శ్రీకాకుళే మహాక్షేత్రే (వేటూరి సుందర రామమూర్తి)

ఆ… ఈ శ్రీకాకుళంలో మహాక్షేత్రంలో నాటి మాట ఇది. తెలుగు నాటి మాట. విశేషించి వెలనాటి మాట. వెలది కోవెలది అయిన ఆటవెలది మాట ఇది.  దైవరాయడా దేవవేశ్యాభుజంగుడు. ఫోనీ.. ఆ దైవం రాయడా అంటే.. రాసే రాత నుదుట. ఎదుట పడి  అడగాలంటే కొబ్బరి కొట్టిన రాయి. ఊలుకా పలుకా రాయడికి? కులుకు కూడబెట్టుకుని కూనసానులతో కూచిపూడి ఆడమంటే మాత్రం విటరాయడూ.. నటరాయడు తెలుగు భర్త!

ఆనాడెప్పుడో  రాయలవారికి నాలుగో జామున కల్లోకి కదిలి వచ్చాడట. అముక్తమాల్యద రాసి తనకిమ్మన్నాడట. ‘కులపతి వెంకన్నగారికిద్దమనుకున్నానే… ఇప్పుడెట్లా స్వామీ!’ అంటే ‘నాకన్నా వెంకన్న ఎవరయ్యా రాయా- ఇంకా కన్ను తెరవలేదా?’ అన్నాడట. ఆ రాయడి గుడి నీడలో వెలసిందో వాడ. ఆ వాడ సానివాడ. దానికి కొంత వారగా తేరగా దక్కిన మాన్యాల వారు, ధాన్యాలవారు, జారులు – పూజారులు అరుగులరిగేట్లు తిష్టించేవారు. లేని కథలు సృష్టించేవారు. నేతిగిలకలవారు, నెత్తి పిలకలవారు, కలవారు- లేనివారు, వారూ – వీరు కలిసి వెలసిన మున్నూరు గడప. రమారమిగా (అంటే విష్ణువు అనుకునేరు! రమను రమించువాడు గనక విష్ణువు ఇత్యాది కాకుళీయ సమాసాలు చేసి కర్మధార్యకు నీళ్ళు వదిలేసి). తొన్నూరు నెగళ్ళవారు ఈ మట్టి దేవుళ్ళు సామాన్యులా! అటు మహభోగి ఆంధ్ర విష్ణువుని, ఇటు ఏ భోగం లేని ఏక రాత్ర మల్లికార్జు స్వామివారిని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. ఇటు శుద్ద వైదీకమూ ఉంది. అటు వీర వైఖానసమూ ఉంది. ఉన్నదేదో ఉంది. ఊరు పచ్చగా ఉంది. ఊహలకు వెచ్చగా ఉంది. అపోహలకూ నచ్చుబాటుగా ఉండనే ఉంది.

అమరవాది  అవధానులుగారంటే… చుట్టుపక్కాల్లోనే కాదు – చుట్టు పక్కల దివిసీమంతా పేరు. పేరుగన్న వైదికం, పేరుకున్న చాన్దసం ఉండాల్సినంత ఉంది. ఒక్కగానొక్క కొడుకు. కాశీ వెళ్ళి వచ్చిన తల్లిని గన్న తాతగారితో, కాశీ దాకా వెళ్ళినవారు ఆ పక్కనే ఉన్న రామేశ్వరం కూడ చూసివస్తే పోయేది కదా! అన్నంతటి లోకజ్ఞాని. ఈ మనమడు. ఇంతకీ పేరు కాశి. కాశిపతి శాస్త్రికి పౌరోహిత్యం పట్టుబడ్డది, దానికి తోడు స్కూల్ చదువుతో నాలుగు ఇంగ్లీషు ముక్కలు కూడా పట్టుబడ్డాయి. దరఖాస్తులు, దస్తావేజులు, కోర్ట్ కాగితాలు చదివేపాటి, చదివి అర్థం చేప్పే పాటి సులువూ పట్టుబడటంతో పట్టపగలంతా వాడి గిరాకీ పట్టపగ్గాలేకుండా పోయింది. వీటన్నిటికీ తోడు అతని రూపం సుందరం . గాత్రం సుమధురం. కాసుల పురుషోత్తమ కవిగారి ‘ఆంధ్ర నాయక శతక’ కంఠస్తం. ఆ పైన దైత గోపాలంగారి శిష్యరికంతో వచ్చిన సక్కుబాయి పాటలు, తుంగల వారికి మేలుబంతిగా అతని వన్నెకువాసి తెచి పాలేళ్ళూ, పంట కాపులు, వర్తకులూ – వస్తాదులూ కూడా అతన్ని మేచ్చేవరకూ- వెంబడిచే వరకు వచ్చింది. ఇప్పుడు కాశి  ప్రభ వెలిగిపోతూ ఉంది. తాత తండ్రులు మాన్యాలు-మన్ననలు, ధనాలు – కనకాలు సరేసరి. రెండు చేతులకి రాళ్ళ ఉంగరాలు అధనా నాలుగైనా ఉండేవి. ఏనాడో శ్రీనాధులవారు వారున్న నాటికే సూటిగా భవిష్యత్తును కూడా పరకాయించి  చూసి అననే అన్నారు కదా!

