వేటూరి శబ్దానికే ప్రాధాన్యం ఇచ్చి అర్థాన్ని పట్టించుకోరని ఒక విమర్శ ఉంది. ఈ విమర్శలో నిజం లేదు కానీ ఈ విమర్శకి కారణం ఉంది. భావాన్ని సూటిగా చెప్పకుండా పదప్రయోగాలతో సూచించడానికి ఇష్టపడే వేటూరి శైలి వలన ఆయన రాసిన కొన్ని పంక్తులు వెంటనే అర్థం కావు. అయితే ఆయన భాషని భావం కోసమే వాడారన్నది “వేటూరి పాట” పుస్తకంలో “డా. జయంతి చక్రవర్తి” గారడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానంలో సుస్పష్టం –
ప్రశ్న: మీ దృష్టిలో సినిమా పాటకి భాష ముఖ్యమా లేక భావం ముఖ్యమా?
వేటూరి సమాధానం: మౌనభాష భావం, వ్యక్తభావమే భాష. ఈ రెండూ వాగర్థావివసంపృక్తౌ అని అన్నట్లు అర్థం – మౌనం, వాక్కు – శబ్దం. అర్థానికి శబ్దం కావాలి, శబ్దానికి అర్థం కావాలి. భాష ముఖ్యమా, భావం ముఖ్యమా అని అంటే భాష భావం వేరు కాదు. భావం లేని భాష లేదు అని చెప్పాలి.
కాబట్టి భావాన్ని అనుసరించే వేటూరి పదాలు ప్రయోగించారు కానీ పదాల వెంట పరిగెత్తుతూ కాదు.
సందర్భానికి తగినట్టు తాను పదాలు వాడానని “కొమ్మకొమ్మకో సన్నాయి” పుస్తకంలో బాపు తీసిన భాగవతం సీరియల్ కి రాసిన పాటలు ఉదహరిస్తూ వేటూరి చెప్పారు. సన్నివేశంలో “డ్రామా” ఉన్నప్పుడు దాగిన తగిన పదాలే వాడాలని, “అదే వస్తువు ఉదాత్తమైనప్పుడు ఉత్తమధ్వని, మంత్రధ్వని, సామవేదగానధ్వని అక్షరాక్షరం వినిపించగలిగి ఉండాలని” పేర్కొన్నారు. శబ్దం పై వేటూరికున్న ఈ “పట్టు” ఆయన పాటలన్నింటా కనిపిస్తుంది. గొప్ప పాటల్లో గొప్ప శబ్దాన్ని వాడారు, సరదా పాటల్లో గమ్మతైన ప్రయోగాలని చేశారు. ఇలాంటి ఒక చిలిపి ప్రయోగాన్ని పరిశీలించి ఆయన పదప్రయోగాలని ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసుకుందాం!
మహేశ్ బాబు, శ్రేయ నటించిన “అర్జున్” సినిమాలో “పిల్లి పిల్లి వచ్చె” అనే ఒక సరదా చిలిపి డ్యూయెట్ గీతం ఉంది. ఇందులో అమ్మాయి అబ్బాయితో ఒకచోట ఇలా అంటుంది –
“కుర్రవాటమెక్కువైతే గుట్టు వెక్కిరించురో! రామునితో కపివా!”
ఇందులో “రామునితో కపివా” అన్న ప్రయోగాన్ని ఎలాంటి శ్రోతలు ఎలా తీసుకుంటారో చూద్దాం!
