(వేటూరి సుందరరామమూర్తి గారంటే సిరివెన్నెల గారికి అపారమైన గౌరవం. వేటూరి గారు కూడా సిరివెన్నెల సాహిత్యాన్ని ప్రేమించి ఆయన్ని తమ్ముడిగా, కొడుకుగా సంభావించారు. వేటూరి గారు పోయినప్పుడు సిరివెన్నెల గారు చలించి కంటతడి పెట్టుకున్నారు కూడా! ఆ సమయంలోనే ఓ వెబ్సైట్ సిరివెన్నెల గారిని విమర్శిస్తూ ఒక చౌకబారు వ్యాసం ప్రచురించింది. కామెంట్లలో సిరివెన్నెల అభిమానులు – వ్యతిరేకులు దిగజారి వ్యాఖ్యలు చేసుకున్నారు. ఇది సిరివెన్నెల గారికి తెలిసి ఆయన కలత చెందారు. తాను స్పందించడం అవసరం అనుకుని ఆయన రాసిన ఈ వ్యాసంలో తన హృదయంలో వేటూరికి ఉన్న స్థానాన్ని చెప్పడంతో పాటు, విమర్శను ఎలా చెయ్యాలో, ఎలా ఎదుర్కోవాలో అన్నది కూడా సుతిమెత్తగా తెలియజేశారు. వ్యాసం చదివాక శాస్త్రి గారి ఔదార్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. వాదోపవాదాలలో సంస్కారం, సహృదయత కరువవుతున్న ఈ రోజుల్లో సిరివెన్నెల గారు చూపించిన మార్గం అనుసరణీయం. ఆయన ఇచ్చిన సందేశం ఆచరణీయం!
సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలో పొందుపరచబడిన ఈ వ్యాసాన్ని అడిగిన వెంటనే ప్రచురించడానికి అనుమతినిచ్చిన సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ముఖ్యంగా సిరివెన్నెల వారి సోదరులు శ్రీ శ్రీరామశాస్త్రి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు!)
అనుకోకుండా ఈ వ్యాఖ్య – దానిపై స్పందనలు, ప్రతిస్పందనలు చూసాను. చాలా సంతోషం కలిగింది. సాహిత్యం పట్ల ఈనాటి యువతరానికి (ఈ వ్యాఖ్యల్లోని ఆవేశం, ఉపయోగించిన సంభాషణ చూసి వీళ్ళు యువతరానికి చెందిన వాళ్ళై ఉంటారని అనిపించింది) ఏ మాత్రం అవగాహన, అక్కర, అభిరుచి, లేవు అని గట్టిగా నమ్ముతున్న మన తెలుగు సమాజానికి, ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన చాలా మంది బుద్ధిమంతులకి కళ్ళు తెరిపించేలా ఉంది ఈ సంగతి.
శ్రీ వేటూరి వారి పట్ల వీరికున్న అభిమానం, వారి నిర్యాణం పట్ల వీరికి కలిగిన సంతాపం, దాని నుంచి జనించిన ఆ కోపం ఏం చెబుతున్నాయి? కవిత్వం, కవి, ప్రతిభ, ముఖ్యంగా పెద్దాయన (నా తండ్రి వంటి శ్రీ వేటూరి వారు) తన అసంఖ్యాకమైన సినీ గీతాలతో తెలుగు సాహిత్యానికి చేసిన సేవ, వీటన్నిటినీ గమనించి, గుర్తించి, అభిమానించి, ఆచరించి, గౌరవించిన సంస్కారం తెలియడం లేదా? అది కూడా యువతరం నుంచి!
ఈనాడు మన తెలుగు సమాజంలో అనేకమంది పండితసమానులూ, మహామహులమనుకుంటున్న వారి దృష్టిలో “ఆప్ట్రాల్” అనిపించే సినీ గేయ రచన ద్వారా శ్రీ వేటూరి వారు (ఆయన పేరు ముందు కీ॥శే॥ అని చేర్చడం నాకు ఇష్టం లేదు. ఆయన తన గీతాల ద్వారా శాశ్వతుడు. అదే సంగతి వారి సంతాప సభలో మొట్టమొదటి వక్తగా తెలియజేసాను) ఎంత స్ఫూర్తిని కలిగించారో అన్నది ఈ స్పందన ద్వారా తెలియజేసిన వాళ్ళందరికి, ముఖ్యంగా వారి ‘కాల ధర్మం’ వల్ల కలిగిన ఆవేదనని, దుఃఖాన్ని వ్యక్తపరచడానికి ఒక మార్గంగా నా పట్ల నిరసన భావం ప్రదర్శించిన వారందరికి నా హేట్సాఫ్.
