రాత్రి చెంత స్వప్నం..ఎవరిదో నిరీక్షణ పర్వం. చిరదీక్ష అన్నది ఉంటుందా ప్రేమలో ! అయినా అదే నువ్వు అని చెప్పడం తప్పు ! పాట అదే నువ్వు అని నిర్థారించి వెళ్తుందా ? అయినా కూడా కొన్ని వెలుగులు చందమామను పట్టి తెస్తాయి. పండు వెన్నెలను పట్టి తెస్తాయి. ఒళ్లంతా గాయాలు ఉన్నా కూడా ఆలపించు స్వరం విభిన్నం అని చెబుతూనే ఉంటాయి. అయినా వానలు పులకింతలే కాదు విషాదాంతాలు కూడా ! ప్రాకృతిక చింతనలు అన్నీ పరమార్థ సహితాలే ! వెతకడం అర్థవంతం అయిన చర్య. జల్లంత కవ్వింతలు కొన్నే ! అయినా కూడా ఆ వాగూ ఈ వంకా వినిపించే గానాలు కొన్ని మనసుకు ఊరడింపు. పాట రాశాక వేటూరి.. రాయక వేటూరి ఎలా ఉంటారు. ఓ చిన్న చెట్టు నీడ చెంత వృద్ధాప్యం పోగేసుకున్న వ్యక్తి అయి ఉంటారు. లేదా పొన్న చెట్టు నీడల్లో తనకి తాను తెలియకుండానే మైమరిచిన ఓ స్వాప్నిక సౌందర్యం అయి ఉంటారు. ఇంకా భాగవత తత్వ స్మరణల్లో ఉంటారు. భగవత్ వాక్కుల్లో ఉంటారు.
గాయాలు ఎన్నో ఉంటాయి. ఉన్నవన్నీ వెన్నాడి వేధిస్తాయి. వేదన శకలాలు అన్నీ మృగ్యం అయి పోతాయి. మాయం అయిపోతాయి. మట్టి తత్వం చెంత జీవన దౌర్బల్యం వినిపిస్తుంది. మట్టిని మనిషిని పట్టి ఇచ్చిన పాట తత్వం కనుమరుగయి పోతుంది. వెతికి ఓ తెరపై తీసుకువచ్చే వెలుగు జ్ఞాపకం అవుతుంది. వెతికి మనిషిని మేల్కొల్పే తత్వం పాట అయి ఉంటుంది. పాట గమన రీతిలో సృజన రేఖలు కొన్ని వికసిస్తూ ఉంటాయి. కన్నీటి గాయాలు ఇంకా కొన్ని అనుభవం అందించిన విషాదాలు ఓ తిరిగే భూ మాతకు ఆభరణాలు అయి ఉంటాయి.
భరించ దగినంత దుఃఖం శోకం అన్నీ వాలిన పూల చెంత రాగాల కోయిలమ్మల చెంత ఉండి ఉంటాయి. గంధం విషాదం చెంత. జ్ఞానం విషాదం చెంత ! విషాదం మిగిలిన చోట పలికిన పాట కొన్ని తరాలు పలికిస్తాయి.. కొన్ని కుహూరుతాలు వినిపిస్తాయి. కోయిలలే నేర్చు పాటలే కొన్ని వేటూరి ని స్మరిస్తే చాలు. పాటకు ధన్యత.. ఇంకా జాతికి ధన్యత దక్కి తీరుతాయి. తెలుగు పదానికి జన్మదినం అని రాయడం సబబు. కానీ పద స్మరణ కు తగ్గ పనులేవీ చేయడం లేదు కనుక అది ఒక విషాదం. వెలితి కూడా !