“ధరియింప నేర్చిరి ధర్భ పట్టెడు వ్రేళ్ళ

లీలామాణిక్యాంగుళీయకములు” అని-

ఆందులోను దబ్బపండుకన్న నిమ్మపండల్లే, హరి చందనపు ఉండల్లే, బంగారు కొండల్లే నిగనిగలాడుతూ…. వయస్సులో ఇప్పుడున్న వాళ్ళకీ – వెనకెప్పుడో ఉన్నవాళ్ళకీ కళ్ళకద్దుకునేటట్టు ముద్దుగా ఉండేఅవాడు కాశి. ఆందరి కళ్ళూ తన మీద వాలుతుంటే.. తన చూపులు కొంచం పైగానో, కిందుగానో, గాలిలోనో, నీటిలోనో, తేలుతూనో మునుగుతూనో ఉండేవి.

ఒకనాటి వేసంగి మధ్యాహ్నవేళ కృష్ణలో జలకమాడి, సంధ్యా వందనం పూర్తి చేసుకుని, అంగాస్త్రం ఝాడించుకుని వెనుదిరిగేవేళకు గట్టుదరి బుడగలు బుడగలి ఉడుకుతున్న కృష్ణవేణమ్మ నట్టు వాంగం చూసి అట్టే నిలిచిపోయాడు కాశి. నాచు పాపలై – నీటి నీడలై – ఏటి పాపలై కదులుతున్న చేపలూ, ముక్కుముట్టని, గొంతు దాటని, పొట్ట నిండని ఈ ఏటి కూళ్ళకోసం అలిసి అవిసె పువ్వుల్లా పడిఉన్న కొంగలు. ముక్కు మూరెడున్నా నీళ్ళు నోరెడైనా దొరకని వడాగాడ్పులో ఏటి చేప నేసుకోబోయి ఏటి చాప నోట పరుచుకున్న కొంగల నోరంతా ఇసకసకాగా.. ఈ విడ్డురాలు చూస్తూ మరచిన ఒడ్డు ఎక్కబోయాడు కాశి.

 

ఇప్పుడ ఒడ్డు ఒయ్యారంగా ఉంది, దానికి నడుమొచ్చి ఉయ్యాలలూగింది. భెంగచూపుల కళ్ళతో బెడిస కిలుక్కుమంది. ఆ పడుచు ఉతకబోయిన ఓణీ ఏరెత్తికెళ్ళంది. ఏరు మొల దాటేసరికి  వెతకబోయిన మోహినీ ఎదనెట్టే ఏటికెదురీదసాగింది. ఈత ఆగదు – పాత అందదు. ఈ తపతపలకి కొంగ రెక్కల రెపరెపలు. కృష్ణవేణమ్మ నవ్విన్దా అన్నట్టుగా ఉంది. మధ్యాహ్న దరిద్రంతో అలమటిస్తున్న ఆ ఇసక మేటలో.. ఈ సౌందర్యలహరీ ప్రవాహం. చూడడానికి రెండు కళ్ళూ  చాలకపోయె. పైటందని, నీటి పాటందని చిన్నది చిక్కులో పడింది. ఆ పాట కోసం పోగా పోగా పాతాళమే గతి అయ్యేటట్టు ఉంది. ఆది లేకుండా ఊరు చేరాలంటే ఎట్టా? నీటి చీర కట్టు జారిందా నీతి కట్టు జారినంతపనాయె. ఏటి కోకతో ఎన్నాళ్ళుండేను?  పాటిరేవు పడితే పరువేమయ్యేను? వరదొస్తే వరదంటి వయసు ఏ గట్టు చేరేను? తన గుట్టు తన లంకకే చేటు కదా ? వణుకు పట్టిన మైతీగ ఏటి వాగల మీటు కెన్నాళ్ళు తాళేను – తాళం వేసేను?

