పాటే వేటూరిని చేరింది (హరీశ్ శంకర్)

 

కృష్ణా తరంగాలు, ఉప్పొంగే గోదావరులు, యమునా తీరాలు, హుబ్లీ సౌందర్యాలు అన్నీ తన పాటలో కనిపిస్తాయి…. ఏ పాట రాసినా అందులో ఏదో ఒకటి మనం పదిలపరచుకునేలాగా ఉంటుంది…. యువతను ఉర్రూతలూగించినా, అందరికి వేదాంతం చెప్పినా,  అప్పుడప్పుదు వైరాగ్యంలో మునిగి తేలినా… అన్నిటిలో వేటూరి ఉంటారు… వేటూరికి ముందు వచ్చిన రచయితలు, వేటూరు తరవాత రాబోయే రచయితలు… అందరి పాటలు ఒక్క వేటూరిలో కనిపిస్తాయి. వేటూరి తో పాట రాయించుకోవడం కోసం తాను డైరక్టరుని కావాలనుకున్న హరీశ్ శంకర్ వేటూరి వర్ధంతి సందర్భంగా ఆయన పాటలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆంధ్రప్రభతో పంచుకున్నారు.

నాకు ఆయన గురించి చెప్పే అర్హత లేదు, ఇళయరాజా సంగీతం వింటూ వేటూరి సాహిత్యానికి అభిమానినయ్యాను. మా నాన్న గారు తెలుగు టీచర్ కావడం వల్ల వేటూరి గారి పెద్దనాన్నగారు  వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి ఎక్కువగా చెబుతుండేవారు. అలా ఆయన మీద నేను అపారమైన గౌరవం పెంచుకున్నాను.

నా మొదటి సినిమా షాట్ కి వేటూరి పాట :

వేటూరి గారు రామ్ గోపాల్ వర్మకి ఎప్పుడు రాశారో తెలియదు. ‘శివ ‘ చిత్రంలో ” ఆనందో బ్రహ్మ, ఎన్నియల్లో మల్లియల్లో”  అనే  పాటలు రెండూ రాశారు. దర్శకుడిగా నా మొదటి చిత్రం ‘షాక్ ‘. వర్మతో నా మనసులోని మాట చెప్పాను. వేటూరి గారితో పాట రాయించుకోవాలనుకుంటున్నాను అని. ఆయన వెంటనే “వెంతనే వెళ్ళి కలిసి రాయించుకో ”  అన్నారు. సినిమా చర్చలు జరుగుతున్నప్పుడు, పాటల విషయం రాగానే వేటూరి గారిని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఉవ్విళ్లూరాను. అంతవరకు ఆయనతో రాయించే పాటకు సిట్యుయేషన్ ఏమీ అనుకోలేదు. ఈ సినిమాకు అజయ్ అతుల్ అనే మరాఠి సంగీత దర్శకుడు పనిచేశాడు. ఆయనతో రాయించే పాటకు ‘మధురాష్టకం ‘ ట్యూన్ అనుకొని ‘మధురం మధురం ‘ అంటూ రాసిన పాట తీసుకొని ఆయన దగ్గరకు బయలుదేరాను. మొదటిసారిగా ఆయన్ను కలుస్తున్నానన్న ఫీలింగ్ రాగానే బాగా ఎగ్జయిట్ అయ్యాను.  నేను రాసిన పాట చూసి ‘ఇందులో ఏమీ మార్చక్కర్లేదు ” అన్నారాయన. ఆయనకు నమస్కరించి “అయ్యా! మీతో రాయించుకోడానికి వచ్చాను” అంటూ ఆయన పాదాల దగ్గర బొకే పెట్టి ‘ఇది నా మొదటి సినిమా, మీరు పాట రాసి ఆశీర్వదించాలి ” అని నమస్కరించాను. ‘నీకు మొదటి సినిమా అయినా, నాకు ప్రతీ పాట కొత్తపాటే ” అన్నారు. ఆయనకు నేను సిట్యుయేషన్ చెబుతుంటే ఒక పెన్ తీసుకొని నేను ఏది చెబుతుంటే అది రాసుకున్నారు. “తరవాతి వారమే షూటింగ్, ఈ వారంలో ఇస్తారా? ” అన్నాను. దానికి ఆయన “ఎందుకు! రేపు ఇచ్చేస్తాను ” అన్నారు.

