“పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని” పాటకి వేటూరి రాసిన పేరడీ!

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వేటూరిపై రాసిన అద్భుతమైన వ్యాసంలో తెరమడుగున పడిన వేటూరి ఆణిముత్యాలను వెలికితీయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు:

మొట్టమొదటసారిగా బాణీ కట్లుబాట్లని, ‘చిత్ర’ పరిధుల్ని దాటి, తనదైన స్వతంత్ర ప్రతిపత్తితో ఒక ‘కావ్యఖండిక’ గా మనగలిగేలా పాటని నిలబెట్టి, ఎప్పటికీ వసివాడని దేవపారిజాతాల్లా, గీతాలు గుబాళించేటట్టు తన ‘భావ గంధాన్ని’ అద్ది, ఒక్కోపాట ఒక్కో ‘సంపూర్ణ కావ్యం’ లా తీర్చిదిద్దడానికి ఆయన చేసిన తపస్సు, నన్ను స్తంభీభూతుణ్ని చేసిన సందర్భాలెన్నో వివరించడానికి చోటు చాలదు. అది ఏ సినిమా, దాని ‘నిలకడ’ ఎంత క్షణికం, ఆ సినిమాకి గాని, ఆ సందర్భానికి గాని అంత అర్హత ఉందా అని కూడా పట్టించుకోకుండా, ఆయన చెక్కిన కావ్యశిల్పాలు ఎన్నో!! పేరుకూడా గుర్తులేనంతగా ఇట్టే వచ్చి అట్టే కొట్టుకుపోయిన ఎన్నో చిత్రాల్లో ఆయన చేసిన అద్భుతాల్ని ఆనవాలు పట్టాలంటే ఎంతో త్రవ్వకపు పని చేపట్టాల్సిందే. అలా ‘తెరమరుగున’ పడిన అనేక గీతాలను ‘కనిపెట్ట’ గలిగితే, తన పద పారిజాతాల సుమమాలతో వాగ్దేవి నలంకరించిన సుందర రామ్మూర్తి గారిలోని కవితా మూర్తిని దర్శించగలిగితే, సినిమాకి సంబంధించని మహాకవులు కూడా సినిమా పాట రాయడం తమ ప్రతిభకి గర్హించదగ్గ ‘స్వోన్మీలనం’ (Self expression) గా భావించి కుతూహలపడతారే గాని, గర్హించవలసిన, లొల్లాయి పదాల కాలక్షేపంగా భావించి వెనకడుగు వేయరని అనిపించక తప్పదు!
వెండితెరని నల్లబల్లగా మార్చి తిరిగి తెలుగు ఓనమాలు దిద్దించిన వేటూరి వ్యాసం

veturi.in ఇలాంటి పాటలను వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక చక్కని పాటను పరిచయం చేస్తున్నాం. పీపుల్స్ ఎన్కౌంటర్ వంటి చిత్రాలు తీసిన దర్శకుడు మోహన్ గాంధీ గారు ఈటీవి వారు వేటూరిపై చేసిన “ఝుమ్మంది నాదం” సిరీస్ లో మాట్లాడుతూ ఈ పాటను ప్రస్తావించారు. చక్రవర్తి సంగీతం అందించిన “ఉషాకిరణ్ మూవీస్” వారి “పూజకు పనికిరాని పువ్వు” (1986) అనే చిత్రానికి రాసిన పాటిది. ఈ చిత్రం బహుశా వేశ్యల జీవితాన్ని, సంఘంలో వారి పరిస్థితిని చూపిస్తూ అభ్యుదయ భావాలతో తీసిన సినిమా కావొచ్చు. వేటూరి గారు ఈ సినిమాకి సింగిల్ కార్డ్ రచయితగా వేటూరి మూడు పాటలు రాశారు. అందులో “కదిలింది కదిలింది గంగాభవాని, కఠిన కాముక లోక కల్మషాలను కడిగి“, “ఈ ఎడారి పువ్వుల ఎదలో చల్లని ఈ దయ చల్లవయా” అనే పాటలు సాహిత్యపరంగా చాలా చక్కగా ఉన్నాయి. ఇవి సందర్భోచిత గీతాలు. కాబట్టి కమర్షియల్ సూత్రాలు పట్టించుకోకుండా కవి తన స్పందనని రాసుకోవచ్చు. మూడో పాట కమర్షియల్ గా సాగే పేరడీ పాట. ఆ పాట గురించే ఈ వ్యాసం.