రెక్కలు లేవు..చుక్కల్లేవు. చెంత ఉన్న తారా నివహం లేదు గాక లేదు. అయినా కూడా కృష్ణమ్మ చెంత ఓ కావ్యం ఉంది. లేదా కావ్యాన్ని పాట రీతిలో మలిచిన వచనం ఉంది. వచన రూప సాహిత్యంతో పేరు తెచ్చుకున్న వైనం ఒకటి ఉంది. ఆ పాటకు పల్లవి,కీర్తికి ఆరంభం ఇంకా చాలా కలిపి నిర్వచిస్తే వేటూరి ఇంటి పేరు వినిపిస్తుంది. వేటూరి ఇంటి పేరుతో పాటే సుందర రాముని కీర్తి వికసిస్తూ ఉంది. ఆ ఆనంద గతుల చెంత వినిపించే మురళి తెలుగులో తీపి. పిలిచిన మురళిని వలచిన మోవిని కలిపి ఉంచిన ఆనంద భైరవి. మళ్లీ చూడు చీకట్లు మళ్లీ చూడు వెన్నెలలు. వెన్నెలల చెంత పోగేసుకున్నవేవో ఏకాంతాలు మిగిల్చిన ఆనందాలు. చీకట్ల చెంత విదిల్చిన విషాదాలే ఇప్పటి సరాగ బంధాలు కావొచ్చు.
కార్తీకం వెళ్లిపోయాక మళ్లీ తెల్ల చీరకు తకధిములు నేర్పడం సాధ్యం అవుతుందా.. వైశాఖం రానుంది. ఆ నీరెండల నీడల్లో రాయని ప్రేమ కావ్యాలను ఏ విధంగా ఆరంభించాలో అన్న వెతుకులాట ఒకటి అనితరం సాధ్యతకు తూగుతుందా..ఆరంభం అయినా అంతం అయినా ఏదయినా నిరంతర ప్రవాహ ధర్మంలో కలిసిన స్రవంతులు. ఆ రంగుల సంధ్యలు కొన్ని ప్రేమకు ఆనవాళ్లు. ప్రేమను కలుపుకున్న వేళ అమ్మాయిలంతా ఏమయిపోతున్నారు. గోదావరి, అందమయిన సీత ఇంకా అందమయిన రాముడు ఏమయిపోతున్నారు. మహల్లో కోయిలల కూజితాలు ఏమయి ఉన్నాయి.
అయినా రాణివాసం బాగుంది. పెద్ద బొట్టుకు తార్కాణం అయి నిలిచిన అమ్మాయి ఒకరు బాగున్నారు. ఇంకా కొన్ని కుహూరుతాలు వేటూరివి కొన్ని కుహూరుతాలు ఇళయ రాజావి కూడా ! తెలుగులో తెలుగు అలానే.. తెలుగులో తేనె అలానే ! విషాదం ఏంటంటే మనుషులు తమని తాము విస్మరించిన వేళ కూడా భాష సంబంధిత తియ్యందనాలు అలానే ! కనుక తెలుగులో తెలుగు వెళ్లిపోదు. ఎటూ వెళ్లిపోదు. అవి కన్నీటి తెరలపై తేలియాడే సందర్భాలను వెతుకుతూ ఉంటాయి. హృదయ లయల గతులకు మృదంగ నాదాలు అయి అనుసరిస్తాయి. ఏ సంజె గాలి స్వాప్నిక ఛాయ చెంతనో తెలుగు తమిళం కలిసే ఉంటాయి. ఆ కళ చెంత అధరం మధురం. ప్రణయం మధురం. ఇంకా అనేకం ఇంకా అనంతం మధురాతి మధురం. మనసా నీదే గెలుపు.. ఇంకోసారి అనండిక !