కొత్తవాడిని కదా అందుకని వేగంగా ఏదో ఒకటి రాసి ఇచ్చేస్తారేమో అనుకున్నాను. మూడురోజుల తరవాత వస్తానండి అన్నాను. కాని ముందే కాల్ వచ్చింది. ఆయన ‘మధురం మధురం’ పల్లవి మార్చకుండా రాశారు. నేను మధురాష్టకాన్ని ఆ సౌండింగ్ మిస్సవ్వకుండా పూర్తిగా అలాంటి మంచి భాష పాటలో ఉండాలనుకున్నాను. భార్యభర్తల మధ్య ఉండే చిలిపి సరసాలు ఈ పాటలో ఉండాలని చెప్పాను. అందుకు ఆయన ‘ కమ్మని కాపురంలో షుగరే మధురం… అది తలపించే నీ ఫిగరే మధురం ” అని రాశారు. నాకు అస్సల్ నచ్చలేదు. “గురువుగారూ… షుగరే , ఫిగరే రాయడానికి చాలామందే ఉన్నారు, ఈ పాటని సంస్కృతంలో రాయించాలనుకున్నాను. ఈ పాటను తెలుగులో ఉండాలనుకోవడమే నేను కాంప్రమైజ్ లా ఫీల్ అవుతున్నాను ” అనడంతో ఆయన ఒక్క సెకను ఆలోచించి “సాయంత్రం రా ” అన్నారు. ఆ సాయంత్రం ఆయన రాసిన ఒక్కో లైన్ వింటుంటే నా శరీరం పులకించిపోయింది.  సాధారణంగా చాలామంది రచయితలు ట్యూన్ లో పాడి వినిపిస్తారు. అప్పటికే మనం ట్యూన్ విని ఉంటాం కాబట్టి. ట్యూన్ వైపు ఎటువంటి ఫిర్యాదు ఉండదు. ఆ ట్యూన్ మనకు నచ్చిన కారణంగా లిరిసిష్టులు చేసిన తప్పులు కొట్టుకుపోతాయి. కానీ వేటూరి గారు అతిసామాన్యంగా ఒక్కో లైన్ చదువుతుంటే… నేను పొద్దున విన్నదానికీ దీనికి ఎంత తేడా ఉందా అనిపించింది. ప్రతి వాక్యం నిజంగా మధురంగా రాశారు. విపరీతమైన ఎగజైట్ మెంట్. కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. గంగిగోవుపాలు గరిటడైనా చాలు ‘ అన్నట్లుగా నేను ఒక పాట రాయించుకున్నాను. ఆయన్ డిక్టేట్ చేస్తాను రాసుకో అంటే, కాదండీ మీ చేతిరాతతోనే తీసుకుంటాను.  అని చెప్పి ఆ కాగితం తీసుకొని వెళ్ళాను. సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి నా సంకల్పం నెరవేరింది. ఆ సినిమాకి సింగిల్ కార్డు ఎందుకు అనుకోలేదా అని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. నేను పాట రాయించుకున్న మూడు సంవత్సరాలకు ఆయన కన్నుమూశారు. ఆయనను చూడటానికి వెళ్లాను. ఆయన అంతిమ యాత్రలో పల్గొని ఆయనను భుజాల మీద మోయాలని అనుకున్నాను. మాది సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం. అందువల్ల మా నాన్నగారికి ఫోన్ చేసి వేటూరి గారిని మోయడానికి అనుమతి పొందాను. ఆయనను నా భుజాల మీద మోయడం నా అదృష్టంగా భావించాను. అంత తొందరగా ఆయన వెళ్ళిపోవడం ప్రజలు చేసుకున్న దురదృష్టం.