పెళ్ళి చేసి చూడు” చిత్రానికి పింగళి గారు రాసిన “పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని” పాటకి పేరడీ ఈ గీతం. పాడినది జానకి. వేశ్యలు తమ రోజూవారీ జీవితం గురించి సరదాగా పాడుకుంటున్న ఒక జావళీ తరహా గీతంలా పైకి కనిపిస్తుందీ పాట. పింగళిని అమితంగా ప్రేమించే వేటూరి ఆయన శైలిని కళ్లకద్దుకుని చాలా పద చమత్కారాలు చేశారు. పింగళి “ఓ భావి భారత భాగ్య విధాతలారా! యువతి యువకులారా! స్వానుభవమున చాటు నా సందేశమిదే!” అని మొదలుపెడితే వేటూరి దానికి ధీటుగా సినిమా సందర్భానికి తగినట్టు –  “ఓ సందుగొందుల సార్వభౌములారా! వీధిలో రసికులారా! చాటుమాటుగ చాటు మా సందేశమిదే!” అంటూ పల్లవించారు. పాటంతా ఎన్నో చమత్కారాలు చేస్తూ చివర్లో గొప్పగా ముగించారు.

ఈ సరదా కమర్షియల్ పాటకి కాస్త శృంగారం, కొంచెం మాస్ అపీల్ ఉన్న లైన్లు రాయక తప్పదు. “ముష్టి ఎత్తుకును యాచకుడైనా ముద్దుల బిచ్చాలడగోయ్” , “రాజ్యాలేలే నాయకులైనా రాత్రికి హాజరు కావాలోయ్” వంటి అలాటి లైన్లూ వేటూరీ రాశారు. ఇలాంటి మాస్ లైన్లు రాయడంలో ఆయన చూపించిన లాఘవాన్ని మెచ్చుకోవచ్చు. అయితే ఇలాటి లైన్లే రాసుంటే ఈ పాట గురించి పెద్ద చర్చించాల్సింది ఏమీ ఉండేది కాదు. ఇలా సరదాగా సాగుతున్న పాటల్లోనూ శ్రోతలు ఒక్కసారిగా అవాక్కయ్యే గొప్ప వాక్యాలు చొప్పించడం వేటూరికే చెల్లిన శైలి. ఇలా తన మెరుపులతో ఎన్ని మామూలు పాటలని ఆయన “ఎలివేట్” చేశారో లెక్కలేదు. ఇలా రాయడం చాలా కష్టం కూడా – పూర్తి మాస్ పాట రాయొచ్చు, పూర్తి గొప్ప పాట రాయొచ్చు, కానీ ఓ మామూలు సందర్భానికి మామూలు పాటలా రాస్తూ మధ్యలో ఇన్ని మెరుపులు మెరిపించడం వేటూరి లాంటి గొప్ప సినీకవులకే సాధ్యమవుతుంది.

పాటనిండా వేటూరి సమాజంపై చురకలు వేస్తూనే వచ్చారు. ఇంట్లో భార్యని వదిలి సాని కొంపలు చేరే వాళ్ళను “వంటింటి పొయ్యిలో తమ ఇల్లాలు పిల్లిని దాచేసి సాని కొంపలు జేరు చవటలకు శాస్తి కాగ” అంటూ భలేగా శపించారు. “పొయ్యి వెలిగించలేదు” అనడానికి “పొయ్యిలో పిల్లి లేవలేదు” అనే తెలుగు వాడుక ఒకటి ఉందని తెలిస్తే ఈ ప్రయోగంలో వేటూరి బ్రిలియన్స్ అర్థమవుతుంది. అలాగే “సాని ఇంటికి వల్లకాటికి చేరినవాడిక అంతేనోయ్” అంటూ హెచ్చరించారు. పోలీసుల నుండీ, చుట్టూ జనాల నుండీ ఉండే వేధింపులని ప్రస్తావిస్తూ – “ఖాకీ బట్టల కుక్క కాపలా, కన్ను గీటితే చెల్లేనోయ్”, “చూడవచ్చిన కోతిమూకలు కాల్చుకు తినడం మామూలోయ్” – అనే గుండెలోని బాధను పెదవి నవ్వుతో చెప్పే వాక్యాలు రాశారు.

