భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూని ఇంటర్వ్యూ చేసిన ఏకైక తెలుగు ఘన‘పాత్రికేయుడా’యన. కథారచనలో మల్లాది రామకృష్ణశాస్త్రిగారి శహభాష్‌లు అందుకోవడంతో పాటూ, వారి దగ్గర మెళకువలు నేర్చుకున్న ‘కథకుడా’యన. “ఈ పాట రాసినవాడెవరో గానీ, వాడు సినీ రంగాన్ని ఏలతాడు” అని ‘చాసో’ పరోక్ష దీవెనలు అందుకున్న ‘సినీకవి’ ఆయన. తన జ్ఞాపకాలను రసగుళికలుగా మార్చి ‘హాసం’ పాఠకుల పెదవులపై దరహాస చంద్రికలు పూయించిన ‘వ్యాసకర్త’ ఆయన. ఇలా పాత్రికేయుడిగా, కథకుడిగా, కవిగా, వ్యాసకర్తగా తన పేరులో ఉన్న సుందరతను తన రచనలన్నింటికీ అన్వయింపజేసి, అక్షరాన్ని ఆలంబనగా చేసుకుని తెలుగు సాహితీ ప్రపంచంలో అక్షరుడై వెలుగుతున్న పదహారణాల ఆంధ్రుడు శ్రీ వేటూరి సుందర రామమూర్తిగారు.
మెరీనాతీరే, నగర సంకీర్తనం, రాష్ట్రగానం, మాటకచేరి, అనురాధ డైరీ వంటి శీర్షికలతో పత్రికా రచనలకు కూడా కవితాగంధాన్ని అద్ది, తిరుమలరామచంద్రగారు, నండూరి రామ్మోహనరావు గారు శివలెంక శంభుప్రసాద్ గారు వంటి పాత్రికేయశిఖరాల మెప్పు పొందినవారు వేటూరి. “అదిగో ద్వారక.. ఆలమందలవిగో” వంటి శీర్షికలు నొచ్చుకోవాల్సినవారుకూడా మెచ్చుకునేంత సరసంగా ఉండేవి. టంగుటూరి ప్రకాశం పంతులుగారు మరణించినప్పుడు “ప్రకాశవిహీనమైన ఆంధ్రప్రదేశ్” అన్న శీర్షికతో వేటూరి వ్రాసిన నివాళి వ్యాసం ఎందరో ప్రముఖుల మన్ననలు పొందింది. ఇక ‘ప్రతీ ఏక సంచికా ప్రత్యేక సంచికే’ వంటి అక్షరక్రీడావిన్యాసాలైతే పదహారేళ్ల ఆయన పాత్రికేయ జీవితంలో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. సిటీ న్యూస్‌కు ఆయన పెట్టిన పేరు నగర సంకీర్తన. ఆ న్యూస్ ఐటమ్ వ్రాసినవాడుగా ఆయన పేరు ’హోర్మోనిస్టు’. వార్తంశాలు వ్రాసేటప్పుడే ఆయన కలం ఇటువంటి చమత్కార పోకడలు పోతే, ఇక కథో, నవలో రాసేటప్పుడు ఊరికే కూర్చుంటుందా?