ఇదంతా చూస్తున్న కాశీ ఒడ్డెక్కలేక, ఎక్కకుండా ఉండలేక, బిక్కుమంటున్న చక్కంది చూసిన జాలి చూపు మింగలేక, అంగాంగ సౌదర్య గంగకు సారెగ తన అంగవస్త్రం అందించాడు. అంగనామణి ఆ అంగవస్త్రాన్ని చెంగుగా వక్షోజాల మీద అచ్ఛాదన చేసుకుని ఆలింగనం చేసుకున్నంతగా ఏటి నీటి నిలువుటద్దాన కనపడే సరికి గంగవెర్రులెత్తినంత.. కామ కటాక్షం కలిగినత… కౌగిలింత కల దాటి కట్టెదుటికి వచ్చిననత… ఆ కాంత తనకిచ్చినత.. ఎంతెంతో ఆ వెచ్చనంతా… వేడుకగా తోచి, వేడెక్కి పగటి కల కన్నాడు కాశీ. ఛూపు చుట్టరికం కలిపింది. ఆంగవస్రం కట్టుకుని నిలబడ్డ కన్నె గాలి నడుము పేదరికం తెలిపింది. మడుగుకు అడుగులొత్తుతూ మెత్తగా తూలుతూ తుళ్ళుతూ ఆమె ఒడ్డుకు రాబోయి ఆగింది. ఆమె చూపు పైట దార్ని పడి మూగగా కళ్ళకు చేరి ముత్యమంత కన్నీటి బొట్టు రాల్చింది. ఆ మూగచూపు కాశీ అయిదు ప్రాణాలనూ అచమ్యా అంటూ పీల్చింది. ఆంతే తనకు వచ్చీరాని ఈతతో నదికి అడ్డం పడ్డాడు కాశీ. నడిచాడో .. పరుగుతీసాడో.. పాకాడో .. ఢేకాడో పడుచమ్మ పైట పట్టుకున్నాడు. అనామిక బొడ్డులోంచి ఓ నవ్వు పుట్టి పెదాల మీదకొచ్చి పూసింది. మున్గురుల తడి ముత్యాల తెర నుంచి ఆమె వెన్నెల నవ్వులు కాలే ఎండకు గొడుగేసి కాశీ గుండెకు వల వేశాయి.

పైటనిచ్చిన పడువాడికి సిగ్గులు కృతజ్ఞత చెప్పాయి. ఛూపులు ఎరుపులై, పిలవని పిలుపులై, కాశీని కాములవారి గుడి తలుపులు తీసి రమ్మన్నాయి. ఇదంతా కాశీ మానసికం.

కాదంటే స్వప్న జగత్తు. లేదా మదన మహత్తు.

పైటనందుకుని, తడిసి మోపెడైనదాన్ని పిండుకోబోయి, కాశశీపతులవారి అంగవస్త్రాన్ని జారకుండా మునిపంట పొదిపి, చివళ్ళ చంకనెట్టుకుని  వంగింది ఆ పడుచు దోరగా.. అదోరకంగా కాశీ వంక చూస్తూ – అద్దరినెదరున్నా-ఏటికిద్దరిని  వీరిద్దరే. పైట చేతబట్టి  తెచ్చిన కాశీ పునః స్నానం చేయలేదు. ఆంగవస్త్రం ఎంగిలించిన అంగన దాన్ని నీట తడపనూ లేదు. అంటు అంటూ లేదు అనుకున్నవారు లేరు. వారిద్దరి మధ్య ఇంత జరిగినా మాటా – మంచీ సుంతయినా లేదు.