కాలమయినా దేవుడయినా ఓ ఆజ్ఞను ఇచ్చి వెళ్తాడు. కాలం కానీ దేవుడి కానీ కొన్ని చెప్పి వెళ్లాక జీవన గమనం మరింత మార్పు పొంది ఉంటుంది. కృష్ణా నదీ తీరాన ఒక యమున ఉంటుంది. ప్రణయమున యమున అయి ఉంటుంది. ఆ యమున పేరు వేటూరి సుందరరామ్మూర్తి. ఆ యమున వినిపించు వసంత గానాలు గీతాంజలిని స్మరింపజేస్తాయి. నీటిపై తేలిన కలలకు కొన్ని అక్షరాలు జోడించి చెంత చేర్చి కూర్పును పాట అని నిర్వచించి ఊగించి తూగించి శాసించి రసాస్వాదనలు చెందించి ఒక పాట నేను అయి ఉంటే ఆ పాట వేటూరి అయి ఉంటే.. ఆ నేను ఈ వేటూరి ఒక్కటే అయి ఉండాలి. ఉప్పొంగి పొంగిన గోదావరుల చెంత రామ తత్వ సారాన్ని వినిపించు సుందర రాముడి పాటకు మరింత దిగులు లేదా మరింత ఉత్సాహం మరింత ఆనందం దక్కే భాగ్యం ఇకపై కూడా ఉండాలి.
ఒక పాట నుంచి మరో పాట ఒక కైవల్యం నుంచి ఓ ప్రశాంత వదనం వరకూ మోగు కిన్నెర.. మోగు నది మోగించు నదము ఇంకా చాలా.. స్వర లాలిత్యంలో కూడి ఉంటాయి. ఆ కూడికకు ఏకాంతం ఓ తోడు. ఆ తోడుకు తెలుగుదనం వెచ్చని స్పర్శ. ఇంకా చాలా.. ఆమని పాడుతున్న వేళ ల్లోనే కాదు ఇంకా చాలా చోట్ల చాలా శిఖరాల చెంత చాలా లోయల్లో కూడా వినిపించు ఓ పద నాదం ఓ ఎద నాదం విరిసిన మందారం ఇంకా చాలా కలిస్తే వేటూరి.
ఎన్ని సార్లు రాసినా ఎన్ని సార్లు చెప్పినా మనసుదే గెలుపు. అక్కడక్కడ మనిషిదే గెలుపు. మనసా గెలుపు నీదే కదా ! ఆ విధంగా ఆమనులు కొన్ని ..కోయిలలు కొన్ని.. కూత నేర్పు పాటలు కొన్ని వసంత కాల వీచికలు కొన్ని ఆలపనలు కొన్ని అదుపాజ్ఞలు కొన్ని. చాలినంత సంతోషం చాలినంత జీవితాన ! సార్థకత ఒకటి జీవితం చివరిలో! చివరి నుంచి మొదటి వరకూ ఓ మనిషి నా జ్ఞాపకం. గెలిచి వచ్చిన జ్ఞాపకం. వెళ్లిపోయిన వారంతా గొప్పవారు అన్న సూత్రీకరణకు అంతా తూగరు. ఈ పాటి ఇంగితం బుర్రలో ఉంచుకుని నివాళి రాయాలి. వెళ్లిన వారంతా దైవ సమానులు అని ఓ సామాన్యీకరణ అన్నది వద్దనుకుని ఉంటే మనం ఏం రాస్తున్నామో ఏం చెబుతున్నామో అన్నవి తప్పక తెలుస్తాయి. ఈ వేళ కొన్నే వేణువులు వినిపిస్తాయి.
ఈ సందర్భ సహిత వాక్యాన వినిపించు వసంత గానం వేటూరిని నివాళిస్తాయి. నివాళించు నా మది నివేదించు నా మది ఈ విధంగా చెప్పేవి చెప్పనివి అన్నీ కూడా మంచి సాహిత్యం వెతుకులాటలోనే ఉంటున్నాయి. ఆమని కోయిలయి పాడిన సందర్భాల్లో మాత్రమే నేనున్నాను. వసంత గాన వర్ణనకు తూగే పదాల వెతుకులాటలోనే ఈ క్షణాలు ఉన్నాయి. కవితా వాక్కులు కొన్ని వినిపిస్తూ వినిపిస్తూ ముందున్న కాలానికి చేసే విన్నపాన్ని స్మరణకు తూగే విధంగా మలుచుకోవడం ఓ బాధ్యత.