ఇలా పాట వింటూ ఉంటే సరదాగా కనిపిస్తూ బాధని తెలిపే multi-layered ఫీల్ ఒకటి శ్రోతకు కలుగుతుంది. దర్శకుడు మోహన్ గాంధీ గారు ఈ మాటే ప్రస్తావిస్తూ – “నవ్వు ఎక్కువైనా కన్నీళ్ళు వస్తాయన్నట్టుగా చివర్లో ఓ స్ట్రోక్, ఓ కొరడా దెబ్బలా ఆ వేశ్యలందరూ తమ characterization చెప్పుకున్నారు” అన్నారు. పాట మొత్తానికి మకుటాయమానంగా నిలిచిన ఆ ముగింపు వాక్యమే – “మలినగర్భ ఈ సంఘమాతకు మంత్రసానులం మేమేనోయ్” అన్నది. నది ప్రవహిస్తూ కల్మషాలను కడిగినట్టుగా ఈ వేశ్యలు సమాజంలో కుళ్ళును తాము తీసుకుని భరిస్తున్నారు. వారు గనుక మలినగర్భ అయిన సంఘమాతకు పురుడు పోయకుంటే ఏమైపోయేదీ సమాజం అన్న ప్రశ్నని మనలో పుట్టిస్తూ, వారిని ఇంత ఉదాత్తంగా చూపిన వేటూరి కలానికి ఎన్ని నమస్కారాలు చేసుకున్నా సరిపోదు. ఆ మహాకవికి ఇదే మా చిరునివాళి.

ఈ పేరడీ పాట ఆడియో

పాట పూర్తి సాహిత్యం:

ఓ సందుగొందుల సార్వభౌములారా! 
వీధిలో రసికులారా! 
చాటుమాటుగ చాటు మా సందేశమిదే! వారెవా!  

ముసుగు వేసుకుని, మసక చూసుకుని, ముద్దులబేరాలాడాలోయ్! 
ముడుపులు మాకే కట్టాలోయ్! 
మా ఒడుపులు మీరే చూడాలోయ్! 

వంటింటి పొయ్యిలో తమ ఇల్లాలు పిల్లిని దాచేసి
సాని కొంపలు జేరు చవటలకు శాస్తి కాగ! 
మంచాల మల్లెల కూనిరాగాల 
మా పేరు తలచుకుని విటులు భయపడగ! 

గుళ్ళో పూజలు చేసే విటుడు ఒళ్లో హారతి పట్టాలోయ్! 
ముష్టి ఎత్తుకును యాచకుడైనా ముద్దుల బిచ్చాలడగోయ్! 
రాజ్యాలేలే నాయకులైనా రాత్రికి హాజరు కావాలోయ్! 
సాని ఇంటికి వల్లకాటికి చేరినవాడిక అంతేనోయ్! 

ఖాకీబట్టల కుక్కకాపలా, కన్ను గీటితే చెల్లేనోయ్! 

మందో మాకో దంచేటప్పుడు ముందుగ మా జత ఉండాలోయ్! 
చూడవచ్చిన కోతిమూకలు కాల్చుకు తినడం మామూలోయ్! 
మలినగర్భ ఈ సంఘమాతకు మంత్రసానులం మేమేనోయ్! 

సినిమాలో మొత్తం మూడు పాటలు ఇక్కడ వినొచ్చు:

పూజకు పనికిరాని పువ్వు jukebox

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.