వేటూరి పాటే మంత్రము (సంతోష్ పవన్)

వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది.నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే.ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర.కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు.

పోనీ వేటూరి వెండితెర యాత్రనే తీసుకున్నా తలవని తలపుగా “ఓ సీత కథ”లో అవకాశం వచ్చిన నాటి నుంచి మరణానికి కొన్ని వారాల ముందు “విలన్” వరకూ రాస్తూనే ఉన్నారు.సినీ గీతాల్లో ఇటు టేస్టుగా అమృతాన్ని అటు నిష్ఠగా మద్యాన్నీ కూడా అందించారు.అంతకంత ప్రతిష్ఠ అప్రతిష్ఠలు మూటకట్టుకున్నారు.

హనుమంతుడంత వారితో కుప్పిగంతులు వేయించి వెక్కిరించే అవగుణాలు కాసేపు పక్కన పెట్టి,ఆయన నోటి తుంపరలు లెక్కపెట్టకుండా ఆ కవితాగానాన్ని విందాం.

వేటూరి ప్రత్యేకతలు పదాలతో ఆట..లోతైన భావం…చిక్కని భాష

పదాలతో ఆట ముఖ్యంగా సన్నివేశ బలం,సందర్భ ఔచిత్యం లేని పాటల కోసం మొదలెట్టాననీ,తర్వాత తర్వాత బలమైన సన్నివేశాలను ప్రతిష్ఠించాల్సిన ఆలయంలా మాత్రమే పదాలను వాడాననీ…ఎన్నడూ పదాలకు పట్టం కట్టలేదని చెప్తారు వేటూరి. తెలుగు పదానికి చక్కిలిగింతలు పెట్టి పకపకా నవ్విస్తారు..ఆ పదాలతో పాటకు కన్నుకొట్టిస్తారు..మన నాలుకలపై నాట్యం ఆడిస్తారు.

“రాంబంటు”లో హీరో అమాయకత్వం గురించి రాస్తూ “సిగలోకి పూలంటే అరటిపువ్వు తెస్తాడు” అని ఊరుకోకుండా “అవకతవకడు”,”ముదురుబెండడు” లాంటి ముచ్చటైన ప్రయోగాలు చేసి ముళ్లపూడి వారికి ముద్దొచ్చేసారట వేటూరి.డబ్బింగ్ గీతాలు మారం చేస్తుంటే “అరబిక్ కడలందం” లాంటి పదాలు పుట్టించేసారు.”తానానా తాన తానానన ఇది పల్లవి ఒక తింగరోడి గురించి రాయండి గురువుగారు” అని మాధవపెద్ది సురేష్ ట్యూనూ టైమూ ఇస్తే..ఆశుకవి ఆ సుకవి అరక్షణం ఆగకుండా “ఏముంది ఏ బీ సీ రాని ఏబ్రాసి”అన్నార్ట మరి,”తర్వాతి లైనో” అని నసిగితే..”ఒకటి ఇంగ్లీష్ అయ్యింది కదా ఇప్పుడు తెలుగు రాస్కో ఓ అంటే ఢం రాని సన్నాసి”,అనేసార్ట.ఆ పాట పల్లవి ఇలా వచ్చింది..

“ఏ బీ సీ రాని ఏబ్రాసిరో వాడు ఓ అంటే ఢం రాని సన్నాసిరో”

అదీ వేటూరి వేగం పద చమత్కారం.

దర్శకుడు స్వేచ్ఛ ఇచ్చిన చోట “అచ్చెరువున అచ్చెరువున(ఆ+చెరువున)”…”ఆబాలగోపాలము ఆ బాలగోపాలుని” అంటూ పూర్వకవుల పంథాలో అలంకారాల(యమకం అని గుర్తు)తో చెలరేగాడు.”అడవిరాముడు”లాంటి మాస్ సినిమాలో జనానికి తెలియకుండా

“ఆరేసుకోబోయి పారేసుకున్నాను

కోకెత్తుకెళ్లింది కొండగాలి”

అంటూ అచ్చమైన పదహారణాల సీసపద్యం రాసి మెప్పించనూ గలడు(గణాలూ యతులూ కూడా కించిత్ తప్పలేదు) “గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన

గోధూళి ఎర్రన ఎందు వలన” కూడా సీసమే(రెండవ పాదంలో యతి సరిపోయిందో లేదో ఒకసారి చూడండి) “ఆనంద్”లో “నువ్వేనా నా నువ్వేనా”పాట పాడిన కె.ఎం.రాధాకృష్ణ గొంతులో ఒక గస ఉంటుంది..మాంత్రికుడు వేటూరి సరిగ్గా ఆయన గొంతుతోనే “గసగసాల కౌగలింత గుసగుసల్లె మారుతావు” అని పాడించారు .పైగా గసగసాల కౌగలింత అన్న ప్రయోగం….గసగసాల-గుసగుసల్లే శబ్దాలంకారం నిజంగా అద్భుతం.