‘విపర్యయాలు’ కథలో పేదవాడైన హీరో గురించి చెబుతూ “బీదతనం అందాన్ని మకమకలాడిస్తుం”దంటారు. “సూర్యచంద్రాదులు కూడా తోడుండే పాకలో కాపురం” అంటూ చిల్లులుపడ్డ ఇంటి పైకప్పును ఉదహరిస్తూ లేమిని కూడా లలితంగానే వర్ణిస్తారు. ఏ ఎండకాగొడుగు పట్టే గుమాస్తాల గురించి చెబుతూ “భాగ్యవంతుల కొంపల్లో భాషాప్రవీణ” అంటూ చమత్కరిస్తారు. తన “జీవనరాగం” నవలలో “డికాషన్‌లో పోస్తున్న పాలలాగా చీకటిలోకి తెల్లని ఉదయ కాంతులు జొరబడుతున్నాయి” అంటూ సూర్యోదయాన్ని సరికొత్తరీతిలో మనకు చూపిస్తారు. ముళ్ళపొదల మధ్యలో ఉన్న రేగుచెట్ల గురించి చెబుతూ “రేగుపళ్ళు తీయనివెప్పుడూ, తీయరానివిగా ఉంటాయం”టారు. ఆ నవలలోనే ఒకచిన్నదాని గురించిన ప్రస్తావనలో “ఈడుముదరని సిన్నది. జోడుకుదిరిన కన్నెది. అభిమానానికి కూనపులి. అందానికి జాబిలి. పుడుతూనే ఆడిది. పున్నెంకట్టుకో దొరా – నీ సేయి మంచిది” అంటూ ప్రాసలతో పరవళ్లు త్రొక్కుతారు. ఇక “లేతయెండ బంగారు వానలా ఉంది”, “దొరల్లో దొంగల్ని కొట్టే దొంగల్లో దొర”, “నీలిదుప్పటంలో పకపకలాడుతున్న పాపలా ఉన్నాడు చందమామ”, మొదలైనవి రాబిన్‌హుడ్ సీరియల్లో వేటూరి మార్కు ప్రయోగాలు. ఇవన్నీ వేటూరి కొంచెం అటూ ఇటుగా ఇరవై ఐదు నుండి ముప్ఫై ఏళ్ల ప్రాయంలో వ్రాసినవే.
ఆ తరువాతకాలంలో ఒకప్రక్క సినీసాహితీ ప్రపంచాన్ని సర్వంసహా చక్రవర్తిలా పరిపాలిస్తూనే.. మరోప్రక్క అవకాశం చిక్కినప్పుడల్లా కథలో, వ్యాసాలో వ్రాసి తెలుగుతనాన్ని అక్షరాలలో పెట్టి మనపై చిలకరిస్తుండేవారు వేటూరి. “మాటు లేని పరువం మాట నేర్చింది”, “జడుపుకొద్దీ వయసు ముడుపుగా మారింది”, “ఆడా, మగతనాలు అర్ధనారీశ్వరపురంలో గుడికట్టుకున్నాయి.”, “చేపల కోసం కొంగ జపం సాగుతూనే ఉంది. చేపట్టే వాని కోసం కన్నెతనం కాగుతూనే ఉంది.” మొదలైనవి గిలిగింతలు పెట్టే ఆయన పదబంధాలలో కొన్ని. శ్రీశ్రీ గారు మరణించినప్పుడు ‘ఈనాడు’కు ఆయన వ్రాసిన వ్యాసంలో.. “రెండు శ్రీల ధన ధరిద్రుడు – కవితా ఘన సముద్రుడు శ్రీశ్రీ” అంటూ నివాళులర్పించారు వేటూరి. ఇంకా.. “శ్రీశ్రీ మొదలంటా మానవుడు – చివరంటా మహర్షి – మధ్యలో మాత్రమే కవి – ఎప్పటికీ ప్రవక్త” అంటూ ఆ మహాకవిని సంస్మరించుకున్నారు.
వేటూరి వ్రాసిన మాటలే ఇలా పాటల్లా ఉంటే.. ఇక ఆయన వ్రాసిన పాటల సంగతి వేరే చెప్పాలా? సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, సీతామాలక్ష్మి, భక్త కన్నప్ప, ఆనందభైరవి, పంతులమ్మ, మయూరి, జేగంటలు, మేఘసందేశం, సీతారామయ్యగారి మనవరాలు, అన్నమయ్య మొదలైన సినిమాలలోని వేటూరి పాటలగురించి పుంఖానుపుంఖాలుగా వ్యాసాలెన్నో వచ్చాయి. ఆత్రేయ, ఆరుద్ర, సినారె, దాశరథుల దగ్గరనుండి సిరివెన్నెల, భువనచంద్ర, వెన్నలకంటి, జొన్నవిత్తుల, చంద్రబోసుల వరకూ ఆయన ఒరవడిని మెచ్చుకోని, కొండొకచో హత్తుకోని సహరచయితలే లేరు. వేరువేరు దారులవారైన విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, సింగీతం శ్రీనివాసరావు గారు, జంధ్యాలగారు, క్రాంతికుమార్ గారు ఇలా దిగ్గజ దర్శకులందరికీ వేటూరే అభిమాన పాటల రచయిత. వీరి సూపర్ హిట్ సినిమాలలో చాలా వరకూ వేటూరివే సింగిల్ కార్డ్స్. బాపు-రమణలకు ఆరుద్రగారే ఆస్థాన రచయిత అయినా, వేటూరిగారి సినీరంగప్రవేశం తరువాత, ఆయన కోసం కూడా తమ ఆస్థానంలో మరో కుర్చీ వేసి గౌరవించారు.