పాట కానీ మాట కానీ చివరి దశ నుంచి మొదటి స్పర్శ వరకూ ఆద్యంతం ఏదో ఒక సందర్భాన్ని సంకేతిస్తూ ఉంటుంది. రాయడానికి రాయకుండా ఉండడానికి ఉన్న భేదం ఒక్కటే. రాయడం బాధ్యత అయి ఉంటుంది. రాయకుండా ఉండడం నియంత్రణకు సంబంధించి ఉంటుంది. రాయడం అన్నది ఉద్దేశ పూర్వకం అయి ఉంటే చాలు అని అనుకోవడం భ్రమ. రాయడం లేదా నివాళి చెప్పడం అన్నది కొన్ని లయాన్వితాల కూడిక. అందమయిన కాలాలు కొన్ని మిగిల్చిన దుఃఖాల వడపోత అని కూడా అనుకోండి. నివాళి అంటే ఆఖరుగా వినిపింపజేయని మాట అని అర్థం కొన్నింట ! వినిపించే మాటలు ప్రశంసార్హాలు అయి ఉంటాయి. వినిపించని మౌనం సంబంధిత దృశ్యం కాంతి ఇంకా చాలా విషయాలు లేదా ఊసులు కొన్నింట మాత్రమే నిక్షిప్తం అయి ఉంటాయి. వాటిని కూడా నివాళిలో భాగంగానే తీసుకోండి. మనసా వాచా ఎవ్వరినో స్మరిస్తున్నాం అనుకోక ఓ వేదమంటి గోదావరి చెంత ఓ వేదమంటి మనిషిని స్మరణలో తీసుకుంటున్నాం అని ఎవరికి వారు ఈ ఉదయాన ఓ అన్వయం తీసుకోండి.
మళ్లీ అని రాశారు ఏమయినా మళ్లింపులు ఉన్నాయా ? అని అన్నారొకరు. మళ్లీ అని రాయడం ఏడాదికో సారి మాత్రమే అని చెప్పాన్నేను. పోనీ మన్నింపులు ఉన్నాయా అని అన్నారొకరు. ప్రేమ విరహం ఇంకా దుఃఖం ఇవన్నీ తెలిశాక ఒక శాఖ జీవితం అని, ఒక శాఖ వేదమంటి జీవితం అని నిర్థారించుకున్నాక మన్నింపులు అన్నవి ఏవీ లేవు. లేకుండా ఉండడం సిసలు అర్థం. జీవితానికి మరో అర్థం వెతుక్కోవడం అంటే అర్థవంతం అయిన సాహిత్యాన్ని చదువుకోవడం.
లేదా అర్థం చెడని విధంగా రాసుకోవడం. రెండూ కూడా ప్రకటన రీతులే అయి ఉంటాయి. వెతలు ఉన్న వేళ ఒక అర్థం సాంత్వన మరో అర్థం ఉపశమనం మరో అర్థం విరామ చిహ్నం అయి ఉంటుంది వాక్యంలో ! లేదా ప్రకటిత వాంగ్మయంలో ! ఇప్పుడు కూడా చుక్కని అడుగు దిక్కుని అడుగు చెమ్మగిల్లిన చూపునే అడుగు. నీరు పొంగిన కనులలో నీటి చెమ్మలను అడుగు. ఏం కాదు ఇది ఉద్వేగం. మన్నింపు ల్లో కొంత, మనస్పర్థల్లో కొంత ఇరుక్కుపోయి ఉండి ఉంటుంది. కవి వేటూరికి జయంతి వేళ నివాళి. ఆ శాబ్దిక నీడల్లో నేను. ఆ శాబ్దిక ఛాయల్లో నేను.