వేటూరి విమర్శకుడు – వేటూరికి ఉన్నంత మంది విమర్శకులు ఇంకే గీతరచయితకీ లేరన్నది నిజం! అలాంటి వారికి వేటూరి ఇలాంటి ప్రయోగాల ద్వారా పుష్కలంగా అవకాశాలు కల్పించారన్నదీ నిజమే! “రామునితో కపివా ఏమిటి అర్థం పర్థం లేకుండా! ఈ వేటూరికి భాషంటే లక్ష్యం లేదు, ప్రేక్షకుడంటే పట్టింపు లేదు, పాట రాయడం పై శ్రద్ధ లేదు!” అంటూ మొదలుపెట్టి విమర్శకులు చెలరేగిపోతారు ఇలాంటి ప్రయోగాలని చూసి. అసలు అర్థమే లేదని ముందే తేల్చేస్తే ఇంక ఏ చర్చా అవసరం లేదు. అర్థం లేకుండా రాసి పడేసిన వేటూరిని హాయిగా విమర్శిస్తూ కూర్చోవచ్చు. చాలా మంది వేటూరి విమర్శకులు ఇక్కడే ఆగిపోతారు. ఒకవేళ అర్థం ఉందేమో అని ఏ మూలనైనా మీకు అనిపించి ఉంటే మీరు విమర్శకులు కారన్న మాట. హమ్మయ్య! అప్పుడు ఇక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళొచ్చు మనం!
సాధారణ ప్రేక్షకుడు – సాధారణ ప్రేక్షకుడికి పాటలోని సాహిత్యాన్ని శోధించాలన్న ఆసక్తి పెద్ద ఉండడు, అలాగే విమర్శకుడిలా గీతరచయితని సాధించాలన్న తపనా ఉండదు! అర్థమైనంత అర్థం చేసుకుని అర్థం కానిది వదిలేస్తాడు. చాలా సార్లు ఓ వాక్యం అర్థం కాకున్నా అందులోని హృదయాన్ని పట్టుకుని ఆస్వాదించే సహృదయత సాధారణ ప్రేక్షకుడికి ఉంటుంది. అయితే విడమర్చి చెప్పడం వేటూరి శైలి కాదు కనుక ఆయన చేసిన కొన్ని ప్రయోగాల అంతు చిక్కాలంటే ఆలోచించి సమయం వెచ్చించాలి. “అబ్బా! అంత ఓపిక ఎవడికుంది? ఇంత కష్టం ఆయన మనని ఎందుకు పెట్టాలి? అందరికీ తెలిసిన పదాలు, ప్రయోగాలు చెయ్యకుండా కొత్త కొత్త, పిచ్చిపిచ్చి ప్రయోగాలు చేసి మమ్మల్నెందుకు చంపాలి?” అనుకున్న వాళ్ళు అర్థం కాని వేటూరి ప్రయోగాలని అర్థం చేసుకునే ప్రయత్నమేదీ చెయ్యకుండానే ఆగిపోతారు. అలాంటి సాధారణ ప్రేక్షకులు – “కుర్రవాటమెక్కువైతే గుట్టు వెక్కిరించురో! రామునితో కపివా!” అన్న లైనుకి అర్థం – “నీ కుర్రవాటం ఎక్కువవుతోంది, నా పరువు తియ్యకు!” వరకూ తీసుకుని, తర్వాత “రామునితో కపివా… ఏదో రాశాడు! ఏమీ అర్థం కాలేదు. వదిలేస్తే పోలా!” అని ఓ దణ్ణం పెట్టేస్తారు! మీరూ ఇక్కడే ఆగిపోవచ్చు!
భాషాభిమాని – ఇంత వరకూ మీరు వచ్చారంటే మీకు తెలుగు భాషపై ఎంతో కొంత ఆసక్తీ అభిమానం ఉండి ఉండాలి. మీకు అభినందనలు! మీ మనసులో ఇప్పుడు – ““నీ కుర్రవాటం ఎక్కువవుతోంది, నా పరువు తియ్యకు! రామునితో కపివా” అని మెదులుతూ ఉండాలి. జాగ్రత్తగా వింటే “రామునితో కపివా” అన్న ప్రయోగానికి అర్థం తెలియకున్నా మీ మనసులో ఏదో భావం అస్పష్టంగా స్ఫురించి ఉంటుంది. కొంత లాజిక్ కూడా మీలో పుట్టి ఉండొచ్చు – ముందు లైనులో అమ్మాయి “ఏయ్, ఏంటి నీ జోరు!” అంటోంది కాబట్టి తర్వాత లైనుకి అర్థం “ నువ్వు పోకిరీ వా” వంటిది ఏదైనా అయ్యుండొచ్చు. కపి అంటే కోతి కాబట్టి “ఈ కోతి పనులు ఆపు!” అన్న అర్థమూ సరిపోతుంది. ఇలా అనుకుని మీరు ఆ లైన్లకి – “ఏయ్! నీ జోరు తగ్గించుకో, నా పరువు తియ్యకు! ఓ కోతిచేష్టల పోకిరీ!” లాంటి అర్థమేదో చెప్పుకుని సంతృప్తి పడొచ్చు. కానీ “రామునితో కపి” అనే వేటూరి ఎందుకు అనాలి, ఇక్కడ రాముడు ఏ అయోధ్య నుంచి ఊడిపడ్డాడు? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. “వేటూరికే తెలియాలి!” అనుకుని ఆగిపోతారు మీరు!