వేటూరి పాటల్లో సొగసులను చూడాలంటే ఏ వందో రెండొందలో పాటలను తీసుకుంటే సరిపోదు. ఆయన వ్రాసిన సుమారు ఆరువేల పాటల్లో సరదా పాటలు, అల్లరి పాటలు అనుకున్న వాటిలో కూడా ఆయన మార్కు విన్యాసాలు కనబడుతూనే ఉంటాయి. అసలైన ‘వేటూరి మార్కు’ ఏమిటంటే.. శ్రోతలలో ఎవరి అనుభవాలకూ, ఊహలకూ తగ్గట్టుగా వారికి ఆ వేటూరి పాట అర్థమవ్వడం. వీణ వేణువైన సరిగమల గురించి, తీగ రాగమైన మధురిమల గురించి ఎవరి భావనలు వారివి కదా! అలా అన్నమాట.
“వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది – గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది” అంటూ లలిత శృంగార భావనల్ని పొంగిచే ఆయన కలం.. “ఎద ఉరుకులు పొదలకు ఎరుకట – పొద ఇరుకులు జతలకు చెఱుకట” అంటూ చిలిపితనాన్నీ ఒలికిస్తుంది.
“హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి – ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో” అంటూ మాట పెగలని భామలు కొందరు.. “నీ మీద నాకు ఇదయ్యో – అందం నే దాచలేను పదయ్యో!” అంటూ సరదాగా ఓ అడుగు ముందుకేసే భామలు ఇంకొందరూ ఆయన పాటల్లో తారసపడుతూనే ఉంటారు.
“రాక రాక నీవు రాగా వలపు ఏరువాక” అని అతి సున్నితంగా పలికే నాయికామణులతో పాటూ.. “ఈడు వచ్చాక ఇట్టా వచ్చా… నువ్వు నచ్చాక నీకే ఇచ్చా” అనే నెరజాణలూ ఆయన పాటలనిండా ఉంటారు.
“చుంబించుకున్న బింబాధరాల సూర్యోదయాలే పండేటి వేళ” అని సుకుమారంగా వ్రాసిన ఆ కలమే.. “ప్రేమంటేనే వ్యవసాయం – పెదవుల్లోనే ఫలసాయం” అంటూ చిత్రమైన పోకడలూ పోయింది.
“సంపెంగ పూలలో నా బెంగ దాచాను – సన్నజాజి నీడలో ఈ నోము నోచాను” అనే ముగ్ధత్వంతో పాటూ, “కౌ బోయివో, లవ్ బోయివో, ప్లేబోయికే బాబాయివో..” అనే చతురత్వం కూడా వేటూరి కవితకున్న ముద్దొచ్చే లక్షణమే.
సాహితీవనంలో అర్భకుణ్ణి, మరింత నిఖార్సుగా చెప్పాలంటే పామరుణ్ణీ అయిన నేను, వేటూరి పాటల మీద ఉన్న విపరీతమైన అభిమానంతో ఫేస్‌బుక్, కోరా వంటి మాధ్యమాలలో ఇప్పటికే ఎన్నో వ్యాసాలు వ్రాశాను. వ్రాస్తూనే ఉన్నాను. “వేటూరిగారొస్తున్నారు” అనే వీడియోతో సుమారు మూడున్నరేళ్ల క్రితం ప్రారంభమైన నా అజగవ (Ajagava)యూట్యూబ్ ఛానల్, ఆయన హస్తవాసి వల్ల ఇప్పటికి 88 వేల పైచిలుకు సబ్‌స్క్రైబర్స్‌ను తీసుకువచ్చింది. అలా నాకు వేటూరి వారి పరోక్ష ఆశీర్వాదం లభించింది. ఆయనకున్న అసంఖ్యాకమైన అభిమానుల్లో ఒకడిగా, ఆ కవిసార్వభౌమునకు వినమ్రంగా నమస్కరిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.
స్వస్తి!
రాజన్ పి.టి.ఎస్.కె