వారి స్పందనకి ప్రతిస్పందిస్తూ, నా పట్ల ఉన్న అభిమానాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నించిన వారందరికీ ఒక విన్నపం. దయచేసి వారి మనస్సుకి తగిలిన గాయాన్ని సవ్యంగా అర్ధం చేసుకోండి. వారిని నిందించే ముందు తెలుగు (సినీ) సాహిత్యం పట్ల వాళ్ళ పరిశీలనా, శ్రద్ధ గమనించి, గర్వించండి.
వాళ్ళు నన్ను తిట్టలేదు. ఒకవేళ నేను పెద్దాయన పట్ల అసూయని, అసహనాన్ని, అలక్ష్యాన్ని ప్రదర్శించానేమో అని అనిపించి అలా స్పందించడం వాళ్ళకి నా పట్ల ఉన్న ఒక “దృష్టి”ని గమనించండి. “వీడు కూడానా!?” అని అనుకోవడం, అనడం ద్వారా, పరోక్షంగా వాళ్ళ హృదయాల్లో నాకున్న స్థానం (నాకంత అర్హత, యోగ్యతా ఉన్నవా లేదా అన్నది వేరే ప్రశ్న) గమనించండి.
నేను అలా ప్రవర్తించి ఉండుంటే, నేను కూడా అంతే తీవ్రంగా, అంతకన్నా తీవ్రంగా స్పందించి ఉండేవాడిని.
నేను సంజాయిషీ ఇవ్వడం లేదు. ఇవ్వను. నేనైనా, మరెవరైనా, ఎంతవారైనా సాహిత్యాన్ని “ఉద్ధరించ” గలిగేంత అవతార పురుషులు ఎవరూ ఉండరు. కాల ప్రవాహంలో ఎందరో వస్తుంటారు, వెళుతుంటారు. అతి కొద్దిమంది మాత్రం శ్రీ వేటూరి గారిలా కాలాన్ని అధిగమించి, శాశ్వత స్థానాన్ని శాసిస్తారు.
ఆయన తరువాత తరానికి చెందిన నాబోటి వాళ్ళు ఆయన సాధించిన ఆ ఘనతని ఆదర్శంగా, గమ్యంగా, భావించి ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి. ఎంతవరకు సఫలం అయ్యారు అన్నది కాలం తేల్చాల్సిన విషయం.
ఒకటి మాత్రం సత్యం. ఎవరెస్టు శిఖరం ఒక్కటే ఉంటుంది. మొదట ఎవరు అధిరోహించారు అన్నదే చరిత్ర. తరువాత మరికొందరు ఆ శిఖరాన్ని అధిరోహించడం అన్నది చరిత్ర కాదు. అలాగే, శ్రీ వేటూరి గారు తొలిసారి ఎవరెస్టుని అధిగమించారు. ఆ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని, తరువాతి తరం వారు ప్రయత్నిస్తారు, ప్రయత్నించాలి కూడా..
చివరగా “వాళ్ళకి” “వీళ్ళకి” కూడా ఒక సూచన. మీరు ప్రస్తావించిన అంశం చాలా ఉన్నతమైనది. మీలోని సంస్కారాన్ని, సాహిత్యాభిరుచిని తెలియజేస్తోంది. కానీ ప్రస్తావించిన “తీరు”, ఉపయోగించిన అధమస్థాయి భాష (అనుకూలురు, వ్యతిరేకులు) కూడా, మీ సంస్కారానికి శోభనిచ్చేదిలా లేదు. గమనించండి. మార్చుకోండి. మీ ఔన్నత్యాన్ని మీరే కించపరచుకోకండి.
మళ్ళీ మరోసారి చెబుతున్నాను. పెద్దాయనకి నాకు ఉన్న అనుబంధం, వారి పట్ల నా అభిప్రాయం, వీటిని నేను ఎప్పుడూ ఎలా వ్యక్తీకరించాను అన్న విషయాలపై నేను వివరణ గాని, సంజాయిషీ గాని ఇచ్చుకోదలచుకోలేదు.
మీరు కూడా వ్యక్తుల పట్ల కన్నా వారు నెలకొల్పిన “విలువల” పట్ల దృష్టి మళ్ళించండి. సాహిత్యం శాశ్వతం. సాహితీకారుడు కాదు. ‘పాట’ శాశ్వతం ‘పాటసారి’ కాదు.
మీ అందరి
సీతారామశాస్త్రి