జీవితం మనోగతం (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

ఇళయరాజా సంగీతం సమకూర్చిన ప్రభుదేవా చిత్రం “టైమ్” లో ఈ మధ్యే ఎప్పుడూ వినని ఓ చక్కని మెలొడీ సుజాత గొంతులో వినిపించింది –

జీవితం, మనోగతం – చైత్రసంగమాలు 
అంకితం, స్వయంకృతం – గ్రీష్మ పంచమాలు
“పియా” నో “ప్రియా” నో అనేసినా
నయానో భయానో వినేసినా

టైమ్ చిత్రంలో “ప్రేమేనంటావా” వంటి హిట్ పాటల మధ్య ఈ పాట కొట్టుకుపోయింది గానీ, ఇళయరాజా చాలా బాగా కంపోజ్ చేశారీ పాట! అలాగే గాయని సుజాత ఎంత బాగా పాడారో. సాహిత్యంలో బరువును గొంతులో పలికిస్తూనే , “పియానో” అన్న లైనులో ఉన్న నిట్టూర్పు నిండిన చిలిపితనాన్నీ ఎంత బాగా పలికించారో! వినాల్సిన మంచి పాట ఇది!

పాట పల్లవి వినగానే ఇది వేటూరి పాటని తెలిసిపోతుంది, ఇలా ఇంకెవరూ రాయరు కనుక. తక్కువ పదాలతో, ambiguity ని వాడుకుని, రకరకాల భావాల షేడ్స్ పలికిస్తూ రాయడం వేటూరి తరచూ వాడే శైలి. సినిమా సందర్భంలో ఒక అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి ఎదురుగా ఉన్నా ప్రేమని వ్యక్తం చెయ్యలేని పరిస్థితి. విధి ఆడిన నాటకంలో ప్రేమని గుండెల్లోనే దాచుకోవాల్సి వస్తుంది. కొన్ని మధుర జ్ఞాపకాలు, నిజం కావని తెలిసినా భవిష్యత్తుపై కొన్ని తీయని ఊహలు, నిరాశలూ, నిట్టూర్పులూ ఇవే మిగిలాయి. ఇవన్నీ ఇమిడ్చి పల్లవి రాయాలంటే కవిత్వపరమైన భాషా, వ్యాకరణం వాడాలి. అదే వేటూరి చేసింది. ఇలాంటి రచనా లక్షణాలు వచన కవితల్లో కనిపిస్తాయి, అయితే సినిమా పాటల్లో ఈ శైలి వాడింది వేటూరే అని చెప్పాలి.

జీవితం, మనోగతం – చైత్రసంగమాలు 
అంకితం, స్వయంకృతం – గ్రీష్మ పంచమాలు

“చైత్రసంగమం” అంటే వసంతం లాంటి వాళ్ళ ప్రేమ పరిచయం. అదే జీవితం ఆమెకి. కానీ అది మనసులోనే దాచుకునేది (“మనోగతం”). వసంత ఋతువులో కోకిల గానమే సంగీతంలో పంచమ స్వరం అని సంగీతజ్ఞులు అంటారు. కానీ వేటూరి “గ్రీష్మ పంచమం” అన్నారు – వసంతం వెళ్ళిపోయినా, గ్రీష్మ ఋతువులో ఎండ మండుతున్నా ఆగక సాగే కోయిల గానం అన్నమాట. అదే ఆ అమ్మాయి జీవితం. ఎంత వద్దనుకున్నా మనసులోని ప్రేమ పోదు, ఆ గానం ఆగదు. ఇలా మనసు ఇంకా ఆ అబ్బాయికే అంకితమైపోవడం తన తప్పే (స్వయంకృతం).