ఆయన ఏం రాసినా నాకు ఇష్టమే :

వేటూరి గారు రాసిన పాటలలో నాకు నచ్చని పాట లేదు. మొత్తం పాట నచ్చకపోయినా అందులో రెండుమూడు వాక్యాలైనా ఆలోచించేలా చేస్తాయి. ఆయన రాసిన వాటిలో ఏ అక్షరమూ బోర్ కొట్టని పాటలు నా ఉద్ధేశం ప్రకారం సాగరసంగమం పాటలు. అందులో పాటలు ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. ఎవరేనా వేటూరి గారి వేదాంత పాటల గురించి అడుగుతుంటే, బెసిక్ గా హిందూమతమంతా వేదంతమయమని నా ఉద్దేశం. వేటూరి ప్రతీ పాటలోనూ వేదాంతం ఉంటుంది. అందులో “ఓం నమః శివాయ ” పాటలో పూర్తి వేదాంతం పెట్టారు. ‘వేవేల గోపెమ్మల ‘ పాటలో శ్రీకృష్ణుడి పుట్టుక దగ్గర నుంచి గీతాబోధ వరకు ఉంటుంది. మూడు నిమిషాల వ్యవధిలో మొత్తం శ్రీకృష్ణ తత్వం చూపారు. రచనా చాతుర్యంలో వేటూరి కంటే ఎంతో గొప్పవారు ఉండవచ్చు, కానీ ఆయన పండితుల దగ్గర నుంచి పామరుల వరకు అర్ధమయ్యేలా రాశారు. భారతీయ సినిమా చరిత్రలో పాట మీద వేటూరి గారికి ఉన్న పట్టు ఇంతవరకూ ఎవరికీ లేదు, ఇక ముందు రాదు కూడా! మూడు నిమిషాలలో కృష్ణ తత్వం, అదే మూడు నిమిషాలలో శివతత్వం.. ఇంత బాగా ఎవరు రాయగలరు? అదే విధంగా “తకిట తధిమి ” పాటలో నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడు తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమా నీ కెందుకింత తపన ” ఇంతకు మించిన వేదాంతం ఎక్కడ ఉంటుంది? మూడు వాక్యాలలో లైన్ అండ్ లెంగ్త్.. అది ఆయనకు మాత్రమే సాధ్యం.

ట్యూన్ కి ప్రాణం పోస్తారు :

ఒక్కోసారి లిరిక్ వచ్చాక ట్యూన్ తగ్గిపోయిన సందర్భాలు ఉంటాయి. లిరిక్ సరిగ్గా సరిగ్గా సెట్ కాకపోవడం కూడా ఉంటుంది. వేటూరి గారు ట్యూన్ కి రాసిన లిరిక్ తరవాత ట్యూన్ మరింత అందంగా వినపడుతుంది. ఒక రచయిత వేటూరి గారి గురించి నాతో ఇలా అన్నాడు “ఒకసారి మణిశర్మ ఒక పాటకు సంబంధించి “నాదరిదిన్నా నాదరిదిన్నా ” అంటూ ట్యూన్ ఇచ్చారుట. వెంటనే ఆయన పాట రాసుకోండి అంటూ  ” నాదరిదిన్నా ” అని అన్నారట. “ఇది ట్యూన్ కదా ” అన్నారట ఆయన, “ఏమీ లేదు రాసుకోండి అంటూ ” నాదరిదిన్నా నాదరిదిన్నా … నడుమే నాజూకు ” అని పాట ఇచ్చారుట. “మీరేంటి త్వరగా అవ్వగొట్టడానికి ఇలా ఇచ్చారా? ” అని అడిగితే ” అక్కడ అది పడితేనే బాగుంటుంది, మీ ట్యూన్ లో నకారాన్ని నేను పాడుచేయదలచుకొలేదు ” అన్నారట వేటూరి. ట్యూన్ ని రెండింతలు చేయడం వేటూరి మాత్రమే సాధ్యం అని నా అభిప్రాయం.

