వేటూరి గారు పోయి అప్పుడే పదేళ్ళు అయిపోయాయా అనిపిస్తుంది. 2010 లో ఆయన పోయినప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉన్నా టీవీలో న్యూస్ చూడలేదు. మా నాన్నగారు ఫోన్ చేసి ఇంట్లో బంధువు ఎవరో పోయినట్లు చాలా నెమ్మదిగా విషయం చెప్పి “ఫీల్ అవ్వకు” అన్నారు. వెంటనే టీవీ పెట్టి చూస్తే అన్ని చానెల్స్ లో ఆయన గురించే చెప్తున్నారు. నాకు చాలా బాధ కలిగింది. “మౌనమై పాడనీ బాధగా” అంటూ ఓ కవిత రాసుకుని నా బాధని విప్పి చెప్పుకుంటే కొంత రిలీఫ్ గా అనిపించింది. కానీ ఆయన ఫోన్ లో నాతో అన్న ఆఖరి మాటలు గుర్తొచ్చి మళ్ళీ బాధ కలిగింది – “మీరు చాలా సార్లు ఫోన్ చేసి ఎప్పుడు కలుద్దామని అడుగుతున్నారు. నేను టైమ్ ఇవ్వలేకుండా ఉన్నాను. ఇప్పుడు ఒక షోలో ఉన్నాను, ఎక్కువ మాట్లాడలేను. తర్వాత చెయ్యండి.” ఆయన గొంతులో విసుగు స్పష్టంగానే వినిపించింది. ఆయనని కలవలేకపోయాను అన్న అసంతృప్తి ఒకటైతే, పెద్దాయనని నా ఫోన్ కాల్స్ తో ఇబ్బంది పెట్టానే అన్న బాధ మరొకటి.
నిజానికి నేను సిరివెన్నెల తరానికి చెందిన వాడిని. నాకు సినిమా పాటల సాహిత్యంపై ఆసక్తి ఏర్పడి సినిమా పాటల్ని అనలైజ్ చేస్తున్న 1994-1998 సంవత్సరాలలో సిరివెన్నెలదే హవా. నాకు నచ్చిన పాటలన్నీ సిరివెన్నెలవే అవుతూ ఉండేవి. నేను దూరదర్శన్ లో మొదటిసారి ఒక లిరిసిస్ట్ ఇంటర్వ్యూ చూసింది కూడా సిరివెన్నెలదే. అన్ని సినిమా పాటలూ సిరివెన్నెలే రాస్తారు అని అనుకుంటున్న ఆ రోజుల్లో, ఆ ఇంటర్వ్యూలోనే సిరివెన్నెల వేటూరిని ప్రస్తావించి “శంకరా విని తరించరా!” అనగలిగే దమ్ము ఆయనకే ఉంది, ఆయనే నా హీరో అన్నారు. “నా హీరోకే హీరోనా!” ఎవరీ వేటూరి అని చూస్తే అప్పట్లో నాకు చాలా నచ్చిన “ఆకాశాన సూర్యుడుండదు సందెవేళకే ” పాట వేటూరి రచన అని తెలిసింది. నాకు చాలా ఇష్టమైన కె.విశ్వనాథ్ గారి సినిమాలు శుభలేఖ, సాగరసంగమం వంటి వాటికి ఆయనే పాటలు రాశారని తెలిసింది. అయితే నాకు వేటూరి పాటల గురించి పూర్తిగా తెలిసి, ఆయనపై అభిమానం ఏర్పడడానికి కారణం ఆకాశవాణి విజయవాడ కేంద్రం “వివిధ భారతి” రేడియో పాటలు.
1998-2002 మధ్య విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకునే రోజుల్లో వివిధభారతి ప్రసారం చేసిన ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు నాకు ఎంతో మంది సినీ గేయ రచయితలను పరిచయం చేశాయి. అప్పుడే వేటూరి విశ్వరూపం అర్థం అయ్యింది. ఎప్పుడూ వినని “పున్నమి లాగ వచ్చిపొమ్మని జాబిల్లడిగింది, పుష్కరమల్లె వచ్చిపొమ్మని గోదారడిగింది”, “నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో”, “తొలి సందెకు తూరుపు ఎరుపు, మలిసందెకు పడమర ఎరుపు”, “కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి”, “సీతాలు సింగారం మాలచ్చి బంగారం” వంటివి నాకు విపరీతంగా నచ్చాయి. కవిత్వం అంటే ఏమిటో నాకు తెలియకపోయినా ఆయన పాటల్లో ఆ కవిత్వం లాంటిది ఏదో ఉంది అనిపించింది. కట్టిపడేసే పల్లవులూ, తెలుగు పదాలు వాడుకలో తనదైన ఒరవడీ, సహజస్ఫురణ (intuition) తో సాగే రచనా విధానం, పాటంతా పరుచుకున్న కవిత్వం, వెరసి ఆయనకే సొంతమైన అందం ఒకటి నన్ను అమితంగా ఆకట్టుకుంది. తర్వాత రోజుల్లో ఆర్కుట్ వేటూరి కమ్యూనిటీలో జరిగిన చర్చల్లో ఆయన చేసిన “ప్రతిభారత సతిమానం చంద్రమతీ మాంగల్యం” వంటి ప్రయోగాల అర్థాలను ఇతరుల ద్వారా తెలుసుకున్నాను. తెలుగు భాషకి, సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలు నాకు నేర్పిన పాఠశాల వేటూరి పాట.