చేపల కోసం కొంగ జపం సాగుతూనే ఉంది. చేపట్టే వాడి కోసం కన్నెతనం కాగుతూనే ఉంది. ఛేతికొచ్చిన అవకాశం అందంగా ఉంది, అందుబాటులో ఉంది. ఛదివిన ఛప్పన్న శాస్త్రాలూ, చెప్పుచ్చుక్కొట్టినా చెప్పిన మాట వినేటట్టు లేడు, అమరవాది వారి అబ్బాయి.

అవునుమరి కొమ్మన్నగారి మనుమడేగా!

ఈ కొమ్మన్నగారు గుంటూరి వారు కాదు. ఆ కొమ్మన్నగారి గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న వేదం వారి అంతే వాసులు. అమరవాది కొమ్మన్న శాస్త్రిగారికి సాక్షాత్తూ పౌత్రుడు మన కాశీపతి శాస్త్రి. మహాయాజ్ఞీకులు, అపర యాజ్ఞువల్క్యులు తిక్కశర్మగారు… అదే మన గుంటూరి కొమ్మన్నగారి పుత్రులు. దరిమిలా యజ్ఞం చెసి సోమయాజులై తండ్రిగారిని తృతీయం తర్వాత చరుర్థ పురుషార్థానికి నడిపించి పుత్రుడుగా చేయవలసింది చేశారు.  ‘ భారాఖ్యమగు లేఖ్యంబైన యామ్నాయమున్ తెనిగించి భారతామృతము కర్ణపుటంబుల గ్రోలి ఆంధ్రావళి మోదముం బొరయనట్లుగ’ చేసిన ప్రాతః స్మరణీయులు – పునరపి అన్నట్లు గురు మానస పుత్రుల జాతకము.. అదే మన కాశీపతి పితామహుల జాతకమూ.  కామకోటికి వచ్చి ముక్తి కాంతానుగ్రహం కోసం, వాకిట నిలిచి వాటారి పోయింది. ఆ వంశాకురమే కదా కాశీ. తాత పేరు నిలపవలసిన వాడాయేను. ఆ పేరు నిలపడానికి ఉన్న పేరు… అదే తన తండ్రిగారికన్నా మంచిపేరు కృష్ణలో కలపడానికి ఇప్పుడీ అవకాశం, అనుకోకుండా.., అందంగా అందే విధంగా ఆడదై వచ్చింది.

నడి వేసంగి, మిట్ట మధ్యాహ్నం, అయితేనే, కాకుళీయ కామ పరిషత్తులో వేళపాళ, ఎక్కువ తక్కువ, కులం గోత్రం – వేదం శాస్త్రం, మంచి చెడ్డలు, మట్టిగడ్డలు శృంగారానికి పాటించవలసిన పనిలేదని ఏనాడో తేల్చి వేశారు. అసలే దివిసీమ, అందులోనూ క్రీడాభిరామంగా వెలిసింది శ్రీకాకుళం.

 

సురలే నరులట అచ్చట

సురుచిర నిమేష నేత్రులు

నరులే సురులట నిచ్చలు

జరాభావ రసగాత్రులు

అంతా దివ్యమే… భవ్యమే!

 

‘ఇంతకీ ఎవరయ్యా ఆ ఇంతి? ఫులకలు పుట్టించే ఆ పూబంతి? ఈ నలరాజును వరించడానికి వలరాజు నదీ తీరానికి పంపిన దమయంతి?’

వచ్చే కాకుళపు తిరునాళ్ళకు – కట్ట కింద తిరునాళ్ళని కూడా పేరు – రైకల పండగ రేనాళ్ళకు ముందుగానే దిగుతారు వక్కలగడ్డ నుంచీ, మురమండ మేళం నుంచీ, వేల్పూరు వాడలనుంచీ, తణుకు నుంచీ, తాడేపల్లి నుంచీ, నగిగడ్డానుంచీ, కడప శివారు కోడూరు నుంచీ – విశేషించి వికట కవిత్వాల రామలింగయ్య  గారి తెనాలి యగ్రహారం నుంచీ, ఆనంద గజపతుల సీమలో కటకం నుంచీ, విజయనగరం నుంచీ, మల్లెమొగ్గల వారు మంచి గంధం వారు, మంగళం పాడువారు, చుట్టాల సురభివారు, పువ్వుల వారు, పూజల వారు – వారి వారి విద్యలతో వీరంగాలతో శీకాకుళానికి తరలి వస్తారు.