పైకి వెళ్ళాక దిగడం కష్టమే… కానీ :

తెలుగులో పరిజ్ఞానం ఉన్నవారెవైరేనా గొప్ప సాహిత్యాన్ని ఇవ్వగలరు. ఆ శక్తి వారి నరాల్లో ఉంటుంది. సాధారణంగా ఎదగాలనుకున్న వారు పైకి వెళ్ళగలుగుతారు. అది కష్టం కాదు, పైకి వెళ్ళిన తరవాత దిగడం కష్టం. అందరికీ అర్ధమయ్యేలా రాయడం చాలా కష్టం. ఆయన సాగరసంగమం వంటి వాటికి ఎంత కష్టపడ్డారో ఏమో కానీ, “ఆరేసుకోబోయి పారేసుకున్నాను ” లాంటి పాటలు రాయడం చాలా చాలా కష్టం. ఆయన రాసిన కమర్షియల్ పాటలు నాకు చాలా ఇష్టం. అలాంటి లిరిక్స్ కోసమే ఒక కమర్షియల్ డైరెక్టర్ యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ సంధర్భంగా నాకు పద్మభూషన్ మంగళంపల్లి బాలమురళి కృష్ణగారు చెప్పిన “నాకు సంగీతం తెలియదు, సంగీతానికే నేను తెలుసు ” అని చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. వేటూరి గారు పాటలకు సేవ చేశారు అనడం కంటే పాట అనేది వేటూరి గారిని చేరి ఒక పరిపక్వత, ఒక సార్ధకత, అనే భావిస్తాను నేను. ఆయనకు వ్యాకరణం మీద పట్టు ఉంది. అలంకరాలు అవపోసన పట్టారు. ఆయన రాసే ప్రాస వల్ల పాట అందమే మారిపోతుంది. సింగీతం గారు తీసిన ఆదిత్య369లో వేటూరి గారు రాసిన “రాసలీల వేళా ” పాటలో ‘నిదుర రాని కుదురు లేని ఎదలలోన సొదలు.. ‘ అంటూ దకారం అందంగా నాట్యం చేస్తుంది. ఇది రాయమని ఏ డైరెక్టరూ, ప్రొడ్యూసరు అడగరు. ఆయన యూనివర్సల్ అంబాసిడర్ ఆఫ్ తెలుగు సాంగ్.

వేటూరి వేదాలు :

నేను అసిస్టెంటు డైరెక్టరుగా పని చేస్తున్న రోజుల్లో ఆయన పాటలతోటి ఒక పెద్ద డైరీ రాసి పెట్టుకున్నాను. వేటూరి గారి పాటలలో నాకు నచ్చిన వాక్యాలు ఆ డైరీలో పొందుపరచుకున్నాను. సినిమాకు సంబంధించి ఎవరితోనైనా డిస్కషన్స్ లో కూర్చునప్పుడు ఉపయోగపడుతుందని అలా చేసుకున్నాను.  ఆయన ప్యాన్ కి కావడం వల్ల ఆ బుక్ కి “వేటూరి వేదాలు ” అని పేరు పెట్టుకున్నాను. ఆయన ప్రతీ పాట ఎంత కమర్షియల్ అయినా అందులో వేదం ఉంటుంది. పాట రాస్తున్నప్పుడు సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఏదో ఇచ్చి వెళ్ళిపోవచ్చని ఆయన అనుకోరు. ‘ఆ అంటే అమలాపురం’ లో ” యానాము వెళ్ళినా ఫ్రెంచి ” అని ఉపయోగించారు. అంత వేగంగా ఆయనకు ఎలా వస్తుందో తెలియదు. సన్నివేశానికి అనుగుణంగా ఇచ్చివెళ్ళిపోవడం కాకుండా విషయాలు చెబుతారు. యానాము, ఇనాము, యానాము లో ఫ్రెంచి వారు ఉన్నారని అన్నారు. అటువంటి పాట కూడా ఎంజాయ్ చేస్తూ రాస్తారు.