ఇక”మమ్మీ పోయి డాడీ వచ్చే” (మిష్టర్ పెళ్లాం) మరో గిలిగింత.

“అంట్లు తోమే ఆడది జంట్స్ కు లోకువ చూడు గాజులు తొడిగే శ్రీమతి ఫోజులు చెల్లవు నేడు” వంటివి మధ్యలో “టింగనాలు” లాంటివి వెయ్యడం.మొత్తానికి ఆ పాట చమత్కారప్రియులకు విందుభోజనం.

ఇంక ఆయనలో మరో కోణం భావ గాంభీర్యం.నిజమైన కవిత్వం రాయాలంటే ఓ జీవితకాలం తపస్సు చెసి పుట్టాలి.అదే కవిత్వం అర్ధం చేసుకోవాలంటే పది జన్మలు తపస్సు చేసి పుట్టాలంటారు.ఆయన భావాల్లో లోతు చూడాలంటే ఈ చిన్ని ప్రయత్నం చాలదు.కానీ నాకు తెలిసినదాన్ని పంచుకోవడంలో తప్పు లేదుగా.

“సూర్యుడైనా

చలవ చంద్రుడైనా

నింగి చుక్కలైనా

అష్ట దిక్కులైనా

నువ్వైనా నేనైనా

నీవైనా అహ నావైనా

సంద్రాన మీనాల చందమే” అని రాశారొక పాటకు సాకీగా.ఏదైనా సరే సముద్రంలో ప్రతిబింబంగా పడినప్పుడు చేపల్లా చలించాల్సిందేనని భావం.సముద్రం ఎవరినైనా తన బిడ్డలైన చేపపిల్లల్లానే చూస్తుందని ఆ సంద్రం పెంపుడు బిడ్డలైన జాలరులు పాడుకోవడం అబ్బబ్బా మహప్రభో మహత్తరం.

“తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా …కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా” అన్న వాక్యం కులం మూలాల్ని ఎలా ప్రశ్నిస్తోందో చూడండి.

వేటూరి ఊహల్ని మనముందు బొమ్మలా కళ్లకు కడతారు.అలవోకగా రాసే క్రమంలో స్థల కాలాల్ని నిర్దేశించి వదులుతారు. ఒక రాత్రి ప్రేయసీ ప్రియులు కారులో షికారుకెళ్లే సందర్భం వస్తే బుర్రబద్ధలు కొట్టుకోరు.

“యమునా తీరం….సంధ్యా రాగం నిజమైనాయి కలలు ఈలా రెండు కనులలో” అని ఊరుకుంటారు నిజానికి అది యమునా తీరం కాకున్నా..అప్పుడు సంధ్యా సమయం కాకున్నా.

“నందికొండ వాగుల్లో నల్లతుమ్మ నీడల్లో చంద్ర వంక కోనల్లో సందెపొద్దు చీకట్లో” అంటూ భయాన్ని కళ్లముందుకు తెస్తారు. “మాటే మంత్రం” అన్నారు కానీ వేటూరి పాటే మంత్రం అని అర్ధమయ్యింది మనకు.

“వేణువై వచ్చాను భువనానికి…గాలినై పోతాను గగనానికి” అంది ఆయన పాళీ.మనం ఇంత శరీరం(వేణువు)తో ఈ భూమ్మీదకు వచ్చామనీ..ప్రాణం(గాలి)గా నింగికి పోతామని అర్ధం.మధ్యలో ఈ జీవితం వేణుగానం.అలాగే ఈ నాడు వేటూరి అనే వేణువు లేదు..ఆ వేణువులో గాలీ లేదు.ఆ వేణుగానం మాత్రం ప్రతీ తెలుగు గొంతులో ప్రతిధ్వనిస్తుంది.

పుట్టిన ప్రతివాడికీ ఋషి ఋణం ఉందంటారు పెద్దలు.పాడుకున్న ప్రతీ పాటకూ కవిఋణం ఉంటుంది.ఈ టపా ద్వారా నేను కొంతైనా తీర్చుకోదలిచాను.మీ వంతుగా మీరూ ఆయన పాటల్ని వాటిలో మీకు కనిపించిన ప్రత్యేకతల్నీ కామెంట్లుగా రాయండి.ఆ మహానుభావుకుడు పరమేశ్వరునిలో ఐక్యం పొందాలని ఆశిస్తున్నాను.

——————————————————-

సంతోష్ పవన్ నవతరంగం కోసం వ్రాసిన ఈ వ్యాసం ఈ కింద లింక్ లో చూడవచ్చు.

http://navatarangam.com/2010/05/veturi-pate-mantram/

 

సంతోష్ పవన్ గారికీ,నవతరంగం వారికీ కృతజ్ఞతలతో….వేటూరి.ఇన్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top