వేటూరి పదస్మృత్యంజలి (చంద్ర రెంటచింతల)

భాషాభిమానాన్ని భావాభినివేశాన్ని గానామృతంగా పసిపిల్లలకు కూడా అర్థమయ్యేట్లు ఉగ్గుపాలుగా పోసి, రెండుమూడుతరాలను బతికించిన వేటూరిగారి వర్థంతి సందర్భంగా పదస్మృత్యంజలి

ఆంధ్రకీర్తి

పుట్టింది పండితవంశంలో
పెరిగింది పత్రికారంగంలో
పలికింది గాయకస్వరాల్లో
వినబడింది మనసులోతుల్లో
విడవనంటోంది విధిగా వినబడి క్షణాల్లో
వీడేదేహాన్ని విడిచివెళ్ళింది ఈరోజే!

పెళ్ళికాని ఆడపిల్ల గుండెచప్పుడులా వినబడి
పెళ్ళిశుభలేఖల్లో పరువుగల ఆడపిల్ల గుండెచప్పుడై కనబడి
పెళ్ళితోరణాలు పైకెత్తే పాటలలో వినబడి
పెళ్ళిపనుల్లో నవ్విస్తూ పలకరించబడి
పెళ్ళిపీటలపై సిగ్గుపడే ఆడపిల్ల మనసుతెరచాటై నిలబడి
తలెత్తేచోట తలదించనిచోట తలెత్తుకునేచోట
అన్నీ తానైన అక్షరవీరుడు మన వేటూరి

అరవయ్యేళ్ళ పెద్దాయన అద్వైతంతో అడగాలన్నా
నలవయ్యేళ్ళ నర్తకుడు వేదాంతంగా మాటాడాలన్నా
ఇరవయ్యేళ్ళ పడుచుపిల్ల ఇలప్రియుణ్ణి ఆటపట్టించాలన్నా
పసిపిల్లలు దేవకన్యను భూమిపైనే చూసి తరించాలన్నా
రామా కృష్ణా అనుకునే పెద్దవాళ్ళకు రాశులపుణ్యం వరించాలన్నా
అందరికి ఆయనే తోడు

ఎన్టీయారునుండి చిన్నెంటీయారు వరకు
ఏయన్నారునుండి మనవడివరకూ
చిరంజీవి నాట్యప్రతాపాల వెనుక
విశ్వనాథుని విజయాల ముంగిట
విన్న పాటల విన్నపాలు ఆయనవే
వీరులందరికి విజయచిహ్నమైన తోడై
వినిపించేందుకు వారికాయనే మొదటితోడు
ఆయన పదాలకు వీరవేగమే జోడు
ఆయన పదాల వెనుక విజయోస్తుగా దేవుడే తోడు
ఆయనకిప్పుడు దేవుడి పదాలతో తోడు
ఆయనెప్పుడూ వీనులొదలని పదాలరేడు

శ్రీశ్రీ మల్లాది ఆత్రేయ ఆరుద్ర ఒకరిగా పరకాయప్రవేశమైనట్టు
సినారె శబ్దాలంకారాలను అధిగమించి ఆడించినట్టు
దాశరథి భావావిష్కరణ లాలిత్యాన్ని ఒడిసిపట్టి ఒంపినట్టు
దేవులపల్లి భావగీతసౌందర్యదిశల పెరిగి ఎదిగినట్టు
శ్రీశ్రీ విప్లవభావగొంతుకవిని అబలగొంతుకలో అమర్చినట్టు
మల్లాది జానుతెనుగుసొగసువన్నెలు అనువాదపాటలకిచ్చి అలరించినట్టు
ఆత్రేయ తాత్వికతానందాన్ని పెంపొందించి ఆకాశానికి పాటగా చేర్చినట్టు
సముద్రాల ఆరుద్రల సీతారామకీర్తనము దాటి సీతారాములకు తానే దగ్గరైనట్టు
అమరగీతాలనిచ్చిన అమరదీప్తి
ఆత్మసాక్షిగ నడచిన అవిరామస్ఫూర్తి
అమ్మగోదారిపాటల ఆత్మతృప్తి
అమ్మభాషకు వందనమిడిన ఆంధ్రశక్తి
అమరవీధుల పదమైన అమరమూర్తి
అమరభాషాసౌందర్యార్చక ధన్యమూర్తి
ఆంధ్రభాషాలంకృతము మీ పదసుకీర్తి
అన్నిమాటలేల! వేటూరి ఆంధ్రకీర్తి!

చంద్ర రెంటచింతల గారికి, చిత్రకారుడికీ ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.