంతలో ఒక బాయ్ ఆటో తీసుకు వచ్చాడు. వేటూరి గారు ఆటో ఎక్కుతుంటే “అదేంటి సార్ ఆటోలో ఏంటి మీ కారు వుంది కదా” అన్నాను.
“ఉందండీ..సాంగ్ రికార్డింగ్ అయిపోయాక వచ్చి చూస్తే డ్రైవర్ గాఢంగా నిద్రపోతున్నాడు. పాపం నిద్ర లేపడం ఎందుకని ఆటోలో వెళ్తున్నా” అని పసిపాపడంత హాయిగా నవ్వేసి ఆటోలో వెళిపోయారు.
అదే ఇంకొకరయితే డ్రైవర్ని నిద్రలేపుతారు. లేదా నిద్రపోయినందుకు కోపం వచ్చి ఉద్యోగం పీకేసేవారు.
కానీ ఆ మహాకవి వేటూరి గారు డ్రైవర్ని నిద్రలేపడం ఇష్టం లేక ఆటోలో వెళ్ళారు.
నా కళ్ళు చమర్చాయి.
ఎంత సున్నిత హృదయం ఆయనది!
అందుకేనేమో అన్ని వేల పాటలతో తెలుగు వారి గుండెల్ని తడిపేశారు.
ఆ మహానుభావుడి వర్ధంతి ఈ రోజు.
ఎందుకో ఈ సంఘటన గుర్తొచ్చింది!!
‘దివాకర్ బాబు మాడభూషి’ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం