“బాలోచ్చిష్టం” (విశాలి పేరి)

“చేరేదెటకో తెలిసి చేరువ కాలేమని తెలిసి” పాట నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఆ పాట కోసం ఒకసారి టి.వి లో ఈ సినిమా వస్తే కదలకుండా, ఛానల్స్ మార్చకుండా (నాకు చాలా కష్టమైన పని) , చూశాను. ఇంకో ఐదు నిమిషాలలో సినిమా అవుతుంది అనగా పాట వచ్చింది. సినిమా పరమ బోర్, పాట మాత్రం సూపర్. అందులో “కలవని తీరాల నడుమా కలకల సాగక యమునా వెనుకకు తిరిగి పోయిందా.. మనువు గంగతో మానిందా ” అని వేటూరి ఎందుకు వ్రాశారో అర్ధం కాలేదు.

కొన్ని రోజుల క్రితం ‘ప్రయాగ ‘ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ త్రివేణి సంగమం చూశాను. ఒక పక్క నల్లగా యమున, ఇంకో పక్క తెల్లగా గంగ, సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది.
ప్రతి నదీ సాగరం లో కలుస్తుంది. నదీ-సముద్రాలది భార్యభర్తల బంధంగా పోలుస్తారు. ప్రతీ నది సముద్రుడికి భార్యే. కానీ యమునకి సముద్రంలో కలిసే అవకాశం ఉండదు. మామూలుగా ప్రవహిస్తోన్న గంగ దాని దిశమార్చుకొని వెనకకు వచ్చీ మరీ యమునతో కలుస్తుంది. అలా తనతో కలుపుకున్న యమునని గంగ తీసుకొని వెళ్ళి సముద్రములో కలుపుతుంది.  యమునని కూతురుగా భావించి గంగ ఆమెని సముద్రుడిలో కలుపుతుంది (అని పురాణాలలో ఉంది).  ఇందు మూలంగా “యమునా నది” మాత్రం  “సింధు సుత ” అనగా సముద్రానికి కూతురుగా చెప్పబడుతుంది. ఈ గంగా యమునల కలయికని వేటూరి గారు “మనువు ” గా చెప్పారు.
నర్తనశాల సినిమాలో ఒక పద్యం ఉంటుంది “హే గోపాలక.. హే కృపాజలనిధే.. హే సింధు కన్యా పతే .. ” అని. కులశేఖరులు రచించిన ముకుందమాలలోని ఆ పద్యము చాలా రోజులు ఆలోచింపచేసింది, ఈ ‘ సింధు కన్య ‘ ఎవరూ అష్టభార్యలలో అని! ఒక సింధు కన్య “యమున”. ఇంకో సింధు కన్య.. ‘ లక్ష్మీ దేవి’ (లక్ష్మీ దేవిని సముద్రుడి కూతురిగా కీర్తిస్తాయి పురాణాలు).  సింధుకన్యా పతి కృష్ణుడు. ఆయనకు యమున మీద కూడా చాలా ప్రేమ ఉందని చెబుతారు. వల్లభాచార్యుల పుష్టి మార్గ సంప్రదాయంలో కృష్ణుడికి పట్టమహిషి యమునే.
వేటూరి గారు ఇంత చరిత్ర తవ్వుతారా? మామూలుగా “కలవలేని రైలు పట్టాలము మనము లేకపోతే నింగినేల లా ఎప్పటికీ కలవని వాళ్ళమనో   ” అని సింపుల్ గా చెప్పేయచ్చు కదా? ఇలా “కలవని తీరాన నడుమా కలకల సాగక యమునా” అని ఇన్ని రోజులు ఆలోచిస్తే కానీ తెలియనంత నిగూఢంగా రాస్తారా? అసలు ఒక వాక్యం ఆయన రాశారు అంటే దాని వెనుక చాలా చరిత్ర ఉండి తీరాల్సిందే!
వేటూరి గారు ఈ పాట ను “చేరేదెటకో తెలిసి చేరువ కాలేమని తెలిసి, చెరిసగమైనామెందుకో తెలిసి ” అని వ్రాశారుట. పాట ట్యూన్ చెసేటప్పుడు మామ “తెలిసి.. తెలిసి తెలిసి ” అని మూడుసార్లు అనిపించి పాటకు సొబగులు అద్దారు.
సంగీత సాహిత్యాల కృషి ఎంత ఉన్నా ఆ పాటకు తన గళంతో ప్రాణం పోసిన వ్యక్తి మాత్రము బాలు గారే.   ఆ సినీ త్రిమూర్తుల కలయిక ఈ అద్భుతమైన పాట.  “బాలోచ్చిష్టం” అయిన ఈ పాట ఇదిగో…

ఇదేపాట గురించి నాకుతెలిసిన వేటూరి వ్యాసంలో గొల్లపూడి గారి మాటల్లో ఇక్కడ చదవండి


‘విశాలి పేరి’ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

2 thoughts on ““బాలోచ్చిష్టం” (విశాలి పేరి)”

  1. వేటూరి గారు కవికుల పీఠాధిపతి…ఒక గొప్ప పాటని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు ..గాడ్ బ్లెస్ యూ

  2. విభాతమిత్ర

    ఈపాట విన్నపుడల్లా ఆ బాణీకి సంతోషించాలా
    ఆ గానానికి మైమరచిపోవాలా..
    ఆ సాహిత్యానికి గుండె బరువు చేసుకోవాలా..
    ఆ సన్నివేశానికి బాధపడాలా..
    అన్నీ కలిపి ఇంకేదో అవ్వాలా…అర్థం కాదు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top