గానం కోరుకునే గీతం వేటూరి
గాయకుడు కోరుకునే కవి వేటూరి –మంగళంపల్లి బాలమురళీకృష్ణ
వేటూరి వారిపాటకి
సాటేదని సరస్వతిని చేరి కోర, నా
పాటేశ్వరుడికి వుజ్జీ
వేటూరేనంది నవ్వి వెంకటరమణా!
—ముళ్ళపూడి వెంకటరమణ
“ఆకాశాన్నాక్రమించిన ఆయన భావనాపాదానికి, భూగోళాన్ని ఆక్రమించిన ఆయన భాషాపాదానికి భక్తితో అంజలి ఘటిస్తూ “నా మూడో పాదాన్ని నీ నెత్తిన పెడతా” అంటున్న ఆయన తాండవ పాదానికి భయంతో నమస్కరిస్తూ, ముమ్మారు మొక్కుతూ”..
ఆయన జ్ఞానానికి నా అక్షరాభినందనలు – సిరివెన్నెల సీతారామశాస్త్రి
పదాల అల్లిక పాటైతే, ఆ పాటకి సంగీత జ్ఞానం తోడైతే,లోతైన అర్ధం పాటంతా నిండిపోతే,ధర్మార్ధకామమోక్షాలు ఏదో ఒక పాటలో ఇమిడిపోతే అది వేటూరి గీతం అవుతుంది.
ఆయన స్వేచ్చగా కొన్ని పదాలని సృష్టించేశారు,భావాల్ని తన పాటలోచుట్టేశారు ,శ్రావ్యమైన పాటని ఎంజాయ్ చెయ్యండని మనమీద వదిలేశారు..ఆ ‘జిలిబిలిపలుకులు’ ఒక పాటై సంగీత ప్రియుల్ని ముద్దుపెట్టేసింది.
వాణిశ్రీ నటించిన “రామచిలుక” సినిమాలో ..’మావయ్య వస్తాడంటా మనసిచ్చి పోతాడంట .. మరదల్ని మెచ్చి మరుమల్లె గుచ్చి ముద్దిచ్చి పోతాడంటా ఆ ‘ముద్దర్లు పోయేదెట్టా’ అని పడుచుపిల్ల మనసు ని సిగ్గు చాటునంచి చూపించడం ఆయనకే చెల్లింది..
చిరంజీవి సినిమా ‘రాక్షసుడు’ లో ఆయన రాసిన “నీమీద నాకు ఇదయ్యో” పాటలో ..”ఇదయ్యో” అంటే డిక్షనరీలో అర్ధం దొరకకపోవచ్చు కానీ పాట వినేవాళ్ళకి అర్ధం అయిపోతుంది ఆ ‘ఇదేంటో’..
‘మేఘసందేశం’ లో ‘ఆకాశ దేశానా ఆషాఢ మాసాన ‘అని , ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లో ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అని, ‘ప్రతిఘటన ‘లో ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకం లో ‘అని,అడవిరాముడులో.. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు”అని, ‘బొంబాయి’సినిమా లో
‘నీ నమాజుల్లో ఓనమాలు మరిచా’ అని, ‘వేణువై వచ్చాను భువనానికి’ అని
రాసినా ఆయనకే సాధ్యం.
వయసుతో సంబంధం లేదు ఆయనకి.. కుర్రాళ్ళ చురుకుతనాన్ని ‘వయస్సునామీ తాకెనమ్మీ’ అని ‘కంత్రీ’ సినిమాలో రాసేసారు. ఆయనో సాహిత్య సముద్రం అందుకే “అది అరబిక్ కడలందం ” లాంటి కసక్కులని ,’ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలోవరి’ లాంటి క్లాసిక్స్ ని అందించేసారు.
ఆయన కత్తి లాంతి కలం విజృభించి ‘ కొర్రమీను కోమలం సొరచేప శోభనం ‘అని రాసినా నచ్చింది, “ఆరేసుకోబోయి పారేసుకున్నాను కోకెత్తుకెళ్లింది కొండగాలి”అని రాసినా నచ్చింది..’మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇందృడే చంద్రుడై కన్నుకొట్టెరా’ అని రాసినా నచ్చింది..
మిష్టర్ పెళ్ళా సినిమాలో “అంట్లు తోమే ఆడది జంట్స్ కు లోకువ చూడు ..గాజులు తొడిగే శ్రీమతి ఫోజులు చెల్లవు నేడు” అని రాసి కొంతమంది మగవాళ్ళని తనపాటలో నిలబెట్టేసారు సరదాగా .
‘ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ..బదరీ’ అనే బద్రీనాధ్ సినిమా లోని పాటలో,బదరీ నారాయణుడుని, పరమేశ్వరుడిని కలిపి..శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనే భావాన్ని తనపాటలో అందించడం ఆయన పాటలో ఉన్న అందం.
జర్నలిస్ట్ గా ప్రవేశం, ఒక సీత కధతో సినీప్రవేశం చేసిన వేటూరి సుందరరామ్మూర్తిగారు వేలపాటలని రాసారు. 8 నందీ అవార్డులతో కలిపి 14 అవార్డ్ లని సొంతం చేసుకున్నారీ ఈ గేయ చక్రవర్తి.
శ్రీశ్రీ తర్వాత తెలుగు పాటకి జాతీయ ఖ్యాతిని అందించిన ఘనతని సొంతం చేసుకున్నారు..
కొత్త కొత్త పద ప్రయోగాలతో పాటకి పట్టం కట్టేసారు వేటూరి..ఆయన రాసిన ప్రతీపాటా ఒక అద్భుతం,వినాలనిపించే ఆణిముత్యం.
“ఆయన పాట ఒక సంస్కారం, ఆయన పాట ఇష్టం గా చేసే సంసారం,ఆయన పాట ఎప్పటికీ పంచదార సాగరం”
సంగీత శ్రీనాధుడు, సాహితీ కీర్తి.. వేటూరి సుందర రామమూర్తి గారికి నివాళితో ఆయన పాటలని ఎప్పటికీ ప్రేమించే..వైదేహి
వైదేహి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం
వేటూరి సుందరరామ్మూర్తి గారి గురించి మీ అందరి వివరణ చాలా చాలా బాగుంది. మీ అంత వివరణ నేను ఇవ్వలేను కానీ. నేను ఆయన పాటలకు పిచ్చి అభిమానిని. ఇంటిపేరు ఒకటి అవటం వలన కాదు. నిజం గానే వేటూరి గారి గురించి ఆయన రాసిన పాటలను ఉటంకిస్తూ మీరు చేసిన విశ్లేషణ కు నా అభివందనములు..
V V R MURTHY
(వేటూరి వెంకట రమణ మూర్తి)