కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం!
కార్తీక మాసం అనగానే నాకు గుర్తొచ్చే వాక్యాలు ఇవి. ఒక అద్భుతమైన శివధ్యానస్వరూపం కనిపిస్తుందిక్కడ. తలుచుకున్నప్పుడల్లా ఓ నమస్కారం చేసుకుంటాను.
కార్తీక మాసంలో కైలాసగిరిపై కొలువైన శివుణ్ణి మంచు దీపంగా వర్ణించడం ఈ పంక్తులకు ప్రాణం. మంచు తెలుపుకే కాక చల్లదనానికి కూడా ప్రతీక. తెల్లని చల్లని సామి శివయ్య కాక ఇంకెవరు? మంచుతో కప్పబడ్డ ఆ కైలాస పర్వతంలా తెల్లగా మెరిసిపోతూ, ధ్యానంలో కూర్చుని ఉన్న చల్లని లోకాల పాలిటి వెలుగుగా నా మనసులో శివస్వరూపం మెదిలి ఓ పులకింత కలుగుతుంది.
ఈ మంచు దీపం ప్రమిదే లేని దీపం. దీపానికి ప్రమిద ఆధారం. సకల జగత్తుకీ ఆధారమైన వాడికి ఆధారం ఎవరు? అన్నీ తానై ఉన్న వాడికి వెలుపల ఉన్నది ఏది? ఇది ఒక అర్థం. అందరిలో ఆత్మ దీపంగా వెలుగుతున్న వాడు అని ఇంకో అర్థం. ఇలా చాలా అర్థాలు స్ఫురించే గొప్ప ప్రయోగం ఇది.
కవి (వేటూరి) ఇంతటితో ఆగలేదు. “ప్రమథాలోక” అన్న విశేషణమూ వాడాడు. “ఆలోకము” అంటే చూపు, స్తోత్రము వంటి అర్థాలు ఉన్నాయి. శివ భక్త గణమైన ప్రమథలు అందరూ ఆ పరమేశ్వరుని తనివి తీరా చూసుకుంటూ, స్తుతిస్తూ ఉంటే వారిని అనుగ్రహించే కరుణామూర్తి ఈ శివమూర్తి!
“ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం” – ఆహా! ఎంత గొప్పగా శివుణ్ణి దర్శించావయ్యా వేటూరీ! ధన్యుడివి! శివతత్త్వం ఏమాత్రం తెలియని, శివభక్తి ఏ మూలా లేని నా బోటి వాడికే ఇంత అర్థమయ్యింది అంటే ఇంకెన్ని విషయాలు ఈ వాక్యాల్లో పొదిగావో నీకే తెలియాలి!
ఇదే చిత్రంలో వేటూరి గారు “ఓం నమశ్శివాయ” అనే ఇంకో అద్భుతమైన శివగీతం రాశారు. ఆ పాటపై “మాధురి ఇంగువ” గారు రాసిన అద్భుతమైన విశ్లేషణ ఇక్కడ చదవండి!