అట్లా వచ్చి, వన్నెల పదారాలు చేసి వారి వారి తావులకు మళ్ళే ఈ జనాభాలో ఒకరో ఇద్దరో, మేళాల వారో మేజువాణిల వారో కొన్నాళ్ళపాటు శ్రీకాకుళంలోనే ఉండిపోవడం కద్దు. ఆందులో ఏటా ఒక్క కుటుంబం వారైనా నట్టువాంగం నేర్పులతోనో, భామాకలాపాల ఆట ఒడుపులతోనో, సానివాడ కూనలకు విద్య నేర్పే పని మీద ఉండడం కద్దు. వారిలో కొందరు కృష్ణలీలా విశేషాలను ఆకళింపు చేసుకుని అభినయంలో దిట్టలనిపించుకోవాలని పురాణేతిహాసాలు తెలిసిన పండితులను, తలపండితులను సగౌరవ లాంచనాలతో వాడలో వారి పిలిచి సత్కరించడమూ కద్దు. సాధన చేయడమూ కద్దు.

కద్దు  కద్దు అంటూ కళ్ళ కద్దుకున్న కళలకు కాణాచి  విజయనగరవాసిని భోగిని, కాశీ పితామహులను ఆ విధంగా ఆశ్రయించినదై మనసు నిండుగా కృష్ణ మాయలు, మర్మాలు మనసు తీరగా గీతలూ – వేదాంతాలు మనసు తీరని గారాలు శృంగారాలూ అన్నీ నేర్చినదే. నేరుచుకుంటున్నట్టు నేర్పుగా కొమ్మన్నగారి నీడను.. తలను రసికతలను దాచుకున్నది. ఫ్రత్యక్ష గురుత్వమేమో  శాస్త్రిగారిది.. పైగా పడుచుదనం దోరగా పలకమారే వయసేమో.. ఆ కాంతను అయస్కాంతను, ప్రియస్వాన్తను ఆసాంతం సొంతం  చేసుకున్న వారై, కృష్ణ కృష్ణ అనుకున్నంతలో నెల పొడిచి తొమ్మిదింట నెలవంక నవ్వులది ఓ వెలది పాప పుట్టింది. పుట్టింది పెరగడానికె అన్నట్టు  పెరిగి పెద్దమనిషి అయింది. అటు తర్వాత కాశీరాజుగారి కొలువు పేరంటానికి భోగినిని రమ్మని గజపతుల నుంచి పిలుపు మేనాతో వచ్చిది. ఇటువంటి  సందర్భాల్లో గుడ్డు తల్లిని వెక్కిరిస్తుంది, అందుకనే ఆ కన్నపాపను, కన్నెపిల్లను తిరిగొస్తే సరే.. లేదంటే దాని ముద్దూ, ముచ్చటా మీరే. చూసుకొండి అంటూ కళ్ళంట నీళ్ళెట్టుకుని భోగిని వెళ్ళీపోయింది.

ఆందాల భరిణలో ముద్దమందారమూ అన్నట్టుగా పైటకెదిగిన దీక్షితదుహిత ‘నాన్నగారూ’ అంటూ కొమ్మన్నగారి ఇంట్లోను, ఇంటి పనుల్లోనూ తిరుగుతుంటే.. ఓనాడు నట్టువాంగాల్ ఉయ్యూరుగాడు వచ్చి మాగూటి చిలకను, మా గువ్వకే ముడిపెట్టమన్నాడు.  కాకపోతే నెమలి పాడితే వినాలని – కోకిల ఆడితే చూడాలని అనుకున్నట్టే అవుతుందని అన్నాడు.