వేటూరి గారు పోవడానికి ఒక ఆరునెలలు ముందు అనుకుంటూ ఆయన నెంబర్ ఎలాగో సంపాయించి ఫోన్ చేశా. అసిస్టెంట్ ఎవరో ఎత్తుతారు అనుకుంటే ఆయనే స్వయంగా “హలో” అనేసరికి చాలా కంగారుపడ్డాను! ఆ కంగారులో, తడబాటులో ఆయన అభిమానిననీ, ఆర్కుట్ గ్రూప్ ఉందనీ, పాటలు చర్చిస్తామనీ, ఇంకా చాలా సందేహాలు ఉన్నాయనీ, ఆయనతో మాట్లాడాలనీ, కలవాలనీ… ఇలా ఒక ఆర్డర్ అంటూ లేకుండా నోటికొచ్చింది అంతా మాట్లాడాను. ఆయన ఓపిగ్గా విని – “నీ అభిమానానికి చాలా సంతోషం నాయనా! కానీ నా టైమ్ నా చేతుల్లో ఉండదు. ఎప్పుడు కలవాలో చెప్పలేను” అన్నారు. తర్వాత ఒకట్రెండు సార్లు ఆయనకి చేసినప్పుడు అదే సమాధానం వచ్చింది. అది ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో నాకు తెలియలేదు. ఆయన ఇంటికి డైరెక్టుగా వెళ్ళగలిగే సాహసం చేయలేకపోయాను. వేటూరి గారు పోయిన కొన్నేళ్ళకి 2015 లో అనుకుంటా వారబ్బాయి రవిప్రకాష్ గారు పరిచయమయ్యి, ఎంతో ఆదరంగా మాట్లాడి, వారింటికి పిలిచినప్పుడు, నేను వేటూరి గారింట్లోకి అడుగుపెట్టి “ధన్యోస్మి” అనుకున్నాను. హాల్ లో వేటూరి గారి ఫోటోలు చూసినప్పుడు – “రవిప్రకాష్ గారు ముందే పరిచయమై ఉండుంటే వేటూరి గారినే కలిసే అవకాశం దక్కేదేమో!” అనిపించింది. ప్రాప్తం లేదంతే!
మిగిలిన కాస్త సంతృప్తీ ఏమిటంటే వేటూరి గారి ఆఖరి చూపులు దక్కడం. వేటూరి గారు పోయినప్పుడు, బ్రతికుండగా ఆయన్ని చూడలేని నేను, వట్టి దేహంగా మిగిలిన ఆయన్ని చూడలేక, నా స్మృతిలో ఆయన్ని ఎప్పుడూ సజీవంగానే ఉంచుకోవాలని ఆయన అంతిమ దర్శనానికి వెళ్లకూడదు అని నిశ్చయించుకున్నాను. నా కవితలో కూడా అదే రాసుకున్నాను –
మిమ్మల్ని కలవాలనుకున్నాను
కానీ నాకన్నా ముందే మరణం మిమ్మల్ని కలిసింది
నా మనసులో మాత్రం మీకు మరణం లేదు కనుక
మీ అంత్యక్రియలకు నేను హాజరు కాలేను
ఇంతకాలం మీ పాటల్లో బతుకుతున్న నన్ను
టీవీ లాక్కెళ్ళి నిజం ముందు కూర్చోపెడతానంటోంది
అందుకే…
దాన్నీ నేను చూడను
కానీ మిత్రుడు అవినేని భాస్కర్ నాతో మాట్లాడి నన్ను ఒప్పించాడు. అతనూ బెంగుళూర్ నుంచీ వచ్చాడు, నేనూ వెళ్ళాను. అక్కడికి వచ్చిన జనాన్ని చూసి ఆశ్చర్యపోయాను. టీవీల్లో అన్ని చానెల్స్ లో ఆయన గురించే రోజంతా రావడం చూసి సినీపరిశ్రమ ఆయన్ని ఎంత ప్రేమించిందో అర్థమైంది. ఇక్కడ సెలబ్రిటీ లు, మీడియా వాళ్ళు, సాహిత్య అభిమానులూ కాక ఒక మనిషిగా వేటూరిని కోల్పోయిన బాధతో ఎందరో వచ్చారు. ఎంతోమంది హృదయాలని ఆయన తాకారని నాకు అర్థమైంది. ఆయన మంచితనం గురించి, చేసిన సాయాల గురించి, గుప్తదానాల గురించీ నాకప్పుడే తెలిసింది. తర్వాత ఏళ్లల్లో ఇంకా తెలిసింది. కవిగా వేటూరి ఎంత ఉన్నతులో మనిషిగా కూడా అంతే గొప్పవారు.