నా చిత్రం లో ఆయన మీద అభిమానంతో :

వేటూరి గారు రాసిన పాటలలో ” రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ” పాటను మించింది లేదు. ఆ పాటకు వేటూరి గారు జాతీయ అవార్డు అందుకున్నారు. శ్రీశ్రీ గారి తరవాత వేటూరి గారే జాతీయ అవార్డు అందుకున్నారు. నేను తీసిన “గబ్బర్ సింగ్ ” సినిమాలో జైలు సీనులో రౌడీలతో అంతాక్షరీ ఆడించే సీన్ ఉంటుంది. ఆ సీన్ ఈ పాటతోటే మొదలౌతుంది. చివరి అక్షరంతో కాకుండా, నాకు నచ్చిన పాటలు పెట్టడం కోసం అక్షరాలు మార్చాం.

ఆయన మాట మెత్తన :

చాలామందికి వేదాంతానికి, వైరాగ్యానికి తేడా తెలియదు. వేదాంతమే వైరాగ్యం అనే అపోహ ఎక్కువమందిలో ఉంది. వేదాంతం- ఎన్ లైట్మెంట్, వైరాగ్యం – డిటాచ్ మెంట్, ఈ రెండిటికి తేడా తెలియక చాలామంది అపార్ధం చేసుకుంటారు.  వేటూరి గారి పాటలలో వేదాంతం నిండి ఉంటుంది. ఆయన చాలా మెలగా, చాలా నెమ్మదిగా మాట్లాడతారు. ఆయన ట్యూన్ కి రాస్తారు. కాని ట్యూన్ లో పాడరు. సామాన్యంగా చదువుతారు భావన ఆయన శరీరంలో దాగి ఉంటుంది.

ఆలోచించే బుర్రలోనే డబుల్ మీనింగ్ ఉంటుంది :

చాలామంది ఆయన రాసిన శృంగారాన్ని డబుల్ మీనింగ్ అంటారు. నేను అంగీకరించను. మనలో అటువంటి చెడు ఆలోచన ఉంటేనే అలా అనిపిస్తుంది. సింగిల్ బ్రెయిన్ తో డబుల్ మీనింగ్ రాయలేం. రెండో బుర్ర చేరితేనే డబుల్ మీనింగ్. వినేవారిలో ఆ ద్వంద్వం ఉంది కాబట్టే అలా భావన చేస్తున్నారు. “ఆకు చాటు పిందె తడిసే ”  వంటి పాటల విషయంలో చూస్తే ధోరణి లో ఉంటుంది.