‘పెళ్ళి’ కొమ్మన్నగారి ఎర్ర నెత్తురు తెల్లమొగం వేసింది. తండ్రి బిడ్డగా ఇది బ్రాహ్మణి – తల్లి వరసగా సాని. మమకారానికి – వావి వరసా లేవు. అప్పటికే ప్రాయపు సూర్యుడు పడమటికి చేరిన కొమ్మన్న్నగారికి వల్లమాలిన దుఃఖం  వెల్లువై వచ్చింది. శాస్త్రిగారు జీవన్మృతులై భాష్పగన్గలో  వారికి సశరీర నిమజ్జనం జరిగింది. కాకుళేశుడి గుడి ధర్మకర్త రాజబంధువు అంకినీడు నాయుడు కొడుకుతో పెళ్ళీ పేరంటం అన్ని జరిగిపోయాయి. ఆ తర్వాత రాజ బంధుత్వం రాబందుగా మారి, కులం వారిలో రాజ బంధువుల్లో పిల్లలుండగా ఇదేమిటని, కథేమిటని కాకులై పొడిచి చిన్న అంకినీడుకు మళ్ళీ పెళ్ళి చేశారు.

బొమ్మల పెళ్ళిగా జరిగినా అమ్మను చేసి వెళ్ళాడు అంకినీడు కొడుకు. భోగిని కూతురు యామిని ఇప్పుడు తల్లి, తాళి పడ్డ చోట తల్లి కాలేదు  యామిని.  తను పుట్టినప్పుడు తల్లికి పురుడు పోసిన వాడ వదిన సామ్రాజ్యం తనకూ పురుడు పోసింది. యామిని కడుపున మళ్ళీ భోగంది పుట్టింది. దిగిన పదారేళ్ళ కాలం ఇంటిపనులకే సరిపోయే. వంటలకూ వార్పులకూ చేతులు  కాలిపోయె. ఛాకిరేవులకు కొలువాయె. ముద్దులూ లేవు, మురిపాలూ లేవు. మువ్వలు లేవు – మువ్వ గోపాల పదాలు లేవు. ఇంటికొచ్చే పూట కాపరాల వారికి సపర్యలు – సల్లాపాలు, సన్నజాజులూ – చాటు ముద్దులు – ఇలా గడిచిపోతూ ఉంది.

 

సామ్రాజ్యం ఇంట్లో  సందె పేరంటాలు సన్నగిల్లాయి. కొత్త నీరు వచ్చి పాత నీరు పల్చబడ్డట్టు అయింది. యామిని బతుకు ఎడారిలో ఎండమావి. ఒక వీసం వైరాగ్యం.. ఆమె చూపు లోను, పలకరింపులోను. ఇపుడు ఈ బిడ్డ పుట్టిన  తర్వాత ఉన్మాదంగా మారింది, పిచ్చిపాటలు! అంకినీడు బతకనీడు, చావనీడు. వాడు మోడు. నేను బీడు. బతుకు పాడు అనటం వెర్రిగా నవ్వడం. కంట్లో ఈతముల్లు గుచ్చుకుని పువ్వు పూసిందని కొందరు – కంటి నలకను ఈతముల్లుతో తీసుకుంటే  ఏమవుతుందని కొందరు, దెప్పడంతో ఉన్న మతి కూడా పోయింది యామినికి. నంగిగడ్డలో నగరాజ కుమారి మంత్రం పెడితే యామినీ పూర్ణచంద్రికలు, పున్నములవుతాయని, వాడవారు, వరసవారు  చెప్పగా బండి కట్టించారు. కాకుళం దాటగానే గుండేరు – అదొక వాగు. ఆ వాగులో అన్ని గుండ్రాళ్ళే ఇసకపాలు తక్కువ, దాని రాకడ, పోకడ అంతుబట్టదు, బండి కదిలే వేళకు దుక్కివాన కురిసింది. బండి కదిలి గుండేరు చేరేసరికి – అది నిండేరై కూర్చుంది. ఈ బండి నడివాగులో చిక్కుకుంది. వరదలో కొట్టుకుపోయిన యామిని, జీవితపు ఆవలిగట్టుకు చేరింది. ఆంతా కథలాగా  జరిగిపోయింది. ముదిసాని సామ్రాజ్యం కొంపలో చిన్న భోగిని చిరుదీపమై మిగిలింది. ఆందంతో అభిసారిక కావలసింది – పరువంతో పరిచారికగా మారింది. ఎవరు మెచ్చేను ఎత్తుబడ్డ సామ్రాజ్యం తప్ప! ఇంట్లో ముసలిదాని వేధింపు పడలేక కాస్త గాలి పీల్చుకుందాం అనే వేళకు గుళ్ళో నైవేద్యం గంట  మోగిది. అప్పుడు కృష్ణకు బయలుదేరింది చిన్న భోగిని.  కాశీతో చూపుల సంభోగం అప్పుడే జరిగింది. ఆమె వరకు ఎండ వెన్నెలగా ఉంది. ఆ వెన్నెల్లో గొడుగు పట్టేందుకు తగ్గవాడే ఒకడు, కడుచక్కనివాడు, మనసెక్కినవాడు – కాశీ దొరకనే దొరికాడు.