వేటూరి గారు మృణాళిని గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ నిన్న విన్నప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే ఆయనెప్పుడూ తన గురించి తాను గొప్పగా చెప్పుకోలేదు. “నేను మహాకవిని! తెలుగు భాషని, సినిమాలని ఉద్ధరించాను!” అని ఆయన అనుకోలేదు. చెప్పినదంతా విశ్వనాథ సత్యనారాయణ, మల్లాది, ఆత్రేయ, పింగళి వంటి పూర్వకవుల గురించీ, వారి గొప్పతనం గురించీ. ఏవో మనస్పర్థలు వచ్చి పాటలు రాయడం మానేసిన కె. విశ్వనాథ్ గారి గురించి కూడా ఎంతో గొప్పగా మాట్లాడడం చూస్తే వేటూరి హుందాతనం ఏమిటో తెలుస్తుంది. ఆయన మనసు మెత్తన. ఒక సినీకవిగా తనకి చేతనైనంతలో సినిమా సందర్భాలని ఎలివేట్ చేస్తూ అన్ని రకాల పాటలూ రాసిన ప్రొఫెషనల్ ఆయన. సినిమా పాటన్నది ఒక సమిష్టి కృషి అనీ అందులో తన వంతుగా తన పాత్ర పాటించడమే తన ధర్మమనీ నమ్మి ఆచరించిన వ్యక్తి ఆయన. గొప్పవిగా కీర్తించబడిన ఆయన పాటల్లో లోపాలు వెతికి ఆనందించిన వాళ్ళున్నారు, ఆయన రాసిన కొన్ని నాసి రకం పాటలు చూపించి ఆయన పాటలన్నీ ఇంతే అన్న వాళ్ళున్నారు, ఇంకో అడుగు ముందుకేసి ఆయన గురించి అంతా తెలిసినట్టు “ఆయనంతే, నిర్లక్ష్యంగా పాటల్ని రాసి పారేసి ప్రేక్షకులపై విసిరేస్తాడు” అంటూ ఆయన వ్యక్తిత్వాన్నే కించపరిచిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మేధావులు, విమర్శకులు ఏమనుకున్నా సామాన్య ప్రజలు మాత్రం ఆయన్ని అక్కున చేర్చుకున్నారు, ఆయన పాటల్ని ఆదరించారు, ఆ పాటల్లో మునిగి ఆనందించారు. వేటూరి మాత్రం పొగిడిన వాళ్ళనీ, తెగిడిన వాళ్ళనీ ఇద్దరినీ చూసి చిరునవ్వు నవ్వుకుంటూ తన పనిని తాను ఒక కర్మయోగిలా చేసుకుంటూ పోయారు. తెలుగు భాషని, సాహిత్యాన్ని, కవిత్వాన్ని చివరి వరకు ప్రేమిస్తూనే గడిపారు. ఈనాడు ఆయన మిగిల్చి వెళ్ళిన ఆయన పాటల్లో ఆ ప్రేమ పలుకుతూనే ఉంది. వినగలిగిన వాళ్ళకి ఆ మధురిమలు వినిపిస్తూనే ఉన్నాయి. స్వర్గం నుంచి అదిగో వేటూరి గారు అంటున్నారు –
“పదే పదే పాడుతున్నా పాడిన పాటే
అది బ్రతుకో పాటో నాకే తెలియదు
పాడుతు ఉంటే! పాడుతు ఉంటే!
పదే పదే పాడుతున్నా పాడిన పాటే
పదే పదే పాడుతున్నా పాడిన పాటే“
మహనీయుని పరిచయం చేసారు.🙏