ఆయన శృంగారం పారబోసి డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నప్పుడు “జగడ జగడ జగడం ” పాటలో ప్రత్యేకంగా తెలుగు తెలియని మణిరత్నం గారి సినిమాలో ఏదో రాసి చేతులు దులిపేసుకోవచ్చు. “మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెనా.. మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే ” అంటూ రాశారు. యువతకు స్ఫూర్తిగా నిలిచారు. “నేడే రా నీకు నేస్తము… నిన్నంటే నిండు సున్నరా… రానే రాదు ” అంటూ రాశారు. నేను బాగా డిప్రషన్ లో ఉన్నప్పుడు ఈ పాట ఎక్కువ సార్లు వింటాను, వింటూనే ఉంటాను. మంచి పాట, ఉకితి ఆరేశారు. శాస్త్రి గారు చెప్పినట్టు ” ఆ పాటకు ముందూ వెనుకా వాక్యాలు చూడాలి, ‘మా ఊపిరి నిప్పులు ‘ అనడంలో ఆవేశం కనిపిస్తుంది. స్మితతో పాడటం చూస్తే, అది శృంగారంగా కనిపిస్తుంది. అది ఆలోచించేవారి ధోరణి మీద ఆధరపడి ఉంటుంది. బూతు అనేది నా భావనలో లేదు. ఆయన దగ్గర మనకు అర్ధం కాని విషయాలు చాలా ఉన్నాయనిపిస్తుంది. అది కూడా ఒక్కోసారి ఒక్కోలా అనిపిస్తుంది. ఆయన రాసిన వాటిలో శ్లేష నాకు చాలా నచ్చుతుంది. కమర్షియల్ గా , వేదాంతిగా, మాస్ ధోరణిలో రాసిన ఏకైక వ్యక్తి వేటూరి. ‘ఆ అంటే ఆహాపురం ‘ వాక్యం చూస్తే అసలు ఆహాపురం అనే ఆలోచన ఎక్కడ నుంచి వచ్చిందో అర్ధం కాదు. ఎంతటి భావన, సినిమా పరిశ్రమలో కొందరి మీద మాస్ పాటల రచయిత అని, మరొకరికి డ్యూయెట్ పాటల రచయిత అని ముద్ర పడుతుంది. వేటూరి తానే ముద్రవేయాలనుకున్నట్టు  కనపడుతుంది. తన మీద ముద్రపడాలనుకోరు. సినీ పాటల రచయితలు అందరూ రాసిన పాటలు వేటూరి ఒక్కరే రాశారు. ఆయన ముందు వారిని, ఆయన తరవాత వారిని కూడా కలిపి రాశారు ఆయన. మాస్ పాట ” ఆ అంటే అమలాపురం ” రాసిన ఆయనే “పిల్లల గ్రోవికి నిలువెల్ల గాయాలు ” అని రాశారు. ఏ రచయితకు ఇంత కంటే ఎక్కువ భావుక దృష్టి ఉంటుంది.

తెలుగు పాటకు ఆనందం :

తెలుగు పాట అంటే వేటూరి, తెలుగు పాటకు పర్యాయపదం వేటూరి అని రాసుకునే అర్హత సంపాదించుకున్న ఏకైక సినీ గేయ రచయిత వేటూరి. చాలామంది రచయితలు మేము కొన్ని గొప్ప పాటలు రాశామని గర్వపడుతుంటారు. కాని ప్రతి గొప్ప పాట నేను వేటూరితో రాయించబడ్డానని గర్వపడుతుంది. రచయితలు కొందరు గొప్ప పాటలు రాశామని గర్విస్తుంటారు. కానీ ఇక్కడ పాట చాలా గర్వపడుతుంది… నన్ను వేటూరి రాశాడని. ఇది నా భావన. ఆయన ప్రభావం లేకుండా ఎవరైనా పాటలు రాశామంటే వారిని నేను రచయిత అనను. నా ఆఫీసులో ఇళయరాజా, వేటూరి ఇద్దరి ఫొటోలే ఉంటాయి. ఒక దర్శకుడిగా నేను సినిమా పరిశ్రమకు రావడానికి వీరిద్దరే కారణం. వారిద్దరినీ విడదీయలేము. ఇప్పుడు వచ్చే రచయితల సిట్యుయేషన్ ఏంటి అని అడుగుతున్నారు. కానీ వేటూరి గారు కథ ఏంటి అని అడిగేవారు.


ఆంధ్రప్రభ వారి సౌజన్యంతో

విశాలి పేరి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

You May Also Like

One thought on “పాటే వేటూరిని చేరింది (హరీశ్ శంకర్)

  1. It is a nice article…you shared your experiences….but I think there is one factual error…”Rasaleela VaeLa” is written by VennelakanTi gaaru (SP sir once said so in Swarabhishekam)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.