“పియా” నో “ప్రియా” నో అనేసినా
నయానో భయానో వినేసినా

పల్లవిలో ఇంతవరకూ బరువుగా సాగుతున్న ట్యూన్ ఒక్కసారిగా కొంత తేలికవుతుంది. ట్యూన్ ని ఆవాహన చేసుకుని, ట్యూన్ నడకకి జోడుగా సాహిత్యాన్ని నడిపించడం వేటూరికి “పెన్ను”తో పెట్టిన విద్య! అందుకే వేటూరి కూడా ఒక “థాట్ జంప్” తీసుకుని తర్వాత రెండు లైన్లు రాశారు. వేటూరి పాటల్లో కనిపించే ఈ “థాట్ జంప్స్” సినిమాల్లో కనిపించే “కేమెరా షాట్స్” లాంటివి. ఎలా అయితే కేమెరా కన్ను రకరకాల ఏంగిల్స్ వాడి మొత్తం దృశ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తుందో, వేటూరి కూడా రకరకాల కవితా దృశ్యాలతో సన్నివేశాన్ని చిత్రిస్తారు. ఇక్కడ కనిపించే దృశ్యం ఆ అమ్మాయి గతంలో అతనితో ప్రేమలో పడిన జ్ఞాపకాన్ని నెమరువేసుకోవడం. ఆ అబ్బాయితో ఫోన్ లో మాత్రమే మాట్లాడుతుంది, అతన్ని చూడదు. ఆ మాటలతోనే ప్రేమలో పడుతుంది. అతనిపై ఇష్టాన్ని మనసు తెలుపుతున్నా, అది అంగీకరించి అతనే తన ప్రియుడు అనుకోవడానికి ఎంత సతమతపడాల్సి వచ్చిందో! ఆ తికమకనే చమత్కారంగా వేటూరి వ్యక్తీకరించారు. నిజానికి ఆ అమ్మాయికి ఇలా ప్రేమలో పడడానికి ధైర్యమూ కావలసి వచ్చింది. అందుకే “నయానో భయానో” చివరికి మనసు మాట విన్నాను అంటోంది. ఇంతటి ప్రియమైన జ్ఞాపకాన్ని తలుచుకుంటూ, వర్తమానంలోని ప్రేమ కోల్పోయిన నిజాన్ని ఎదుర్కొంటూ ఉంటే ఎంత బాధ! వింటున్న మననీ ఈ బాధ తాకుతుంది,  ఆ దృశ్యాన్ని మనం చూడగలిగితే! వేటూరి ఎప్పుడైనా visual poet, లాజిక్ తో ఆయన పాటలని అర్థం చేసుకోలేం, దర్శించాలంతే! లాజిక్ వాడుతున్న కొద్దీ ఆయన పాటలు చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తాయి, కానీ నిజానికి వేటూరి చాలా సింపుల్ గా రాస్తారు, చూడగలగాలంతే!

ఇన్ని విషయాలని కుదించి రాసిన పల్లవి కనుకే అది కవిత్వమైంది.  చరణాల్లో పల్లవిలోని అంశాలనే వివరించారు వేటూరి. కోయిల పూలదారి అనుకుని ఎడారిని చేరడం, అక్కడ ఉన్న ఎండమావినే ఉగాది అని భ్రమపడడం సినిమా కథని చెప్పడమే. సినిమాలో హీరో చిత్రకారుడు కనుక అతని కుంచెలలో దాచుకునే రూపం ఎప్పటికైనా బయటపడుతుందా అనే ప్రశ్నా వస్తుంది (సినిమాలో హీరో కూడా తన ప్రేమని చెప్పలేని పరిస్థితి). ఇలా సినిమా సారాన్ని జీర్ణించుకుని రాసిన పాట ఇది.

జీవితం, మనోగతం – చైత్ర సంగమాలు 
అంకితం, స్వయంకృతం – గ్రీష్మ పంచమాలు
“పియా” నో “ప్రియా” నో అనేసినా
నయానో భయానో వినేసినా

1. ఎడారి చేరి కోకిలమ్మ తప్పె పూలదారి
ఆ విధి వినే కథా వినోదమే!
ఉగాది వచ్చి ఎండమావిలోన కాలు జారి
కలైనా కళైనా విషాదమే!
పెదవిలో బాసలు పెగలని ఆశలు
రగిలిన శ్వాసలో కరిగిన సేసలు
కుంచెలపై అంచులలో దాచుకునే రూపం
చిత్రముగా ఛాయగా మారేనా ప్రాయం?

|| జీవితం, మనోగతం ||

2. ఏ జవాబు నోచుకుంది సాగరాల ఘోష?
పాడుతా తుఫానులో స్వరాలిలా!
ఈ పెదాలు దాటిరాదు కన్నె మూగభాష
స్వరాలే జ్వలించే పదాలుగా!
నిలవదీ కాలము కలవదీ బంధము
కరుగు కన్నీటిలో కలువలే అందము!
తూరుపుకీ పడమరకీ ఊయల నా ప్రాణం
మనసులో గానమే మాటలో మౌనం!

|| జీవితం, మనోగతం ||

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.