తెలుగు సినీ కవిసార్వభౌముడైన
కీ.శే. శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారి
జయంతి సందర్భంగా
ఒక భక్తుడు చేస్తున్న అక్షరార్చన
హాయిగ గాలులు వీచసాగెను
హంస గణములు ఆడసాగెను
మనసున మధురపు లహరులు పొంగగ
కచ్ఛపినాదము వినపడసాగెను
సర్వసృష్టికీ ప్రాణము పోసే
దివ్యదేశమది బ్రహ్మలోకమది
ఏకాంతములో బ్రహ్మాభారతి
ముచ్చటలాడే మంచి సమయమది
చతురాననుని చతురోక్తులకు
చదువులతల్లీ పకపక నవ్వెను
నవ్వులు ఆయెను మంచి ముత్యములు
జలజల రాలెను వెలుగులు కురియుచు
రాలెడి అట్టి ముత్యములందున
విధాత పట్టెను ఒడుపుగ ఒకటి
ఎనిమిది కన్నులు మిలమిల మెరవగ
ప్రేమ భావమున దానిని జూచెను
మెల్లగ విడచెను దీవెన లిచ్చెను
భూలోకమునకు మార్గము చూపెను
ముత్యము సాగెను మబ్బులు దాటెను
కృష్ణాతీరపు పల్లియ చేరెను
చంద్రశేఖర శాస్త్రిగారను
వైద్యుండొక్కరు అక్కడ ఉండెను
కమలాంబను పుణ్యమూర్తితో
ధర్మజీవనము సాగిస్తుండెను
ఆమె గర్భమున ప్రవేశించెను
ముత్యము మూర్తిగ మారుట కొరకు
వాణీవిరించి ఆశీఃఫలముగ
రామ సుందరుడు ఇలకేతెంచను
సుందరరామ మూర్తి యతండు
వేటూరిగా విఖ్యాతుండు
పత్రికలందున చిత్రములందున
వెలుగులు నింపిన ప్రభాకరుండు
“భారతనారీ చరితము” అంటూ
సినీరంగమున ప్రవేశించెను
వేనకు వేలుగ పాటలు రాసి
శ్రోతల గుండెల నివాసముండెను
సిరిసిరిమువ్వల నాదం చేస్తూ
శంకరాభరణ రాగం తీస్తూ
సాగరసంగమ సప్తపదులతో
విశ్వనాథునితొ అడుగులు వేసెను
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారని
అడవి రామునిగ సత్యం చెప్పెను
కోకెత్తుకెళ్ళిన కొండగాలిపై
చిందులు వేసే సీసం రాసెను
రాలుపూల తేనియకై
రాతిపూల తుమ్మెదనొదలెను
మల్లెపూల మారాణికి
బంతిపూల పారాణి పెట్టెను
ప్రేమను వ్యవసాయం చేసి
పెదవుల్లో ఫలసాయం చూపెను
తారాజాబిలి కలవని నాడు
వెన్నెల లేదని తీర్మానించెను
వలపు ఏరువాకగ చేసి
మల్లెపూల మాటలు చెప్పెను
అలా మండి పడకే అంటూ
జాబిలితో పాటలు పాడెను
పురుషుల్లో పుంగవుడతడు
పులకిస్తే ఆగని ధీరుడు
రగులతున్న మొగలి పొదలలో
నాగస్వరమూదే ఘనుడు
లిపిలేని కంటిబాసలు
అందంగా పలికిస్తాడు
శ్రీవారికి ప్రేమలేఖలు
సరసంగా రాయిస్తాడు
చినుకులా రాలిన ప్రేమను
కడలిలా పొంగిస్తాడు
వీణ వేణువైన సరిగమలను
ఆ ప్రేమలో వినిపిస్తాడు
తెలుగు భారతికి వెలుగు హారతిగ
అన్నమయ్యను కీర్తిస్తాడు
ఒక ఒంట్లోనే కాపురమున్న
శివపార్వతులను ప్రార్థిస్తాడు
మానసవీణలు మ్రోగించి
మధుగీతాలను పాడిస్తాడు
నవమినాటి వెన్నెలతోటి
దశమి జాబిలి జత చేస్తాడు
ఒడి వలపుల చెరసాలంటూ
యక్షిణితో ఆడిస్తాడు
కిలికించితాలు చేయించి
నెరజాణలతో మురిపిస్తాడు
తరాలనీకథ క్షణాలదేనని
ఆమనితోటి పాడిస్తాడు
ఎదలోతుల్లో ముల్లున్నా
రోజా కమ్మని బోధిస్తాడు
మనసు మనసు కలిపేసి
కనులు ఎదలు తడిపేస్తాడు
పావురానికి పంజరానికి
పెళ్ళిచేసి చూపిస్తాడు
రాలిపోయె పువ్వులతోటి
రాగాలను పలికిస్తాడు
మరోమహాభారతమంటూ
ప్రతిఘటనలు చేయిస్తాడు
ఒకటా రెండా రాసిన పాటలు
ఆరువేలకు అటో ఇటోమరి
పాటల నిండా తీయని ఊటలు
కవిరాజంటే వేటూరే మరి
అతను రాసిన పాటలకోసం
ఎంత రాసినా కొంత మిగులును
భావాలన్నీ త్రవ్వుతు పోతే
బ్రతుకు చాలదను చింత కలుగును
హృదయమునందున గృహమునందున
వేటూరికి చిత్తరువును కట్టిన
రాజన్ పి.టి.ఎస్.కె చేసిన
భక్తి పూజయిది అక్షరార్చనిది
స్వస్తి!
ఈ రోజు వేటూరి గారి జయంతి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ.రాజన్ పి.టి.ఎస్.కె గారు తయారు చేసిన ఈ విడియో మీకోసం