వేటూరి అభిమాని – మీరింకా ముందుకొచ్చారంటే మీరు వేటూరి అభిమానులే అయ్యుండాలి! మీకు “కంగ్రాట్స్” చెప్పాలో, మీపై “జాలి పడాలో” నాకు తెలియట్లేదు. ఏదేమైనా ఇంత దూరం వచ్చారు కాబట్టి ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళడం ఎందుకు? కొంచెం తెలిసిన వాళ్ళని అడుగుదాం, గూగుల్ చేసి చూద్దాం. ఇలా ప్రయత్నిస్తే మీకు “రాముని తోక” అనే ఒక తెలుగువాడుక కనిపిస్తుంది. దాని అర్థం ఇది –
రాముని తోక – Rama’s tail. A joke–a bad reader instead of reading రామునితో కపివరుండిట్లనియె read “రాముని తోక పివరుండు”. Used to blundering reader.
కాబట్టి “రాముని తోక” అంటే అజాగ్రత్తగా చదవడం వల్ల జరిగే పొరబాటు అన్నమాట. వాడో “రాముని తోక” అని ఎవరైనా అంటే – “he is careless” అన్న అర్థం తీసుకోవచ్చు. వేటూరి ఈ వాడుకని దృష్టిలో పెట్టుకునే “రామునితో కపివా” అని ప్రయోగించారనుకుంటే అప్పుడు అర్థం ముందు అనుకున్న – “పోకిరీ”కి దగ్గరలోనే – “దుడుకువాడివా”, జాగ్రత్త లేదా” వగైరా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి రాముడు ఎందుకు వచ్చాడో తెలిసి ఓ చిరునవ్వు పెదవులపై మెదులుతుంది, ఓ సంతృప్తి మిగులుతుంది! “హమ్మయ్య!” అనుకుని ఆగొచ్చు!
అయితే కొంత మంది వేటూరి అభిమానులు ఇంకా ముందుకెళతారు – “అబ్బెబ్బె! కాదు కాదు. ప్రయోగం దీని ఇన్స్పిరేషన్ వల్ల అయ్యిండదు. “రాముని తోకవా” అనకుండా, “రామునితో కపివా” అన్నారు కనుక అది కాకపోవచ్చు. ట్యూన్ లో “రాముని తోకవా” సరిపోక అలా సరిపెట్టారా? ఏమో కాదేమో! ఇంకేదో ఉందేమో! అయ్యో వేటూరీ! ఎందుకు పోయావయ్యా!”….
క్షమించాలి! మీకెప్పటికీ సంతృప్తి ఉండదు! కొన్ని వేటూరి ప్రయోగాలకి పూర్తి సంతృప్తికరమైన వివరణలు దొరకవు. ఉన్నదానితో తృప్తి పడడమే. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెబితే ఆనందపడడమే. “కాదు! కాకూడదు!” అని మీరు మథనపడుతూ కూర్చుంటానంటే – “ప్లీజ్! మీరు వేటూరి క్రిటిక్ గా అయినా మారండి! అప్పుడు కనీసం వేటూరిలో తప్పులు పట్టుకుని తిట్టానన్న సంతృప్తి అయినా మిగులుతుంది!”