ఫరువాన్ని పరువంతో పుఠం పెడితే, అందాన్ని అందతో రంగరిస్తే – వయస్సుని, వాంఛని వడబోత పెట్టుకుంటే , సిగ్గుని చిగురించే కోరికని చిత్రిక పట్టుకుంటే, వడదెబ్బని వడపప్పుగా నమిలి మింగితే… పులకింతల పూనకంలో వలవంతల పూనకం ముద్దుగా తాగితే ఈ దప్పి తీరేనా? ఎద నొప్పి జారేనా! ఆనుకున్నంతలో పైకి అనలేనంతలో అంగవస్త్రం అందుకుంటూ ఆమె చేతులు స్పృశించాడు కాశి. ఆమె నవ్వింది . నవ్వుతే నాదనిపించింది. మౌనంతో మనది అనిపించింది. ఈ చెయ్యి, ఆ చెయ్యి కలపడతో, దులుపుకోడతో, ఈ బంధం ఇప్పటిది కాదు అనిపించింది.  ఈ రాసలీలకు ఆకాశంలో అగ్నిసాక్షి. భూలోకంలో కృష్ణవేణమ్మ సాక్షి. రతి స్పర్శ, రాగ స్పర్శ  జ్ఞాతంగా అజ్ఞాతంగా జరిగిపోయాయి.  “ అవసర పఠితావాణి అలంకార రహితాస్తు శోభతే, పఠితాం, అవసర గామీ నారి భూషాహనిస్తు శోభతే., పఠితాం, అవసర గామీ నారి భూషాహనిస్తు శోభతే., పఠితాం, అవసర గామీ నారి భూషాహనిస్తు శోభతే., పఠితాం, అవసర గామీ నారి భూషాహనిస్తు శోభతే., పుంసాం” ఇదే కదా ఆ కకుళేశుడి వైష్ణవ మాయ!

అట్టట్టా ముదిరిన చనువు మళ్ళీ నట్టేట ముంచింది. ఇద్దరినీ జలక్రీడలకు తార్చిన్ది. లక్ష్మణ కవి గారన్నట్టు జలముల నగ్ని! పైటా అంగాస్త్రం కూడబలుక్కున్నాయి, అంగాగాలు అదమరిచి పోయాయి, ఆడా, మగతనాలు అర్థనారిశ్వరపురంలో గుడి కట్టుకున్నాయి. అప్పుడే స్వామివారికి నివేదన పూర్తయినట్టు సుదూరాన గుళ్ళో మళ్ళీ గంట మోగింది. మూడు తరాల అజ్ఞాత కథకు కృష్ణవేణిలో నిమజ్ఞం జరిగింది.

ఇంతకీ  సానివాడలో ఒక సామెత ఇప్పటికీ మిగిలిపోయింది.

శ్రీకాకుళే మహాక్షేత్రే

గుండేరే మహనది

ఈతముల్లే ప్రాణ హాని

అంకినీడే అధోగతి.

——————————–

కౌముది సౌజన్యంతో….

 

“అనగనగా ఓ మంచి కథ” శీర్షికన ఈ వ్యాసం “కౌముది జులై 2009” సంచికలో ప్రచురించబడినది.

 

కౌముది యాజమాన్యానికి కృతజ్ఞతలతో

 

(యూనీకోడీకరించినది-రమణి రాచపూడి)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top